‘సూక్ష్మం’లోనే మోక్షం!  | scientist raghu kalluri says about exosome advantages | Sakshi
Sakshi News home page

‘సూక్ష్మం’లోనే మోక్షం! 

Published Wed, Jan 31 2018 11:10 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

scientist raghu kalluri says about exosome advantages - Sakshi

ఎక్సోసోమ్‌లు, తెలుగు శాస్త్రవేత్త రఘు కల్లూరి(ఇన్‌సెట్లో)

సాక్షి, హైదరాబాద్‌ 
మన శరీరంలో కోట్ల సంఖ్యలో కణాలు ఉంటాయని మనకు తెలుసు. ఒక్కోదాంట్లో ఉండే డీఎన్‌ఏ, వాటి భాగాలైన జన్యువుల గురించి కూడా వినే ఉంటాం. మరి ఎక్సోసోమ్స్‌ గురించి...? ఊహూ... వీటి గురించి తెలిసే అవకాశాలు చాలా చాలా తక్కువే.

ఒకొక్కరిలో కనీసం వెయ్యి లక్షల కోట్ల వరకూ ఉండే అతిసూక్ష్మమైన కొవ్వు తిత్తులివి! ఇంకా చెప్పాలంటే శరీర కణాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటాయి. కణాల అన్నింటి నుంచి ఇవి విడుదలవుతూంటాయనితెలుసుగానీ.. ఎందుకున్నాయో, ఏం చేస్తాయో..? ఎలా చేస్తాయో మాత్రం మిస్టరీనే! 

ఈ రహస్యాలను ఛేదిస్తే కేన్సర్‌సహా అనేక వ్యాధులకు మెరుగైన చికిత్స లభిస్తుంది. సరిగ్గా  ఇవే లక్ష్యాలుగా ‘ఎక్సోసోమ్‌’లపై ప్రయోగాలు చేస్తున్నారు రఘు కల్లూరి. తెలుగువాడైన ఈ యువశాస్త్రవేత్త హైదరాబాద్‌లో జరుగుతున్న ‘ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌ ఆన్‌ సెల్‌ బయాలజీ’కి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా రఘు కల్లూరి తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే..

మన శరీరంలోని కణాలన్నీ విడుదల చేసే అతిసూక్ష్మమైన తిత్తుల్లాంటి నిర్మాణాలే ఎక్సోసోమ్‌లు. సుమారు 30 ఏళ్ల కిత్రమే వీటిని గుర్తించారు. కానీ అప్పట్లో ఇవి కణ వ్యర్థాలు మాత్రమే అని అనుకునేవాళ్లు. అయితే గత పదేళ్లలో ఎక్సోసోమ్‌లకు సంబంధించిన ప్రాథమిక వివరాలు అర్ధమవుతున్న కొద్దీ శాస్త్రవేత్తల్లో వీటిపై ఆసక్తి పెరిగింది. కణాలన్నీ వీటిని విడుదల చేస్తాయని తెలుసుగానీ.. ఎందుకు చేస్తాయో... ఎలా చేస్తాయో తెలియదు. నానోమీటర్ల సైజులో మాత్రమే ఉండే ఎక్సోసోమ్‌లలో డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, ప్రొటీన్లు ఉంటాయని, కొన్నిసార్లు ఇవి ఇతర కణాల్లోకి చొచ్చుకుపోగలవనీ కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. ఈ అంశాల ఆధారంగా ఎక్సోసోమ్‌లు వేర్వేరు కణాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు, తద్వారా కొన్ని భౌతిక మార్పులకు కారణమవుతున్నాయని కొంతమంది అంచనా వేస్తున్నారు. వీటిని తగు విధంగా నియంత్రించగలిగితే వైద్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలవుతుందని నా అంచనా. 

వైద్యరంగంలో అద్భుత ఫలితాలు.. 
కణాలు అన్నీ వీటిని విడుదల చేస్తాయని తెలిసింది. అయితే అన్ని ఎక్సోసోమ్‌లు ఒకేలా ఉండవు. కణాల స్థితికి అనుగుణంగా వీటిలో ఉండే డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏలు మారిపోతూంటాయి. ఇంకోలా చెప్పాలంటే కణాలు ఆరోగ్యంగా ఉండే ఒక రకమైన కూర్పు లేకుండా ఇంకోలా ఉంటాయన్నమాట. కేన్సర్, కొన్ని ఇతర వ్యాధులతో బాధపడుతన్న వారి రక్తాన్ని పరిశీలించినప్పుడు ఈ విషయం స్పష్టమైంది. అందువల్లనే ఈ ఎక్సోసోమ్‌లను భవిష్యత్తులో వ్యాధి నిర్ధారణకు మెరుగైన సాధనంగా వాడుకోవచ్చునని భావిస్తున్నాం.

అంతేకాదు.. ఇవి ఇతర కణాల్లోకి చాలా సులువుగా చొచ్చుకుపోగలవు కాబట్టి వీటి ఆధారంగా శరీరంలోని వివిధ భాగాలకు మందులు నేరుగా చేరవేయవచ్చు కూడా. నేను పనిచేస్తున్న ఎండీ యాండర్సన్‌ కేన్సర్‌ సెంటర్‌తోపాటు కొంతమంది ఇతర శాస్త్రవేత్తలు ఎక్సోసోమ్‌లలోకి మందులు చేర్చడంలో ఇప్పటికే విజయం సాధించారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో కేన్సర్‌ కణతులను గణనీంగా తగ్గించవచ్చునని కూడా రుజువైంది. 

ప్రయోజనాలెన్నో.. 

  •     సింపుల్‌గా చెప్పాలంటే.. పిసరంత రక్తం నుంచి ఎక్సోసోమ్‌లను వేరు చేసి.. వ్యక్తుల తాలూకూ ఆరోగ్య పరిస్థితిని మదింపు చేయవచ్చు.  
  •     డీఎన్‌ఏ మార్పులు మొదలుకొని ప్రొటీన్లు తదితరాలన్నింటినీ విశ్లేషించే అవకాశం లభిస్తుంది కాబట్టి.. ఎక్సోసోమ్‌ల ఆధారంగా వ్యక్తిగతమైన, కచ్చితమైన వైద్యం సాధ్యమవుతుంది. 
  •     కేన్సర్‌ విషయానికి వస్తే జన్యుమార్పులన్నింటినీ గుర్తించి తదనుగుణంగా చికిత్స పద్ధతులను అభివృద్ధి చేయవచ్చు. 
  •     మధుమేహం, నాడీ సంబంధిత వ్యాధులను కూడా వీటి ద్వారా గుర్తించే అవకాశముంది. నానోస్థాయిలో ఉంటాయి కాబట్టి వీటితో మందులు సరఫరా చేయడాన్ని నానో వైద్యం అని కూడా                  అనవచ్చు. 
  •    సహజసిద్ధంగా శరీరమే వీటిని ఉత్పత్తి చేస్తూంటాయి కాబట్టి.. శరీర రోగ నిరోధక వ్యవస్థ వీటిని అడ్డుకోదు కూడా. తద్వారా కొన్ని రకాల మందులతో వచ్చే దుష్ప్రభావాలను గణనీయంగా                   తగ్గించవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement