నిగనిగల కురులకు...
బ్యూటిప్స్
కురులు నిగనిగలాడుతూ అందంగా కనిపించాలంటే సరైన పోషణ అవసరం. శిరోజాల ఆరోగ్యాన్ని పెంపొందించే ప్యాక్స్ గురించి... గుడ్డు సొన, పెరుగు, ఆవనూనె కలిపి తలకు పట్టించాలి. గుడ్డులోని ఎ, బి12, డి, ఇ విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు కుదుళ్లను బలంగా మార్చుతాయి. ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు కండిషనర్‌గా ఉపయోగపడతాయి. అవకాడో గుజ్జులో నాలుగైదు చుక్కల పెప్పర్‌మింట్ ఆయిల్ కలిపి జుట్టుకు మాస్క్ వేయాలి. 15-20 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వీటిలోని అధిక ప్రొటీన్లు, మాంసకృత్తులు తలకట్టు ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తాయి.
రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ అంతేమొత్తం కొబ్బరి నూనెలో గుడ్డు సొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించాలి. మృదువుగా మసాజ్ చేయాలి. ఈ మిశ్రమం వెంట్రుకలకు మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. కుదుళ్లు బలంగా అవుతాయి. దీంతో వెంట్రుక పెరుగుదల బాగుంటుంది.
వెంట్రకలు చిట్లడం, చుండ్రు సమస్యలు ఉంటే జుట్టు రాలడం కూడా ఎక్కువే ఉంటుంది. ఈ సమస్య నివారణకు కొబ్బరినూనెలో కొన్ని కరివేపాకులు వేసి వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రిపూట ఇలా చేసి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఆలివ్ ఆయిల్, దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది.