లంగ్ కేన్సర్‌ను గుర్తించే నా‘నోస్’ చిప్..
ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల కేన్సర్‌ను ఇకపై ఓ బ్రీథలైజర్(శ్వాస విశ్లేషణ పరికరం) ద్వారా కూడా గుర్తించొచ్చు. శ్వాస విశ్లేషణ ద్వారా లంగ్ కేన్సర్‌ను గుర్తించే నానోస్ అనే నానోటెక్ చిప్‌ను టెల్ అవైవ్ యూనివర్సిటీ పరిశోధకులు ఆవిష్కరించారు. ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడిన, ఆ వ్యాధి ముప్పు తీవ్రంగా ఉన్న 358 మంది రోగులపై, సాధారణ ఆరోగ్యవంతులపై ఈ నానోస్ చిప్ బ్రీథలైజర్‌తో పరీక్షలు నిర్వహించగా.. 90 శాతం కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయని పరిశోధకులు వెల్లడించారు. మామూలుగా అయితే ఊపిరితిత్తుల కేన్సర్ నిర్ధారణకు కఠినమైన బ్రాంకోస్కోపీలు, కంప్యూటర్ ఆధారిత బయాప్సీలు లేదా శస్త్రచికిత్సల వంటివి అవసరం అవుతాయట. కానీ ఈ నానోస్ చిప్ బ్రీథలైజర్ శ్వాస పరీక్ష ద్వారానే కేన్సర్‌ను గుర్తిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ఊపిరితిత్తుల కేన్సర్ కణతులు విడుదల చేసే రసాయనాలు గాలిలో సులభంగానే ఆవిరిగా మారుతాయి. వాటిని పసిగట్టడం ద్వారా ఈ పరికరం కేన్సర్‌ను గుర్తుపడుతుంది. అలాగే కే న్సర్ కణతుల రకం, తీవ్రతను కూడా దీనితో గుర్తించవచ్చట. వీరి అధ్యయన ఫలితాలను షికాగోలో ఇటీవల జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ సదస్సులో సమర్పించారు.