radiotherapy
-
భారత్‌లో రెట్టింపు రేడియో థెరపీ మెషీన్లు అవసరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఏటా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2020లో కొత్తగా 13.25 లక్షల కొత్త కేసులు రాగా 8.5 లక్షల మంది క్యాన్సర్ సంబంధ సమస్యలతో మరణించారు. ఈ నేపథ్యంలో దేశీయంగా సకాలంలో సరైన చికిత్స అందించేందుకు రేడియో థెరపీ మెషీన్ల సంఖ్య రెట్టింపు స్థాయికి పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఎలెక్టా ఇండియా ఎండీ మణికందన్ బాలా సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 650 పైచిలుకు మెషీన్లు ఉండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం జనాభారీత్యా 1,400 వరకు అవసరమని ఆయన చెప్పారు. నివేదికల ప్రకారం తెలంగాణలో 2025 నాటికి కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య 53,000 పైచిలుకు ఉండనుందన్నారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు, చికిత్స వ్యయాలను తగ్గించి .. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆస్పత్రులతో చర్చలు జరుపుతున్నామని బాలా చెప్పారు. ఎంఆర్–లినాక్ వంటి అధునాతన మెషీన్లను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి దేశీయంగా తమ మెషీన్లు 500 పైచిలుకు ఉన్నట్లు వివరించారు. ఎలెక్టాకు అమెరికా, బ్రిటన్, చైనా తదితర దేశాల్లో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. -
క్యాన్సర్‌ను నివారించేందుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందా? ఎవరికి మేలు..
వైద్య విజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని వ్యాధులకు ఖచ్చితమైన పరిష్కారాన్ని కనుక్కోలేకపోతున్నాం. జీవితకాలాన్ని పొడిగించుకోగలిగిన మనిషి క్యాన్సర్‌కు ఆన్సర్ మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. క్యాన్సర్ అనగానే ఎన్నో సందేహాలు, భయాలు, అనుమానాలు వెంటాడుతుంటాయి. క్యాన్సర్‌పై అవగాహన కోసం అందరూ తెలుసుకోవాల్సిన విషయాలివి... ► క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? క్యాన్సర్ లక్షణాలు ఆ వ్యాధి సోకిన అవయవాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వివిధ రకాల క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణాలు ఇవి... తీవ్రమైన అలసట. జ్వరం, రోగనిరోధక శక్తి తగ్గడం, ఆకలి తగ్గడం, వాంతులు, విరేచనాలు, అకారణంగా బరువు తగ్గడం, రక్తహీనత. ► క్యాన్సర్ కణం శరీరంలో ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోవచ్చా? శరీరం మొత్తంలో క్యాన్సర్ కణం ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోడానికి నిర్దిష్టమైన పరీక్ష అయితే లేదు. ఎందుకంటే ఏ అవయవానికి క్యాన్సర్ వచ్చిందని అనుమానిస్తే... దానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, ఎఫ్ఎన్ఏ టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై, పెట్ స్కాన్ ఇలా.. అవసరాన్ని బట్టి రకరకాల పరీక్షలు చేస్తుంటారు. ఒక్క సర్వైకల్ క్యాన్సర్‌ను మాత్రం పాప్‌స్మియర్ ద్వారా చాలా ముందుగా గుర్తించవచ్చు. ► క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ లేదా? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్)కు కారణం హెచ్‌పీవీ వైరస్ అని తెలుసు కాబట్టి ఇది రాకుండా అమ్మాయిలకు వ్యాక్సిన్ ఉంది. తొమ్మిదేళ్ల నుంచి పెళ్లికాని అమ్మాయిలందరూ (అంటే శృంగార జీవితం ప్రారంభం కాకముందుగా) ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. హెపటైటిస్–బి వ్యాక్సిన్ ద్వారా 50% – 60% కాలేయ క్యాన్సర్లను నివారించవచ్చు. ► క్యాన్సర్ నివారణ మన చేతుల్లో లేదా? సర్వైకల్ క్యాన్సర్‌కు తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌కూ ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి నివారణ మన చేతుల్లో లేనట్టే. అయితే పుష్కలంగా పీచు పదార్థాలు ఉండే ఆహారం, వ్యాయామం, కాలుష్యానికీ, రసాయనాలకూ దూరంగా ఉండటం, పొగతాగడం–ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం, తరచూ ఇన్ఫెక్షన్స్ గురికాకుండా చూసుకోవడం ద్వారా వీలైనంతవరకు క్యాన్సర్‌ను నివారించుకోవచ్చు. ► క్యాన్సర్స్ వంశపారంపర్యమా? ఖచ్చితంగా చెప్పలేం గానీ... రక్తసంబంధీకుల్లో రొమ్ముక్యాన్సర్ ఉన్నప్పుడు... మిగతా వారితో పోలిస్తే... వీళ్లకువచ్చే ముప్పు ఎక్కువ. బీఆర్సీఏ–1, బీఆర్సీఏ–2 వంటి జీన్ మ్యూటేషన్ పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పసిగట్టవచ్చు. ► క్యాన్సర్‌ను కొంతమంది జయిస్తే మరికొందరు కొద్దిరోజుల్లోనే మరణిస్తారు. ఎందుకని? ప్రతి మనిషి ప్రవర్తనలో తేడా ఉన్నట్లే, క్యాన్సర్ కణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటుంది. క్యాన్సర్‌ను జయించడం అన్న విషయం దాన్ని ఏ దశలో కనుక్కున్నాం, ఆ క్యాన్సర్ గడ్డకు త్వరగా పాకే గుణం ఉందా లేక సోకిన ప్రాంతానికే పరిమితమయ్యిందా అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సర్జరీ, మందులు, చికిత్సప్రక్రియలూ ఆ విషయాల మీదే ఆధారపడి ఉంటాయి. క్యాన్సర్‌ను జయించడంలో త్వరగా గుర్తించడంతో పాటు ఆ గడ్డ తాలూకు స్టేజ్, గ్రేడింగ్ కూడా చాలా ముఖ్యం. ► క్యాన్సర్‌కు వయోభేదం లేదా? లేదు. ఏ వయసువారిలోనైనా కనిపించవచ్చు. అదృష్టవశాత్తు చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ చాలావరకు పూర్తిగా నయం చేయగలిగేవే. ► క్యాన్సర్‌ను అదుపులో మాత్రమే ఉంచగలమా? నయం చేయలేమా? చికిత్స సమయంలోనూ, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? క్యాన్సర్ చికిత్సతో వచ్చే దుష్ప్రభావాలను (సైడ్‌ఎఫెక్ట్స్‌ను) పరిశోధకులు కొంతవరకు తగ్గించగలిగారు గానీ ఇప్పటికీ అవి ఎంతోకొంత ఉన్నాయి. వైద్యుల సలహాలు పాటించడం, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండే వైద్యకేంద్రంలోని అనుభవజ్ఞులైన డాక్టర్ దగ్గరికి వెళ్లడం, మనోధైర్యంతో యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండటం మంచిది. పథ్యాలు ఏవీ పాటించనక్కర్లేదు. మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. క్యాన్సర్ కణాలమీదే పనిచేసే కీమోథెరపీ, రేడియోథెరపీలతో పాటు ల్యాపరోస్కోపిక్ పద్ధతిలో చేసే కీ–హోల్ సర్జరీలు కూడా నేడు క్యాన్సర్‌కు చేయగలుగుతున్నారు. సర్జరీ చేశాక రేడియోథెరపీ, కీమో, హార్మోన్ థెరపీ వంటివి ఇచ్చినా లేదా థెరపీ తర్వాత సర్జరీ చేసినా చికిత్స అంతటితో ముగిసిందని అనుకోడానికి లేదు. క్రమం తప్పకుండా చెకప్స్‌కు వెళ్లడం, పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. మొదటి ఐదేళ్లలో వ్యాధి తిరగబెట్టకపోతే అది మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. కొంతమందిలో పది, ఇరవై ఏళ్ల తర్వాత వ్యాధి వచ్చిన భాగంలో కాకుండా మరో అవయవంలో వచ్చిన సందర్భాలున్నాయి. కాబట్టి క్యాన్సర్ అదుపులో ఉందంటారుగానీ పూర్తిగా నయమైంది అని చెప్పలేరు. ఒక రొమ్ములో క్యాన్సర్ వచ్చిన వారిలో మరో రొమ్ములోనూ వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్ని రకాల క్యాన్సర్లు శరీరంలోని ఒక అవయవం నుంచి ఇంకో అవయవానికి విస్తరించి, మిగతా భాగాలకు వ్యాపించి, ఇతర అవయవాలకూ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని నిర్ధారణ చేసే పరీక్షలను చికిత్స ముగిశాక కూడా చేయించుకుంటూ ఉండాలి. -
ప్రొస్టేట్ క్యాన్సర్‌పై నానో కత్తి
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మగవారికి ప్రొస్టేట్ క్యాన్సర్ శాపంగా పరిణమిస్తోంది. దీన్ని గుర్తించిన తర్వాత రేడియో థెరపీ లేదా ఆపరేషన్ చేసి ప్రొస్టేట్ గ్రంధిని తొలగించడమనే మార్గాలు మాత్రమే రోగులకు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా దీన్ని పూర్తిగా నిర్మూలించే సరికొత్త చికిత్సా విధానంపై డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేవలం గంటలోపు పూర్తయ్యే ఈ చికిత్స ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నయం చేస్తుందంటున్నారు. ఈ చికిత్సలో మందులకు లొంగని కణతులపైకి ఎలక్ట్రిక్ తరంగాలను పంపి వాటిని నాశనం చేస్తారు. ‘నానో నైఫ్’గా పిలిచే ఈ సరికొత్త చికిత్సా విధానం చాలా సులువైనదని, సైడ్ ఎఫెక్టులు చాలా స్వల్పమని యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్ సర్జన్లు చెప్పారు. నిజానికి ఈ నానో నైఫ్ చికి త్సను ఇప్పటికే లివర్, క్లోమ క్యాన్సర్లలో వాడుతున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌పై దీన్ని తొలిసారి వాడినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఏమిటీ నానో నైఫ్.. ఈ ట్రీట్మెంట్ పేరు నానో నైఫ్ కానీ, నిజంగా చికిత్సలో నైఫ్ (కత్తి) వాడరు. చర్మం ద్వారా ఒక సూదిని పంపి ఆల్ట్రాసౌండ్స్ను ఉపయోగించి కణతులను (ట్యూమర్లు) గుర్తిస్తారు. అనంతరం ఆ కణితి చుట్టూ నాలుగు సూదులు గుచ్చుతారు. వీటి ద్వారా నానో నైఫ్ మిషన్ ఎలక్ట్రిక్ తరంగాలను పంపుతుంది. ఈ తరంగాలు కణతుల్లోని కణాలపై ఉండే త్వచాన్ని ధ్వంసం చేస్తాయి. దీంతో ఆ కణుతులు నాశనం అవుతాయి. ఈ మొత్తం ప్రక్రియ 45–60 నిమిషాల్లో పూర్తవుతుంది. లకి‡్ష్యత కణుతులపైకి కరెంట్ తరంగాలను పంపి నిర్వీర్యం చేసే ఈ పద్దతిని ఇర్రివర్సబుల్ ఎలక్ట్రోపోరేషన్ అంటారు. దీనివల్ల కణతులకు చుట్టుపక్కల కణజాలంపై పెద్దగా ప్రభావం పడకుండా ఉంటుంది. సాంకేతికత సాధించిన విజయాల్లో ఇది ఒకటని ఈ ఆపరేషన్ తొలిసారి నిర్వహించిన డాక్టర్ ఆలిస్టర్ గ్రే అభిప్రాయపడ్డారు. ముదిరితే కానీ తెలియదు.. మగవారిలో మూత్రాశయం దిగువన ఉండే ప్రొస్టేట్ గ్రంధిలో కణజాలం అదుపుతప్పి పెరగడాన్ని ప్రొస్టేట్ క్యాన్సర్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో సంభవించే క్యాన్సర్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత ప్రమాదకరమో, పురుషుల్లో ఈ క్యాన్సర్ అంతే ప్రమాదకారిగా మారింది. ఏటా లక్షలమంది దీని బారినపడి మరణిస్తున్నారు. ఇతర క్యాన్సర్లలో కనిపించినట్లు ఈ క్యాన్సర్ సోకగానే లక్షణాలు కనిపించవు. దీంతో చాలామందిలో ఇది సోకిన విషయం చివరి దశలో కానీ బయటపడదు. మూత్ర విసర్జనలో ఇబ్బంది అనిపిస్తే డాక్టర్లు ప్రొస్టేట్ క్యాన్సర్‌గా అనుమానిస్తారు. బయాప్సీ ద్వారా ఈ క్యాన్సర్‌ను నిర్ధారిస్తారు. రేడియోథెరపీ నిర్వహించడం, ఆపరేషన్‌తో కణుతులను తొలగించడం వంటి చికిత్సామార్గాలున్నాయి. అయితే వీటితో సైడ్ ఎఫెక్టులు ఎక్కువ. ఇండియాలో ఏడాదికి సుమారు లక్షకుపైగా ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 85 శాతం కేసులు 3, 4వ దశల్లో మాత్రమే గుర్తించడం జరుగుతోంది. ఇది సోకడానికి నిర్దిష్ఠ కారణాలు తెలియదు. ఎలాంటి దురలవాట్లు లేనివారికి కూడా ఇది సోకే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపడం ద్వారా ఇది రాకుండా నివారించవచ్చు. – నేషనల్ డెస్క్,సాక్షి -
పెద్దదిక్కులో..కేన్సర్‌కు దిక్కేది?
ఎంజీఎంలో 10 నెలలుగా నిలిచిన సేవలు పేద రోగులకు తప్పని తిప్పలు చికిత్సకు హైదరాబాద్‌కు వెళ్లాల్సిందే ఎంజీఎం, న్యూస్‌లైన్ : ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో క్యాన్సర్ వైద్య సేవలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలు దేవుడేరుగు ఉన్న నామామాత్రపు సేవలు సైతం అందని దుస్థితి నెలకొంది. కోబాల్ట్ పరికరంలో ఏర్పడిన సాంకేతిక లోపంతోపాటు రేడియోథెరపీ కోసం ఉపయోగించే సోర్స్ కూడా ముగిసి 10 నెలలు గడుస్తోంది. అయినా పేద రోగులకు క్యాన్సర్ సేవలను అందుబాటులోకి తేవడంలో ఎంజీఎం పరిపాలనాధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో వరంగల్‌తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఎంజీఎం వచ్చే క్యాన్సర్ రోగులు చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లక తప్పడం లేదు. పూర్తిగా నిలిచిపోయిన వైద్యసేవలు 2013 జూలై 8న టెలీథెరపీ పరికరంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో క్యాన్సర్ వైద్యసేవలు పూర్తిగా నిలిచిపోయాయి. క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ, రేడియోథెరపీ ద్వారా చికిత్సలు చేస్తుంటారు. రేడియేషన్ ప్రక్రియలో క్యాన్సర్ కణాలను నాశనం చేస్తారు. ఆస్పత్రికి నిత్యం 30 నుంచి 50 మంది వరకు క్యాన్సర్ రోగులు వస్తుండగా ఇందులో 35 మంది రేడియోథెర పీ ద్వారా, 15 మంది కీమోథెరపీ ద్వారా చికిత్స పొందే వారు. ప్రస్తుతం వారంతా హైదరాబాద్‌కు వెళ్తున్నారు. అడ్రస్ లేని ఆధునిక పరికరాలు 1991లో కోబాల్ట్ యూనిట్ ప్రారంభించి అదే పరికరంతో క్యాన్సర్ రోగులకు చికిత్సలు చేస్తూ వచ్చారు. సుమారు రెండు దశాబ్దాలుగా ఉపయోగించడంతో ఆ పరికరంలోని రేడియేషన్ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోవడం వల్ల చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయేదని వైద్యులే పేర్కొంటున్నారు. 1991లో 150 ఆర్ఎంఎంతో(రాంజన్ ఫర్ మినిట్ ఎట్ 1 మీటర్ డిస్టెన్స్) యూనిట్‌ను ప్రారంభించారు. అయితే ఐదున్నరేళ్ల నుంచి దాని సామర్థ్యం సగానికి తగ్గిపోయిందని నిపుణులు చెబుతున్నారు. దీనికి మరోమారు 2003లో 150 ఆర్ఎంఎం కొత్త సోర్స్‌ను ఏర్పాటు చేశారు. 2003 నుంచి నేటి వరకు అదే సోర్స్‌ను ఉపయోగిస్తున్నారు. దీని సామర్థ్యం 2013 వరకు 150 నుంచి 35 ఆర్‌ఎంఎంకు తగ్గిపోయింది. రేడియేషన్ పరికరంలో 50 శాతానికి ఎక్కువగా సోర్స్ ఉన్నప్పుడే క్యాన్సర్ కణాలపై రేడియేషన్ ప్రభావం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈపరికరం ద్వారా రోగులకు చికిత్స చేసినా ఆశించిన ప్రయోజనం లేకుండా పోయేది. ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స విభాగంలో లీనాక్(లినాయర్ యాక్సిలేటర్) అనే నూతన పరికరం అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా వైద్యం అందిస్తే మెరుగైనా ఫలితాలు వస్తాయి. ఆరోగ్యశ్రీ నిధులు ఉన్నా.. ఎంజీఎం ఆస్పత్రి క్యాన్సర్ చికిత్స విభాగంలో ఆరోగ్యశ్రీ కింద 1300 మంది క్యాన్సర్ రోగులకు రేడియేషన్ ద్వారా చికిత్స అందించినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీని ద్వారా ఆస్పత్రికి రూ.మూడుకోట్లకు పైగా అదనపు ఆదాయం లభించింది. అయినా క్యాన్సర్ విభాగం మూత పడడం వల్ల ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా కోల్పోవలసిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని రోగులు కోరుతున్నారు. -
లంగ్ క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు!
ఊపిరితిత్తులు మన శ్వాసక్రియకు ఎంతో కీలకం. ఎందుకంటే... శ్వాస తీసుకోవడం క్షణం ఆలస్యం జరిగినా ప్రమాదమే. అంతటి కీలకమైన ఈ అవయవానికి క్యాన్సర్ సోకితే... గుర్తించడం ఒకింత కష్టం. కారణం... దీన్ని క్షయగా పొరబడే అవకాశం ఉండటం. ఈ కారణంగా చికిత్స ఆలస్యమయ్యే అవకాశం ఉన్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహన కోసం ఈ కథనం. ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే... అక్కడి కణాలు నియంత్రణ లేకుండా అపరిమితంగా పెరిగిపోవడమే. అప్పుడా వ్యాధికి చికిత్స చేయకుండా వదిలేస్తే ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలు ఇతర అవయవాలకూ పాకుతాయి. ఇలా క్యాన్సర్ ఒకచోటి నుంచి మరో అవయవానికి వ్యాపించడాన్ని మెటాస్టాసిస్ అంటారు. క్యాన్సర్ మొదట ఊపిరితిత్తుల్లోని ఎపిథీలియల్ కణాల్లో కనిపిస్తే దాన్ని ‘ప్రైమరీ లంగ్ క్యాన్సర్’ అంటారు. ఇందులో అనేక రకాలున్నాయి. అందులో ప్రధానమైనవి రెండు. మొదటిది స్మాల్‌సెల్ లంగ్ క్యాన్సర్, రెండోది నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. స్మాల్‌సెల్ లంగ్‌క్యాన్సర్ (ఎస్సీఎల్సీ): మొత్తం లంగ్ క్యాన్సర్లలో 14 శాతం ఇవే ఉంటాయి. ఇవి వడివడిగా పాకడం వల్ల లింఫ్‌నోడ్స్, ఎముకలు, మెదడు, అడ్రినల్ గ్రంథి, కాలేయంలోకీ పాకే అవకాశాలున్నాయి. నాన్-స్మాల్‌సెల్ లంగ్ క్యాన్సర్ (ఎన్ఎల్సీఎల్సీ): క్యాన్సర్ వ్యక్తమయ్యే తీరు, లక్షణాలనుబట్టి ఇందులో మూడు రకాలున్నాయి. అవి... స్క్వామస్ సెల్ కార్సినోమా (ఎస్సీసీ): మొత్తం ఊపిరితిత్తుల క్యాన్సర్లలో 25 శాతం - 30శాతం ఈ తరహాకు చెందినవి. ఇది ఊపిరితిత్తుల మధ్యభాగం నుంచి ఆవిర్భవిస్తుంది. అడినోకార్సినోమా: మొత్తం ఊపిరితిత్తుల్లో ఈ తరహాకు చెందినవి 40 శాతం ఉంటాయి. ఈ క్యాన్సర్ ఊపిరితిత్తుల బయటి భాగం నుంచి ఉద్భవిస్తుంది. లార్జ్ సెల్ కార్సినోమా (ఎల్సీసీ): మొత్తం లంగ్ క్యాన్సర్లలో ఇవి 10 శాతం - 15 శాతం ఉంటాయి. ఈ తరహా క్యాన్సర్ చాలా వేగంగా విస్తరించడంతో పాటు... తగ్గే అవకాశాలు బాగా తక్కువ. ఇవేగాక... చాలా తక్కువపాళ్లలో కార్సినాయిడ్ ట్యూమర్స్, అడినాయిడ్ సిస్టిక్ కార్సినోమా, హామార్టోమా, లింఫోమా, సార్కోమా తరహా క్యాన్సర్లూ ఉంటాయి. సెకండరీ లంగ్ క్యాన్సర్: రోగిలో క్యాన్సర్ వేరేచోట ఆవిర్భవించి, పాకే గుణం వల్ల అది ఊపిరితిత్తులకూ విస్తరించడం వల్ల వచ్చే లంగ్ క్యాన్సర్‌ను సెకండరీ లంగ్ క్యాన్సర్ అంటారు. ఉదాహరణకు చాలామందిలో రొమ్ముక్యాన్సర్ మెటస్టాటిస్ వల్ల ఊపిరితిత్తులకూ పాకుతుంది. లక్షణాలు: ఎడతెరపి లేకుండా దగ్గు బరువు తగ్గడం వేగంగా గాలిపీల్చడం (ఆయాసం) ఛాతీనొప్పి దగ్గుతున్నప్పుడు రక్తం పడటం ఎముకల్లో నొప్పి వేలిగోళ్లు బాగా వెడల్పుకావడం జ్వరం అలసట / నీరసం గుండె పైభాగంలోని కుడి గది నుంచి వెళ్లే సిరలోని రక్తప్రవాహంలో అడ్డంకులు మింగడంలో ఇబ్బంది పిల్లికూతలు ఆహారం రుచించకపోవడం గొంతు బొంగురుపోవడం... ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను కలవాలి. ఒకవేళ అది క్షయగా పొరబడి చికిత్స ప్రారంభించినా... నెల తర్వాత కూడా అవే లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం తప్పనిసరిగా క్యాన్సర్ నిపుణుడిని కలిసి అది క్షయా లేక క్యాన్సరా అన్నది నిర్ధారణ చేసుకోవడం ప్రధానం. ఎందుకంటే క్యాన్సర్‌ను త్వరగా గుర్తిస్తే సమర్థమైన చికిత్సకు అవకాశాలు ఎక్కువ. నిర్ధారణ పరీక్షలు: పై లక్షణాలు కనిపించినప్పుడు ముందుగా ఛాతీ ఎక్స్-రే తో పాటు బయాప్సీ, సీటీస్కాన్, పెట్ సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేయాలి. వాటితోపాటు లంగ్స్‌ను పరీక్షించే బ్రాంకోస్కోపీ, రక్తపరీక్షల వంటివి చేయించి వ్యాధి నిర్ధారణ చేసి, వ్యాధి దశను బట్టి అవసరమైన చికిత్స అందించాలి. క్యాన్సర్ కణితి ఊపిరితిత్తుల పైభాగంలోనే ఉంటే దాన్ని నీడిల్ పరీక్ష లేదా బయాప్సీ ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఒకవేళ కణితి లంగ్‌లో మధ్యభాగంలో ఉంటే బ్రాంకోస్కోపీ చేసి, బయాప్సీ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ కణితి క్యాన్సరే అని నిర్ధారణ జరిగితే పెట్ స్కాన్ ద్వారా శరీర భాగాలన్నింటినీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే... ఈ పరీక్ష ద్వారా క్యాన్సర్ ఏ దశలో ఉంది, అది శరీరంలోని ఏయే భాగాలకు విస్తరించి ఉంది అనే విషయాలు తెలుస్తాయి. అయితే కొన్ని రకాల ఎముకలకు సంబంధించిన మెటాస్టాటిస్లు పెట్స్కాన్లోనూ కనిపించక పోవచ్చు. అప్పుడు అవసరాన్ని బట్టి బోన్‌స్కాన్, ఎమ్మారై స్కాన్ వంటి పరీక్షలూ చేయాల్సి ఉంటుంది. చికిత్స: ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ఒకవేళ నాలుగోదశలో గుర్తిస్తే అప్పుడు కీమోథెరపీతో పాటు మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇచ్చి, రోగి జీవితకాలాన్ని పొడిగిస్తారు. బయాప్సీ ముక్కను ఈజీఎఫ్ఆర్ అనే కొన్ని ప్రత్యేక పరీక్షలకు పంపి, వాటిలో పాజిటివ్ ఫలితం వస్తే దాన్ని బట్టి మాత్రల ద్వారా కూడా నాలుగో దశ లంగ్ క్యాన్సర్‌కు చికిత్స చేయవచ్చు. ఒకవేళ క్యాన్సర్ మూడో దశ (3-ఏ)లో ఉన్నప్పుడే గుర్తిస్తే... అప్పుడు కీమోథెరపీ, రేడియోథెరపీలను కూడా ఇవ్వవచ్చు. కొన్నిసార్లు కీమోథెరపీతో వ్యాధిని నియంత్రణలోకి తెచ్చి అప్పుడు శస్త్రచికిత్స చేసి క్యాన్సర్ ఉన్న భాగాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఇక మూడోదశలోనే 3-బి అనే దశలో గుర్తిస్తే అప్పుడు కీమోథెరపీ, రేడియోథెరపీ ఒకసారిగాని... లేదా ఒకదాని తర్వాత మరొకటి గాని ఇస్తారు. క్యాన్సర్‌ను రెండోదశలోనే గుర్తిస్తే... ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఉన్న భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించి, అప్పుడు కీమో ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను చాలా ముందుగా అంటే... మొదటి దశలోనే గుర్తిస్తే మ్తారం ఒక్క శస్త్రచికిత్స చికిత్సతోనే అంతా పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే లంగ్ క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించడం అన్నివిధాలా మేలు. నివారణ: అన్నిరకాల ఊపిరితిత్తుల క్యాన్సర్లకూ ప్రప్రథమ, ప్రధాన కారణం పొగాకు వాడకం. అది పొగతాగడం రూపంలోగాని లేదా పొగాకు నమలడం గాని లేదా అడ్డపొగాకు రూపంలో నిప్పు ఉన్నవైపును నోట్లో పెట్టి కాల్చడం గాని... ఇలా ప్రక్రియ ఏదైనా పొగాకు అన్నది అన్ని రకాల లంగ్ క్యాన్సర్లకు మూలకారణం. సిగరెట్ పొగలో 4000 రకాల హానికరమైన రసాయనాలు, అందులో 60కి పైగా క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటాయి. ఆ పొగ నేరుగా కాకుండా, పొగతాగేవారి పక్కన ఉండే వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా హానికరం కాబట్టి ఈ దురలవాటును దూరం చేసుకుంటే 90 శాతం రోగుల్లో సమర్థమైన నివారణ సాధ్యమవుతుంది. ఇక సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావడం ద్వారా విటమిన్-డిని శరీరానికి లభించేలా చేయడం కూడా క్యాన్సర్ నివారణకు తోడ్పడే అంశమే. పొగాక వాడకంతో పాటు... ర్యాడాన్ గ్యాస్, ఆస్బెస్టాస్, అల్యూమినియం పరిశ్రమల్లో పనిచేయడం, రేడియేషన్‌కు ఎక్స్పోజ్ అయ్యే రంగాల్లో ఉన్నవారు, ఆర్సినిక్ లాంటి విషాలకు ఎక్స్పోజ్ కావడం, బొగ్గు ఉత్పాదనకు సంబంధించిన రంగాల్లో ఉండటం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు రిస్క్ ఫ్యాక్టర్లు. కాబట్టి ఈ రంగాల్లో ఉండేవారు తమకు క్షయ, బ్రాంకైటిస్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించినా అది ఊపిరితిత్తుల క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకోవాలి. అయితే ఈ తరహా క్యాన్సర్ కణాలు అత్యంత సూక్ష్మమైనవి కావడం వల్ల మొదట తీసిన స్కాన్‌లో అవి కనిపించకపోయినా... మూడు లేదా ఆరు నెలల తర్వాత తీయించిన స్కాన్‌లో వాటిని కనుగొంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రిస్క్ ఫ్యాక్టర్ల రంగాల్లో ఉన్నవారు తరచూ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ ఉండటం మంచిది. డాక్టర్ సిహెచ్.మోహనవంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్: 9848011421