క్యాన్సర్‌... వైద్యపరీక్షలు | Cancer can not be diagnosed with an xray or an ultrasound | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌... వైద్యపరీక్షలు

Published Thu, Mar 21 2019 1:04 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

Cancer can not be diagnosed with an xray or an ultrasound - Sakshi

క్యాన్సర్‌ వ్యాధిలో పాత కణాలు నశించకుండానే కొత్త కణాలు ఏర్పడుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక గడ్డలా ఏర్పడతాయి. ఆ గడ్డలనే మనం క్యాన్సర్‌ లేదా మాలిగ్నెంట్‌ ట్యూమర్స్‌ అంటారు. ఈ కణాలు రక్తప్రవాహం ద్వారా, లింఫ్‌ వ్యవస్థ ద్వారా శరీరంలోని మిగతా భాగాలకూ వ్యాపించి అక్కడ కూడా అపరిమితంగా పెరిగిపోతూ ఉంటాయి. ఆ దశనే మెటాస్టాసిస్‌ అంటారు. అంటే క్యాన్సర్‌ కణాలు తాము ఏర్పడిన ప్రదేశం చుట్టూ ఉండే కణజాలాలకూ, అవయవాలకూ పాకడమే కాకుండా, మిగతా శరీరభాగాలకూ వ్యాపించిందని అర్థం. ఈ దశకు చేరుకుంటే క్యాన్సర్‌ లొంగడం చాలా కష్టం. క్యాన్సర్‌ కణితిలో కణాలు పెరిగే కొద్దీ రక్తసరఫరాకు దూరమై ఆక్సిజన్‌ అందక నశించవచ్చు.

కానీ ఆ కణాలు కొత్త రక్తనాళాలను ఏర్పరచుకుంటూ పెరుగుతూపోతాయి. దీన్నే వైద్యపరిభాషలో ‘యాంజియోజెనెసిస్‌’ అంటారు. ఈ విధంగా రక్తనాళాలు ఏర్పడకుండా యాంజియోజెనెసిస్‌ కారకాలను అరికట్టాలని ఎన్నో పరిశోధనలు జరిగాయి. కానీ ఇంతవరకు సఫలం కాలేకపోయారు. అయితే ఇంతకుముందుకూ ఇప్పటికీ క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలలో, చికిత్స విధానాలలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ రాకుండా వ్యాక్సిన్‌తోపాటు తొలిదశలోనే కనుక్కునే స్క్రీనింగ్‌ టెస్టులు కూడా అందుబాటులోకి రావడం కొంతలో కొంత ఆనందం కలిగించే విషయం. 

ఎలాంటి లక్షణాలూ కనిపించకపోయినా, ఆరోగ్యంగా ఉన్నవారిలో లేదా రిస్క్‌ఫ్యాక్టర్స్‌ ఉన్నవారిలో, స్మోకింగ్, ఆల్కహాల్‌ వంటి దురలవాట్లు, వారు చేసే వృత్తిని బట్టి క్యాన్సర్‌ను ముందుగానే కనుక్కోవడానికి చేసే పరీక్షలను స్క్రీనింగ్‌ పరీక్షలు అంటారు. అలాంటివాటిల్లో రొమ్ముక్యాన్సర్‌కు చేసే మామోగ్రామ్, గర్భాశయముఖ ద్వార క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టే పాప్‌స్మియర్, పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కు చేసే పరీక్షలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. మనలో చాలామంది హాస్పిటల్‌ అన్నా, హెల్త్‌ చెకప్స్‌ అన్నా భయపడతారు. మరీ ముఖ్యంగా క్యాన్సర్‌ లాంటి తీవ్ర సమస్యలు ఉన్నప్పుడు కూడా ‘ఇన్నిరకాల పరీక్షలు ఎందుకు... ఇంత ఖర్చు ఎందుకు... అని ఆలోచించేవారు కూడా ఉంటారు. క్యాన్సర్‌ కణం చాలా సూక్ష్మమైనది, ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో క్యాన్సర్‌ చికిత్సలు వ్యక్తికీ వ్యక్తికీ మారుతున్నాయి. వాటినే టార్గెటెడ్‌ లేదా పర్సనలైజ్‌డ్‌ ట్రీట్‌మెంట్స్‌ అంటారు.

కణితి సైజ్, వ్యాపించే గుణం, స్టేజ్, ఎన్ని లింఫ్‌ నాళాలకు సోకింది, ఇతర శరీర భాగాలకు వ్యాపించిందా, పేషెంట్‌ వయసు, వారి ఇతర ఆరోగ్య సమస్యలు, వాటికి వాడే మందులు... ఇలా ఆ క్యాన్సర్‌ రకాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. దాన్ని నిర్ధారణ చేయడానికి అనేక రకాల పరీక్షలు అవసరమవుతాయి. ‘క్యాన్సర్‌ కణం శరీరంలో ఎక్కడైనా ఉందా? దాన్ని ముందే తెలుసుకోగలమా?’ అని చాలామంది అడుగుతుంటారు. క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు కూడా లక్షణాల లాగానే క్యాన్సర్‌ వచ్చిన అవయవాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

సాధారణంగా ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్, బయాప్సీ వంటి పరీక్షలు అవసరమవుతాయి. లక్షణాలు కనిపించినప్పుడు ఈ పరీక్షలతో నిర్ధారణ చేశాక, చికిత్స మొదలుపెట్టేటప్పుడు మిగతా విషయాలను తెలుసుకోడానికి రక్తపరీక్షలు, మల, మూత్ర పరీక్షలు, సీటీ స్కాన్, పెట్‌ స్కాన్, ఎమ్మారై వంటివి చేస్తారు. సీటీస్కాన్, ఎమ్మారై పరీక్షలు కణితి ఉన్న ప్రదేశాన్ని, దాని పరిమాణాన్ని నిర్ధారణ చేసేందుకు ఉపయోపడతాయి. 

క్యాన్సర్‌ పరీక్షల్లో కొన్ని... 
1 ఎఎఫ్‌పీ (అల్ఫా ఫీటో ప్రోటీన్‌) : లివర్‌ క్యాన్సర్‌లో ఈ పరీక్ష లెవల్స్‌ ఎక్కువగా ఉంటాయి. 

2 సీఏ 15.3 : రొమ్ము క్యాన్సర్‌లో ఈ బ్లడ్‌మార్కుర్‌ ఫలితాల రేంజ్‌ ఎక్కువ. 

3 సీఏ 19.9 : ఈ పరీక్ష గ్యాస్ట్రిక్, ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌లను తెలుపుతుంది. 

4 సీఏ 125 : మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్‌ను తెలుపుతుంది. 

5 సీఈఏ (కార్సినో ఎంబ్రియానిక్‌ యాంటీజెన్‌) : జీర్ణవ్యవస్థ, పెద్దపేగు (కోలన్‌), రెక్టల్‌ క్యాన్సర్లలో చేస్తారు. 

6 డీఆర్‌–70 : 13 రకాల క్యాన్సర్లను నిర్ధారణ చేస్తుంది. 7 పీఈటీ (పాజిట్రన్‌ ఎమిషన్‌ టోమోగ్రఫీ) : క్యాన్సర్‌ కణాల మెటబాలిక్‌ రేట్‌ను తెలిపే పరీక్ష. దీని ద్వారా శరీరంలో క్యాన్సర్‌ కణాలు ఎక్కడకి వ్యాపించాయో తెలుస్తుంది. 

8 ఎండోస్కోపీ : చిన్న గొట్టం ద్వారా శరీరం లోపలి భాగాలను పరీక్షించడం. వీటిల్లో  పొట్టలోపలి భాగాలను పరీక్షించేవీ, ముక్కులో పరీక్షించే నేసల్‌ ఎండోస్కోపీ, పెద్దపేగుల్లోకి కొలనోస్కోపీ, శ్వాసవ్యవస్థలో బ్రాంకోస్కోపీవంటివి ఉంటాయి.  

9 పీఎస్‌ఏ :  పురుషుల్లో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను తెలుసుకునేందుకు వీలయ్యే ‘ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటిజెన్‌’ అనే రక్తపరీక్ష ఇది. క్యాన్సర్‌ను ఒక ఎక్స్‌రే లేదా ఒక అల్ట్రాసౌండ్‌తోనే నిర్ధారణ చేయలేరు. ఏదో ఒక నిర్దిష్టమైన పరీక్షతో దీని నిర్ధారణ సాధ్యం కాదు. కాని కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెన్సీ, మిగతా ఇన్ఫెక్షన్లు, సిస్ట్‌లు, క్యాన్సర్‌ కాని కణుతులు ఉన్నప్పుడు కూడా పైన పేర్కొన్న పరీక్షల్లోని బ్లడ్‌మార్కర్స్‌ ఎక్కువగా ఉండవచ్చు. అందుకే లక్షణాలు ఉన్నప్పుడు బయాప్సీలో క్యాన్సర్‌ నిర్ధారణ అయ్యాకే చికిత్స మొదలుపెట్టడానికి ఈ పరీక్షలు అవసరమవుతాయి. అంతేగాక... క్యాన్సర్‌ వచ్చి తగ్గాక కూడా మళ్లీ తిరగబెట్టే ప్రమాదాన్ని తెలుసుకునేందుకూ మరికొన్ని పరీక్షలు అవసరమవుతాయి. 

మీలో ఈ కింద పేర్కొన్న లక్షణాలు ఉన్నాయా? 
1 వారి మల, మూత్ర విసర్జనల్లో మార్పులు 

2 ఆకలి, బరువు తగ్గడం 

3 మానని పుండు, కణితి, కణితిలో మార్పులు 

4 వీడని జ్వరం, తీవ్రమైన అలసట 

5 మహిళల్లో నెలసరి మధ్యలో రక్తస్రావం, చనుమొనల నుంచి రక్తస్రావం 

6 శరీరంలో ఎక్కడినుంచైనా రక్తస్రావం 

7తీవ్రమైన తలనొప్పి 

8కొంతకాలంగా గొంతులో మార్పులు 

9 జీర్ణవ్యవస్థలో చాలాకాలంగా తగ్గని అల్సర్స్‌. 

10 మచ్చలు, పుట్టుమచ్చల్లో మార్పులు, అవి పెరగడం. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా, పరీక్షలంటే భయపడకుండా అనుభవజ్ఞులైన వైద్యులను సంప్రదించాలి. 

Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421, 
Kurnool 08518273001

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement