లంగ్ క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు! | Lung cancer, the better to determine how quickly! | Sakshi
Sakshi News home page

లంగ్ క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు!

Published Sat, Jan 11 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM

లంగ్ క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు!

లంగ్ క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు!

ఊపిరితిత్తులు మన శ్వాసక్రియకు ఎంతో కీలకం. ఎందుకంటే... శ్వాస తీసుకోవడం క్షణం ఆలస్యం జరిగినా ప్రమాదమే. అంతటి కీలకమైన ఈ అవయవానికి క్యాన్సర్ సోకితే... గుర్తించడం ఒకింత కష్టం. కారణం... దీన్ని క్షయగా పొరబడే అవకాశం ఉండటం. ఈ కారణంగా చికిత్స ఆలస్యమయ్యే అవకాశం ఉన్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహన కోసం ఈ కథనం.
 
 ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే... అక్కడి కణాలు నియంత్రణ లేకుండా అపరిమితంగా పెరిగిపోవడమే. అప్పుడా వ్యాధికి చికిత్స చేయకుండా వదిలేస్తే ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలు ఇతర అవయవాలకూ పాకుతాయి. ఇలా క్యాన్సర్ ఒకచోటి నుంచి మరో అవయవానికి వ్యాపించడాన్ని మెటాస్టాసిస్ అంటారు. క్యాన్సర్ మొదట ఊపిరితిత్తుల్లోని ఎపిథీలియల్ కణాల్లో కనిపిస్తే దాన్ని ‘ప్రైమరీ లంగ్ క్యాన్సర్’ అంటారు. ఇందులో అనేక రకాలున్నాయి. అందులో ప్రధానమైనవి రెండు. మొదటిది స్మాల్‌సెల్ లంగ్ క్యాన్సర్, రెండోది నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్.
 
 స్మాల్‌సెల్ లంగ్‌క్యాన్సర్ (ఎస్‌సీఎల్‌సీ):
మొత్తం లంగ్ క్యాన్సర్లలో 14 శాతం ఇవే ఉంటాయి. ఇవి వడివడిగా పాకడం వల్ల లింఫ్‌నోడ్స్, ఎముకలు, మెదడు, అడ్రినల్ గ్రంథి, కాలేయంలోకీ పాకే అవకాశాలున్నాయి.
 
 నాన్-స్మాల్‌సెల్ లంగ్ క్యాన్సర్ (ఎన్‌ఎల్‌సీఎల్‌సీ): క్యాన్సర్ వ్యక్తమయ్యే తీరు, లక్షణాలనుబట్టి ఇందులో మూడు రకాలున్నాయి. అవి...
 
 స్క్వామస్ సెల్ కార్సినోమా (ఎస్‌సీసీ):
మొత్తం ఊపిరితిత్తుల క్యాన్సర్లలో 25 శాతం - 30శాతం ఈ తరహాకు చెందినవి. ఇది ఊపిరితిత్తుల మధ్యభాగం నుంచి ఆవిర్భవిస్తుంది.
 
 అడినోకార్సినోమా: మొత్తం ఊపిరితిత్తుల్లో ఈ తరహాకు చెందినవి 40 శాతం ఉంటాయి. ఈ క్యాన్సర్ ఊపిరితిత్తుల బయటి భాగం నుంచి ఉద్భవిస్తుంది.
 
 లార్జ్ సెల్ కార్సినోమా (ఎల్‌సీసీ): మొత్తం లంగ్ క్యాన్సర్లలో ఇవి 10 శాతం - 15 శాతం ఉంటాయి. ఈ తరహా క్యాన్సర్ చాలా వేగంగా విస్తరించడంతో పాటు... తగ్గే అవకాశాలు బాగా తక్కువ. ఇవేగాక... చాలా తక్కువపాళ్లలో కార్సినాయిడ్ ట్యూమర్స్, అడినాయిడ్ సిస్టిక్ కార్సినోమా, హామార్టోమా, లింఫోమా, సార్కోమా తరహా క్యాన్సర్లూ ఉంటాయి.
 
 సెకండరీ లంగ్ క్యాన్సర్:
రోగిలో క్యాన్సర్ వేరేచోట ఆవిర్భవించి, పాకే గుణం వల్ల అది ఊపిరితిత్తులకూ విస్తరించడం వల్ల వచ్చే లంగ్ క్యాన్సర్‌ను సెకండరీ లంగ్ క్యాన్సర్ అంటారు. ఉదాహరణకు చాలామందిలో రొమ్ముక్యాన్సర్ మెటస్టాటిస్ వల్ల  ఊపిరితిత్తులకూ పాకుతుంది.
 
 లక్షణాలు:  
 ఎడతెరపి లేకుండా దగ్గు  
 బరువు తగ్గడం
 వేగంగా గాలిపీల్చడం (ఆయాసం)
 ఛాతీనొప్పి
 దగ్గుతున్నప్పుడు రక్తం పడటం  
 ఎముకల్లో నొప్పి
 వేలిగోళ్లు బాగా వెడల్పుకావడం  
 జ్వరం  
 అలసట / నీరసం
 గుండె పైభాగంలోని కుడి గది నుంచి వెళ్లే సిరలోని రక్తప్రవాహంలో అడ్డంకులు  మింగడంలో ఇబ్బంది  
 పిల్లికూతలు  
 ఆహారం రుచించకపోవడం
 గొంతు బొంగురుపోవడం... ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను కలవాలి. ఒకవేళ అది క్షయగా పొరబడి చికిత్స ప్రారంభించినా... నెల తర్వాత కూడా అవే లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం తప్పనిసరిగా క్యాన్సర్ నిపుణుడిని కలిసి అది క్షయా లేక క్యాన్సరా అన్నది నిర్ధారణ చేసుకోవడం ప్రధానం. ఎందుకంటే క్యాన్సర్‌ను త్వరగా గుర్తిస్తే సమర్థమైన చికిత్సకు అవకాశాలు ఎక్కువ.
 
 నిర్ధారణ పరీక్షలు: పై లక్షణాలు కనిపించినప్పుడు ముందుగా ఛాతీ ఎక్స్-రే తో పాటు బయాప్సీ, సీటీస్కాన్, పెట్ సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేయాలి. వాటితోపాటు లంగ్స్‌ను పరీక్షించే బ్రాంకోస్కోపీ, రక్తపరీక్షల వంటివి చేయించి వ్యాధి నిర్ధారణ చేసి, వ్యాధి దశను బట్టి అవసరమైన చికిత్స అందించాలి. క్యాన్సర్ కణితి ఊపిరితిత్తుల పైభాగంలోనే ఉంటే దాన్ని నీడిల్ పరీక్ష లేదా బయాప్సీ ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఒకవేళ కణితి లంగ్‌లో మధ్యభాగంలో ఉంటే బ్రాంకోస్కోపీ చేసి, బయాప్సీ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ కణితి క్యాన్సరే అని నిర్ధారణ జరిగితే పెట్ స్కాన్ ద్వారా శరీర భాగాలన్నింటినీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే... ఈ పరీక్ష ద్వారా క్యాన్సర్ ఏ దశలో ఉంది, అది శరీరంలోని ఏయే భాగాలకు విస్తరించి ఉంది అనే విషయాలు తెలుస్తాయి. అయితే కొన్ని రకాల ఎముకలకు సంబంధించిన మెటాస్టాటిస్‌లు పెట్‌స్కాన్‌లోనూ కనిపించక పోవచ్చు. అప్పుడు అవసరాన్ని బట్టి బోన్‌స్కాన్, ఎమ్మారై స్కాన్ వంటి పరీక్షలూ చేయాల్సి ఉంటుంది.
 
 చికిత్స: ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ఒకవేళ నాలుగోదశలో గుర్తిస్తే అప్పుడు కీమోథెరపీతో పాటు మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇచ్చి, రోగి జీవితకాలాన్ని పొడిగిస్తారు. బయాప్సీ ముక్కను ఈజీఎఫ్‌ఆర్ అనే కొన్ని ప్రత్యేక పరీక్షలకు పంపి, వాటిలో పాజిటివ్ ఫలితం వస్తే దాన్ని బట్టి మాత్రల ద్వారా కూడా నాలుగో దశ లంగ్ క్యాన్సర్‌కు చికిత్స చేయవచ్చు. ఒకవేళ క్యాన్సర్ మూడో దశ (3-ఏ)లో ఉన్నప్పుడే గుర్తిస్తే... అప్పుడు కీమోథెరపీ, రేడియోథెరపీలను కూడా ఇవ్వవచ్చు. కొన్నిసార్లు కీమోథెరపీతో వ్యాధిని నియంత్రణలోకి తెచ్చి అప్పుడు శస్త్రచికిత్స చేసి క్యాన్సర్ ఉన్న భాగాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఇక మూడోదశలోనే 3-బి అనే దశలో గుర్తిస్తే అప్పుడు కీమోథెరపీ, రేడియోథెరపీ ఒకసారిగాని... లేదా ఒకదాని తర్వాత మరొకటి గాని ఇస్తారు. క్యాన్సర్‌ను రెండోదశలోనే గుర్తిస్తే... ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఉన్న భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించి, అప్పుడు కీమో ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను చాలా ముందుగా అంటే... మొదటి దశలోనే గుర్తిస్తే మ్తారం ఒక్క శస్త్రచికిత్స చికిత్సతోనే అంతా పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే లంగ్ క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించడం అన్నివిధాలా మేలు.
 
 నివారణ: అన్నిరకాల ఊపిరితిత్తుల క్యాన్సర్లకూ ప్రప్రథమ, ప్రధాన కారణం పొగాకు వాడకం. అది పొగతాగడం రూపంలోగాని లేదా పొగాకు నమలడం గాని లేదా అడ్డపొగాకు రూపంలో నిప్పు ఉన్నవైపును నోట్లో పెట్టి కాల్చడం గాని... ఇలా ప్రక్రియ ఏదైనా పొగాకు అన్నది అన్ని రకాల లంగ్ క్యాన్సర్లకు మూలకారణం. సిగరెట్ పొగలో 4000 రకాల హానికరమైన రసాయనాలు, అందులో 60కి పైగా క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటాయి. ఆ పొగ నేరుగా కాకుండా, పొగతాగేవారి పక్కన ఉండే వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా హానికరం కాబట్టి ఈ దురలవాటును దూరం చేసుకుంటే 90 శాతం రోగుల్లో సమర్థమైన నివారణ సాధ్యమవుతుంది. ఇక సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్ కావడం ద్వారా విటమిన్-డిని శరీరానికి లభించేలా చేయడం కూడా క్యాన్సర్ నివారణకు తోడ్పడే అంశమే. పొగాక వాడకంతో పాటు... ర్యాడాన్ గ్యాస్, ఆస్‌బెస్టాస్, అల్యూమినియం పరిశ్రమల్లో పనిచేయడం, రేడియేషన్‌కు ఎక్స్‌పోజ్ అయ్యే రంగాల్లో ఉన్నవారు, ఆర్సినిక్ లాంటి విషాలకు ఎక్స్‌పోజ్ కావడం, బొగ్గు ఉత్పాదనకు సంబంధించిన రంగాల్లో ఉండటం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు రిస్క్ ఫ్యాక్టర్లు. కాబట్టి ఈ రంగాల్లో ఉండేవారు తమకు క్షయ, బ్రాంకైటిస్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించినా అది ఊపిరితిత్తుల క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకోవాలి. అయితే ఈ తరహా క్యాన్సర్ కణాలు అత్యంత సూక్ష్మమైనవి కావడం వల్ల మొదట తీసిన స్కాన్‌లో అవి కనిపించకపోయినా... మూడు లేదా ఆరు నెలల తర్వాత తీయించిన స్కాన్‌లో వాటిని కనుగొంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రిస్క్ ఫ్యాక్టర్ల రంగాల్లో ఉన్నవారు తరచూ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ ఉండటం మంచిది.
 
 డాక్టర్ సిహెచ్.మోహనవంశీ

 చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
 ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్
 ఫోన్: 9848011421

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement