మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేక పోవడం, ధూమపానం, రోజు రోజుకు పెరుగుతున్న పర్యావరణ కాలుష్యాలు ప్రజల్లో క్యాన్సర్ బీజాల్ని నాటుతున్నాయి. ఫలితంగా గతంలో పొగతాగేవారికి మాత్రమే సోకే లంగ్ క్యాన్సర్ ఇప్పుడు అందరికీ సోకుతోంది. మరోవైపు జంక్‌ఫుడ్స్‌కు అలవాటు పడుతున్న నగర వాసులు అన్నవాహిక, లివర్, పేగుల క్యాన్సర్‌లకు గురవుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు. క్యాన్సర్ కేసులు, నివారణ మార్గాలపై ప్రత్యేక కథనం.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లో క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందుకు ప్రజల జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణంగా చెబుతున్నారు. రెండు జిల్లాల్లో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో ప్రధానంగా పట్టణ ప్రాంతాల మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా, గ్రామీణుల్లో సర్వైకల్ క్యాన్సర్(గర్భాశయ ముఖద్వారం) సోకుతున్నట్లు చెబుతున్నారు. పురుషుల్లో లంగ్ క్యాన్సర్, చెవి, ముక్కు, గొంతు క్యాన్సర్, కడుపులో (పెద్దపేగు) క్యాన్సర్‌లు నమోదవుతున్నట్లు నిపుణులు వివరిస్తున్నారు.
బ్రెస్ట్ క్యాన్సర్‌పై పెరిగిన అవగాహన
అర్బన్ ప్రాంతాల్లో నివశించే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరిగాయి. ప్రస్తుతం అవగాహన పెరగడంతో మొదటి రెండు దశల్లోనే 60 శాతం మంది రోగులు చికిత్సకోసం వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మోమోగ్రఫీ వంటి స్క్రీనింగ్ పరీక్షలు సైతం అందుబాటులో ఉండటంతో పలువురు మహిళలు తరచూ పరీక్షలు చేయించుకుంటున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌కు మూడు దశల్లో శస్త్ర చికిత్సలు చేస్తుండగా, నాలుగో దశలో గుర్తించిన వారికీ కీమో చికిత్సలు అందించనున్నట్లు వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
పెరుగుతున్న లంగ్ క్యాన్సర్ కేసులు
ప్రస్తుతం లంగ్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. వ్యాధి బాధితుల్లో 65 శాతం మందికి ధూమపానం కారణం కాగా, 20 శాతం మందికి «పొగ పీల్చడం కారణంగా తెలుస్తోంది. మరో 15 శాతం మందికి వాతావరణ కాలుష్యం కారణంగా చెబుతున్నారు. లంగ్ క్యాన్సర్ బాధితుల్లో 15 శాతం మంది మహిళలు ఉండటం ఆందోళన కలిగించే అంశంగా వైద్యులు చెబుతున్నారు.
లివర్, అన్నవాహిక, పేగుల్లో క్యాన్సర్
ఆహారపు అలవాట్లు, అధికశాతం కొలస్ట్రాల్, హెపటైటీస్–బి, సీ వైరస్‌ల కారణంగా ఇటీవల జిల్లాలో లివర్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా జంక్‌ఫుడ్, కల్తీ ఆహారం కారణంగా అన్నవాహిక క్యాన్సర్, పేగుల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. పాన్‌పరాగ్, గుట్కా వంటి వాటి కారణంగా ఓరల్ క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
గ్రామీణుల్లో సర్వైకల్ క్యాన్సర్
గ్రామీణుల్లో వయస్సు 50 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. పెళ్లికి ముందు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించడం ద్వారా వ్యాధి రాకుండా నివారించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
తొలిదశలో నిర్ధారణ ముఖ్యం
ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీస్ క్యాన్సర్ సోకుతుండగా, గ్రామీణులకు సర్వైకల్ క్యాన్సర్ వస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రమాణాలతో వ్యాధి నిర్ధారణ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం పెద్ద ఎత్తున క్యాన్సర్ ఆస్పత్రులకు నిధులు కేటాయిస్తోంది. నిర్ధారిత సమయాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయించుకోవడం ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. తొలిదశలో గుర్తిస్తే ఎలాంటి క్యాన్సర్‌నైనా వంద శాతం నివారించే అవకాశం ఉంది. ఎక్కువ మంది రెండు, మూడు దశల్లో చికిత్స కోసం వస్తున్నారు.
– డాక్టర్ ఏవై రావు, క్యాన్సర్ వ్యాధి చికిత్సా నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment