హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఏటా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2020లో కొత్తగా 13.25 లక్షల కొత్త కేసులు రాగా 8.5 లక్షల మంది క్యాన్సర్ సంబంధ సమస్యలతో మరణించారు. ఈ నేపథ్యంలో దేశీయంగా సకాలంలో సరైన చికిత్స అందించేందుకు రేడియో థెరపీ మెషీన్ల సంఖ్య రెట్టింపు స్థాయికి పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఎలెక్టా ఇండియా ఎండీ మణికందన్ బాలా సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు.
ప్రస్తుతం భారత్‌లో 650 పైచిలుకు మెషీన్లు ఉండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం జనాభారీత్యా 1,400 వరకు అవసరమని ఆయన చెప్పారు. నివేదికల ప్రకారం తెలంగాణలో 2025 నాటికి కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య 53,000 పైచిలుకు ఉండనుందన్నారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు, చికిత్స వ్యయాలను తగ్గించి .. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని తెలిపారు.
ఇందుకోసం ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆస్పత్రులతో చర్చలు జరుపుతున్నామని బాలా చెప్పారు. ఎంఆర్–లినాక్ వంటి అధునాతన మెషీన్లను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి దేశీయంగా తమ మెషీన్లు 500 పైచిలుకు ఉన్నట్లు వివరించారు. ఎలెక్టాకు అమెరికా, బ్రిటన్, చైనా తదితర దేశాల్లో తయారీ ప్లాంట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment