కేన్సర్‌ను చంపేసే ఫ్యాటీ ఆసిడ్స్‌ గుర్తింపు | Scientists find fatty acid that can kill cancer cells | Sakshi
Sakshi News home page

కేన్సర్‌ను చంపేసే ఫ్యాటీ ఆసిడ్స్‌ గుర్తింపు

Published Thu, Jul 16 2020 8:41 AM | Last Updated on Thu, Jul 16 2020 1:46 PM

Scientists find fatty acid that can kill cancer cells - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రాణాలను బలితీసుకుంటున్న కేన్సర్‌ మహమ్మారి వ్యతిరేక పోరాటంలో శాస్త్రవేత్తలు ప్రధాన పురోగతి సాధించారు.మానవులలో క్యాన్సర్‌ కణాలను  చంపగల   ఫ్యాటీ ఆసిడ్స్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. డిహోమో-గామా-లినోలెనిక్ ఆమ్లం లేదా డీజీఎల్‌ఏ అనే కొవ్వు ఆమ్లం మానవులలో క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. కొత్త పరిశోధన ద్వారా క్యాన్సర్ సంభావ్య చికిత్సలో  కొన్ని చిక్కులు ఉన్నప్పటికీ, ఒక కీలక అడుగు పడిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రధానంగా డీజీఎల్‌ఏ అనే కొవ్వు ఆమ్లం మానవులలోని క్యాన్సర్ కణాలలో ఫెర్రోప్టోసిస్‌ను ప్రేరేపిస్తుంది. ఫెర్రోప్టోసిస్‌ అంటే దెబ్బతిన్న లేదా పనిచేయని కణాలు సురక్షితంగా, సమర్ధవంతంగా నాశనం చేయడం లేదా రీసైకిల్ చేయడం. ఇనుము ("ఫెర్రో" అంటే ఇనుము) ను ఉపయోగించే అత్యంత నియంత్రిత సెల్ డెత్ ప్రోగ్రామ్‌ను ఫెర్రోప్టోసిస్ అంటారు. దీన్ని 2012లో శాస్త్రవేత్తలు  కనుగొన్నారు. పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ (పీయూఎఫ్ఏ), డీజీఎల్‌ఏ ఆమ్లం ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా అటు జంతువుల్లో ఇటు మానవులలోని కేన్సర్‌ కణాలలోనూ ఫెర్రోప్టోసిస్‌ను ప్రేరేపిస్తుందని అధ్యయనం తెలిపింది. ఈ డీజీఎల్‌ఏను  ఖచ్చితంగా కేన్సర్‌ కణంలోకి బట్వాడా చేయగలిగితే, అది ఫెర్రోప్టోసిస్‌ను ప్రోత్సహిస్తుందనీ, తద్వారా కణితిలోని కేన్సర్‌‌ కణాలను హరించి వేస్తుందని తెలిపారు. అంతేకాదు ఫెర్రోప్టోసిస్‌ ద్వారా మూత్రపిండాల సంబంధిత జబ్బులు, న్యూరోడీజెనరేషన్ వ్యాధుల వంటి పరిస్థితుల గురించి అధ్యయనం చేస్తున్నామని వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ జెన్నిఫర్ వాట్స్ వెల్లడించారు. ‘డెవలప్‌మెంటల్ సెల్‌’ లో ఈ స్టడీ ప్రచురితమైంది. 

దాదాపు ఇరవై సంవత్సరాలుగా, నెమటోడ్ కేనోరబ్డిటిస్ ఎలిగాన్స్‌ ద్వారా జంతువుల్లో  డీజీఎల్‌ఎతో సహా ఇతర ఆహార కొవ్వుల ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఈ ఆవిష్కరణకు క్యాన్సర్‌కు సంభావ్య చికిత్స దిశగా ఒక అడుగుపడిందని చెప్పారు. అలాగే  కొన్నిచిక్కులు కూడా ఉన్నాయన్నారు. సీ ఎలిగాన్స్ అనేది మైక్రోస్కోపిక్ వార్మ్‌. సెల్‌ యాక్టివిటీ అధ్యయనంలో పారదర్శకంగా ఉండే దీన్ని తరచుగా ఉపయోగిస్తారు. నెమటోడ్లకు ఈ ఆహారం ఇవ్వడం వల్ల డీజీఎల్‌ఏతో నిండిన బ్యాక్టీరియా.. అన్ని బీజ కణాలతో పాటు బీజ కణాలను తయారుచేసే మూల కణాలను కూడా చంపినట్లు పరిశోధకులు కనుగొన్నారు. మరోవైపు ఈ ఫలితాలు మానవ కణాలకు సరిపోతాయో లేదో తెలుసుకోవడానికి పరిశోధకుల బృందం స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన స్కాట్ డిక్సన్‌తో కలిసి మరింత అధ్యయనం చేశారు. ఈ బృందం కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. దీనికి అదనంగా, డీజీఎల్‌ఏకు వ్యతిరేకంగా పనిచేసే మరో ఫాటీ ఆసిడ్‌ను కూడా గుర్తించారు. ‌ఈథర్ లిపిడ్‌గా పిలిచే దీన్ని తొలగిస్తే.. డీజీఎల్‌కు ఎక్స్‌పోజ్‌ అయిన‌ కణాలు మరింత వేగంగా చనిపోతాయని కనుగొన్నారు.  డిక్సన్ చాలా సంవత్సరాలుగా ఫెర్రోప్టోసిస్, క్యాన్సర్‌తో పోరాటంలో దాని సామర్థ్యాన్ని అధ్యయనం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement