పెద్దదిక్కులో..కేన్సర్‌కు దిక్కేది? | That's side .. cancer? | Sakshi
Sakshi News home page

పెద్దదిక్కులో..కేన్సర్‌కు దిక్కేది?

Published Fri, May 23 2014 2:35 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

పెద్దదిక్కులో..కేన్సర్‌కు దిక్కేది? - Sakshi

పెద్దదిక్కులో..కేన్సర్‌కు దిక్కేది?

  •      ఎంజీఎంలో 10 నెలలుగా  నిలిచిన సేవలు
  •      పేద రోగులకు తప్పని తిప్పలు
  •      చికిత్సకు హైదరాబాద్‌కు వెళ్లాల్సిందే
  •  ఎంజీఎం, న్యూస్‌లైన్ : ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో క్యాన్సర్ వైద్య సేవలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలు దేవుడేరుగు ఉన్న నామామాత్రపు సేవలు సైతం అందని దుస్థితి నెలకొంది. కోబాల్ట్ పరికరంలో ఏర్పడిన సాంకేతిక లోపంతోపాటు రేడియోథెరపీ కోసం ఉపయోగించే సోర్స్ కూడా ముగిసి 10 నెలలు గడుస్తోంది. అయినా పేద రోగులకు క్యాన్సర్ సేవలను అందుబాటులోకి తేవడంలో ఎంజీఎం పరిపాలనాధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో వరంగల్‌తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఎంజీఎం వచ్చే క్యాన్సర్ రోగులు చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లక తప్పడం లేదు.
     
    పూర్తిగా నిలిచిపోయిన వైద్యసేవలు
     
    2013 జూలై 8న టెలీథెరపీ పరికరంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో క్యాన్సర్ వైద్యసేవలు పూర్తిగా నిలిచిపోయాయి. క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ, రేడియోథెరపీ ద్వారా చికిత్సలు చేస్తుంటారు. రేడియేషన్ ప్రక్రియలో క్యాన్సర్ కణాలను నాశనం చేస్తారు. ఆస్పత్రికి నిత్యం 30 నుంచి 50 మంది వరకు క్యాన్సర్ రోగులు వస్తుండగా ఇందులో 35 మంది రేడియోథెర పీ ద్వారా, 15 మంది కీమోథెరపీ ద్వారా చికిత్స పొందే వారు. ప్రస్తుతం వారంతా హైదరాబాద్‌కు వెళ్తున్నారు.
     
    అడ్రస్ లేని ఆధునిక పరికరాలు
     
    1991లో కోబాల్ట్ యూనిట్ ప్రారంభించి అదే పరికరంతో క్యాన్సర్ రోగులకు చికిత్సలు చేస్తూ వచ్చారు. సుమారు రెండు దశాబ్దాలుగా ఉపయోగించడంతో ఆ పరికరంలోని రేడియేషన్ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోవడం వల్ల చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయేదని వైద్యులే పేర్కొంటున్నారు. 1991లో 150 ఆర్‌ఎంఎంతో(రాంజన్ ఫర్ మినిట్ ఎట్ 1 మీటర్ డిస్టెన్స్) యూనిట్‌ను ప్రారంభించారు.

    అయితే ఐదున్నరేళ్ల నుంచి దాని సామర్థ్యం సగానికి తగ్గిపోయిందని నిపుణులు చెబుతున్నారు. దీనికి మరోమారు 2003లో 150 ఆర్‌ఎంఎం కొత్త సోర్స్‌ను ఏర్పాటు చేశారు. 2003 నుంచి నేటి వరకు అదే సోర్స్‌ను ఉపయోగిస్తున్నారు. దీని సామర్థ్యం 2013 వరకు 150 నుంచి 35 ఆర్‌ఎంఎంకు తగ్గిపోయింది.

    రేడియేషన్ పరికరంలో 50 శాతానికి ఎక్కువగా సోర్స్ ఉన్నప్పుడే క్యాన్సర్ కణాలపై రేడియేషన్ ప్రభావం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈపరికరం ద్వారా రోగులకు చికిత్స చేసినా ఆశించిన ప్రయోజనం లేకుండా పోయేది. ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స విభాగంలో లీనాక్(లినాయర్ యాక్సిలేటర్) అనే నూతన పరికరం అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా వైద్యం అందిస్తే మెరుగైనా ఫలితాలు వస్తాయి.
     
    ఆరోగ్యశ్రీ నిధులు ఉన్నా..
     
    ఎంజీఎం ఆస్పత్రి క్యాన్సర్ చికిత్స విభాగంలో ఆరోగ్యశ్రీ కింద 1300 మంది క్యాన్సర్ రోగులకు రేడియేషన్ ద్వారా చికిత్స అందించినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీని ద్వారా ఆస్పత్రికి రూ.మూడుకోట్లకు పైగా అదనపు ఆదాయం లభించింది. అయినా క్యాన్సర్ విభాగం మూత పడడం వల్ల ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా కోల్పోవలసిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని రోగులు కోరుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement