కులమత సాగర సంగమ శృతిలో...
కులమత సాగర సంగమ శృతిలో...
Published Fri, Aug 9 2013 10:32 PM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
భారతదేశం పుణ్యభూమి, వేదభూమే కాకుండా ప్రేమ భూమి కూడా. ప్రేమను పంచడం, ఆత్మీయతలను అందీయడంలో భారతదేశం ముందువరుసలో ఉంటుంది. ప్రేమ తత్త్వానికీ, మానవత్వానికీ అర్థం పరమార్థం తెలిపిన ఎందరో మహానీయుల కథలు, కథనాలు ఈ నేలమీద నిత్యశ్రవణాలు, చిరస్మరణాలు. ప్రేమభావనకు పాదులు తొడిగి మానవ మనుగడకు ప్రేమే మూలమని చాటిచెప్పిన రామాయణం, విశ్వరహస్యమంతా ప్రేమమయమేనని వేణువూదిన కృష్ణతత్త్వం, బుద్ధుడు, పరమహంస, వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మాగాంధీ, మదర్ థెరిసా... ఇలా ఎందరో ఈ నేలమీద ప్రేమకు ఆనవాలుగా కనిపిస్తారు. ఈ దేశం చెరిగిపోని ప్రేమలకు చిరునామా... కాలం చెరిగిపోని మమతలకు వీలునామా.
ఇలాంటి దేశంలో ఒక మారుమూల పల్లెలో మనసులు కలబోసుకున్న ఒక కుర్రజంట గుండెచప్పుళ్లకు అందమైన అనువాదమేమో అనిపించే అద్భుతమైన గీతం, నాకు నచ్చిన గీతం ‘సీతాకోకచిలక (1981)’ చిత్రంలోని ఈ పాట. భారతీరాజా దర్శకత్వం - ఇళయరాజా సంగీత దర్శకత్వం, బాలసుబ్రహ్మణ్యం. వాణీజయరామ్‌ల గళ మాధుర్యాల మేళవింపుగా రూపుదిద్దుకున్న ఈ పాట, కీర్తిశేషులు వేటూరి వారి సాిహ తీ సుగంధంతో అజరామరమైంది. వైయక్తికమైన ప్రేమకు విశ్వవ్యాప్తమైన ఆలోచన ఆలంబనగా నిలిచినప్పుడు ఆ ప్రేమగీతం సత్యం-శివం-సుందరం అవుతుంది. ఈ పాటలో వేటూరి సుందరరామమూర్తి కలవిన్యాసం ఆ విధంగానే సాగింది కనుక, ఈపాట కలకాలం చల్లని చల్లని ప్రేమ గీతమైంది.
క్రైస్తవ-హిందూ మతాలకు చెందిన యువతీయువకుల ప్రేమకథగా దర్శకుడు భారతీరాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మనసులకు కులం ఉండదు, మతం ఉండదు కనుక అవి స్వేచ్ఛగా ప్రేమించేసుకుంటాయి. కానీ, మనుషులకు కులం ఉంటుంది, మతం ఉంటుంది. ప్రేమ-పెళ్లితో బంధంగా మారాలంటే అది అడ్డుపడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఒక విరహగీతికగా సాగే పాట ఇది.
రచనాశైలి దృష్ట్యా ఇందులో చోటు చేసుకున్న వస్తువైవిధ్యం, వస్తుగాంభీర్యత కూడా ఉదాత్తమైనవే. భారతదేశం అనేక మతాలకు నెలవు. అనేక కులాలకు పట్టుగొమ్మ. కులమతాలనే అనేక నదులు సంగమించిన మహాసాగరమే భారత దేశం. అందుకే ఈ ప్రేమ గీతావిష్కరణకు భారతదేశమంతటి మహా విస్తృతమైన నేపథ్యాన్ని ఊతంగా తీసుకున్నారు వేటూరి.
ఈ దేశంలో పుట్టిన రామాయణం వంటి మహాకావ్యాన్ని మించిన ప్రేమగాథ లేదు. అంతకు మించిన విరహ గాథ కూడా లేదు. సీతారాములు అనుభవించిన ఎడబాటుని మించిన వియోగం ఏముంటుంది. అక్కడ అశోకవనంలో సీత, ఇక్కడ అడవుల్లో రాముడు... ఇద్దరి నడుమ దారి లేని సముద్రం. ఆ కడలి రాముడి మదిలో కొలువై వుంది, ఆ కడలి కెరటం సీతమ్మ కన్నుల్లో పొంగుతూ ఉంది. దాటలేని సముద్రం కూడా దాటించే వార ధి నిర్మించిన సంకల్ప బలమే ప్రేమ. అదే ప్రేమకున్న శక్తి. దాన్ని ‘జానకి కన్నుల జలధి తరంగం... రాముని మదిలో విరహ సముద్రం... చేతులు కలిపిన సేతు బంధనం... ఆసేతు హిమాచల ప్రణయ కీర్తనం... అంటూ ఈ గీత రచనకు నాంది, ప్రస్తావన చేశారు వేటూరి. సీతారాముల ప్రణయంలోని అచంచలమైన శక్తి నేటికీ ప్రేమమూర్తులుగా ఆ ఇద్దరినీ పూజింపచేస్తోంది కాబట్టే, నేటికీ రామాయణం ఆసేతుహిమాచలం పాడుకునే నిత్య పారాయణం అయింది.
మూడు సముద్రాలు ఒకటిగా కలిసేచోటు, కనిపించే చోటు కన్యాకుమారి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంలోని ఈ పాటలో... కన్యాకువూరి నీ పదవుులు నేనే.../ కడలి కెరటమై కడిగిన వేళ... అంటూ భౌగోళికంగానూ, పాత్రపరంగా భావ గర్భితంగానూ రాయడం వేటూరిగారికే చెల్లింది. అలాగే భౌగోళికంగా చూస్తే... దేశ పటంలో కన్యాకుమారి ప్రాంతం అడుగున ఉంటుంది. దేశాన్ని మాతృమూర్తిగా ఆరాధించే మన సంప్రదాయాన్ని అనుసరించి అది పవిత్రమైన మాతృపాదాలతో సమానం. అందుకే ఆ ప్రాంతాన్ని... భారత భారతి పద సన్నిధిలో.../ కులవుత సాగర సంగమ శృతిలో... అంటూ మాతృవందనం చేసి ధన్యులయ్యారు వేటూరి. అంతేకాదు ఈ ప్రాంతంలోనే వారధి నిర్మించి రాముడు రావణాసురుడితో యుద్ధం చేసి సీతమ్మను వెనుకకు తెచ్చుకున్నాడన్నది చారిత్రకం. అందుకే పాట మొదట్లో రామాయణ ప్రస్తావన.
పాట రాయడానికి పదాలు తెలిస్తే చాలును. కాని ఉదాత్తమైన పాట రాయడానికి మాత్రం... పురాణాలు, చరిత్ర, భౌగోళిక ం, దేశ కాలమాన పరిస్థితుల మీద అవగాహన ఎంత అవసరమో ఈ పాట గుర్తు చేస్తుంది. అందుకే ఈ పాట ప్రణయగీతాలన్నింటి వరుసలో గురుస్థానంలో నిలుస్తుందన్నది నా స్థిర అభిప్రాయం.
Advertisement