పాడైపోయినా.. ప్రమాదకరంగా మారినా శరీరంలోని కణాలు వెంటనే తమంతట తాము చచ్చిపోతాయి. ఈ ప్రక్రియను అపోప్టోసిస్ అంటారు. ఇదెలా జరుగుతుందో స్పష్టంగా తెలుసుకోగలిగితే కేన్సర్ మొదలుకొని జట్టు రాలిపోవడం వరకూ అనేక సమస్యలకు పరిష్కారం దొరికినట్లే. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ దిశగా ఓ ముందడుగు వేశారు. ఒక రకమైన అపోప్టోసిస్‌లోని దశలను, వేగాన్ని గుర్తించడంలో వీరు విజయం సాధించారు. ఇందుకోసం కప్ప గుడ్లపై పరిశోధనలు చేశారు. కొంచెం పెద్ద సైజులో ఉండటం వల్ల అవి నాశనం కావడాన్ని మైక్రోస్కోపు గుండా నేరుగా చూడగలిగారు.
కణం నుంచి సైటోప్లాసమ్‌ను సూక్ష్మమైన గొట్టంలోకి మారుస్తూండగా పచ్చటి వెలుగు కనిపించింది. దీన్నే అపోప్టోసిస్ సంకేతంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంకో పద్ధతిలో చూసినప్పుడు ఇది వెలుగులా కాకుండా ఓ తరంగంలా కనిపించిందని నిమిషానికి 30 మైక్రాన్ల వేగంతో ప్రయాణించిందని.. దీన్నిబట్టి కప్ప కణం ఒకటి నాశనమయ్యేందుకు దాదాపు 33 నిమిషాలు పట్టినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జేమ్స్ ఫారెల్ తెలిపారు. ఈ తరంగాలు వెలువడ్డ తరువాత కాస్‌పేసెస్ అనే ప్రొటీన్లు చైతన్యవంతమయ్యాయని.. ఒక్కోటి ఇంకోదాన్ని తట్టిలేపడం.. ఇది మరోదాన్ని చైతన్యవంతం చేస్తూ కణం మొత్తం నిర్వీర్యమైపోయేలా చేశాయని వివరించారు. అపోప్టోసిస్ వెనుక ఉన్న మిగిలిన ప్రక్రియలను కూడా అర్థం చేసుకోగలిగితే వ్యాధి నివారణలో ఎలా వాడుకోవచ్చో తెలుస్తుందని చెప్పారు.
వయసు పెరిగినా యవ్వనంగా ఉండాలంటే...
వయసు ఎంత పెరిగినా ఏమాత్రం ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటే భలే ఉంటుందని మనం చాలాసార్లు అనుకుని ఉంటాం. మినసోటా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త పాల్ డీ రాబిన్స్ తాజా పరిశోధన ప్రకారం.. మన శరీరంలో ఉండే సెనోలిటిక్స్ అనే అతిసూక్ష్మ అణువులను చైతన్యవంతం చేస్తే చాలు. శరీర కణాలు ఒక దశ తరువాత విభజితం కావని మనం చదువుకుని ఉంటాం. శాస్త్రీయ పరిభాషలో దీన్ని సెనిసెన్స్ అంటారు. ఈ దశకు చేరుకున్నప్పుడు కణజాలం పనియడం కూడా తగ్గిపోతుంది. ఫలితంగా జబ్బులు చుట్టుముడతాయి.
సెనోలిటిక్ అణువులు ఈ పరిస్థితి తీవ్రతను తగ్గించడంతోపాటు కణాలు మళ్లీ విభజితమయ్యేలా చేస్తాయి అని పాల్ డీ రూబిన్స్ అంటున్నారు. సెనిసెంట్ దశలో ఉన్న కణాలను శరీరం నుంచి బయటకు పంపే విషయంలో జన్యువుల పాత్ర 30 శాతం కాగా.. వాతావరణం70 శాతం ప్రభావం చూపుతుందని గత పరిశోధనలు చెబుతున్నాయి. దీన్నిబట్టి మనం ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నాం? ఎంత తరచుగా వ్యాయామం చేస్తున్నాం? వంటి అంశాలన్నీ కణాల సెనిసెన్స్‌ను ప్రభావితం చేస్తాయని లేదంటే సెనోలిటిక్ ఆధారిత మందులను తయారు చేయడం ద్వారా దీన్ని సాధించాల్సి ఉంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment