నిద్రలేమితో మధుమేహం ముప్పు..
కంటినిండా తగినంత నిద్ర లేకుంటే మధుమేహం ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిద్రలేమి వల్ల రక్తంలో ఫ్యాటీయాసిడ్స్ గణనీయంగా పెరుగుతాయని అంటున్నారు. ఫ్యాటీయాసిడ్స్ రక్తంలో ఎక్కువగా ఉన్నప్పుడు, ఇన్సులిన్‌కు రక్తంలోని చక్కెరను అదుపు చేసే సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు. నిద్రలేమి వల్ల ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రక్తంలోని ఫ్యాటీయాసిడ్స్ మార్పులపై షికాగో వర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు.
నిద్రలేమి కారణంగా స్థూలకాయం, టైప్-2 డయాబెటిస్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇదివరకే పలు పరిశోధనల్లో తేలింది. రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రలో గడిపిన వారిలో అర్ధరాత్రి నుంచి వేకువజాము మధ్య రక్తంలో ఫ్యాటీయాసిడ్స్ పాళ్లు గణనీయంగా పెరిగాయి. ఈ పరిస్థితి మధుమేహానికి ముందస్తు సూచన అని నిపుణులు పేర్కొంటున్నారు.