విద్యార్థిని మింగిన నీటిగుంత
-
ప్రమాదం జరిగిందని తెలిసినా.. నిర్లక్ష్యంగా వెళ్లిపోయిన ప్రిన్సిపాల్
-
విద్యార్థి బహిర్భూమికి వెళ్లగా చోటుచేసుకున్న దుర్ఘటన
-
బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
శాయంపేట : పాఠశాల పరిసరాల్లో బహిర్భూమికి వెళ్లిన విష్ణు(10) అనే విద్యార్థి నీటి తటాకాన్ని తలపిం చేలా తవ్విన భారీ గుంతలో పడి దుర్మరణం పాల య్యాడు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం శాయంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రేగొండ మండలం కొత్తపల్లిగోరికి చెందిన కొలిపాక రవి, మంజుల దంపతులకు ఇద్దరు కుమారులు వారిలో పెద్ద కుమారుడు వేణు పుట్టకతోనే అంగవైకల్యం కలిగి ఉన్నాడు. రెండో కుమారుడు విష్ణు గతేడాది మెుగుళ్లపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో సీటు సంపాదించాడు. మొగుళ్లపల్లిలో పాఠశాల భవనం అందుబాటులోకి రాకపోవడంతో, తాత్కాలిక ఏర్పాటుగా శాయంపేట గురుకులంలోనే విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా, శాయంపేట గురుకులంలో స్థానిక విద్యార్థులు 450 మంది, మొగుళ్లపల్లికి చెందినవారు మరో 160 మంది చదువుతున్నారు. అయితే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అమాంతంగా పెరిగిం ది కానీ.. టాయిలెట్స్ సంఖ్య మాత్రం పెరగలేదు. మరోవైపు పాఠశాల ప్రిన్సిపాల్ మరుగుదొడ్లు, మూత్రశాలలకు తాళం వేసి ఉంచేవారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక విద్యార్థులు ప్రతిరోజు బహిర్భూమి కోసం పరిసరాల్లోని నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లేవారు.
కర్రను పట్టుకోబోయి..
ఈక్రమంలో శనివారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో విద్యార్థులు భోజనాలు ముగించుకొని, విద్యార్థి విష్ణు తోటి విద్యార్థులతో కలిసి పాఠశాలను ఆనుకొని ఉన్న ఓ ప్రైవేటు స్థలంలో బహిర్భూమికి వెళ్లారు. ఆ స్థలంలోని మెురంను తరలించగా మిగిలిన పెద్ద గుంతలో ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్లు భారీగా చేరాయి. విద్యార్థి కొలిపాక విష్ణు ఆ గుంతలోకి కర్ర వేసి ఆడసాగాడు. ఇంతలో కర్ర అందులోకి పడిపోయింది. దీంతో ఆ కర్రను ఎలాగైనా పట్టుకోవాలని గుంత ఒడ్డుకు చేరుకొని అడుగువేశాడు. దీంతో ఒడ్డున ఉన్న మట్టిపెళ్లలు ఒక్కసారిగా కూలడంతో విష్ణు నీళ్లలోకి మునిగిపోయాడు. వెంటనే తోటి విద్యార్థులు విష్ణు చేతికి కర్ర అందించి.. ఒడ్డుకు లాగే ప్రయత్నం చేశారు. అది విఫలమైంది. విష్ణు నీళ్లలో మునిగిపోయాడు. దీంతో తోటి విద్యార్థులు కార్తీక్, గణేశ్, యశ్వంత్‌లు పరుగెత్తుకుంటూ వెళ్లి ఉపాధ్యాయులకు జరిగిన విషయాన్ని తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో మృతదేహం కోసం వెతికించారు. రాత్రి 8 గంటలకు విద్యార్థి మృతదేహం లభ్యమైంది.
ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ వేటు
విద్యార్థి మృతదేహంతో విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు గురుకులం ఎదుట సోమవారం రాత్రి ధర్నాకు దిగారు. దీంతో పరకాల తహసీల్దార్ కృష్ణ గురుకులానికి చేరుకొని మృతిచెందిన విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇప్పించడంతో పాటు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామన్నారు. దీంతో వారు ఆందోళనను విరమించారు. కాగా, ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆరా తీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ ఎండీ ఖాజాను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.