eventually
-
నిగనిగల కురులకు...
బ్యూటిప్స్ కురులు నిగనిగలాడుతూ అందంగా కనిపించాలంటే సరైన పోషణ అవసరం. శిరోజాల ఆరోగ్యాన్ని పెంపొందించే ప్యాక్స్ గురించి... గుడ్డు సొన, పెరుగు, ఆవనూనె కలిపి తలకు పట్టించాలి. గుడ్డులోని ఎ, బి12, డి, ఇ విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు కుదుళ్లను బలంగా మార్చుతాయి. ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు కండిషనర్‌గా ఉపయోగపడతాయి. అవకాడో గుజ్జులో నాలుగైదు చుక్కల పెప్పర్మింట్ ఆయిల్ కలిపి జుట్టుకు మాస్క్ వేయాలి. 15-20 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వీటిలోని అధిక ప్రొటీన్లు, మాంసకృత్తులు తలకట్టు ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ అంతేమొత్తం కొబ్బరి నూనెలో గుడ్డు సొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించాలి. మృదువుగా మసాజ్ చేయాలి. ఈ మిశ్రమం వెంట్రుకలకు మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. కుదుళ్లు బలంగా అవుతాయి. దీంతో వెంట్రుక పెరుగుదల బాగుంటుంది. వెంట్రకలు చిట్లడం, చుండ్రు సమస్యలు ఉంటే జుట్టు రాలడం కూడా ఎక్కువే ఉంటుంది. ఈ సమస్య నివారణకు కొబ్బరినూనెలో కొన్ని కరివేపాకులు వేసి వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రిపూట ఇలా చేసి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఆలివ్ ఆయిల్, దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. -
ఆగితే చస్తావ్...
1976 మాంట్రియల్ ఒలింపిక్స్ జరుగుతున్న సమయం... బేబీ డాక్‌గా ప్రసిద్ధుడైన నియంత జీన్ క్లాడ్ డువలియర్ అప్పటికే హైతీ దేశాన్ని ఐదేళ్లుగా తన చెప్పుచేతల్లో పెట్టుకుని పాలిస్తున్నాడు. నియంత పాలన ఎలా ఉంటుందో జనాలకు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్న డువలియర్... ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్టును ఎంపిక చేసే బాధ్యతను కూడా తనే తీసుకున్నాడు. తన సన్నిహితులతో కలిసి చాలా మందిని వడపోసి చివరకు 13 మంది క్రీడాకారులను ఎంపిక చేశాడు. ఇందులో పది మంది అథ్లెట్లు, ముగ్గురు బాక్సర్లు ఉన్నారు. వీళ్లతో పాటు తన స్నేహితుల్లో కొంత మందిని కూడా పోటీలకు పంపాడు. అప్పటిదాకా జరిగిన 12 ఈవెంట్లలో ఏ ఒక్కరూ గెలవలేకపోయారు. దీంతో అంతర్జాతీయ వేదికపై అవమానం జరి గిందనే కోపం, అసహనం, ఆవేశంతో డువలియర్ ఊగిపోతున్నాడు. ఇక మిగిలింది ఒకే ఒక్క ఈవెంట్ 5 వేల మీటర్ల పరుగు. బతుకు భయంతో... డ్యూడన్ లామోత్... హైతీ తరఫున హీట్స్‌లో పాల్గొంటున్న అథ్లెట్. తమ అథ్లెట్లందరూ ఓటమిపాలు కావడంతో అతనిలో ఏదో తెలియని భయం. గెలుపును పక్కనబెడితే కనీసం రేసునైనా పూర్తి చేస్తానో లేదోనని ఆందోళన. గన్ పేలింది... రేసు మొదలైంది. అథ్లెట్లు వేగం పుంజుకుంటున్నారు. కానీ లామోత్ మాత్రం సెకన్, సెకన్‌కు వెనుకబడిపోతున్నాడు. ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చొన్న డువలియర్లో క్షణక్షణానికి అసహనం పెరిగిపోతోంది. గ్యాలరీ వైపే చూస్తూ పరిగెడుతున్న లామోత్ ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఓ దశలో రేసును ఆపేయాలని నిశ్చయించుకున్నాడు. కానీ ‘రేసు పూర్తి చేయకపోతే ఉరితీస్తానని’ డువిలియర్ చేసిన సైగతో లామోత్ ప్రాణం గాలిలో కలిసిపోయినట్లయింది (నిజానికి ఈవెంట్‌కు ముందే ఆ హెచ్చరిక జారీ చేసినట్లు కూడా కొందరు చెబుతారు). అంతే ఊపిరి బిగపట్టి, కండరాలు మెలిపెట్టి... అడుగు తీసి అడుగు వేయలేక... సగం దూరం కూడా పూర్తి చేయని రేసును బతుకు జీవుడా అంటూ 18 నిమిషాల 50.07 సెకన్లలో పూర్తి చేశాడు. ఒలింపిక్స్ చరిత్రలో ఇది అత్యంత చెత్త రికార్డు. 14 మంది పాల్గొన్న హీట్స్‌లో 13వ స్థానంలో నిలిచిన అతనికి, 12వ స్థానంలో నిలిచిన అథ్లెట్ (13ని. 43.89 సెకన్లు)కు ఏకంగా 5 నిమిషాల తేడా ఉంది. ఒక నియంత పరువు కోసం భయంతో పరుగెత్తిన అథ్లెట్ తన కెరీర్లో చెరగని చెత్త రికార్డు నెలకొల్పినా ప్రాణాలను మాత్రం నిలబెట్టుకోగలిగాడు.