krishna distrct
-
రాచపుండు... కేసులు మెండు
మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేక పోవడం, ధూమపానం, రోజు రోజుకు పెరుగుతున్న పర్యావరణ కాలుష్యాలు ప్రజల్లో క్యాన్సర్ బీజాల్ని నాటుతున్నాయి. ఫలితంగా గతంలో పొగతాగేవారికి మాత్రమే సోకే లంగ్ క్యాన్సర్ ఇప్పుడు అందరికీ సోకుతోంది. మరోవైపు జంక్‌ఫుడ్స్‌కు అలవాటు పడుతున్న నగర వాసులు అన్నవాహిక, లివర్, పేగుల క్యాన్సర్లకు గురవుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు. క్యాన్సర్ కేసులు, నివారణ మార్గాలపై ప్రత్యేక కథనం. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లో క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందుకు ప్రజల జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణంగా చెబుతున్నారు. రెండు జిల్లాల్లో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో ప్రధానంగా పట్టణ ప్రాంతాల మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా, గ్రామీణుల్లో సర్వైకల్ క్యాన్సర్(గర్భాశయ ముఖద్వారం) సోకుతున్నట్లు చెబుతున్నారు. పురుషుల్లో లంగ్ క్యాన్సర్, చెవి, ముక్కు, గొంతు క్యాన్సర్, కడుపులో (పెద్దపేగు) క్యాన్సర్లు నమోదవుతున్నట్లు నిపుణులు వివరిస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై పెరిగిన అవగాహన అర్బన్ ప్రాంతాల్లో నివశించే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరిగాయి. ప్రస్తుతం అవగాహన పెరగడంతో మొదటి రెండు దశల్లోనే 60 శాతం మంది రోగులు చికిత్సకోసం వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మోమోగ్రఫీ వంటి స్క్రీనింగ్ పరీక్షలు సైతం అందుబాటులో ఉండటంతో పలువురు మహిళలు తరచూ పరీక్షలు చేయించుకుంటున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌కు మూడు దశల్లో శస్త్ర చికిత్సలు చేస్తుండగా, నాలుగో దశలో గుర్తించిన వారికీ కీమో చికిత్సలు అందించనున్నట్లు వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. పెరుగుతున్న లంగ్ క్యాన్సర్ కేసులు ప్రస్తుతం లంగ్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. వ్యాధి బాధితుల్లో 65 శాతం మందికి ధూమపానం కారణం కాగా, 20 శాతం మందికి «పొగ పీల్చడం కారణంగా తెలుస్తోంది. మరో 15 శాతం మందికి వాతావరణ కాలుష్యం కారణంగా చెబుతున్నారు. లంగ్ క్యాన్సర్ బాధితుల్లో 15 శాతం మంది మహిళలు ఉండటం ఆందోళన కలిగించే అంశంగా వైద్యులు చెబుతున్నారు. లివర్, అన్నవాహిక, పేగుల్లో క్యాన్సర్ ఆహారపు అలవాట్లు, అధికశాతం కొలస్ట్రాల్, హెపటైటీస్–బి, సీ వైరస్ల కారణంగా ఇటీవల జిల్లాలో లివర్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా జంక్‌ఫుడ్, కల్తీ ఆహారం కారణంగా అన్నవాహిక క్యాన్సర్, పేగుల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. పాన్‌పరాగ్, గుట్కా వంటి వాటి కారణంగా ఓరల్ క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. గ్రామీణుల్లో సర్వైకల్ క్యాన్సర్ గ్రామీణుల్లో వయస్సు 50 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. పెళ్లికి ముందు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించడం ద్వారా వ్యాధి రాకుండా నివారించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. తొలిదశలో నిర్ధారణ ముఖ్యం ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీస్ క్యాన్సర్ సోకుతుండగా, గ్రామీణులకు సర్వైకల్ క్యాన్సర్ వస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రమాణాలతో వ్యాధి నిర్ధారణ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం పెద్ద ఎత్తున క్యాన్సర్ ఆస్పత్రులకు నిధులు కేటాయిస్తోంది. నిర్ధారిత సమయాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయించుకోవడం ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. తొలిదశలో గుర్తిస్తే ఎలాంటి క్యాన్సర్‌నైనా వంద శాతం నివారించే అవకాశం ఉంది. ఎక్కువ మంది రెండు, మూడు దశల్లో చికిత్స కోసం వస్తున్నారు. – డాక్టర్ ఏవై రావు, క్యాన్సర్ వ్యాధి చికిత్సా నిపుణుడు -
ముంచినా.. తేల్చినా.. వారే దిక్కు!
సాక్షి, అమరావతి : నియోజకవర్గ స్థాయి మొదలు గ్రామస్థాయి వరకు ప్రతి పార్టీలో పదుల సంఖ్యలో ఉన్న ప్రధాన అనుచరులే ఆయా పార్టీల అభ్యర్థులకు పెద్ద దిక్కువుతున్నారు. వీరి కష్టం మీదనే అన్ని పార్టీలు ఆధారపడుతున్నాయి. సాధారణ వేళల్లో ఎలా ఉన్నా ఎన్నికల తరుణంలో మాత్రం వీరి సహకారం లేనిదే అభ్యర్థులు కాలు కూడా కదపలేని పరిస్థితి. ఎన్నికల్లో తమ నాయకుడిని గెలిపిస్తే ఐదేళ్ల పాటు భరోసా ఉంటుందన్న భావనలో ఊరూర తిరుగుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశముంది. ఇప్పుడే పట్టు సాధించాలన్న ఉద్దేశంతో చాలా మంది కార్యకర్తలు తామే పోటిలో ఉన్నట్లు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఓటు అడగడం మొదలు పార్టీ ప్రచారం, ఇతరత్రా కార్యకలపాల్ని పర్యవేక్షిస్తూ చక్కబెడుతున్నారు. బుజ్జగింపులు.. చేరికలు సొంత పార్టీలోని కార్యకర్తలు అసంతృప్తితో ఉన్న విషయాన్ని ముందుగానే గ్రహించి వారిని బుజ్జగించటం లేదా నాయకుడి దగ్గరకు తీసుకెళ్లడంలో మండలస్థాయి నాయకులదే పాత్ర కీలకం. స్థాయిని బట్టి అభ్యర్థులే వారి ఇంటికి పోయి వారిని బుజ్జగిస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీల్లో అసంతృప్తులను పసిగట్టి వారిని సొంత పార్టీలోకి లాక్కుంటున్నారు. ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించటానికి తమకున్న అనుభవాన్నంతా రంగరిస్తున్నారు. అవసరాన్ని బట్టి కాలు దూస్తుండటం, తప్పనిసరి పరిస్థితుల్లో స్నేహ హస్తాన్ని అందించడంలో విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. మండల స్థాయిలోనే ఎంతలేదన్నా ఒక్కో పార్టీకి 40 నుంచి 50 మంది వరకు ముఖ్య నాయకులుంటారు. వీరందరిని కలుపుకుపోతే గెలుపు పక్కా కావటంతో అభ్యర్థులందరూ వీరికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వారి సూచనలతోనే.. ప్రచారంలో భాగంగా ఓటర్ల వద్దకు వెళ్లే నాయకులు ముందు స్థానిక ద్వితీయ శ్రేణి నాయకుల సూచనలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు, ఇప్పటివరకు చేసిన అభివృద్ధి వంటి వాటిని చర్చించుకుంటున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకతలు ఎదురవుతున్న సందర్భాల్ని ఎలా డీల్ చేయాలో ముందస్తు వ్యూహరచన అమలు చేయటంలో వీరే కీలకం. అభ్యర్థులను పీడుస్తున్న భయం నాయకుల కోవర్టు ఆపరేషన్లు. తన వెంటే ఉంటూ ప్రత్యర్థులకు ఎప్పటికప్పుడు పార్టీ బలాలు, బలహీనతలను చేరవేసి ప్రత్యర్థులకు సాయం చేయటం. కీలక సమయంలో సహాయనిరాకరణ చేసి అభ్యర్థిని ఓడించాలన్నా సదరు ద్వితీయ శ్రేణి నాయకుల చేతిలోనే ఉంది. -
పోలీస్ కస్టడీ నుంచి దొంగ పరార్
కృష్ణా జిల్లా: పోలీసుల కళ్లు కప్పి కస్టడీలో ఉన్న ఖైదీ పరారైన సంఘటన కృష్ణాజిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. నల్లగొండకు చెందిన ఒక దొంగను మరో కేసు దర్యాప్తు నిమిత్తం ఏలూరుకు బస్సులో తరలిస్తున్నారు. బస్సు కీసర టోల్‌ప్లాజా వద్ద ఆగగానే పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు. దీంతో పోలీసులు అతని కోసం గాలింపు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కృష్ణా జిల్లాలో భూప్రకంపనలు
విజయవాడ: కృష్ణా జిల్లాలో కలకలం రేగింది. నందిగామ, కంచికచర్ల ప్రాంతంలో భూ ప్రకంపనలు జనాలను పరుగులు పెట్టించాయి. గురువారం తెల్లవారుజామున దాదాపు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. అయితే రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత స్వల్పంగా నమోదు కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో భూప్రకంపనలు ఒకసారి 4 సెకన్లు, మరోసారి 3 సెకన్లు నమోదయ్యాయి. ఉదయం వాకింగ్, పాల కోసం వెళ్లేవారు ఈ ప్రకంపనల్ని గుర్తించారు. తరచుగా వస్తున్న భూప్రకంపనలతో మున్ముందు పెను ప్రమాదం వాటిల్లే అవకాశముందని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.