Fatty acids
-
ఒంటివాసనే దోమకాటుకు మూలం
న్యూయార్క్: దోమలు. మనందరికీ ఉమ్మడి శత్రువులు. మలేరియా, జైకా, డెంగీ ప్రాణాంతక జ్వరాలకు కారణం. ఇవి కొందరినే ఎక్కువగా కుట్టడానికి కారణం ఏమిటి? ఫలానా రక్తం గ్రూప్ ఉన్నవారిని, రక్తంలో చక్కెర స్థాయిలు బాగా ఉన్నవారిని, వెల్లుల్లి, అరటిపండ్లు ఎక్కువగా తినేవారిని, మహిళలను దోమలు అధికంగా కుడుతుంటాయని అనుకుంటుంటారు. కానీ, ఇవేవీ నిజం కాదని అమెరికాలోని రాక్ఫెల్లర్ వర్సిటీ పరిశోధకులు తేల్చిచెప్పారు. శరీరం నుంచి వెలువడే ఓ రకం వాసనే దోమలను ఆయస్కాంతంలా ఆకర్షిస్తుందని, అలాంటి వారినే అవి ఎక్కువగా కుడుతుంటాయని తేల్చారు. ఈ వాసనకు కారణం శరీరంలోని కొవ్వు అమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్). ఇవి దోమలను ఆకర్షించే వాసనను ఈ ఉత్పత్తి చేస్తాయట! అధ్యయనం వివరాలను ‘జర్నల్ సెల్’లో ప్రచురించారు. మస్కిటో మ్యాగ్నెట్ మారదు చర్మంలో కార్బోజైలిక్ యాసిడ్స్ స్థాయిలు అధికంగా ఉన్నవారి పట్ల దోమలు విపరీతంగా ఆకర్షణకు గురవుతాయని అమెరికాలోని ‘రాక్ఫెల్లర్స్ ల్యాబొరేటరీ ఆఫ్ న్యూరోలింగ్విస్ట్ అండ్ బిహేవియర్’ ప్రతినిధి లెస్లీ వూషెల్ చెప్పారు. చర్మంలో భారీగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే దోమల ముప్పు అధికమేనని వివరించారు. జైకా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికున్‌గున్యా వంటి జ్వరాలకు కారణమయ్యే ‘ఎడిస్ ఈజిప్టి’ దోమలపై మూడేళ్లు అధ్యయనం చేశారు. చర్మంలో ఫ్యాటీ యాసిడ్స్ స్థాయిలు బాగా ఉన్నవారే ఎక్కువగా దోమకాటుకు గురవుతున్నట్లు గుర్తించారు. ఆ అమ్లాల నుంచి ఉత్పత్తయ్యే గ్రీజులాంటి కార్బోజైలిక్ యాసిడ్స్ చర్మంపై కలిసి పొరలాగా పేరుకుంటాయి. వాటి నుంచి వచ్చే ఒక రకమైన వాసన దోమలను ఆకట్టుకుంటుందట!. -
హైదరాబాద్‌లోని పిల్లల్లో ఇవి తక్కువగా ఉన్నాయి..
సాక్షి, హైదరాబాద్: పిల్లల మేధోశక్తితో పాటు ఏకాగ్రత పెరగాలంటే ఎక్కువగా ఒమేగా–3 పాలీ అచ్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఆహారంతో పాటు అందేలా చూడాలని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పిల్లల్లో (7– 13 ఏళ్ల మధ్య వయస్కులు) ఈ రకమైన కొవ్వులు తక్కువగా ఉన్నాయని ఎన్ఐఎన్ అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. శరీర, జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు కొవ్వులు లేదా ఫ్యాటీ ఆమ్లాలు చాలా అవసరం. ఆహారంలోని కొన్ని రసాయనాల ద్వారా శరీరం వీటిని తయారు చేసుకోగలదు. కానీ కొవ్వుల్లో కొన్నింటిని మాత్రం తయారుచేసుకోలేదు. ఆల్ఫా లినోలిక్ యాసిడ్ (ఏఎల్ఏ) లేదా ఒమేగా–3, లినోలిక్ యాసిడ్ (ఎల్ఏ) లేదా ఒమేగా–6 ఫ్యాటీ ఆమ్లాలను ఆహారం ద్వారా అందించాల్సి ఉంటుంది. అందుకే వీటిని ఆవశ్యక కొవ్వులుగా పిలుస్తారు. ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాల్లో రెండు రకాలు ఉంటాయి. అవి డోకోసా హెక్జనోయిక్ యాసిడ్ (డీహెచ్ఏ), ఈకోసాపెంటనోయిక్ యాసిడ్ (ఈపీఏ). మెదడులో ఉండే పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాల్లో డీహెచ్ఏ అత్యధికం. గుండె, రోగ నిరోధక వ్యవస్థ, మేధోశక్తి పనితీరుపై ప్రభావం చూపుతుంటుంది. గర్భధారణ చివరి త్రైమాసికంలో పిండంలోని మెదడులోకి చేరే డీహెచ్ఏ.. పుట్టిన తర్వాత రెండేళ్లవరకు ఎక్కువఅవుతూ ఉంటుంది. తద్వారా మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. శాఖాహారులకు అవిశగింజలు, చియాసీడ్స్.. హైదరాబాద్‌లోని 5 పాఠశాలల నుంచి 625 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని వారు ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలను ఎలా.. ఎంత మోతాదుల్లో అందుకుంటున్నారో పరిశీలించారు. చాలా మందిలో తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 80 శాతం మంది ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలను ఆహారంగా తీసుకుంటున్నారని, కానీ నెలకు 100 గ్రాములకు మించి తినకపోవడం, ఈపీఏ, డీహెచ్ఏలు అత్యధికంగా ఉండే సముద్ర చేపలను కాకుండా మంచినీటి చేపలను తినడం కారణంగా తగిన మోతాదులో శరీరానికి ఈ ఫ్యాటీ ఆమ్లాలు అందట్లేదని తెలిసింది. ఈపీఏ, డీహెచ్ఏ ప్రయోజనాలను గరిష్ట స్థాయిలో పొందేందుకు వారానికి వంద నుంచి 200 గ్రాముల వరకు చేపలు.. ముఖ్యంగా ఉప్పునీటి చేపలను తినడం అవసరమని ఎన్ఐఎన్ సూచించింది. మాంసం, పౌల్ట్రీ, గుడ్లలో ఈపీఏ, డీహెచ్ఏలు తక్కువ మోతాదులో ఉంటాయని, శాఖాహారంలో అసలు ఉండవని ఈ అధ్యయనం నిర్వహించిన శాస్త్రవేత్త పి.దేవరాజ్ తెలిపారు. అవిశగింజలు, చియాసీడ్స్, వాల్నట్స్ వంటి వాటిల్లో ఏఎల్ఏ పూర్వ రూపంలోని రసాయనాలు కొన్ని ఉంటాయని, శాఖాహారులు వీటిని తీసుకోవడం ద్వారా ఏఎల్ఏ లేమిని భర్తీ చేసుకోవచ్చని సూచించారు. ఆవనూనె, సోయా నూనెల్లోనూ ఈ కొవ్వులు ఉంటాయని తెలిపారు. ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలను ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం తెలుపుతోందని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత వివరించారు. -
కేన్సర్‌ను చంపేసే ఫ్యాటీ ఆసిడ్స్ గుర్తింపు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రాణాలను బలితీసుకుంటున్న కేన్సర్ మహమ్మారి వ్యతిరేక పోరాటంలో శాస్త్రవేత్తలు ప్రధాన పురోగతి సాధించారు.మానవులలో క్యాన్సర్ కణాలను చంపగల ఫ్యాటీ ఆసిడ్స్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. డిహోమో-గామా-లినోలెనిక్ ఆమ్లం లేదా డీజీఎల్‌ఏ అనే కొవ్వు ఆమ్లం మానవులలో క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. కొత్త పరిశోధన ద్వారా క్యాన్సర్ సంభావ్య చికిత్సలో కొన్ని చిక్కులు ఉన్నప్పటికీ, ఒక కీలక అడుగు పడిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా డీజీఎల్‌ఏ అనే కొవ్వు ఆమ్లం మానవులలోని క్యాన్సర్ కణాలలో ఫెర్రోప్టోసిస్‌ను ప్రేరేపిస్తుంది. ఫెర్రోప్టోసిస్ అంటే దెబ్బతిన్న లేదా పనిచేయని కణాలు సురక్షితంగా, సమర్ధవంతంగా నాశనం చేయడం లేదా రీసైకిల్ చేయడం. ఇనుము ("ఫెర్రో" అంటే ఇనుము) ను ఉపయోగించే అత్యంత నియంత్రిత సెల్ డెత్ ప్రోగ్రామ్‌ను ఫెర్రోప్టోసిస్ అంటారు. దీన్ని 2012లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ (పీయూఎఫ్ఏ), డీజీఎల్‌ఏ ఆమ్లం ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా అటు జంతువుల్లో ఇటు మానవులలోని కేన్సర్ కణాలలోనూ ఫెర్రోప్టోసిస్‌ను ప్రేరేపిస్తుందని అధ్యయనం తెలిపింది. ఈ డీజీఎల్‌ఏను ఖచ్చితంగా కేన్సర్ కణంలోకి బట్వాడా చేయగలిగితే, అది ఫెర్రోప్టోసిస్‌ను ప్రోత్సహిస్తుందనీ, తద్వారా కణితిలోని కేన్సర్ కణాలను హరించి వేస్తుందని తెలిపారు. అంతేకాదు ఫెర్రోప్టోసిస్ ద్వారా మూత్రపిండాల సంబంధిత జబ్బులు, న్యూరోడీజెనరేషన్ వ్యాధుల వంటి పరిస్థితుల గురించి అధ్యయనం చేస్తున్నామని వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ జెన్నిఫర్ వాట్స్ వెల్లడించారు. ‘డెవలప్మెంటల్ సెల్’ లో ఈ స్టడీ ప్రచురితమైంది. దాదాపు ఇరవై సంవత్సరాలుగా, నెమటోడ్ కేనోరబ్డిటిస్ ఎలిగాన్స్ ద్వారా జంతువుల్లో డీజీఎల్ఎతో సహా ఇతర ఆహార కొవ్వుల ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఈ ఆవిష్కరణకు క్యాన్సర్‌కు సంభావ్య చికిత్స దిశగా ఒక అడుగుపడిందని చెప్పారు. అలాగే కొన్నిచిక్కులు కూడా ఉన్నాయన్నారు. సీ ఎలిగాన్స్ అనేది మైక్రోస్కోపిక్ వార్మ్. సెల్ యాక్టివిటీ అధ్యయనంలో పారదర్శకంగా ఉండే దీన్ని తరచుగా ఉపయోగిస్తారు. నెమటోడ్లకు ఈ ఆహారం ఇవ్వడం వల్ల డీజీఎల్‌ఏతో నిండిన బ్యాక్టీరియా.. అన్ని బీజ కణాలతో పాటు బీజ కణాలను తయారుచేసే మూల కణాలను కూడా చంపినట్లు పరిశోధకులు కనుగొన్నారు. మరోవైపు ఈ ఫలితాలు మానవ కణాలకు సరిపోతాయో లేదో తెలుసుకోవడానికి పరిశోధకుల బృందం స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన స్కాట్ డిక్సన్‌తో కలిసి మరింత అధ్యయనం చేశారు. ఈ బృందం కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. దీనికి అదనంగా, డీజీఎల్ఏకు వ్యతిరేకంగా పనిచేసే మరో ఫాటీ ఆసిడ్‌ను కూడా గుర్తించారు. ఈథర్ లిపిడ్గా పిలిచే దీన్ని తొలగిస్తే.. డీజీఎల్కు ఎక్స్పోజ్ అయిన కణాలు మరింత వేగంగా చనిపోతాయని కనుగొన్నారు. డిక్సన్ చాలా సంవత్సరాలుగా ఫెర్రోప్టోసిస్, క్యాన్సర్‌తో పోరాటంలో దాని సామర్థ్యాన్ని అధ్యయనం చేస్తున్నారు. -
చురుకైన కీళ్ల కోసం!
కీళ్లవాతం – ఆహారం ఆర్థరైటిస్ (కీళ్లవాతం) తగ్గడానికి పైటోకెమికల్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారం పైటోకీన్స్తో పోరాడుతుంది. కొన్ని పదార్థాలు కీళ్లవాతం బాధ పెరగడానికి కారణమవుతుంటాయి. అందుకే కేవలం మందుల మీద ఆధారపడకుండా డైట్‌చార్ట్‌ను మార్చుకోవడం ద్వారా చక్కటి ఉపశమనం పొందవచ్చు. ఏమేమి తినకూడదో చూద్దాం! గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న, రెడ్‌మీట్, చక్కెర, తేనె, పాలు, పాల ఉత్పత్తులు, నూనెలో వేయించిన పదార్థాలు, వేయించి ఉప్పు చల్లిన గింజలు, తీపి కోసం కృత్రిమంగా వాడే ట్యాబ్లెట్లు– లిక్విడ్లు, మైదా, బేకరీ ఉత్పత్తులను మినహాయించాలి. కూరగాయల విషయానికి వస్తే... బంగాళాదుంప, వంకాయ, టొమాటో, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, వండి చల్లబరిచి నిల్వ చేసిన పదార్థాల (ఫ్రోజన్ ఫుడ్)కు కూడా వాతాన్ని పెంచే గుణం ఉంటుంది. టీ, కాఫీ, ఆల్కహాలు సేవనాన్ని పూర్తిగా మానేయాలి. వీటిని తినవచ్చు! ఏమేమి తినకూడదో తెలియచేసే జాబితా చూశాక ఇక తినడానికి ఏమున్నాయి? అనిపిస్తుంది. కానీ ఆర్థరైటిస్ బాధ నుంచి ఉపశమనాన్నిచ్చే ఆహారం చాలానే ఉంది. అరటి, మామిడి పండ్లు, స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, తర్బూజ, బత్తాయి, కమలా వంటి సిట్రస్ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. కూరగాయల్లో... ఆకుకూరలు, మామిడికాయ, నిమ్మ, క్యారట్, క్యాబేజ్, క్యాలిఫ్లవర్, బ్రోకలి, లెటస్, అరటి, చిక్కుడు వంటి కాయగూరలు తీసుకోవచ్చు. అలాగే రోజుకు రెండు కప్పుల గ్రీన్‌టీ, జింజర్ టీ, మొలకలు, నువ్వులు, వీట్‌గ్రాస్, ముడిబియ్యంతో వండిన అన్నం, శనగలు, రాజ్మా వంటి పొట్టు తీయని ధాన్యాలు తీసుకోవాలి. -
నిగనిగల కురులకు...
బ్యూటిప్స్ కురులు నిగనిగలాడుతూ అందంగా కనిపించాలంటే సరైన పోషణ అవసరం. శిరోజాల ఆరోగ్యాన్ని పెంపొందించే ప్యాక్స్ గురించి... గుడ్డు సొన, పెరుగు, ఆవనూనె కలిపి తలకు పట్టించాలి. గుడ్డులోని ఎ, బి12, డి, ఇ విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు కుదుళ్లను బలంగా మార్చుతాయి. ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు కండిషనర్‌గా ఉపయోగపడతాయి. అవకాడో గుజ్జులో నాలుగైదు చుక్కల పెప్పర్మింట్ ఆయిల్ కలిపి జుట్టుకు మాస్క్ వేయాలి. 15-20 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వీటిలోని అధిక ప్రొటీన్లు, మాంసకృత్తులు తలకట్టు ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ అంతేమొత్తం కొబ్బరి నూనెలో గుడ్డు సొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించాలి. మృదువుగా మసాజ్ చేయాలి. ఈ మిశ్రమం వెంట్రుకలకు మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. కుదుళ్లు బలంగా అవుతాయి. దీంతో వెంట్రుక పెరుగుదల బాగుంటుంది. వెంట్రకలు చిట్లడం, చుండ్రు సమస్యలు ఉంటే జుట్టు రాలడం కూడా ఎక్కువే ఉంటుంది. ఈ సమస్య నివారణకు కొబ్బరినూనెలో కొన్ని కరివేపాకులు వేసి వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రిపూట ఇలా చేసి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఆలివ్ ఆయిల్, దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. -
నిద్రలేమితో మధుమేహం ముప్పు..
కంటినిండా తగినంత నిద్ర లేకుంటే మధుమేహం ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిద్రలేమి వల్ల రక్తంలో ఫ్యాటీయాసిడ్స్ గణనీయంగా పెరుగుతాయని అంటున్నారు. ఫ్యాటీయాసిడ్స్ రక్తంలో ఎక్కువగా ఉన్నప్పుడు, ఇన్సులిన్‌కు రక్తంలోని చక్కెరను అదుపు చేసే సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు. నిద్రలేమి వల్ల ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రక్తంలోని ఫ్యాటీయాసిడ్స్ మార్పులపై షికాగో వర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు. నిద్రలేమి కారణంగా స్థూలకాయం, టైప్-2 డయాబెటిస్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇదివరకే పలు పరిశోధనల్లో తేలింది. రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రలో గడిపిన వారిలో అర్ధరాత్రి నుంచి వేకువజాము మధ్య రక్తంలో ఫ్యాటీయాసిడ్స్ పాళ్లు గణనీయంగా పెరిగాయి. ఈ పరిస్థితి మధుమేహానికి ముందస్తు సూచన అని నిపుణులు పేర్కొంటున్నారు.