ఖమ్మం: ఈరోజుల్లో మనిషికి చావు ఊహించనిది. కానీ, అతనికి మాత్రం ఊహించిందే. అందుకే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. జీవిత భాగస్వామి కోసం కావాల్సిన ఏర్పాట్లు చేసేశాడు. కన్నవాళ్లకు, తోడబుట్టిన వాడికి ధైర్యం చెప్పి.. ఓదారుస్తూ వచ్చాడు. విదేశాల్లో ఉంటున్న తాను.. ఎలాగైనా తన మృతదేహం స్వదేశానికి చేరేలా ముందుగానే ఏర్పాట్లు చేశాడు. ఖమ్మం వాసులను కంటతడి పెట్టిన హర్షవర్థన్ గాథలోకి వెళ్తే..
ఖమ్మం సిటీలో ఉండే ఏపూరి రామారావు, ప్రమీలకు ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు హర్షవర్థన్ బీఫార్మసీ చేసి.. 2013లో ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తూ వచ్చాడు. కరోనాకి ముందు.. 2020 ఫిబ్రవరిలో ఖమ్మం వచ్చి వివాహం చేసుకున్నాడు. వీసా వస్తే భార్యను తీసుకెళ్లాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో వైరస్-లాక్‌డౌన్ వచ్చి పడ్డాయి.
ఇదిలా ఉండగానే.. 2020 అక్టోబర్‌లో జిమ్ చేస్తున్న హర్షవర్ధన్‌కి ఆరోగ్యం తేడాగా అనిపించింది. దగ్గు ఆయాసం అనిపించడంతో టెస్టులు చేయించుకోగా.. లంగ్స్ క్యాన్సర్ సోకిందని చెప్పారు. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో.. వాళ్లు రోదించారు. ఇంటికి వచ్చేయమని కోరారు. కానీ, హర్ష వాళ్లకు ధైర్యం అందించాడు. అక్కడే ఉండి చికిత్స తీసుకుంటానని చెప్పాడు.
క్యాన్సర్ సోకింది.. తనకు చావు తప్పదని అనుకున్నాడో ఏమో భార్యకు విడాకులిచ్చేశాడు. అంతేకాదు.. ఆమె జీవితంలో స్థిరపడేందుకు కొన్ని ఏర్పాట్లు చేశాడు. ఈ క్రమంలో.. క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న క్రమంలో.. నయమైందని డాక్టర్లు చెప్పడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 2022 సెప్టెంబర్‌లో ఇంటికి వచ్చి పదిరోజులు ఉన్నాడు. తిరిగి వెళ్లాక.. వ్యాధి తిరగబడింది. ఇక చావు తప్పదని అతనికి అర్థమైంది. విషయం అందరికీ ఫోన్ చేసి చెప్పాడు. రోజూ వీడియో కాల్‌లో మాట్లాడడం చేశాడు. ఇంతలో తమ్ముడు అఖిల్‌కు వివాహం నిశ్చయ్యం అయ్యిందని సంతోషించాడు. మే నెలలో ముహూర్తం ఫిక్స్ చేయడంతో.. సంతోషించి ఆరోగ్యం సహకరిస్తే వస్తానంటూ చెప్పాడు కూడా. ఆ సమయంలో అతని ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది.
తాను చనిపోయాక.. మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంపై అతను దృష్టిసారించారు. ఆ విషయంలో తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనుకున్నాడు. ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం.. ఓ లాయర్‌ను పెట్టుకుని ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. మార్చి 24వ తేదీన హర్షవర్ధన్ కన్నుమూశాడు.
ఏప్రిల్ 5వ తేదీ(బుధవారం) అతని మృతదేహాం ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు చేరింది. హర్ష మృతదేహాన్ని చూసి కుటుంబంతో పాటు స్థానికులంతా కన్నీరు మున్నీరుగా విలపించగా.. అంత్యక్రియలు ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment