ఆన్సర్స్‌ రాసేటప్పుడు కళ్ళకు మసకలు! | homeopathic councelling for health | Sakshi
Sakshi News home page

ఆన్సర్స్‌ రాసేటప్పుడు కళ్ళకు మసకలు!

Published Sat, Dec 10 2016 12:36 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

ఆన్సర్స్‌ రాసేటప్పుడు కళ్ళకు మసకలు! - Sakshi

ఆన్సర్స్‌ రాసేటప్పుడు కళ్ళకు మసకలు!

నా వయస్సు 28 ఏళ్లు. నేను ప్రస్తుతం కొన్ని కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాను. నాకు దృష్టిలోపం ఉంది. అద్దాలు వాడుతున్నాను. కొన్నిసార్లు  కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌ రాసే సమయంలొ ఆన్సర్‌ షీట్‌లో ఆన్సర్స్‌ రాసేప్పుడు కళ్లు మసక అవుతున్నాయి. దానివల్ల అతి కష్టమ్మీద పరీక్ష రాయాల్సి వస్తోంది. డాక్టర్‌ను కలిస్తే మందులూ, చుక్కల మందూ ఇచ్చారు. అయినా ఫలితం లేదు. దయచేసి ఈ సమస్య నుంచి బయటపడే మార్గం చెప్పండి.    – రఘురామ్, ఖమ్మం

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు కంట్లో ఇమేజ్‌ ‘అకామడేటివ్‌ ఫెయిల్యూర్‌’ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. కెమెరాలో బొమ్మ క్లియర్‌ అయ్యేందుకు ఫోకస్‌ అడ్జెస్ట్‌ చేసిన ప్రక్రియే కంట్లోనూ జరుగుతుంది. ఎదుటి వస్తువును చూసే ప్రక్రియలో ఈ అడ్జెస్ట్‌మెంట్‌ కంట్లో ఆటోమేటిగ్గా జరుగుతుంది. దీన్నే అకామడేషన్‌ అంటారు. అది సరిగా జరగనప్పుడు దాన్ని అకామడేటివ్‌ ఫెయిల్యూర్‌ అంటారు. కొందరిలో సహజంగా కంటి కండరాలు బలహీనంగా ఉండి అకామడేటివ్‌ ఫెయిల్యూర్‌ జరగవచ్చు. మరికొందరిలో టెన్షన్‌ పడుతున్నప్పుడు సైకో సొమాటిక్‌ కారణాల వల్ల ఈ అకామడేటివ్‌ ఫెయిల్యూర్‌ జరుగుతుంది.

పైగా మీరు ఎగ్జామ్‌ సమయంలోనే ఈ సమస్య వస్తుందంటున్నారు కాబట్టి చాలావరకు అది ఎగ్జామ్‌ టెన్షన్‌ వల్లనే కావచ్చు. లేదంటే చదువుతున్న ప్రతిసారీ ఈ సమస్య రావాలి కదా. మీరు అద్దాలు వాడుతున్నానని అన్నారు. అవి సరైన పవర్‌తో (అండర్‌ కరక్షన్‌తో, ఓవర్‌ కరెక్షన్‌తో) ఉన్నాయా లేదా అన్న విషయాన్ని  ఓసారి కంటి వైద్య నిపుణుడిని కలిసి పరీక్ష చేయించుకోండి. మీ వయస్సుకు రక్తపోటు, చక్కెర వ్యాధి ఉండకపోవచ్చు. అయినా ఓసారి పరీక్ష చేయించుకుని అవి లేవని నిర్ధారించుకోవడం మంచిది. థైరాయిడ్‌ వ్యాధి, అనీమియా (రక్తహీనత) కూడా ఉన్నాయేమో పరీక్షించుకోండి. డ్రై ఐ, ఇంట్రా ఆక్యులార్‌ ప్రెషర్‌లను కూడా చెక్‌ చేయించుకోవాలి. పైవన్నీ నార్మల్‌గా ఉంటే మీకు ఎగ్జామ్‌ టెన్షన్‌ వల్లనే ఈ సమస్య వస్తోందని నిర్ధారణ చేయవచ్చు.
 
నా వయస్సు 44 ఏళ్లు. సిగరెట్లు తాగుతాను. ఓసారి సిగరెట్‌ వెలిగిస్తుంటే లైటర్‌లో మంట కాస్తంత పైవరకూ వచ్చి, కంటికి సెగ తగిలిందనిపించింది. అలా జరిగినందువల్ల నా కంటికి ఏదైనా హాని జరిగే అవకాశం ఉందా? సిగరెట్‌ స్మోకింగ్‌ వల్ల కంటికి ఏదైనా ప్రమాదమా?– సుకుమార్, నల్లగొండ
కార్నియా పైపొరను ఎపిథీలియమ్‌ అంటారు. మాటిమాటికీ పొగ, సెగ తగలడం వల్ల ఈ ఎపిథీలియమ్‌ దెబ్బతినడానికి అవకాశం ఉంది. ఒకవేళ అది దెబ్బతింటే కంట్లోంచి నీరు కారడం, ఎరుపెక్కడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా ఎక్కువగా పొగతాగేవాళ్ల (క్రానిక్‌ స్మోకర్స్‌)లో నికోటిన్‌ విష పదార్థం ప్రభావంవల్ల ‘టుబాకో ఆంబ్లోపియా’ అనే సమస్య వస్తుంది. ఆంబ్లోపియా వచ్చిన వాళ్లలో కంటి నరం (ఆప్టిక్‌ నర్వ్‌) దెబ్బతిని స్పష్టమైన బొమ్మ (క్లియర్‌  ఇమేజ్‌) కనిపించకుండా కేవలం ఓ స్కెచ్‌లాగానో, ఫోటోగ్రాఫ్‌ నెగెటివ్‌ లాగానో (ఘోస్ట్‌ ఇమేజ్‌) కనిపిస్తుంది. దీని వల్ల వచ్చే ఇంకొక సమస్య కళ్లు పొడిబారడం... అంటే డ్రై ఐ అన్నమాట. మీరు వెంటనే సిగరెట్‌ మానేయండి. ఆంబ్లోపియా వచ్చినవాళ్లు వెంటనే సిగరెట్‌ పూర్తిగా మానేసి, వాళ్లకు విటమిన్‌ సప్లిమెంట్స్‌ (ప్రత్యేకంగా బి1, బి2, బి12, బి6) ఇస్తే పరిస్థితి మళ్ళీ సాధారణంగా మారేందుకు అవకాశం ఉంది.

తరచూ... యూరినరీ ఇన్ఫెక్షన్‌లు
నా వయసు 34 ఏళ్లు. తరచుగా జ్వరం. మూత్రవిసర్జన సమయంలో విపరీతమైన మంట కూడా ఉంటోంది. ఇలా తరచూ జ్వరం, మూత్రంలో మంట వస్తున్నాయి. ఇలా మాటిమాటికీ జ్వరం రాకుండా ఉండేందుకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? – సుమాలిక, దోసపహాడ్‌

మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘రికరెంట్‌ యూరిన్‌ ఇన్ఫెక్షన్‌’తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా మీకు మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్‌ వస్తున్న కారణం ఏమిటన్నది తెలుసుకోవాలి. మీకు షుగర్‌ ఉంటే కూడా ఇలా మాటిమాటికీ యూరిన్‌ ఇన్ఫెక్షన్‌ రావచ్చు. ఒకసారి మీరు షుగర్‌ టెస్ట్‌ చేయించుకోండి. అలాగే అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లుగానీ, మూత్రనాళాల్లో వాపుగానీ ఉన్నాయేమో చూడాలి. మీకు డాక్టర్‌ ఇచ్చిన యాంటీబయాటిక్‌ పూర్తి కోర్సు వాడకుండా ఉన్నా కూడా మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్స్‌ తిరగబెట్టవచ్చు. మీకు ఏ కారణం లేకుండా ఇన్ఫెక్షన్‌ వస్తుంటే కనీసం మూడు నెలల పాటు యాంటీబయాటిక్స్‌ వాడాలి. రోజూ నీళ్లు ఎక్కువగా (అంటే రెండు నుంచి మూడు లీటర్లు) తాగాలి. మూత్రం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకుండా, వెంటనే మూత్రవిసర్జనకు వెళ్లాలి.

మా బాబు వయసు ఎనిమిదేళ్లు. ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ముఖం, కాళ్లు వాపు వచ్చాయి. యూరిన్‌లో ప్రోటీన్స్‌ పోయాయనీ, నెఫ్రోటిక్‌ సిండ్రోమ్‌ అని చెప్పి చికిత్స చేశారు. నెలరోజులు మందులు వాడిన తర్వాత యూరిన్‌లో ప్రోటీన్‌ పోవడం తగ్గింది. మందులు ఆపేశాము. మళ్లీ 15 రోజుల తర్వాత యూరిన్‌లో మళ్లీ ప్రోటీన్లు పోవడం ప్రారంభమైంది. మళ్లీ మందులు వాడితే ప్రోటీన్లు పోవడం తగ్గింది. ఇలా మందులు వాడినప్పుడల్లా తగ్గి, ఆపేయగానే మూత్రంలో మళ్లీ ప్రోటీన్లు పోతున్నాయి. అయితే ఎక్కువకాలం మందులు వాడితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందా అని ఆందోళనగా ఉంది. వాటివల్ల ఏవైనా సైడ్‌ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశాలూ ఉన్నాయా? దయచేసి వివరించండి.     – యూసఫ్, ఖమ్మం

నెఫ్రోటిక్‌ సిండ్రోమ్‌ ఉన్నప్పుడు మొదటిసారి పూర్తిగా మూడు నెలల పాటు డాక్టర్‌ పర్యవేక్షణలో మందులు వాడాలి. కొంతమంది పిల్లల్లో మందులు మానేయగానే మళ్లీ ప్రోటీన్‌ పోవడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పిల్లల్లో తక్కువ మోతాదులో మందులను ఆర్నెల్ల నుంచి తొమ్మిది నెలల పాటు వాడాల్సి ఉంటుంది. కొంతమందిలో సైడ్‌ఎఫెక్ట్స్‌ కనిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు వేరే మందులు వాడాల్సి ఉంటుంది. చాలామంది పిల్లల్లో ఈ వ్యాధి 12–14 సంవత్సరాల వయసప్పుడు పూర్తిగా నయమవుతుంది. కిడ్నీలు దెబ్బతినే అవకాశం చాలా తక్కువ. మీరు ఆందోళన పడకుండా డాక్టర్‌ పర్యవేక్షణలో మందులు వాడండి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement