ఎంఆర్‌ఐ స్కానింగ్‌లను, రిపోర్టులను చూపిస్తున్న కుటుంబ సభ్యులు
కృష్ణాజిల్లా, జంగమహేశ్వరపురం (గురజాలరూరల్): క్యాన్సర్ గడ్డలు ఆ బాలుడిని భవిష్యత్తును నిలవరిస్తున్నాయి. రెక్కాడితేకాని డొక్కాడని ఆ బాలుడి తల్లిదండ్రులు బిడ్డను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న ఇటిని కూడా అమ్ముకొని వైద్య చేయిస్తున్నారు. నాలుగు నెలల నుంచి 15రోజులకు ఒకసారి (కుటుంబ సభ్యులు నలుగురు) చెన్నై వెళ్లి వైద్య పరీక్షలు చేయిస్తూ ఆర్థికకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం, దయగల చూపరులు ఆర్థికంగా ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. గురజాల మండలం జంగమహేశ్వరపురం గ్రామానికి చెందిన కంచనపల్లి వెంకటకృష్ణాచారి, చంద్రకళ దంపతులు కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమారులు లక్ష్మీదుర్గాచారి 4వ తరగతి, లక్ష్మీనరసింహాచారి 3వ తరగతి చదువుతున్నారు. వెంకటకృష్ణాచారికి రెండేళ్ల క్రితం బోధకాలు వచ్చి ఎడమకాలు గిలకను తీసేశారు. భార్య కూలిపనులు చేసి నలుగురిని పోషిస్తోంది. ఈ పరిస్థితుల్లో చిన్నకుమారుడు లక్ష్మీనరసింహాచారికి కడుపులో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయని తెలియడంతో వారి ఆవేదన మిన్నంటింది.
ఇంటిని అమ్ముకొని వైద్యం..
లక్ష్మీనరసింహచారికి 2018లో జ్వరం వచ్చింది. గురజాల ప్రభుత్వాసుపత్రికి, పిడుగురాళ్ల ప్రైవేటు వైద్యశాలను సంప్రదించినా జ్వరం నయం కాలేదు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రెండు నెలలు పరీక్షలు నిర్వహించి టీబీ అని మందులు వాడారు. జ్వరం నయం కాకపోవడంతో మళ్లీ పరీక్షలు నిర్వహించి కడుపులో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయని చెన్నై రిఫర్ చేశారు. కుమారునికి వైద్యఖర్చుల నిమిత్తం నివాసగృహాన్ని అమ్ముకున్నారు. క్యాన్సర్ గడ్డలు కరిగిం చేందుకు వైద్య బృందం ఇప్పటికే నాలుగు సర్జరీలు చేశారు. క్యాన్సర్‌వార్డులో మహిళలకే ప్రవేశం ఉంది. దీంతో కుటుంబ సభ్యులు నలుగురు నాలుగు నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజులకు ఒకసారి వెళ్లి వారం రోజులు అక్కడే ఉండి ఉచిత వైద్యం పొందుతున్నారు. ఆరు నెలల పాటు చెన్నైలో వైద్యం పొందాల్సి ఉంది. ఆర్థిక పరిస్థితి సహకరించడంలేదు. ప్రభుత్వం కనికరించాలని, దాతలు కరుణ చూపాలని వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment