గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు... జాగ్రత్తలు!
మహిళల ఆరోగ్యం
గర్భాశయ క్యాన్సర్ లక్షణాలను... ప్రధానంగా నెలసరి రక్తస్రావంలో వచ్చే తేడాల ద్వారా గుర్తించవచ్చు. రుతుక్రమ సమయంలో రక్తస్రావం మరీ ఎక్కువగా ఉండడం, నెల మధ్యలో స్పాటింగ్ వంటి లక్షణాలు కనిపిస్తే ఒకసారి గర్భకోశ నిపుణులను సంప్రదించాలి. తెల్లని లేదా పసుపు రంగు ద్రవాలు సాధారణ స్థాయికన్నా ఎక్కువగా స్రవిస్తుంటే కూడా అప్రమత్తం కావాల్సిందే.
పొత్తి కడుపు నొప్పి మరో లక్షణం. కలయిక సమయంలో నొప్పి, మూత్రాశయం నొప్పిగా అనిపించడం, మూత్రవిసర్జన చేసేటప్పుడు నొప్పి కూడా సర్వికల్ క్యాన్సర్ లక్షణాలలో ఒకటి. ఇది వ్యాధి ముదిరిన దశ. క్యాన్సర్ సర్విక్స్ నుంచి మూత్రాశయానికి పాకినప్పుడు ఈ లక్షణం కనిపిస్తుంది. ఇదే లక్షణం యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌లోనూ ఉంటుంది. కాబట్టి సమస్య మూత్రనాళానికి ఇన్‌ఫెక్షన్ అయి ఉండవచ్చనే కోణంలో కూడా నిర్ధారించుకుని చికిత్స చేయించుకోవాలి.
పరీక్షలు: పాప్‌స్మియర్ టెస్ట్ గర్భాశయ క్యాన్సర్ లక్షణాలను ముందస్తుగా కనుక్కోగలిగిన పరీక్ష. ఇందులో అంతా సాధారణంగానే ఉన్నట్లు నిర్ధారించు కోవాలి. భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వారానికి క్యాన్సర్ సోకే ప్రమాదాన్ని ఇది తెలియచేస్తుంది. ఏదైనా తేడా ఉంటే వెంటనే చికిత్స ప్రారంభించాలి.