Researches
-
‘ఇన్ఫోసిస్ ప్రైజ్ 2024’.. విజేతలు వీరే
ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ గురువారం ‘ఇన్ఫోసిస్ ప్రైజ్ 2024’ విజేతలను ప్రకటించింది. ఎకనామిక్స్, ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ అనే ఆరు విభాగాలలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న వారి పేర్లను వెల్లడించింది.అవార్డు అందుకున్న వారిలో భారత్‌లోని ప్రముఖ సంస్థలకు చెందిన వారు ఇద్దరు. ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఇద్దరు, వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఒకరు, ఎడిన్బర్గ్ యూనివర్సిటీ నుంచి ఒకరు ఉన్నారు. ఈ అవార్డు కింద 100,000 డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు 84 లక్షల, 42 వేలు) నగదు బహుమతిని అందజేయనున్నారు. అవార్డు ప్రదానోత్సవం జనవరిలో జరగనుంది.ఇన్ఫోసిస్ ప్రైజ్ 2024 గెలుపొందిన విజేతలు:1. ఎకనామిక్స్ విభాగంలో.. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అరుణ్ చంద్రశేఖర్2. ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో.. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి శ్యామ్ గొల్లకోట.3. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగంలో.. ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి మహమూద్ కూరియా.4. లైఫ్ సైన్సెస్ విభాగంలో.. పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు చెందిన సిద్ధేష్ కామత్5. మ్యాథమెటికల్ సైన్సెస్ విభాగంలో.. కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్ నీనా గుప్తా6. ఫిజికల్ సైన్సెస్ విభాగంలో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ వేదిక ఖేమానీకి బహుమతి లభించింది.కాగా ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజినీర్లు సంబంధిత రంగాల్లో విశేష కృషి చేసినందుకుగాను పత్రి ఏటా ‘ఇన్ఫోసిస్ ప్రైజ్’ను అందిస్తోంది. ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్య వంటి ఆరు విభాగాల్లో కృషి చేసిన వారికి ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. ప్రతి కేటగిరి నుంచి గెలుపొందిన విజేతలకు ఒక బంగారు పతకంతోపాటు, ప్రశంస పత్రం, లక్ష డాలర్లు( భారత కరెన్సీ ప్రకారం రూ. 84 లక్షల 40 వేలు), దానికి సమానమైన ప్రైజ్ పర్స్ అందిస్తారు. మానవాళికి మేలు చేసే అత్యుత్తమ పరిశోధనలను గుర్తించడం, దేశంలోని యువ పరిశోధకులకు, ఔత్సాహిక శాస్త్రవేత్తలకు ఆదర్శంగా నిలవడమే ఇన్ఫోసిస్ ప్రైజ్ ప్రాథమిక లక్ష్యం.అయితే విదేశాలకు చెందిన విజేతలు బహుమతిని గెలుచుకునే సమయంలో తమకు నచ్చిన ఇండియన్ ఇన్స్టిట్యూట్లలో తగిన సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. దేశంలో గరిష్టంగా రెండు పర్యటనలలో 30 రోజులు గడవాల్సిందిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కోరుతుంది. -
టెక్ ప్రపంచంలో పంచేంద్రియాలు!
దొడ్డ శ్రీనివాసరెడ్డి మనిషి సృష్టించిన టెక్నాలజీ ఇప్పుడు మరో మనిషిని సృష్టించబోతోంది. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మనిషి మెదడును అనుకరించేందుకు ప్రయత్నిస్తు్తంటే.. దాని సాయంతో మన పంచేంద్రియాలకు ప్రత్యా మ్నాయాలను సృష్టించే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం చేసే పనులైన చూపు, వాసన, వినికిడి, రుచి, స్పర్శలను ఆస్వాదించగల కృత్రిమ పరికరాల తయారీలో శాస్త్రవేత్తలు తలమునకలు అవుతున్నారు. జ్ఞానేంద్రియాల్లోని లోపాలను సరిచేయడం, వాటి పనితీరును మెరుగుపర్చడంతోపాటు పూర్తిస్థాయిలో కృత్రిమంగానే.. మరింత సమర్థంగా రూపుదిద్దేందుకు ప్రత్యామ్నాయ పరికరాలపై ప్రపంవ్యాప్తంగా పరిశోధకులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. లక్షల మంది చూపులేని అంధులు, కోట్ల మంది దృష్టి లోపాలతో బాధ పడుతున్నవారు ప్రపంచంలో ఉన్నారు. చేతులు, కాళ్లు కోల్పోయి, కృత్రిమ అవయవాలతో కాలం గడుపుతున్న వికలాంగులూ ఉన్నారు. కరోనా బారినపడిన కోట్లాది మంది బాధితులు రుచి, వాసన జ్ఞానం కోల్పోవడం మనం గమనించాం. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి, మరింత సమర్థంగా జ్ఞానేంద్రియాలు పనిచేసేలా కృత్రిమ మేధతో ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలను అవలోకనం చేసుకుందాం. చూపు మనిషి కళ్లు, కంటిచూపుపై చిరకాలంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చూపులేని, కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ సాగుతోంది. ఇలాంటి వారి కోసం ‘ఆర్‌కామ్ మైఐ’అనే పరికరం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఈ పరికరాన్ని కళ్లజోడుకు అమర్చుకుంటే మాటల ద్వారా అవసరమైన సమాచారాన్ని అంధులు, కంటిచూపు సరిగా లేనివారు పొందవచ్చు. చిన్న వైర్లెస్ కెమెరా కలిగిఉన్న ఈ పరికరం ద్వారా మన ముందున్న ఏ వస్తువునైనా మాటల ద్వారా అభివర్ణిస్తుంది. మనం తెలుసుకోవాల్సిన వస్తువు వైపు చూస్తూ పరికరాన్ని ఆన్ చేస్తే చాలు... దానికి అమర్చి ఉన్న స్పీకర్ ద్వారా ఆ వస్తువు గురించి వివరిస్తుంది. వార్త, కథనం గురించి తెలుసుకోవాలన్నా ఈ ఆర్నమ్ మై ఐ ద్వారా చదివి వినిపించుకోవచ్చు. వినియోగ వస్తువుల బార్ కోడులను చదివి వాటి వివరాలను కూడా అందిస్తుంది. దాంతో అంధులు కూడా ఎవరి సాయం లేకుండా ధైర్యంగా షాపింగ్ చేయవచ్చు. ►కంటిచూపు సమస్యలు ఉన్న వారికోసం జార్జియా యూనివర్సిటీ ‘మిరా’అనే పరికరాన్ని రూపొందించింది. కృత్రిమ మేధతో పనిచేసే ఆ పరికరాన్ని వీపు భాగంలో తగిలించుకుంటే చాలు... అంధులు కూడా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లవచ్చు. ఈ పరికరం నిరంతరాయంగా మన పరిసరాల గురించి వివరిస్తూ సురక్షితంగా గమ్యం చేరుస్తుంది. ►కంటికి ప్రత్యామ్నాయంగా ‘బయోనిక్ ఐ’త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ‘బయోనిక్ ఐ’పై పరిశోధనలు జరుగుతున్నాయి. ‘బయోనిక్ ఐ’... ఎదుట ఉన్న దృశ్యాలను గ్రహించి, వాటిని ఎలక్ట్రిక్ సిగ్నల్స్‌గా మార్చి మెదడుకు సంకేతాలు పంపడం ద్వారా దీన్ని ధరించిన వ్యక్తికి ఆయా దృశ్యాలు ఆవిష్కృతం అయ్యేలా చేస్తుంది. సిడ్నీ వర్సిటీ ఇటీవల ‘బయోనిక్ ఐ’ను గొర్రెలకు అమర్చి పరీక్షించగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తేల్చింది. ఫీనిక్స్99గా పిలిచే ఈ పరికరాన్ని ఇక మనుషులపై పరీక్షించాల్సి ఉంది. సెకండ్ సైట్, ఆస్ట్రేలియాకే చెందిన మోనాష్ విజన్ గ్రూప్, ఫ్రాన్స్‌కు చెందిన పిక్సిమ్ గ్రూప్ లాంటి సంస్థలు కంటి రెటినాకు ప్రత్యామ్నాయంగా పనిచేసే ‘బయోనిక్ ఐ’పై పరిశోధనలు చేస్తున్నాయి. భవిష్యత్తులో ‘బయోనిక్ ఐ’కు 40 కోట్ల డాలర్ల మార్కెట్ ఉంటుందని అంచనా. వాసన స్కాట్లాండ్లో నర్సుగా పనిచేసిన జాయ్ మిన్ని వాసన ద్వారా రోగికి నరాలకు సంబం«ధించిన పార్కిన్సన్ వ్యాధి ఉన్నదీ లేనిదీ చెబుతూ సంచలనం సృష్టించారు. పార్కిన్సన్ వ్యాధి కారణంగా శరీరం నుంచి వచ్చే వాసనల్లో తేడాను ఆమె పసిగట్టగలదు. జాయ్ మిన్ని స్ఫూర్తితో యూరప్‌కు చెందిన అనేక యూనివర్సిటీలు పరిశోధనలు నిర్వహించి పార్కిన్సన్ రోగుల నుంచి వెలువడే పది రకాల రసాయనాలను గుర్తించారు. దీని ఆధారంగా చైనాకు చెందిన జె జియాంగ్ యూనివర్సిటీ కృత్రిమ మేధను ఉపయోగించి ఒక కృత్రిమ నాసికను అభివృద్ధి చేసింది. రోగి శరీరం నుంచి వెలువడే రసాయనాల వాసనను గ్రహించి వ్యాధి లక్షణాలను చెప్పగలిగే ఈ పరికరం 70.8 శాతం కచ్చితత్వం కలిగి ఉంది. శ్వాస ఆధారంగా పని చేయగలిగిన సెన్సర్లు ఉన్న పరికరాల ద్వారా ఇప్పుడు కొన్ని రకాల కేన్సర్లను, మూత్రపిండాల వ్యాధులు, స్లెరోసిస్ వంటి మరికొన్ని వ్యాధులను పసిగట్టే పనిలో పరిశోధకులు ఉన్నారు. బ్రెయిన్ చిప్ కంపెనీ తయారు చేసిన ‘అకిడా’ప్రాసెసర్ వంద రకాల రసాయనాలను, వాసనలను పసిగట్టగలుగుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్, బ్రూవరేజ్ వంటి ఫ్యాక్టరీలలో పదార్ధాల నాణ్యతను పరీక్షించడానికి ఇప్పుడు ఎలక్ట్రానిక్ నాసికలను వినియోగిస్తున్నారు. మనిషికి ప్రమాదకరమైన విషపూరిత వాయువులను పరీక్షించడానికి కూడా ఈ కృత్రిమ నాసికలు వాడకంలోకి వచ్చాయి. వినికిడి దాదాపు రెండు దశాబ్దాలుగా మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ ద్వారా చెవిటి వారిలో వినికిడి శక్తిని ఇనుమడించగలిగాం. చెవిలో అంతర్భాగమైన కాక్లీని అనుకరించే పరికరాన్ని మరింత అభివృద్ధి చేసి మాటలను, శబ్దాలను వేరుచేయగల ఏఐ ఆధారిత పరికరాన్ని ‘ఓమ్నీ బ్రిడ్జ్’అభివృద్ధి చేసింది. ఈ పరికరం సాయంతో అవసరమైన భాషలోకి తర్జుమా చేసుకొని సంభాషణల్ని కొనసాగించగలిగే శక్తి చెవిటి వారికి ప్రసాదించింది. ►మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), రొడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్ (ఆర్ఐఎస్డీ) కలసి శబ్దాలను గ్రహించి ప్రసారం చేయగల ఒక రకమైన వస్త్రాన్ని అభివృద్ధి చేశాయి. ఈ పరిశోధనా ఫలితాన్ని ఇటీవల నేచర్ పత్రికలో ప్రచురించాయి. చెవిలో కర్ణభేరిని పోలిన ఈ వస్త్రం... శబ్ద తరంగాలను ఎలక్ట్రిక్ తరంగాలుగా మార్చి మన చెవికి అమర్చిన మైక్రోఫొన్ లాంటి పరికరానికి చేరుస్తుంది. ఈ పరికరం ఆ శబ్దాలను చెవిటి వారికి యథాతథంగా వినిపించగలుగుతుంది. ఈ వస్త్రాన్ని పైదుస్తుల్లో గుండె ప్రాంతంలో అమర్చడం ద్వారా గుండె, శ్వాసకోస పనితీరును కూడా ఎప్పటికప్పుడు గమనించవచ్చు. స్పర్శ చర్మానికి ఉన్న ప్రత్యేక గుణం స్పర్శ జ్ఞానం. స్పర్శ ద్వారా వస్తువులను గ్రహించగలిగే గుణం చర్మానికి ఉంది. వికలాంగులకు అమర్చే కృత్రిమ చేతులు, కాళ్లకు స్పర్శ జ్ఞానం కూడా అందించాలనే బృహత్ సంకల్పం పరిశోధకులకు ఏర్పడింది. ఈ దిశగా జరుగుతున్న పరిశోధనలు అనేక ఆవిష్కరణలకు దారి తీస్తున్నాయి. బ్రిటన్‌లోని బ్రిస్టల్ రొబోటిక్స్ లేబొరేటరీకి చెందిన పరిశోధకులు త్రీడీ ప్రింట్‌తో రూపొందించిన కృత్రిమ చర్మాన్ని రోబోల వేళ్లకు తొడగడం ద్వారా స్పర్శ జ్ఞానాన్ని కలిగించడంలో విజయం సాధించగలిగారు. కృత్రిమ చర్మం ద్వారా వస్త్రాల నాణ్యత, మృదుత్వం, తేమ వంటి లక్షణాలను పసిగట్టవచ్చు. స్పర్శను ఆస్వాదించగలిగే కృత్రిమ చర్మం తయారీపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ముట్టుకున్నçప్పుడు వచ్చే ప్రకంపనాల ఆధారంగా కృతిమ మేథతో వస్తువులను గ్రహించగలిగే ఈ–స్కిన్.. మనిషి స్పర్శజ్ఞానాన్ని అనుకరించగల ప్రత్యామ్నాయ మార్గంగా అవతరించబోతోంది. మనిషి ముట్టుకోలేని అత్యంత వేడి పదార్థాలు, అత్యంత శీతల పదార్థాలు, ప్రమాదకరమైన వస్తువులను ఈ కృత్రిమ చర్మం ద్వారా విశ్లేషించే అవకాశం ఏర్పడుతుందని పరిశోధకుల అభిప్రాయం. ‘అకిడా’ప్రాసెసర్ అమర్చిన పరికరాలతో రోడ్డు, బ్రిడ్జీలను ముట్టుకొని వాటి నాణ్యతను అంచనా వేసే అవకాశం ఏర్పడుతుంది. మనిషి వెళ్లలేని సముద్రగర్భాలు, భూగర్భాల్లో ఈ కృత్రిమ చర్మంగల పరికరాలను పంపడం ద్వారా కొత్త విషయాలు తెలుసుకొనే ఆస్కారం ఉందని ఈ రంగంలో పనిచేస్తున్న పరిశోధకులు చెబుతున్నారు. రుచి గుండె జబ్బులకు, రక్తపోటుకు కారణమైన అధిక ఉప్పు వాడకాన్ని తగ్గించడం కోసం జపాన్‌లో మైజీ యూనివర్సిటీ ఒక ఎలక్ట్రానిక్ చాప్‌స్టిక్‌ను తయారు చేసింది. ఈ చాప్‌స్టిక్‌తో ఆహారం తీసుకొనేటప్పుడు అది సోడియం అయాన్లను నోటికి అందించి కృత్రిమంగా ఉప్పు రుచిని కలిగిస్తుంది. దాంతో ఆహారంలో ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించగలిగామని యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. ఈ సూత్రాన్ని అనుసరించి మనిషి కోరిన రుచులను కృత్రిమంగా అందించగల అనేక వస్తువులు అందుబాటులోకి రాబోతున్నాయని ప్రముఖ పరిశోధకుడు నిమిషె రణసింఘె చెబుతున్నారు. వైన్ తయారీ కేంద్రాల్లో రుచిచూసి నాణ్యతను అంచనా వేసే టేస్టర్ల స్థానంలో ఇప్పుడు కృత్రిమ మేధస్సుతో పని చేసే ‘ఎలక్ట్రానిక్ నాలుక’లు అంటుబాటులోకి వచ్చాయి. ఈ ఎలక్ట్రానిక్ నాలుకలో ఉండే సెన్సర్లు పదార్థంలో ఉండే రుచికి సంబంధించిన సమాచారాన్ని గ్రహించి, విశ్లేషించి ఫలితాలను వెల్లడించగలవు. పదార్థాల నాణ్యత, తాజాదనాన్ని విశ్లేషించే ఎలక్ట్రానిక్ నాలుకలను ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో వాడుతున్నారు. అలాగే మనిషి నాలుకతో రుచి చూడలేని రసాయనాల కోసం ఫార్మా కంపెనీల్లో కూడా ఎలక్ట్రానిక్ నాలుకలు అందుబాటులోకి వచ్చాయి. -
నొప్పిలోనూ చిన్న చూపా?!
అన్నింటా వివక్ష ఉన్నట్టే.. ఆరోగ్య చికిత్సలోనూ స్త్రీల పట్ల వివక్ష ఉందా?! ఎందుకంటే, పురుషుల కంటే స్త్రీల నొప్పిని వైద్యులు తక్కువ అంచనా వేస్తారని ఇటీవల జరిగిన పరిశోధనలు సూచిస్తున్నాయి. నొప్పితో బాధపడుతున్న పురుషుడిని వాస్తవికవాదిగా చూస్తే, స్త్రీని హిస్టీరికల్, భావోద్వేగాలకు లోనయ్యేవారిలా చూస్తారని ప్రపంచవ్యాప్తంగా జరిగిన 77 అధ్యయనాలు చెబుతున్నాయి. స్త్రీల ఆరోగ్యం విషయంలో ఇంటి నుంచి ఆసుపత్రుల దాకా ప్రపంచవ్యాప్తంగా ఎందుకీ వివక్ష?! తలనొప్పి, కడుపునొప్పి, కాలు, చెయ్యి, మెడ, నడుము నొప్పి.. బాధిస్తోందని హాస్పిటల్‌కి వెళితే అక్కడ అవసరానికి సరైన చికిత్స లభిస్తుందని ఎవరైనా అనుకుంటారు. కానీ చాలా మంది మహిళలు కొత్తరకమైన హింసను ఎదుర్కొంటున్నారని, ఆరోగ్య రక్షణ అందించేవారు పురుషుల కంటే స్త్రీలలో నొప్పిని తక్కువ అంచనా వేస్తున్నారని అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తెలియజేసింది. ఈ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ టీనా దోషి ‘స్త్రీ, పురుష తేడా లేకుండా అందరిలోనూ తలనొప్పి, న డుము, మెడ నొప్పి, కడుపునొప్పి, ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నాయి. అయితే, పురుషుల కన్నా స్త్రీలలో వచ్చే నొప్పుల సంఖ్య ఎక్కువ ఉన్నట్టు కూడా పరిశోధనలు ఉన్నాయి. దీని వల్ల కూడా ఇలాంటి ఒక అభిప్రాయం కలగచ్చు’ అంటారు ఆమె. పరీక్షా గదిలోనూ... మియామీ న్యూరోసైన్స్ లేబొరేటరీలో జరిపిన ఒక అధ్యయనంలో దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతున్న రోగుల వీడియోలను చూసినప్పుడు అందులోని వైద్య విద్యార్థులు, వైద్యులు స్త్రీల నొప్పిని పురుషుల కంటే తక్కువ అంచనా వేసినట్టు గుర్తించారు. ‘చేయి విరిగిందని ఎక్స్ రే చూపిస్తే వైద్యుడికి ఒక స్పష్టమైన భావం ఉంటుంది. అదే కడుపునొప్పి లేదా తెలియని ఏదైనా రుగ్మత ఉందని సంప్రదిస్తే అంటే నిర్ధారణ పరీక్షల ద్వారా ఇంకా గుర్తించలేని సమస్య అయితే అప్పుడు నొప్పి తాలూకు అంచనా స్త్రీలో మానసికపరమైనదిగా చూడచ్చు’ అంటారు వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా ఉన్న జానిస్ సబిన్. నొప్పి తాలూకు సమస్యను అనుభవించే వ్యక్తికి మాత్రమే నిజంగా ఎలా అనిపిస్తుందో తెలుస్తుంది. వాస్తవమా, కాదా అనే విషయాల్లో బేరీజు వేయడంలో కొంచెం తేడా అయితే ఉండొచ్చు’ అని వివరిస్తారాయన. అనుకోని పక్షపాతం వాస్తవానికి డాక్టర్లు ఉన్నదే రోగులకు సాయం చేయడానికి. ‘కానీ, ప్రపంచవ్యాప్తంగా 77 ‘పెయిన్ స్టడీస్’ పరిశీలిస్తే పురుషులను వాస్తవాలు చెప్పేవారిగా చూసే అవకాశం ఉంది. స్త్రీలలో భావోద్వేగాలకు లోన య్యారేమో అని చూసే అవకాశం ఉంది. కొన్ని దేశాల్లో వర్ణవివక్ష కారణంగా ఆడవారిలోనే పక్షపాతం చూపే అవకాశాలూ లేకపోలేదు’ అంటారు టీనా. ఇంటిలోనే వివక్ష.. ‘వైద్యులదాకా వెళ్లడానికి ముందు మన ఇంటి వాతావరణంలోనే చూద్దాం. పురుషుల నొప్పి కన్నా స్త్రీ నొప్పిని ఇంటిలోనే తక్కువ అంచనా వేస్తారు. స్త్రీ నొప్పి అంటే కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని సర్దుబాటు చేస్తారు. అదే మగవారు ‘నొప్పి’ అంటే కొంత అలెర్ట్ అవుతారు. అలాగే, ఇతర ఆరోగ్య నిపుణులు కూడా పురుషులతో పోల్చితే వ్యాయామాలు చేయడం, ఆహార జాగ్రత్తలు పాటించడం.. వంటివి స్త్రీలలో తక్కువ స్థాయిలో ఉన్నాయని నివేదికలు ఇచ్చారు. మానసిక చికిత్స ద్వారా స్త్రీ నొప్పి నుంచి కోలుకోవడానికి ఎక్కువ ప్రయోజనం పొందితే, పురుషులకు మందులు ఎక్కువ అవసరమవుతున్నాయ’ని అంటారు మియామీ విశ్వవిద్యాలయ డైరెక్టర్ ఎలిజబెత్ లోసెన్. అయితే, ఇప్పటికీ పాత మూస పద్ధతుల ఆధారంగానే మహిళల నొప్పి గురించి విశ్లేషిస్తున్నారని, వారి వాస్తవిక దృక్కోణంలోనూ, ఆధునిక జీవన విధానంలోనూ చాలా తేడా వచ్చిదంటున్నారు పరిశోధకులు. చికిత్సలో వివక్ష ఉండదని, వాస్తవ ప్రపంచానికి దగ్గరగా ఉండేవారిలో శారీరక నొప్పుల సంఖ్య తక్కువనేది నిపుణుల అభిప్రాయం. ఒత్తిడిని బట్టి చికిత్స బయటకు చెప్పుకోలేని మానసిక సమస్యల ప్రభావం శరీరం మీద పడుతుంది. అలాంటి కేసులు ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. మగవారితో పోల్చితే మహిళల్లో యాంగై్జటీ పర్సంటెజీ ఎక్కువ ఉంటుంది. మహిళ మానసిక స్థితిపై ఆమె చుట్టూ ఉన్న వాతావరణం ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇంటి విషయాలు, రిలేషన్స్, పిల్లలకు సంబంధించినవాటిలో ఏదైనా ఒత్తిడికి లోనైనప్పుడు సైకోసోమాటిక్ సమస్యలు వస్తుంటాయి. చికిత్స కోసం హాస్పిటల్‌కు తీసుకెళితే ‘ఏమీ లేదు స్ట్రెస్ అయ్యారు’ అని డాక్టర్ చెబితే ఇంట్లోవాళ్లే ‘నొప్పి ఏమీ లేదు, నువ్వు అనవసరంగా డబ్బులన్నీ ఖర్చుపెట్టిస్తావ్...’ అని కోప్పడేవారుంటారు. ఇది కూడా స్త్రీలలో ఒకరకమైన ఒత్తిడిని పెంచుతుంది. మగవారిలో అయితే ఇంటి బయటి విషయాలమీద దృష్టి ఎక్కువ ఉంటుంది. పొగతాగడం, మద్యం సేవించడం, వ్యసనాలు.. వీటికి సంబంధించిన సమస్యల వల్ల బాడీ పెయిన్స్ రావడం ఎక్కువ గమనిస్తుంటాం. ఇద్దరిలోనూ సమస్య మూలాలను కనుక్కొని చికిత్స చేస్తాం. – డాక్టర్ కె. హరిణి, సైకియాట్రిస్ట్ తేడా లేదు... చికిత్సలో ఆడ–మగ ఇద్దరినీ ఒకే విధంగా చూస్తాం. కొన్ని సందర్భాల్లో ఆడ–మగ సమస్యల్లో కారణాలు వేరు వేరుగా ఉంటాయి. అవి హార్మోన్లలో తేడాల వల్ల వస్తాయి. పేషెంట్లో ఉండే సమస్యను బట్టి చికిత్స ఉంటుంది తప్పితే ఎక్కువ–తక్కువ అంచనా వేయడం ఏమీ ఉండదు. – డాక్టర్. జి.నవోదయ, జనరల్ మెడిసిన్ – నిర్మలారెడ్డి -
చనిపోయి మళ్లీ అదే తల్లి కడుపున పుట్టారు..సైన్స్‌కే అందని అద్భుతం
పుణ్యఫలం, కర్మఫలం.. జీవాత్మ, పరమాత్మ.. గతజన్మ, పునర్జన్మ.. ఇవన్నీ అస్పష్టమైన నమ్మకాలే కానీ.. కొట్టిపారేయలేని అంశాలంటారు చాలామంది. అయితే నేటి స్మార్ట్ యుగాన్ని సైతం అబ్బురపరచే కొన్ని గత సంఘటనలు ఆ నమ్మకాలను బలపరచే ఆధారాలుగా నిలుస్తుంటాయి. అందులో ‘పొల్లాక్ సిస్టర్స్’ కథ ఒకటి. సైన్స్‌కే అందని ఓ అద్భుతమది. అమెరికాకు చెందిన ఆ అక్కాచెల్లెళ్లు.. చనిపోయి మళ్లీ పుట్టారు.. అవును.. 1957లో కారు యాక్సిడెంట్లో చనిపోయిన ఇద్దరూ.. తిరిగి కొన్ని ఏళ్లకు (1964లో..) అదే తల్లి కడుపున కవలలుగా పుట్టారు. మాటలు వచ్చే వయసుకి.. గతజన్మ సంఘటనలను పూసగుచ్చినట్లు చెప్పడంతో ఒక్కసారిగా జనాలు ఉలిక్కిపడ్డారు. పరిశోధకులు సైతం సమాధానం చెప్పలేని స్థితిలో.. ఈ పునర్జన్మ కథ ఓ మిస్టరీగా మారింది. అసలు ఏం జరిగింది? జొవాన్నా పొల్లాక్, జాక్వెలిన్ పొల్లాక్ అనే అమెరికన్ సిస్టర్స్.. మొదటి జన్మలో కవలలు కాదు. జాన్–ఫ్లోరెన్స్ అనే దంపతులకు 1946లో జొవాన్నా, 1951లో జాక్వెలిన్ జన్మించారు. జొవాన్నా కంటే జాక్వెలిన్ చిన్నది కావడంతో చెల్లెల్ని తల్లిలా చూసుకునేది జొవాన్నా. అయితే జాక్వెలిన్ పుట్టిన ఆరేళ్లకు చర్చ్ రోడ్లో స్నేహితుడు ఆంథోనీతో కలిసి నడుస్తున్న జొవాన్నా(11), జాక్వెలిన్(6) మీదకి ఓ కారు దూసుకొచ్చింది. ఆ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. అయితే 1964లో ఫ్లోరెన్స్ మళ్లీ తల్లి అయ్యింది. ఆ సమయంలో జాన్ తన భార్య కడుపులో కవలలు ఉన్నారని బలంగా నమ్మాడు. ఫ్లోరెన్స్‌ని చెకప్ చేసిన డాక్టర్స్.. బ్ల్లడ్లైన్స్ ఆధారంగా కవలలు ఉండే అవకాశమే లేదని చెప్పినా సరే.. జాన్ తన నమ్మకాన్ని వదులుకోలేదు. అదే నిజమైంది. కవలలు పుట్టారు. మెల్లగా యాక్సిడెంట్ ట్రాజెడీని మరచిపోవడం మొదలుపెట్టారు జాన్ దంపతులు. కవలలకు గిలియన్, జెన్నిఫర్ అని పేర్లు పెట్టారు. బుడి బుడి అడుగులతో.. బోసి మాటలతో మళ్లీ కుటుంబంలో సంతోషాలు మొదలయ్యాయి. ఒకరోజు గిల్లియన్, జెన్నిఫర్లు తల్లిని ‘అటకపైన దాచిన ఫలానా పాత బొమ్మలు కావాలి, ఆడుకుంటాం’ అని అడిగారు. అప్పటి దాకా చూడని ఆ బొమ్మల గురించి కవలలకు ఎలా తెలిసిందో ఫ్లోరెన్స్‌కు అంతుచిక్కలేదు. అయినా పిల్లల కోరిక కాదనలేక అటకమీద నుంచి తీసి ఇచ్చింది. వాటిని అందుకున్న పిల్లలు.. వెంటనే ఇవి నా బొమ్మలు.. ఇవి నీ బొమ్మలు అని జొవాన్నా బొమ్మల్ని గిల్లియన్, జాక్వెలిన్ బొమ్మల్ని జెన్నిఫర్ పంచుకున్నారు. ఇదంతా వాళ్ల 3 ఏళ్ల వయసులో జరిగింది. ఆ ఘటన మరవకముందే.. చనిపోయిన ఇద్దరి పిల్లల ఫొటోని చూసిన ఆ కవలలు ‘ఇది నువ్వు.. ఇది నేను’ అని గుర్తుపట్టడం తల్లి కళ్లారా చూసింది. పిల్లల మాటలు విన్న ఫ్లోరెన్స్‌కి.. కాళ్ల కింద నేల కంపించినట్లైంది. వెంటనే ఆ ఫొటోని దాచిపెట్టింది. అయితే కవలల్లో గిల్లియన్.. గత జన్మలోని జొవాన్నా మాదిరే ఉదారస్వభావంతో ఉండేదట. అంతేకాదు తన వస్త్రధారణ, మాటతీరు అంతా తన చెల్లెలు జెన్నిఫర్‌తో పోల్చినప్పుడు చాలా పరిపక్వత కనిపించేదట. ఎందుకంటే తన గత జన్మలో తన చెల్లెలు జాక్వెలిన్ కంటే సుమారు ఐదారేళ్లు పెద్దది. మరో రోజు కవలలతో బయటికి వెళ్లిన జాన్ దంపతులకు ఇంకో షాక్ ఎదురైంది. గతంలో జొవాన్నా, జాక్వెలిన్‌లు చదివిన స్కూల్‌ని, యాక్సిడెంట్ అయిన ప్లేస్‌ని గుర్తుపట్టారు. అయితే అప్పటిదాకా కవలలు ఆ ప్లేస్‌ని ఎప్పుడూ చూడలేదు. ఇక రోడ్డుపై కవలలు వెళ్తున్నప్పుడు కారు కనిపిస్తే.. తమవైపే దూసుకొస్తుందని ఏడ్చేవారట. ఇలా ఐదారేళ్లు వచ్చేదాకా అచ్చం జొవాన్నా, జాక్వెలిన్‌లానే ప్రవర్తించేవారు కవలలు. షాకుల మీద షాకులు తిన్న తల్లిదండ్రులకు.. ఓ క్లారిటీ వచ్చింది. చనిపోయిన తమ పిల్లలే గిల్లియన్, జెన్నిఫర్ల్లా పుట్టారని నమ్మడం మొదలుపెట్టారు. తమకు కలిగిన అనుభవాలను అందరితో పంచుకోవడం ఆరంభించారు. ఏడేళ్ల వయసు వచ్చేసరికి.. గత జన్మ స్మృతులని పూర్తిగా మరచిపోయిన కవలలు.. సాధారణ పిల్లల్లా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దాంతో సమస్య తీరింది. కానీ అదెలా సాధ్యం అనేది మాత్రం నేటికీ అంతుచిక్కలేదు. అయితే ఈ పొల్లాక్ సిస్టర్స్ పునర్జన్మ ఓ కట్టుకథ అని కొట్టిపారేసేవాళ్లూ లేకపోలేదు. అమెరికన్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్.. పునర్జన్మలు, గత జన్మ జ్ఞాపకాలపై పలు పరిశోధనలు చేశారు. వేల కేసుల్ని స్టడీ చేశారు. 1987లో ఇలాంటి 14 ఆసక్తికర సంఘటనలతో ‘చిల్డ్రన్స్ హూ రిమెంబర్ దెయిర్ పాస్ట్ లైవ్స్ (గత జన్మలను గుర్తుపెట్టుకున్న పిల్లలు)’ అనే పుస్తకం కూడా రాశారు. కచ్చితంగా పునర్జన్మలు ఉన్నాయని, అందులో పొల్లాక్ సిస్టర్స్ కథ కూడా వాస్తవమేనని వెల్లడించారు. సాధారణంగా అమెరికన్లకు ఏలియన్స్, టైమ్ ట్రావెల్స్తో పాటు ఆత్మలన్నా, దెయ్యాలన్నా ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. పైగా చనిపోయిన వారిలో 24 శాతం మంది మళ్లీ తిరిగి పుడతారని వారు బలంగా నమ్ముతారు. --సంహిత నిమ్మన -
సాగర గర్భంలో శోధన
సాక్షి, విశాఖపట్నం: సముద్రంలో కంటికి కనిపించే వివిధ రకాల జీవరాశుల గురించి మనకు తెలుసు. మరి అవి కాకుండా సాగర గర్భంలో ఇంకా ఏముంది? అక్కడి జీవ వైవిధ్యం.. వాతావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది? తదితర అంశాలను అన్వేషించేందుకు విశాఖ నుంచి శాస్త్రవేత్తల బృందం ఈ నెల 15న బయల్దేరింది. ఆర్వీ సింధు సాధన నౌకలో వెళ్లిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ(సీఎస్ఐఆర్–ఎన్ఐవో)కి చెందిన 30 మంది శాస్త్రవేత్తల బృందం హిందూ మహా సముద్ర గర్భంలోని విశేషాలను అన్వేషిస్తున్నారు. ఇతర మహా సముద్రాలతో పోలిస్తే హిందూ సముద్రంలో పరిశోధనలు చాలా తక్కువగా జరిగాయి. అందుకే ఇక్కడ సముద్ర గర్భంలో ఏం దాగుందో అన్వేషించే బాధ్యతను సీఎస్ఐఆర్–ఎన్ఐవో భుజానికెత్తుకుంది. జీవుల జన్యు వైవిధ్య మ్యాపింగ్.. సీఎస్ఐఆర్–ఎన్ఐవో సముద్ర గర్భంలోని జీవుల జన్యు వైవిధ్యాన్ని మ్యాపింగ్ చేయడమే లక్ష్యంగా ప్రాజెక్టును ప్రారంభించింది. హిందూ మహాసముద్రంలో కంటికి కనిపించని జీవరాశులు ఎన్ని రకాలున్నాయి, లోహాలు, వాతావరణ పరిస్థితులు, బ్యాక్టీరియా తదితరాలను అన్వేషించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ‘ట్రేస్ బయోమీ’ అని పేరు పెట్టారు. ► 30 మంది శాస్త్రవేత్తల బృందం 90 రోజుల పాటు సముద్రంలో ప్రయాణించనుంది. వీరి యాత్ర దాదాపు 9,000 నాటికల్ మైళ్ల దూరం సాగనుంది. మే నెలలో గోవాలో వీరి పరిశోధన ముగియనుంది. ► ఒక జీవి పుట్టుక, పెరుగుదల, జీవితచక్రం విశేషాలపై పరిశోధన, నీటిలో ఉన్న లోహనిక్షేపాల వివరాలతో పాటు అవక్షేపాలు ఎంత మేర ఉన్నాయనే దానిని పరిశీలిస్తారు. ► అలాగే సముద్ర గర్భంలోని నీటి సాంద్రత, ఫ్లోరైడ్, వాటర్ టోటల్ హార్డ్నెస్, పీఏ లెవల్స్ ఎంతమేర ఉన్నాయి? జీవరాశులకు అవసరమైన ఆహారముందా? లేదా? మొదలైన వాటిపై పరిశోధనలు నిర్వహిస్తారు. ► హిందూ మహాసముద్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నీరు, పాచి, జీవరాశుల విస్తృత నమూనాల్ని సేకరించి అధ్యయనం చేస్తారు. ఇందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. ► సేకరించిన నమూనాల్లో ఉన్న లోహాలు, సూక్ష్మ పోషకాలు, సూక్ష్మ జీవుల దశలు.. మొదలైన వాటిపై పరిశోధనలు చేస్తారు. ముఖ్యంగా గ్లోబల్ ట్రాన్‌్రస్కిప్టోమ్, మెటాజెనోమ్ విశ్లేషణలు నిర్వహిస్తారు. ► మనకు కావల్సిన మెడిసిన్లకు అవసరమైన బ్యాక్టీరియా, శిలీంద్రాల పరిశోధన జరగనుంది. భవిష్యత్‌లో వాతావరణంపై ఎలాంటి ప్రభావం ఉంటుందని తెలుసుకోడానికి కూడా ఈ పరిశోధన ఉపయోగపడుతుంది. సాగర గర్భ లోతుల్ని అన్వేషిస్తాం.. హిందూ మహా సముద్రం అడుగు భాగంలో అతి తక్కువ పరిశోధనలు జరిగాయి. ఇప్పటివరకు ఉపరితలంపైనా.. అక్కడ్నుంచి కొన్ని కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే పరిశోధనలు చేశారు. ఈసారి మా శాస్త్రవేత్తల బృందం సాగర గర్భ లోతుల్ని అన్వేషించనుంది. సముద్ర జీవుల్లో జన్యు పరమైన మార్పులు, వాటి ప్రత్యేకతలు, ఆ జీవుల వల్ల కలిగే లాభనష్టాల్ని పరిశోధిస్తాం. సముద్ర గర్భంలోని వాతావరణ మార్పులు, వాటి వల్ల భవిష్యత్‌లో వచ్చే మంచి, చెడులపైనా సమాచారం సిద్ధం చేస్తాం. 90 రోజుల్లో ఈ యాత్ర పూర్తయినా.. ఈ ప్రాజెక్టు పూర్తవ్వడానికి మాత్రం మూడేళ్లు పడుతుంది. – డా.జి.ప్రభాకర్ ఎస్ మూర్తి, సీఎస్ఐఆర్–ఎన్ఐవో చీఫ్ సైంటిస్ట్ -
కేన్సర్‌ను చంపేసే ఫ్యాటీ ఆసిడ్స్ గుర్తింపు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రాణాలను బలితీసుకుంటున్న కేన్సర్ మహమ్మారి వ్యతిరేక పోరాటంలో శాస్త్రవేత్తలు ప్రధాన పురోగతి సాధించారు.మానవులలో క్యాన్సర్ కణాలను చంపగల ఫ్యాటీ ఆసిడ్స్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. డిహోమో-గామా-లినోలెనిక్ ఆమ్లం లేదా డీజీఎల్‌ఏ అనే కొవ్వు ఆమ్లం మానవులలో క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. కొత్త పరిశోధన ద్వారా క్యాన్సర్ సంభావ్య చికిత్సలో కొన్ని చిక్కులు ఉన్నప్పటికీ, ఒక కీలక అడుగు పడిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా డీజీఎల్‌ఏ అనే కొవ్వు ఆమ్లం మానవులలోని క్యాన్సర్ కణాలలో ఫెర్రోప్టోసిస్‌ను ప్రేరేపిస్తుంది. ఫెర్రోప్టోసిస్ అంటే దెబ్బతిన్న లేదా పనిచేయని కణాలు సురక్షితంగా, సమర్ధవంతంగా నాశనం చేయడం లేదా రీసైకిల్ చేయడం. ఇనుము ("ఫెర్రో" అంటే ఇనుము) ను ఉపయోగించే అత్యంత నియంత్రిత సెల్ డెత్ ప్రోగ్రామ్‌ను ఫెర్రోప్టోసిస్ అంటారు. దీన్ని 2012లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ (పీయూఎఫ్ఏ), డీజీఎల్‌ఏ ఆమ్లం ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా అటు జంతువుల్లో ఇటు మానవులలోని కేన్సర్ కణాలలోనూ ఫెర్రోప్టోసిస్‌ను ప్రేరేపిస్తుందని అధ్యయనం తెలిపింది. ఈ డీజీఎల్‌ఏను ఖచ్చితంగా కేన్సర్ కణంలోకి బట్వాడా చేయగలిగితే, అది ఫెర్రోప్టోసిస్‌ను ప్రోత్సహిస్తుందనీ, తద్వారా కణితిలోని కేన్సర్ కణాలను హరించి వేస్తుందని తెలిపారు. అంతేకాదు ఫెర్రోప్టోసిస్ ద్వారా మూత్రపిండాల సంబంధిత జబ్బులు, న్యూరోడీజెనరేషన్ వ్యాధుల వంటి పరిస్థితుల గురించి అధ్యయనం చేస్తున్నామని వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ జెన్నిఫర్ వాట్స్ వెల్లడించారు. ‘డెవలప్మెంటల్ సెల్’ లో ఈ స్టడీ ప్రచురితమైంది. దాదాపు ఇరవై సంవత్సరాలుగా, నెమటోడ్ కేనోరబ్డిటిస్ ఎలిగాన్స్ ద్వారా జంతువుల్లో డీజీఎల్ఎతో సహా ఇతర ఆహార కొవ్వుల ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఈ ఆవిష్కరణకు క్యాన్సర్‌కు సంభావ్య చికిత్స దిశగా ఒక అడుగుపడిందని చెప్పారు. అలాగే కొన్నిచిక్కులు కూడా ఉన్నాయన్నారు. సీ ఎలిగాన్స్ అనేది మైక్రోస్కోపిక్ వార్మ్. సెల్ యాక్టివిటీ అధ్యయనంలో పారదర్శకంగా ఉండే దీన్ని తరచుగా ఉపయోగిస్తారు. నెమటోడ్లకు ఈ ఆహారం ఇవ్వడం వల్ల డీజీఎల్‌ఏతో నిండిన బ్యాక్టీరియా.. అన్ని బీజ కణాలతో పాటు బీజ కణాలను తయారుచేసే మూల కణాలను కూడా చంపినట్లు పరిశోధకులు కనుగొన్నారు. మరోవైపు ఈ ఫలితాలు మానవ కణాలకు సరిపోతాయో లేదో తెలుసుకోవడానికి పరిశోధకుల బృందం స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన స్కాట్ డిక్సన్‌తో కలిసి మరింత అధ్యయనం చేశారు. ఈ బృందం కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. దీనికి అదనంగా, డీజీఎల్ఏకు వ్యతిరేకంగా పనిచేసే మరో ఫాటీ ఆసిడ్‌ను కూడా గుర్తించారు. ఈథర్ లిపిడ్గా పిలిచే దీన్ని తొలగిస్తే.. డీజీఎల్కు ఎక్స్పోజ్ అయిన కణాలు మరింత వేగంగా చనిపోతాయని కనుగొన్నారు. డిక్సన్ చాలా సంవత్సరాలుగా ఫెర్రోప్టోసిస్, క్యాన్సర్‌తో పోరాటంలో దాని సామర్థ్యాన్ని అధ్యయనం చేస్తున్నారు. -
అన్ని రకాల కేన్సర్లకు ఒక్క మందు?
కేన్సర్ రకాన్ని బట్టి మందులివ్వడం ఇప్పటివరకూ ఉన్న పద్ధతి. కానీ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కార్డిఫ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనలు సఫలీకృతమైతే మాత్రం పరిస్థితి పూర్తిగా మారనుంది. ఎందుకంటే.. రోగ నిరోధక వ్యవస్థ కణాల్లో అన్ని రకాల కేన్సర్లను ఎదుర్కోగల ప్రత్యేకమైన రిసెప్టర్లను వీరు గుర్తించారు కాబట్టి. ఈ రిసెప్టర్లను ఉపయోగించుకుని రోగ నిరోధక కణాలు క్లుప్తంగా టి–సెల్స్‌తో కేన్సర్లకు మెరుగైన చికిత్స అందించవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేన్సర్‌కు రేడియేషన్, కీమోథెరపీ, శస్త్రచికిత్స అనే మూడు చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటితో అనేక దుష్ప్రభావాలు ఉన్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఇమ్యూనోథెరపీ పేరుతో ఇంకో చికిత్స అందుబాటులోకి వచ్చింది. రోగ నిరోధక కణాలను వెలికతీసి కేన్సర్ కణాలను గుర్తించేలా చేసి మళ్లీ శరీరంలోకి ప్రవేశపెట్టడం ఇమ్యూనోథెరపీ విధానం. అయితే కొన్ని రకాల కేన్సర్లకు మాత్రమే ఈ పద్ధతి ద్వారా చికిత్స కల్పించవచ్చు. పైగా వ్యక్తులను బట్టి చికిత్స ప్రభావశీలతలో తేడాలుంటాయి. ఈ నేపథ్యంలో కార్డిఫ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జన్యు ఎడిటింగ్ టెక్నాలజీ క్రిస్పర్ క్యాస్ –9 సాయంతో కొత్త రకం టీ–సెల్ రిసెప్టర్లను గుర్తించాను. ఎంఆర్1 అని పిలిచే ఈ రిసెప్టెర్లు అందరిలో ఒకేలా ఉంటాయి. పైగా రక్త, రొమ్ము, ప్రొస్టట్, ఊపిరితిత్తులు, ఎముక, గర్భాశయ కేన్సర్ కణాలను ఈ కొత్త రిసెప్టర్ల ద్వారా సమర్థంగా మట్టుబెట్టవచ్చునని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఎంఆర్1 ప్రభావశీలతపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. ఆ తరువాత కూడా ఇదే రకమైన ఫలితాలు వస్తే మాత్రం అన్ని కేన్సర్లకు ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన చికిత్స అందించేందుకు వీలేర్పడుతుంది. ఇదంతా జరిగేందుకు మరో ఏడాది సమయం పట్టవచ్చునని అంచనా. -
మనిషి ఆయుష్షు ఐదు రెట్లు పెరుగుతుందా?
వందేళ్లు బతకాలని ఎవరు అనుకోరు చెప్పండి. కానీ.. చాలా తక్కువ మందికి ఈ అదష్టం దక్కుతుంది. ఇప్పటివరకూ ఇదే పరిస్థితి. కానీ ఓ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బందం పరిశోధనలు పూర్తిస్థాయిలో సఫలమైతే మాత్రం మనిషి ఆయుష్షు నాలుగు రెట్లు అంటే సుమారు 400 ఏళ్లకు పెంచేందుకు అవకాశం ఏర్పడుతుంది! ఎందుకంటే.. సి.ఎలిగాన్స్ అనే సూక్ష్మస్థాయి పురుగులపై జరిగిన పరిశోధనల్లో వాటి ఆయుష్షు ఐదు రెట్లు ఎక్కువైంది కాబట్టి. అదెలాగో తెలుసుకునే ముందు మన కణాలెలా పనిచేస్తాయో కొంచెం అర్థం చేసుకుందాం. కణాల్లోపల ఉండే భాగాలు నిర్దిష్ట పనులు నిర్వహించేందుకు సిగ్నలింగ్ పాథ్‌వేస్‌ను ఏర్పాటు చేసుకుంటాయి. ఒక భాగానికి సంకేతం అందితే.. ఆ పని చేసిన తరువాత సంకేతం పక్కనున్న భాగానికి వెళుతుంది. ఇన్సులిన్‌తోపాటు రాపమైసిన్ పాథ్‌వేలకూ.. ఆయుష్షుకు మధ్య సంబంధం ఉందని గతంలోనే రుజువైంది. రాపమైసిన్ పాథ్‌వేను నియంత్రిస్తే ఆయుష్షు 100 శాతం పెరిగితే ఇన్సులిన్ నియంత్రణ ద్వారా 30 శాతం పెరిగినట్లు గత పరిశోధనలు చెబుతున్నాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. ఈ రెండింటినీ మార్చడం ద్వారా ఆయుష్షు ఐదు రెట్లు పెరుగుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అయితే మానవుల్లోనూ ఇదే ఫలితాలు కనిపిస్తాయా? అన్నది ప్రస్తుతానికైదే తెలియదు. కానీ.. సి–ఎలిగాన్స్‌తోపాటు మానవుల్లోనూ ఒకే రకమైన జన్యువులు ఉండటం గమనించాలని అంటున్నారు ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన జరోడ్ రోలిన్స్ అనే శాస్త్రవేత్త. విస్తత స్థాయి పరిశోధనల ద్వారా మానవుల్లోనూ ఇదే ఫలితాలు సాధించేందుకు అవకాశముందని అంచనా. -
సమాజం మారాలి సర్
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాలంటే వారిపట్ల సమాజపు ఆలోచనా ధోరణి, ప్రభుత్వ విధానాల్లోనూ మార్పులు అత్యవసరమని పద్మశ్రీ ఎం.రోహిణి గోడ్బోలే అంటారు. ‘‘సమాజంలో పైకి తెలియకుండానే మహిళలపట్ల ఒక రకమైన వివక్ష ఉంటుంది. కొన్ని పనులు మహిళలు చేయలేరని, కొన్నింటికి మాత్రమే వారు పరిమితం అని సమాజం భావిస్తుంటుంది. ఈ ధోరణి మారాలి’’ అని ప్రొఫెసర్ రోహిణి అన్నారు. బుధవారం ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్ (ఐడబ్ల్యూఎస్‌ఏ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)లో పద్నాలుగవ త్రైవార్షిక జాతీయ సదస్సు ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు ప్రొఫెసర్ రోహిణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన ‘సాక్షి’తో ఆమె ముచ్చటించారు. పిల్లల పెంపకం ఒక్క తల్లి బాధ్యతగా మాత్రమే కాకుండా.. తల్లిదండ్రులు / అత్తమామలూ చేయూత ఇవ్వడం ద్వారా మహిళలు శాస్త్ర రంగంలో మరింత ముందుకు ముందుకు వెళ్లే అవకాశం ఉందని ప్రొఫెసర్ రోహిణి అభిప్రాయపడ్డారు. ‘‘ప్రభుత్వ విధానాల్లోనూ మహిళల శక్తియుక్తులను వినియోగించుకునేందుకు తగినట్టుగా కొన్ని మార్పులు కూడా అవసరమే. దేశంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో చదువుకుంటున్న, బోధిస్తున్న మహిళలు చాలామందే ఉన్నప్పటికీ... పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో, కంపెనీల్లోనూ ఉన్నతస్థానాల్లో ఉన్న వారు తక్కువే. భారత్‌లో సైన్స్ సబ్జెక్టులు చదువుతున్న మహిళలు కాలేజీస్థాయిలో 40 శాతం మంది ఉంటే, యూనివర్శిటీ స్థాయికి వచ్చేసరికి ఇది 30 శాతానికి, పీహెచ్డీ స్థాయిలో 20 –22 శాతానికి తగ్గిపోతోంది. శాస్త్రవేత్తగా పనిచేస్తున్న వారి విషయానికి వస్తే ఇది మరీ తక్కువగా పదిశాతం మాత్రమే ఉంది’’ అని ప్రొఫెసర్ రోహిణి చెప్పారు. ఒకటే కారణం కాదు ‘‘పెళ్లి, కుటుంబ బాధ్యతలు, ఇంట్లోని వృద్ధుల ఆలనపాలన వంటి విషయాల కోసం మహిళా శాస్త్రవేత్తలు తమ వృత్తిని వదిలేసుకుంటున్నారనే భావన కూడా సమాజంలో నెలకొని ఉంది. కానీ వీటితోపాటు చాలా ఇతర కారణాలూ ఉన్నాయని ఇటీవలి సర్వే ఒకటి స్పష్టం చేస్తోంది. మహిళలు స్వేచ్ఛగా పనిచేసేందుకు తగ్గ వాతావరణం సంస్థల్లో లేకపోవడం, మహిళల అవసరాలకు తగ్గ వెçసులుబాట్లు కల్పించలేని విధానాలు, చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగాలు లేకపోవడమూ కారణమే’’ అని ప్రొఫెసర్ రోహిణి అంటారు. ఎం.రోహిణి గోడ్బోలే సెంటర్ ఫర్ హై ఎనర్జీ ఫిజిక్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు సైన్స్‌ను సమాజానికి చేరువ చేసేందుకు పరిశోధనశాలల్లో ఎంత నిబద్ధతతో పరిశోధనలు చేసినా...శాస్త్ర విజ్ఞానాన్ని సమాజానికి చేరవేయకపోతే ప్రయోజనం లేదన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది ఇండియన్ విమెన్ సైంటిస్ట్ అసోసియేషన్ 1973 జూన్ 13న అప్పటి బాంబే ప్రస్తుత ముంబైలో రిజిస్టర్ అయిన ఈ సంస్థ అప్పటి నుంచి ఇప్పటివరకూ సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి శాస్త్రాన్ని చేరవేసే లక్ష్యంతో పలు కార్యకలాపాలు చేపట్టింది. వేర్వేరు శాస్త్ర రంగాలకు చెందిన 12 మంది వ్యవస్థాపక సభ్యుల ఏర్పాటుకు తొలి ఆలోచన చేయగా, రెండేళ్ల తరువాత ఐడబ్ల్యూఎస్‌ఏ సాకారమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐడబ్ల్యూఎస్ఏకు 11 శాఖలు ఉన్నాయి. మొత్తం రెండువేల మంది మహిళా శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉన్నారు. శాస్త్ర విజ్ఞానాన్ని సమాజానికి చేరువ చేయడం సంస్థ తొలి లక్ష్యమైతే... శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేసేందుకూ పలు కార్యకలాపాలు చేపడుతుంది. మహిళా శాస్త్రవేత్తల విజయాలను ప్రోత్సహించడం, శాస్త్ర రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు సూచించడం తద్వారా మహిళా సాధికారతకు సాయపడటం కూడా సంస్థ లక్ష్యాల్లో కొన్ని. ఈ లక్ష్యాల సాధన కోసం ఐడబ్ల్యూఎస్‌ఏ పలు కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తోంది. పిల్లల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ముంబైలో ‘లెర్నింగ్ గార్డెన్’ పేరుతో పార్కును ఏర్పాటు చేయడం, ఏడాది కాలంలో సుమారు 17 వేల మంది పిల్లలు ఈ పార్కును సందర్శించడం ఐడబ్ల్యూఎస్‌ఏ సాధించిన ఒక ఘనత మాత్రమే. దీంతోపాటు మహిళా శాస్త్రవేత్తల కోసం ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, పిల్లల కోసం డే కేర్ సెంటర్, నర్సరీ స్కూల్, ఆరోగ్య కేంద్రం, లైబ్రరీ రీడింగ్ రూమ్ వంటి వసతులూ కల్పిస్తోంది. స్కాలర్షిప్పులు, అవార్డులు సరేసరి! ప్రతిభకు పోషణ ‘‘దేశం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఎదగాలని ఆకాంక్షిస్తోంది. ఇది నెరవేరాలంటే కాబోయే తల్లులకు తగిన పోషకాహారం అందించడం ఎంతో కీలకం’’ అని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ‘‘మహిళల్లో సుమారు 50 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతూంటే సుమారు 20 శాతం మందికి తగినన్ని పోషకాలు అందడం లేదు. అదే సమయంలో 40 శాతం మంది మహిళలు ఊబకాయలు’’ అని ఆమె వివరించారు. గర్భధారణ సమయంలో మహిళలు వంద గ్రాముల బరువు పెరిగితే పుట్టబోయే బిడ్డ.. జనన సమయ బరువు 20 గ్రాముల వరకూ పెరుగుతుందని, అలాగే గర్భధారణ సమయంలోనూ, బిడ్డకు రెండేళ్లు వచ్చే వరకూ తగినంత మోతాదులో పోషకాలను పొందడం బిడ్డ ఎదుగుదలకు, భవిష్యత్తులో సాంక్రమిక వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఎంతో కీలకమని డాక్టర్ హేమలత వివరించారు. అంతేకాకుండా పిండం ఏర్పడ్డ తొలినాళ్లలో తల్లిద్వారా తగినన్ని పోషకాలు అందకపోతే ఆ ప్రభావం కాస్తా బిడ్డ జీవక్రియలతోపాటు, జ్ఞాపకశక్తి, మెదడు పనితీరులపై కూడా దుష్ప్రభావం పడుతుందని తెలిపారు. డాక్టర్ ఆర్. హేమలత డైరెక్టర్ ఎన్.ఐ.ఎన్. శశికళ సిన్హా భారత రక్షణ రంగానికి కలికి తురాయి వంటి అడ్వాన్స్డ్ ఏరియా డిఫెన్స్ ప్రాజెక్టు డైరెక్టర్. డీఆర్డీవో ఔట్‌స్టాండింగ్ సైంటిస్ట్ జ్యోత్స్న ధవన్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సీనియర్ శాస్త్రవేత్త. దేశంలో అంతరిక్ష ప్రయోగాలకు బాటలు వేసిన దిగ్గజ శాస్త్రవేత్త సతీశ్ ధవన్ కుమార్తె కూడా! మంజులా రెడ్డి హైదరాబాద్‌లోని సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త. ఈ ఏటి ఇన్ఫోసిస్ అవార్డు గ్రహీత సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త. ►పరిశోధన ఉద్యోగం కాదు. జీవితాంతపు విధి నిర్వహణ. కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూనే ఉద్యోగ బాధ్యతల్ని సమర్థంగా చేపట్టడం ఈ రంగంలోని ఏ మహిళకైనా సవాలే. అసలే సమాజంలో పురుషాధిక్యత. అడుగడుగునా అననుకూలమైన పరిస్థితులు. సామర్థ్యం, ప్రతిభ ఉన్నప్పటికీ, వాటికి తగిన గుర్తింపు లభించడం ఓ గగన కుసుమం. అయితే ఇన్ని చిక్కుముళ్ల మధ్యలోనూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో తమదైన ముద్ర వేసిన మహిళామణులు ఎందరో..! వారిలో వీరు కొందరు. ►మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం అంత తప్పేమీ కాకపోవచ్చు. కాకపోతే మానవ మేధలో 50 శాతాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం లేదన్నది అందరూ గుర్తించాలి. వైవిధ్యత అన్నది అన్ని రంగాల్లోనూ మంచిదే. ఇంటిని అత్యంత సమర్థంగా నిర్వహించగలిగిన మహిళ పరిశోధన రంగంలోనూ పూర్తిస్థాయిలో పనిచేసి ఉంటే మానవ శాస్త్ర విజ్ఞానం మరింత పురోగమించి ఉండేదేమో. ►పరిశోధన, అభివృద్ధి రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న ఆలోచన కేవలం వారి సాధికారత కోసం లేదా దయతో చేయాల్సిన పని కాదు. మెరుగైన సైన్స్ కోసమే ఇది జరగాలి. ►‘‘మహిళా శాస్త్రవేత్తగా గుర్తింపు వచ్చేందుకు, తగిన అవార్డులు లభించేందుకు ఆలస్యం జరుగుతోంది’’ -
ఇష్టమైన ప్రపంచం
సైన్స్ టఫ్ సబ్జెక్ట్ అనుకుంటాం. కానీ.. ఇంట్రెస్ట్ ఉంటే ఆ టఫ్ సబ్జెక్టే.. మనకు ఇష్టమైన ప్రపంచం అవుతుంది. ఇప్పుడు ఆ ప్రపంచంలోనే ఉన్నారు మంజులారెడ్డి! కొత్త తరం అమ్మాయిల్ని ఆ ప్రపంచంలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే ‘ఇన్ఫోసిస్ సైన్స్’ అవార్డుకు ఎంపికైన మంజలారెడ్డితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ. ‘‘నీ లక్ష్యాన్ని చేరడానికి చేస్తున్న ప్రయత్నాల్లో నీ వంతుగా ప్రయత్న లోపం ఉండకూడదు. వందసార్లు అడ్డంకులు ఎదురైనా సరే, నూట ఒకటో సారి కూడా ప్రయత్నించి తీరాలి. అప్పుడే లక్ష్యం నీదవుతుంది’’ వివేకానందుడు చెప్పిన ఈ మాటను మనసుకు పట్టించుకున్నారు సైంటిస్ట్ మంజులారెడ్డి. హైదరాబాద్, బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్‌లో బీఎస్సీ చదువుతున్న రోజుల్లోనే సైంటిస్ట్ కావాలన్న తలంపు కూడా ఆమెలో కలిగింది. హెచ్‌సీయూలో ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ చేసేటప్పుడు మరింతగా అది స్థిరపడింది.పీహెచ్‌డీలో చేరారామె. పీహెచ్‌డీలో కూడా పరీక్షలుంటాయని అప్పుడు తెలియలేదు. అనుకున్నవన్నీ అనుకున్నట్లే అనుకున్న సమయానికే జరగడం అందరి జీవితంలో సాధ్యంకాదు. పీహెచ్డీ సగంలోనే ఆపేయాల్సి వచ్చింది. మళ్లీ ప్రయత్నించారు. రెండోసారి కూడా పీహెచ్డీ డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అక్కడితో సరిపెట్టుకుంటే చరిత్రలో కలిసిపోతాం. సరిపోదు అనుకుంటే చరిత్ర సృష్టించగలుగుతాం. ఆ ఎదురీతే ఆమెను సైంటిస్ట్‌గా నిలబెట్టింది. పెళ్లి, పిల్లలతో కూడిన కుటుంబ బంధాలు ఒకటికి రెండుసార్లు ఆమెను పీహెచ్‌డీకి దూరంగా ఉంచినప్పటికీ ఆమె మాత్రం పీహెచ్‌డీకి దూరంగా ఉండదలుచుకోలేదు. సీసీఎంబీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన తర్వాత ఉద్యోగం చేస్తూనే తిరిగి పీహెచ్‌డీలో చేరారు. మూడవ ప్రయత్నం విజయవంతమైంది. అప్పటి నుంచి సైంటిస్ట్‌గా తన కెరీర్‌ని తనకు నచ్చినట్లు మలుచుకున్నారు. ఆ ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు మంజులారెడ్డి. నిరంతరం సాగే యజ్ఞం ‘‘సెయింట్ ఫ్రాన్సిస్‌లో టీచర్లు పాఠం చెప్పి ఊరుకోకుండా స్టూడెంట్స్‌కి భవిష్యత్తు పట్ల మార్గదర్శనం చేసేవారు. వాళ్ల ప్రసంగాలు.. శాస్త్ర సాంకేతిక పరిశోధనల అవసరాన్ని తెలియచేయడంతోపాటు ఆసక్తిని రేకెత్తించేలా ఉండేవి. సైంటిస్ట్‌ను అవ్వాలనేది ఆ వయసులో నా మనసులో స్థిరంగా ఏర్పడిన కోరిక. అందుకే ఎన్నిసార్లు అడ్డంకులు వచ్చినప్పటికీ ప్రయత్నించడాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. సైంటిస్ట్‌కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం కూడా అదే. మా పరిశోధనలు చాలా విస్తృతంగా జరుగుతుంటాయి. నిత్యం పర్యవేక్షిస్తూనే ఉండాలి. బ్యాక్టీరియా గురించి దేశంలో దాదాపు యాభైకి పైగా లాబొరేటరీల్లో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విభాగంలో పరిశోధన చేస్తుంటారు. నా పరిశోధన బ్యాక్టీరియా కణం గోడల నిర్మాణం, బ్యాక్టీరియా పెరుగుదల, ఎంజైమ్‌ల వాడకం ద్వారా కణం గోడలు రెండుగా విడిపోవడం మీద సాగుతోంది. దీని వల్ల కొత్త యాంటీబయాటిక్స్ మందుల తయారీ సాధ్యమవుతుంది. సుదీర్ఘమైన ఫలితాల కోసం నిరంతరం ఒక యజ్ఞంలాగ జరిగే శ్రమ ఇది. అయితే బయటి ప్రపంచానికి... సైంటిస్ట్‌లు కాలక్రమంలో లాబొరేటరీల్లో ఒక పరికరంలాగ మారిపోతుంటారనే అపోహ ఉంటుంది. కానీ మాకు మాత్రం ఏ రోజుకారోజు కొత్తగానే ఉంటుంది. శోధనలో తెలుసుకున్న కొత్త విషయం ఉత్సాహాన్నిస్తుంటుంది. జీవితేచ్ఛను పెంచుతుంది. డైనింగ్ టేబుల్ కబుర్లు కుటుంబం కోసం కొన్నేళ్లు కెరీర్‌కు దూరంగా ఉన్న మాట నిజమే. కానీ ఒకసారి సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ సెంటర్)లో చేరిన తర్వాత ఇక వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మా చిన్నవాడు సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో మైక్రోస్కోప్‌లో నేను పరిశీలిస్తున్న బ్యాక్టీరియాను చూడడానికి చాలా ఇష్టపడేవాడు. రాత్రి భోజనాల దగ్గర నలుగురమూ ఆ రోజు నేను గుర్తించిన విషయాలనే చర్చించేవాళ్లం. నాతోపాటు పిల్లలు కూడా ఎక్సైట్ అయ్యేవాళ్లు. మా వారు డాక్టర్ కావడంతో సబ్జెక్ట్ ఆయనకీ ఆసక్తిగానే ఉండేది. ఇలాంటి ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పించుకోవడం వల్ల పిల్లల వైపు నుంచి ‘మా అమ్మ తన పనిలో తానుంటోంది. మా కోసం టైమ్ కేటాయించట్లేదు’ అనే కంప్లయింట్ రాలేదు. నాకు కూడా రిగ్రెట్స్ లేవు. ఫ్యామిలీ లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేశాను. అడవాళ్లు మారారు పాతికేళ్ల కిందటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఆడవాళ్లు చాలా మారారు. ఆలోచనల్లో అభ్యుదయ ధోరణి అలవడింది. అప్పట్లో నా ఉద్యోగం తొలినాళ్లలో చాలా ఫంక్షన్లు మిస్ అయ్యేదాన్ని. వీలయినప్పుడు ఎప్పుడో ఒక ఫంక్షన్‌కు వెళ్తే అక్కడకు వచ్చిన వాళ్లు ‘కొత్త మోడల్స్ ఎన్నో వచ్చాయి... ఇంకా ఈ చీరలే కడుతున్నావేంటి అని ఒకరు అడిగితే, నగలు పెట్టుకోకూడదూ’ అని మరొకరు అభిమానంగా కసురుకునే వాళ్లు. ‘ఇంత ఆలస్యంగా వచ్చావేంటి, దగ్గర వాళ్ల పెళ్లి కదా ఒకరోజు సెలవు పెట్టచ్చు కదా’ అని కూడా అనేవాళ్లు. ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి వర్కింగ్ ఉమన్ కనీసం ఒకరైనా ఉంటున్నారు. కెరీర్ జర్నీ ఎంత ముఖ్యమో తెలుసుకుంటున్నారు. సోషల్ లైఫ్‌ని ఉద్యోగ జీవితాన్ని సమన్వయం చేసుకోవడంలో ఎదురయ్యే సున్నితమైన అడ్డంకులను అర్థం చేసుకుంటున్నారు. సమాజాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం మొదలైంది. ఇది చాలా మంచి పరిణామం’’ అన్నారు సీసీఎంబీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ మంజులారెడ్డి. వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి అందరూ పని చేయాలి ఆడవాళ్లు– మగవాళ్లు అని కాదు, పని చేసే శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పని చేయాలి. ‘మా నాన్న ఇంత ఆస్తి ఇచ్చారు కాబట్టి నేను పని చేయను. నా భర్త ఇంతింత సంపాదిస్తున్నాడు కాబట్టి నాకు పని చేయాల్సిన అవసరం లేదు’ అనే భావజాలానికి నేను పూర్తిగా వ్యతిరేకిని. ‘ఆడవాళ్లు సాధారణంగా తాము మొదలు పెట్టిన పనిని సగంలో వదిలిపెట్టరు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనక్కి తగ్గరు. అంతటి స్థిరత్వం ఆడవాళ్లలోనే ఉంటుంది. ఈ తరం అమ్మాయిలకు నేను చెప్పే మాట... ‘ఇష్టమైన ఫీల్డ్‌ని ఎంచుకోండి. పని చేయడంలో సంతోషాన్ని ఆస్వాదించండి’ అని మాత్రమే. డాక్టర్ మంజులారెడ్డి ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీసీఎంబీ హైదరాబాద్ ►ఇన్ఫోసిస్అవార్డును మంజులా రెడ్డి వచ్చే ఏడాది జనవరి ఏడవ తేదీన బెంగళూరులో భారతరత్న, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ చేతుల మీదుగా అందుకోనున్నారు. -
పరిశోధనల్లో పూర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశోధనలకు ప్రాధాన్యం తగ్గుతోంది. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల కొరత, ఇతర వివాదాలతో ప్రవేశాలు సజావుగా జరగడం లేదు. రాష్ట్రంలోని వర్సిటీల్లో ఆరేళ్లుగా ప్రొఫెసర్ల నియామకాలు తగ్గడంతో ఎక్కువగా ప్రవేశాలు చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది. సమాజానికి ఉపయోగపడే పీహెచ్‌డీలు ఎన్ని ఉన్నాయో పక్కనబెడితే.. మార్గదర్శనం చేసే ప్రొఫెసర్లు లేక రాష్ట్రంలో పరిశోధనలు తగ్గుతున్నాయని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోల్చితే పీహెచ్‌డీలు చేస్తున్న విద్యార్థుల సంఖ్యలో తెలంగాణ 12వ స్థానంలో ఉన్నా.. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే అట్టడుగున ఉండిపోయింది. తమిళనాడులో 28,684 మంది.. 2016–17 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా పీహెచ్‌డీలు, ఎంఫిల్, పీజీలు చదువుతున్న విద్యార్థుల సంఖ్యపై కేంద్రం లెక్కలు తేల్చింది. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేరుతో ఇటీవల గణాంకాలు విడుదల చేసింది. ఆ ప్రకారం దేశవ్యాప్తంగా పరిశోధనలు చేస్తున్న విద్యార్థుల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 28,684 మంది విద్యార్థులు పీహెచ్‌డీలు చేస్తున్నారు. 13,227 మంది విద్యార్థులతో ఉత్తరప్రదేశ్, 10,841 మంది విద్యార్థులతో కర్ణాటక రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్తాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో 5 వేల మంది చొప్పున పీహెచ్డీ విద్యార్థులున్నారు. 4 వేల నుంచి 5 వేలలోపు పీహెచ్డీ విద్యార్థులతో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 10 రాష్ట్రాల్లో పీహెచ్‌డీలు చేస్తున్న వారి సంఖ్య 1,000కి మించనేలేదు. కేరళలో 58.82 శాతం మహిళలు దేశవ్యాప్తంగా 1,41,037 మంది విద్యార్థులు పీహెచ్డీ చేస్తుండగా.. అందులో 59,242 (42.01 శాతం) మంది మహిళలే ఉన్నారు. 58.82 శాతం మంది మహిళలతో కేరళ తొలి స్థానంలో నిలిచింది. పంజాబ్‌లో 53.95 శాతం మంది, హర్యానాలో 49.54 శాతం, తమిళనాడులో 42.95, రాజస్తాన్‌లో 47.61, ఢిల్లీలో 46.39, మహారాష్ట్రలో 41.79, గుజరాత్లో 39.15, కర్ణాటకలో 38.84, అస్సాంలో 38.19, ఆంధ్రప్రదేశ్‌లో 37.24, తెలంగాణలో 34.28% మంది మహిళలు పీహెచ్డీ చేస్తున్నారు. పీహెచ్‌డీలతోపాటు మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఎం.ఫిల్.) ప్రవేశాల్లోనూ రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొంది. కానీ పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో మాత్రం రెండు రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాల్లో సీన్ రివర్స్ అయింది. పీజీ కోర్సులు చదువుతున్న వారు ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా (5,40,138 మంది) ఉండగా, మహారాష్ట్రలో 3,18,077 మంది ఉన్నారు. తమిళనాడులో 2,63,450 మంది, మధ్యప్రదేశ్‌లో 1,71,801, కర్ణాటకలో 1,69,889, తెలంగాణలో 1,66,186, ఆంధ్రప్రదేశ్‌లో 1,85,672 మంది విద్యార్థులు పీజీ చదువుతున్నట్లు కేంద్రం లెక్కలు తేల్చింది. -
సృజనకు ‘అనంత’ పట్టం..
– సమాజహితమే ధ్యేయంగా ‘అనంతలక్ష్మి’ పరిశోధనలు అను నిత్యం నూతనంగా ఆలోచించే యువత.. తమలోని సృజనకు పదును పెడుతోంది. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని సమాజ హితానికి దోహదపడే ఆవిష్కరణలతో రాణిస్తోంది. ఇందులో భాగంగానే ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ) వినియోగం అనివార్యమైంది. ఇంటర్నెట్ ఆధారితంగా పనిచేసే ఈ వ్యవస్థ వ్యవసాయ ఉత్పత్తుల నుంచి అన్ని రంగాలకు విస్తరింపజేయడంలో యువత ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ని వినియోగించుకుని రూపొందించిన అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల పలు ఆవిష్యరణలు అద్భుత ఫలితాలను సాధిస్తున్నాయి. - జేఎన్టీయూ సాంకేతిక వ్యవ‘సాయం’ వ్యవసాయనికి సాంకేతికత అనుసంధానం అనివార్యమైన రోజులివి. పండ్లతోటలు, ఇతరత్రా తడి పంటల్లో ఐఓటీ ద్వారా అన్నదాతకు దన్నుగా ఆవిష్కరణలు జరిపారు. ‘ఆటోమేటిక్ మెయిషర్ డిటెక్షన్ సిస్టమ్ ’ అనే ఆవిష్కరణను ఈసీఈ చదువుతన్న తరుణ్, రెడ్డిశేఖర్, జయరాములు, ఆరీఫుల్లా రూపకల్ప చేశారు. ప్రతి మొక్క వద్ద ఐఓటీకి అనుసంధానం చేసిన సెన్సార్లను ఉంచడం ద్వారా నీటి శాతం తక్కువైనా.. ఎక్కువైనా వెంటనే ఆ విషయాన్ని మన సెల్‌ఫోన్‌కు సమాచారం అందుతుంది. దీని ద్వారా నీటి యాజమాన్యాలను చేపట్టవచ్చు. దీనిని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయవచ్చు. ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలి. పండ్లతోటలకే కాకుండా అన్ని రకాల పంటలకు దీనిని ఉపయోగించుకోవచ్చు. ఆటోమేటిక్ బ్రేక్ రోడ్డు ప్రమాదాల నివారణకు ఐఓటీ ద్వారా నూతన ఆవిష్కరణ చేశారు పి.మహేష్ కుమార్ (కంప్యూటర్ సైన్సెస్ మూడో సంవత్సరం), జే.సాదిక్ (ఈసీఈ మూడో సంవత్సరం), పి.శ్రీనివాసులు (కంప్యూటర్ సైన్సెస్ మూడో సంవత్సరం), కృష్ణ సాయి ధీరజ్ (కంప్యూటర్ సైన్సెస్ మూడో సంవత్సరం), సాయి ప్రతాప్ రెడ్డి (ఈసీఈ మూడో సంవత్సరం). మన బైక్ లేదా కారుకు అమర్చిన సెన్సార్ ఉన్న ఈ పరికరం ద్వారా వాహనానికి రెండు మీటర్ల దూరం (ఈ దూరం వాహనదారుడి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది)లో వచ్చే అడ్డంకులను గుర్తించి, వాహన వేగం నియంత్రించే వీలుగా ఎంబీడెడ్ సిస్టమ్ద్వారా ప్రోగ్రాం రాస్తారు. మనం ఎంత వేగంగా వెళుతున్నప్పటికీ రెండు మీటర్ల దూరంలో అడ్డంకి ఎదురైన వెంటనే ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు పడతాయి. గాలితో నడిచే వాహనం ఫోర్ స్ట్రోక్ ఇంజిన్‌ను టూ స్ట్రోక్ ఇంజిన్‌గా మార్చి గాలితో నడిచే వాహనాన్ని ఆవిష్కరించారు మెకానికల్ విభాగం మూడో సంవత్సరం విద్యార్థులు జె.దేవకాంత్, కె.అఖిల్, ఎ.జయదీప్, డి.వి.హరీష్, ఎం.చైతన్య రెడ్డి, ఆర్.రజనీకాంత్, నిఖిల్ యాదవ్. కంప్రెస్ట్ ఎయిర్ ఆధారంగా చలనం కలుగుతుంది. గంటలకు 30 నుంచి 40 కిటోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. పరిశోధనలకు ఊతం : పరిశోధనలకు ఊతమిచ్చే విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా మరిన్ని ఆవిష్కరణలు చేయడానికి విద్యార్థులకు ఇది దోహదపడుతుంది. పరిశోధనలకు ఉపయుక్తమయ్యే అధునాతన పరికరాలను మా కళాశాలలో ఏర్పాటు చేశాం. –ఎం. రమేష్ నాయుడు, డైరెక్టర్, అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల ఆర్ అండ్ డీ కీలకం ఏ వ్యవస్థ అయినా పురోగతి చెందడానికి పరిశోధనలు, అభివృద్ధి కీలకమైనవి (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ అండ్ డీ). కళాశాలలో నేర్చుకొన్న అంశాలను పరిగణలోకి తీసుకొని ఇష్టంగా చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చు. విద్యార్థులు ఎంతో సృజనతో ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టడం గర్వకారణం. – డాక్టర్ బండి రమేష్ బాబు, ప్రిన్సిపల్, అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల. అనంతపురం. -
సంక్రాంతి ముందు సైన్స్ పండుగ
–104వ సైన్స్ కాంగ్రెస్‌కు తిరుపతి వేదిక –1983లో తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ –ఏపీలో మూడోసారి – ఈ ఏడాది థీమ్ ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్’ యూనివర్సిటీ క్యాంపస్: శాస్త్ర సాంకేతిక రంగంలో నూతన పరిశోధనలు.. ఫలితాలు.. కొంగొత్త ఆవిష్కణలతో పాటు పలు అంశాలపై జరిగే చర్చా వేదికే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. ఎంతో ప్రతిష్టాత్మకమైన సైన్స్ కాంగ్రెస్ ఏటా జనవరిలో జరపడం ఆనవాయితీ. ఏటా ఈ సదస్సును దేశ ప్రధానే ప్రారంభిస్తారు. అంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి అతిథ్యం ఇచ్చే అవకాశం ఎస్వీయూకు దక్కింది. ఎస్వీయూలో వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగనుంది. జనవరి 3న ఎస్వీయూ స్టేడియంలో నిర్వహించనున్న సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎస్వీయూలో ఆడిటోరియం, సెనెట్ హాల్, అంతర్గత రహదార్లను అభివద్ధి చేయాలని ఈనెల 26న జరిగిన పాలకమండలిలో సైతం నిర్ణయం తీసుకున్నారు. 33 ఏళ్ల తర్వాత ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 1983లో తిరుపతిలో నిర్వహించారు. ‘ మ్యాన్ అండ్ ద ఓసియన్ రీసోర్స్ డెవలప్మెంట్’ అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించారు. కోల్కత్తా కేంద్రంగా ఉన్న ద ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ఏటా నిర్వహిస్తారు. తొలి సైన్స్ కాంగ్రెస్ 1914లో కలకత్తాలో నిర్వహించారు. జస్టిస్ అశుతోష్ ముఖర్జీ అధ్యక్షుడిగా, డి.హూపర్ ప్రధాన కార్యదర్శిగా ఈ సదస్సు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలిసారిగా 1937లో 24 వ సైన్స్ కాంగ్రెస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘ ద ఇండియన్ విలేజ్ ఇట్స్ ఫాస్ట్, ప్రజెంట్, ప్యూచర్’ అనే అంశంపై నిర్వహించారు. అనంతరం 1954, 1967, 1979, 1998, 2006లో మొత్తం ఆరుసార్లు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇక ఏపీ విషయానికి వస్తే 1983లో 70వ సైన్స్ కాంగ్రెస్ తిరుపతిలో నిర్వహించారు. ఫ్రొఫెసర్ బీ రామచంద్రరావు అధ్యక్షుడిగా, ప్రొఫెసర్ అర్చన శర్మ, అరుణ్ దేవ్‌లు ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. 2008లో విశాఖపట్నంలో 95వ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించారు. గత ఏడాది 103వ సైన్స్ కాంగ్రెస్‌ను మైసూర్లో నిర్వహించారు. ప్రారంభం ఇలా 1914లో బ్రిటీష్ రసాయన శాస్త్రవేత్తలు జేఎల్.సిమన్సన్, పీఎస్.మెక్ మోహన్‌లు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను స్థాపించారు. జనవరి 15–17వ తేదీల్లో కలకత్తాలో జరిగిన ఈ సదస్సుకు ఐదుగురు శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఆరు సెషన్స్‌లో జరిగిన సదస్సులలో 35 పరిశోధన పత్రాలు సమర్పించారు. 2013లో కలకత్తాలోనే 100వ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించారు. ఇదే సదస్సు సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరిపారు. 1981 నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డును ప్రవేశపెట్టారు. ఉత్తమ పరిశోధన పత్రాన్ని సమర్పించిన వారికి యంగ్‌సైంటిస్ట్ అవార్డు ఇవ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ అవార్డు పొందిన వారికి రూ.25 వేల నగదు, ప్రశంసాæపత్రం ప్రదానం చేస్తున్నారు. ఎస్ఆర్ఎం నుంచి ఎస్వీయూకు.. జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ బాధ్యతను మొదట చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి కేటాయించారు. ఇటీవల ఆ సంస్థపై మెడిసిన్ అడ్మిషన్ల అంశంపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో వేదిక ఎస్వీయూకు మార్చారు. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఎస్వీయూలోని వసతులు సౌకర్యాలు పరిశీలించి ఎస్వీయూలో నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర కేబినేట్ కూడా దీని నిర్వహణకు ఆమోదించింది. అయితే స్థానిక నిర్వహణ కార్యదర్శి నియామకం జరగలేదు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఎలెక్టెడ్ మెంబర్స్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న ఎస్వీయూ ప్రొఫెసర్ ఎం.భూపతినాయుడికి ఈ అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి. 20 వేల మంది ప్రతినిధులు జనవరిలో జరగనున్న సైన్స్ కాంగ్రెస్‌కు 20వేల మంది ప్రతినిధులు, 200 మంది విదేశీ ప్రతినిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ సదస్సు నిర్వహణకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించటంతో పాటు, మౌలిక వసతుల కల్పనకు ఎస్వీయూకు రూ.కోటి నిధులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఉపయోగాలు: ఈ సదస్సు నిర్వహణ వల్ల ఎస్వీయూ ప్రతిష్ట ఇనమడించే అవకాశం ఉంది. దేశ, విదేశాల్లో ఎస్వీయూకు గుర్తింపు లభిస్తుంది. నూతన పరిశోధనలకు అవకాశం ఏర్పడుతుంది. సైన్స్ పరిశోధనలకు ప్రోత్సాహం లభిస్తుంది. యువత స్ఫూర్తి పొంది భావి శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఏర్పడుతుంది. మంచి అవకాశం ఎస్వీయూకు 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించే అవకాశం రావడం అదష్టమని చెప్పవచ్చు. ఈ సదస్సు నిర్వహణ వల్ల ఎస్వీయూ ప్రతిష్ట పెరగటమే కాకుండా భవిష్యత్‌లో నూతన పరిశోధనలకు అవకాశం ఏర్పడుతుంది. –ఆర్.గురుప్రసాద్, ఎస్వీయూ పాలకమండలి సభ్యుడు -
చదివిన కాలేజ్‌లో అసిస్టెంటు ఫ్రొఫెసర్‌గా..
* మహానంది వ్యవసాయ కళాశాలలో చదివి.. * ఇక్కడే అసిస్టెంటు ఫ్రొఫెసర్‌గా * పత్తి, శనగ నూతన వంగడాలపై పరిశోధనలు మహానంది: చదివిన కళాశాలలో అధ్యాపకుడి పోస్టింగ్ రావడం కొద్ది మందికే దక్కుంది. ఆ కొద్ది మందిలో బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామానికి చెందిన బి. వెంకట రవిప్రకాష్‌రెడ్డి ఒకరు. ఇతను మహానంది వ్యవసాయ కళాశాలలో 2006-10లో అగ్రికల్చర్ బీఎస్సీ చదివారు. నాలుగేళ్ల తర్వాత( 21-02-2014లో) అదే కళాశాలలో అసిస్టెంటు ఫ్రొఫెసర్‌గా చేరారు. తాను ఎంచుకున్న జెనటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్(జన్యు, ప్రజనన) విభాగంలో విద్యార్థులకు వివిధ అంశాలపై విద్యను భోధిస్తున్నారు. ఇతని త ల్లిదండ్రులు నారాయణమ్మ, నారాయణరెడ్డిలు వ్యవసాయం చేసేవారు. దీంతో రైతులకు తన వంతు సేవలందించాలి, వారి అభివృద్ధి కోసం పరిశోధనలు చేయాలని ఇతను వ్యవసాయ కోర్సును ఎంచుకున్నారు. పత్తి, శనగ రకాలపై పరిశోధనలు చేస్తున్నారు. తెగుళ్లు. పురుగుల ఉధృతిని తట్టుకునే రకాలను తయారు చేయడమే తనలక్ష్యమని ఈయన తెలుపుతున్నారు. -
అకడమిక్స్‌తోపాటే పరిశోధనలు
శ్రీకాంత్ జగబత్తుల, అసిస్టెంట్ ప్రొఫెసర్- న్యూయార్క్ యూనివర్సిటీ.. ఇప్పుడు అమెరికా అకడమిక్ వర్గాల్లో వార్తల్లోకి వచ్చిన తెలుగు తేజం. కారణం.. సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్.. ప్రతి ఏటా అతి పిన్న వయసు ప్రొఫెసర్లకు అందించే ఫ్యాకల్టీ కెరీర్ ఎర్లీ డెవలప్మెంట్ అవార్డుకు ఎంపికవడం. జాతీయ స్థాయిలో ఎంతో క్లిష్టంగా ఉండే ఎంపిక ప్రక్రియలో ఏటా ఒకరు లేదా ఇద్దరు ఎంపికయ్యే ఈ అవార్డు ఈసారి శ్రీకాంత్ జగబత్తులకు లభించింది. డేటా డ్రివెన్ మోడలింగ్ అండ్ టెక్నికల్ టూల్స్‌లో ఆయన చేస్తున్న పరిశోధనలకు గుర్తింపుగా లభించిన ఈ అవార్డుతో.. పరిశోధనలను సమర్థంగా కొనసాగించేందుకు అయిదు లక్షల అమెరికన్ డాలర్లను కూడా ఎన్ఎస్ఎఫ్ అందిస్తుంది. మూడు పదుల వయసులోనే ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్న శ్రీకాంత్ జగబత్తులతో గెస్ట్‌కాలం.. రీసెర్చ్ - అవార్డు అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్.. సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో రీసెర్చ్ కార్యకలాపాలు నిర్వహించే పిన్న వయసు ప్రొఫెసర్లను ప్రోత్సహించే ఉద్దేశంతో నెలకొల్పినదే ఫ్యాకల్టీ కెరీర్ ఎర్లీ డెవలప్మెంట్ అవార్డు. దీనికి జాతీయ స్థాయిలో రీసెర్చ్ ప్రతిపాదనలు స్వీకరిస్తారు. 12 మంది నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి సంతృప్తి చెందితే అవార్డుకు ఎంపికచేస్తుంది. ఇలా ఏటా ఒకరికి లేదా గరిష్టంగా ఇద్దరికి లభిస్తుంది. ఎంపికైన వారికి తమ రీసెర్చ్ కార్యకలాపాలు సమర్థంగా కొనసాగించేందుకు ఐదేళ్ల వ్యవధికి 5 లక్షల డాలర్ల ఆర్థిక సహకారం అందిస్తుంది. ఈ ఏడాది నేను చేస్తున్న డేటా డ్రివెన్ మోడలింగ్ అండ్ టెక్నికల్ టూల్స్ రీసెర్చ్ కార్యకలాపాలకు ఆ గుర్తింపు లభించడం ఎంతో సంతోషంగా ఉంది. డేటా డ్రివెన్ మోడలింగ్ అండ్ టెక్నికల్ టూల్స్ ఫలితంగా వ్యాపార సంస్థల ఉత్పత్తుల నిల్వ, సమీప భవిష్యత్తులో నిల్వల అంచనా, ధరల్లో హెచ్చుతగ్గులు వంటి వాటిని ముందుగానే గుర్తించే విధంగా ఒక సొల్యూషన్‌ను కనుగొనడం. దీని ద్వారా వ్యాపార సంస్థలకు తమ ఉత్పత్తుల తయారీ నుంచి భవిష్యత్తులో మార్కెటింగ్‌లో సంభవించే మార్పుల వరకు ముందుగానే ఒక అంచనాకు వచ్చే అవకాశం లభిస్తుంది. దీనికి అనుగుణంగా తమ వ్యూహాలు రూపొందించుకునే వీలు కలుగుతుంది. పరిశోధనల పట్ల ఆసక్తి ఐఐటీ-ముంబైలో చదువుతున్న రోజుల్లో రీసెర్చ్‌పై ఆసక్తి పెరిగింది. అప్పటి ప్రొఫెసర్, ప్రస్తుతం ఐఐటీ-హైదరాబాద్ డెరైక్టర్ ప్రొఫెసర్ యు.బి.దేశాయ్ అందించిన స్ఫూర్తి, సహకారంతో రీసెర్చ్ అభిలాష మరింత పెరిగింది. ఐఐటీ-ముంబైలో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసి, అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(మిట్)లో పీహెచ్‌డీతో న్యూయార్క్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించాను. నాకు పరిశోధనల పట్ల ఆసక్తి పెరగడానికి ప్రధానం కారణం ఐఐటీల వాతావరణమే. ఐఐటీల్లో బీటెక్ స్థాయి నుంచే రీసెర్చ్ కార్యకలాపాల్లో పాల్పంచుకునే అవకాశం కల్పిస్తారు. అందుకే ఐఐటీల్లోని విద్యార్థుల్లో అధిక శాతం మంది రీసెర్చ్‌ను అకడమిక్‌లో భాగంగానే భావిస్తారు. అంతేకాని అదో ప్రత్యేక విభాగమనుకోరు. మిగతా ఇన్స్టిట్యూట్లలో చదువుతున్న విద్యార్థులు కూడా ఇదే దృక్పథాన్ని అలవర్చుకోవాలి. అప్పుడు పీహెచ్డీ అంటే ఏళ్ల తరబడి కష్టపడాలి అనే భావన వీడొచ్చు. పీహెచ్డీ.. ఆర్ అండ్ డీ యాక్టివిటీస్.. ఈ రెండింటిని అకడమిక్స్‌లో భాగంగా భావించాలి. కానీ చాలామంది విద్యార్థులకు రీసెర్చ్ దృక్పథం ఉన్నప్పటికీ సరైన మార్గాలపై అవగాహన లేక అవకాశాలను చేజార్చుకుంటున్నారు. అకడమిక్ స్థాయి నుంచే పీహెచ్డీ దిశగా సరైన దృక్పథంతో అడుగులు వేస్తే ఉన్నత స్థానాలు అధిరోహించొచ్చు. STEM నైపుణ్యాలు విద్యార్థులు-నైపుణ్యాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలు విభిన్న స్కిల్స్ కలిగిన వారికి ప్రాధాన్యమిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఖీఉక (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) కోర్సుల ప్రాముఖ్యత పెరిగింది. దీన్ని గుర్తించే కొన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు పాటించే ఇన్స్టిట్యూట్లు ఉన్నత విద్య కోర్సుల్లో ఈ విభాగాలను సమ్మిళితం చేసి అందిస్తున్నాయి. విద్యార్థులు తాము చేరిన కోర్ కోర్స్‌తోపాటు ఖీఉక నైపుణ్యాలు సొంతం చేసుకునే దిశగా కృషి చేయాలి. ఫలితంగా భవిష్యత్తులో ఉద్యోగ విధుల్లో అన్ని విభాగాల్లో సమర్థంగా రాణించే పరిజ్ఞానం సొంతమవుతుంది. ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అకడమిక్ పరంగా ఇప్పుడు ఎంతో ఆవశ్యకంగా మారిన విభిన్న నైపుణ్యాలు అనే దానికి పరిష్కారం అకడమిక్ స్థాయిలో ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ విధానాన్ని అవలంబించడం. దీనికి ఇన్స్టిట్యూట్ల స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఒక బ్రాంచ్ లేదా కోర్స్‌లో విద్యార్థులను కేవలం వాటికే పరిమితం చేయకుండా.. ఎలక్టివ్స్, మైనర్స్, మేజర్స్ రూపంలో ఇతర సంబంధిత సబ్జెక్ట్‌లు అభ్యసించే అవకాశం కల్పించాలి. అప్పుడే జాబ్ స్కిల్స్, ఉన్నతవిద్య పరంగా ముందంజలో ఉంటారు. కలలు గనే ధైర్యం డేర్ టు డ్రీమ్.. ప్రస్తుతం విద్యార్థులంతా గుర్తించాల్సిన, భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అధిరోహించడానికి అనుసరించాల్సిన తొలి వ్యూహం. చాలా మందికి ఎన్నో స్వప్నాలు ఉంటాయి. కానీ అవి నెరవేరతాయా? లేదా? అనే సందిగ్ధతతో వాటివైపు దృష్టి పెట్టరు. దీంతో నైపుణ్యాలు ఉన్నప్పటికీ వెలుగులోకి రాలేకపోతున్నారు. కానీ ఒక లక్ష్యం గురించి కలలు గనే ధైర్యం ఉంటే అదే భవిష్యత్తుకు పునాది. ఆ స్వప్నం, లక్ష్యం నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు సహజమే. ఇప్పుడు మనం ఉపయోగించే ఎన్నో ఉత్పత్తులు ఎందరో శాస్త్రవేత్తల ఎన్నో ఏళ్ల పరిశోధనలు, ఆ క్రమంలో ఎన్నో ప్రతికూల ఫలితాలు చవిచూశాక ఆవిష్కృతమైనవే. దీన్ని గుర్తిస్తే అపోహలు, ఆందోళనలు వీడినట్లే. సబ్జెక్ట్‌పై దృష్టి పెట్టాలి నేటి విద్యార్థుల్లో కనిపిస్తున్న ఫోబియా.. ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించడం. ఉన్నత విద్య లేదా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయానికి అవసరమైన మార్కులు, గ్రేడ్ల గురించి ఆందోళన చెందుతుంటారు. ప్రాక్టికల్ దృక్పథంతో, పరిశోధనాత్మక శైలితో సబ్జెక్ట్ నైపుణ్యాలను సొంతం చేసుకుంటే ర్యాంకులు, అవకాశాలు, ఉన్నతస్థానాలు వాటంతటవే లభిస్తాయన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి!! ఎడ్యూన్యూస్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ కోర్సులకు ప్రత్యేక యూనివర్సిటీ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ (హస్త కళలు) గత కొంత కాలంగా ఇన్స్టిట్యూట్ల పరంగా, విద్యార్థుల్లో ఆసక్తి పరంగా వెనుకంజలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు కోర్సులకు ప్రత్యేకంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం చేపట్టాల్సిన చర్యలు, విధి విధానాల రూపకల్పనకు ఐదుగురు సభ్యుల కమిటీని కూడా నియమించింది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అమర్జీత్ సిన్హా నేతృత్వంలోని ఈ కమిటీలో టెక్స్టైల్స్, హెచ్ఆర్డీ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ మూడు నెలల్లో తన నివేదికను సమర్పించనుంది. యూనివర్సిటీల గ్రేడింగ్‌కు సరికొత్త విధానం దేశంలోని యూనివర్సిటీలకు ఇచ్చే గ్రేడింగ్ విధానంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్పులు చేపట్టనుంది. దీని ప్రకారం ప్రస్తుతం అనుసరిస్తున్న గ్రేడింగ్ నియమావళిలోనూ మార్పులు తేనుంది. ప్రస్తుతం దేశంలో సాంకేతిక విద్యా సంస్థల గ్రేడింగ్‌ను ఏఐసీటీఈ, యూనివర్సిటీల పనితీరు ఆధారంగా ఇచ్చే గ్రేడింగ్ విధానాలను యూజీసీ, నాక్ (నేషనల్ అక్రెడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్)లు నిర్వహిస్తున్నాయి. అయితే ఇవి గ్రేడింగ్ ఇచ్చే సమయంలో అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు తలెత్తుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో మూడు నెలల్లో గ్రేడింగ్‌కు సంబంధించి కొత్త విధానాలు, అదేవిధంగా నియమావళిని రూపొందించనున్నట్లు తెలిపింది. -
పరిశోధనలపై లోతైన చర్చలు
రెండో రోజూ కొనసాగిన బయో ఆసియా-2015 సదస్సు హైదరాబాద్: జీవశాస్త్ర పరిశోధనలపై బయో ఆసియా-2015 సదస్సు రెండో రోజున ప్రతినిధులు లోతైన చర్చలు సాగించారు. మంగళవారం జరిగిన ఈ సదస్సుకు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. పలు దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చించారు. ఔషధాలు, నూతన వ్యాక్సిన్లు, డ్రగ్స్, బయోటెక్నాలజీ వంటి వైద్య సంబంధిత అంశాలపై నిపుణులు ప్రసంగించారు. అలాగే భారత్‌లో ఔషధ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సదస్సు నిర్ణయించింది. చౌక ధరల్లో ఔషధాలను తీసుకురావాలని, వివిధ వ్యాధులకు ఔషధ ప్రయోగాలు చేపట్టాలని వైద్య నిపుణులు పేర్కొన్నారు. నిపుణులకు అవార్డులు: ఔషధ రంగంలో కృషి చేసిన పలువురికి మంత్రి జూపల్లి అవార్డులు అందజేశారు. యూకేకు చెందిన విలియమ్ హార్వే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ మార్క్ కాల్ఫీల్డ్ ‘జీనోం వ్యాలీ అవార్డు’ను అందుకున్నారు. రక్తపోటు, రేడియో వాస్కులర్ అనే అంశంపై ఆయన కృషి చేశారు. ‘జీనోం వ్యాలీ స్పెషల్ ఎక్స్‌లెన్స్’ అవార్డును భారత్ యువ శాస్త్రవేత్త నటాషా పూనం వాలాకు దక్కింది. నెక్టార్ థెరపిటిక్స్ సంస్థ తరపున ఆమె ఔషధాలపై పరిశోధనలు చేశారు. బ్రిటిష్ డిప్యూటి హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్‌కు ప్రత్యేక బయో అవార్డును మంత్రి అందజేశారు. చైనాతో తెలంగాణ పారిశ్రామిక ఒప్పందం చైనాతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికంగా సంయుక్త కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించింది. దానిలో భాగంగా మంగళవారం మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో చైనా, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక ఒప్పందం చేసుకున్నాయి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్, చైనాలోని చైనా మెడికల్ సిటీ సంస్థలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఇరు సంస్థలు సంయుక్తంగా వైద్య సంబంధిత ఔషధ ఉత్పత్తులను చేపట్టేందుకు నిర్ణయించారు. -
మన గొర్రెతోక బెత్తెడే!
సాక్షి, హైదరాబాద్:మన రాష్ట్రంలో దాదాపు 2.5 కోట్ల గొర్రెలు ఉన్నాయి. లక్ష కుటుంబాలకు పైగా గొర్రెల పెంపకంపై ఆధార పడి జీవిస్తున్నాయి. అయినప్పటికీ వీరి అభ్యున్నతికి దోహదపడేలా, మేలు జాతి గొర్రెల అభివృద్ధికి పశు వైద్య విశ్వవిద్యాలయంలో నామమాత్రపు పరిశోధనలు కూడా జరగక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. మరోవైపు గడ్డి విత్తనాల పంపిణీ, సబ్సిడీపై నట్టల మందు సరఫరా.. లాంటి సాధారణ కార్యక్రమాలకే పశుసంవర్ధక శాఖ పరిమితమరుు్యంది. కానీ పొరుగు రాష్ట్రాలు గొర్రెల అభివృద్ధిలో ఎంతో ముందుంటున్నాయి. మన రాష్ట్రం మాత్రం కొత్త ఆవిష్కరణలు లేకపోయినా కనీసం పక్క రాష్ట్రాల ఆవిష్కరణలను అందిపుచ్చుకోవడంలో కూడా విఫలమవుతోంది. ‘నారి సువర్ణ’తో మహారాష్ట్ర ముందడుగు... గొర్రె ప్రతిసారీ రెండు, మూడు పిల్లల్ని ఈనితే పెంపకందారుకు ఎంతో లాభం. దీన్ని దృష్టిలో ఉంచుకునే మహారాష్ట్రలోని ‘నింబ్కర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం’ (నారి) పదేళ్లకు పైగా రకరకాల ప్రయోగాలు చేసింది. ప్రతి ఈతలోనూ రెండు పిల్లలను ఈనే కొత్త గొర్రె జాతిని సృష్టించి తమ రాష్ట్రవాసులకు కానుకగా అందించింది. కవల పిల్లలకు ఆస్ట్రేలియాలోని ‘బొరోలో’ జాతి గొర్రెలు పెట్టింది పేరు. గొర్రెల్లో కవల పిల్లలను ఈనే జన్యు మూలానికి ‘ఫెక్యున్డిటీ బొరోలో’ (ఫెక్యున్డిటీ అంటే బహుళ పిల్లలను ఈనే లక్షణం అని అర్థం.) అన్న పేరు స్థిరపడింది. ఇదే ‘ఫెక్ బి’గా వ్యవహారంలో ఉంది. బొరోలో జాతి గొర్రెల్లోని ‘ఫెక్ బి’ జన్యువును మన దక్కనీ జాతి గొర్రెల్లో ప్రవేశపెట్టగలిగితే కవల పిల్లలను ఇచ్చే దక్కనీ గొర్రెలను సృష్టించవచ్చనే ఆలోచన ‘నారి’కి వచ్చింది. ‘నారి’ ప్రయత్నాలకు ‘నేషనల్ కెమికల్ లేబొరేటరీస్’ (ఎన్సీఎల్) తోడ్పాటునందించింది. పశ్చిమబెంగాల్లోనే దొరికిన మూలాలు... 19వ శతాబ్దానికి ముందు ‘బొరోలో’ జాతి గొర్రెలు ఒక పిల్లనే ఈనేవి. అలాంటిది ఈ గొర్రెల్లోకి ‘ఫెక్ బి’ జన్యువు ఎలా వచ్చిందన్న అంశంపై ‘నారి’ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. దీంతో దీని మూలాలు మన దేశంలోనే ఉన్న విషయం బయటపడింది. పశ్చిమ బెంగాల్లో ‘గరోల్’ అనే జాతి గొర్రెల్లో కూడా ఈతకు రెండు, మూడు పిల్లలను ఈనే లక్షణాలు ఉన్నాయి. ఈ గొర్రెలనే 1793లో తెల్ల జాతీయులు ఆస్ట్రేలియాకు తీసుకెళ్లినట్లుగా ఆధారాలు లభించాయి. ‘గరోల్’ గొర్రెలతో సంకరం ద్వారానే ‘బొరోలో’ గొర్రెల్లో కవల పిల్లలను ఈనే లక్షణం వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ‘నారి’ సంస్థ వారు గరోల్ జాతి గొర్రెలను తెప్పించారు. అయితే ఈ గొర్రెలు చాలా చిన్నవి. 12 నుంచి 15 కిలోల బరువు మాత్రమే తూగుతాయి. దక్కనీ జాతి గొర్రెలు 30 నుంచి 35 కిలోల బరువు తూగుతాయి. దీంతో రకరకాలుగా ప్రయోగాల అనంతరం.. సైజులో దక్కనీ లక్షణాలు...పునరుత్పత్తిలో ‘గరోల్’ లక్షణాలు ఉన్న కొత్త గొర్రెను సృష్టించారు. దీనికి ‘నారి సువర్ణ’ అన్న పేరుపెట్టారు. ఈ ఆవిష్కరణకు గాను 2007లో గ్రామీణాభివృద్ధికి దోహదపడే శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించిన జాతీయ అవార్డును ‘నారి’, ‘ఎన్సీఎల్’లు సంయుక్తంగా పొందాయి. అందిపుచ్చుకున్న కర్ణాటక.. ‘నారి సువర్ణ’ జాతి విత్తన పొట్టేళ్లను కొనుగోలు చేసి కొన్ని జిల్లాల్లో ఎంపికచేసిన గొర్రెల కాపరులకు అందించే ప్రాజెక్టును ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం కర్ణాటక ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ పొట్టేళ్ల సంకరం ద్వారా పుట్టే ‘ఫెక్ బి’ జన్యువు కల్గిన పిల్లలను ప్రభుత్వమే రూ.10 వేలకు కొనుగోలు చేసి వాటిని ఇతర పెంపకందారులకు అందజేసే ప్రణాళిక సిద్ధం చేసింది. రెండు పిల్లలను ఈనే కొత్త జాతి గొర్రెల గురించి ‘సాక్షి’ ప్రశ్నించే వరకు అటు మన పశు వైద్య విశ్వవిద్యాలయ వర్గాలకు కానీ, పశుసంవర్ధక శాఖ అధికారులకు గానీ సమాచారం లేకపోవడం విచారకరం. మహారాష్ట్ర తరహా కొత్త జాతి గొర్రెలను మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేసి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గొర్రెల పెంపకందారులు కోరుతున్నారు. -
పరిశోధనలే దేశాభివృద్ధికి కీలకం
నగరం, న్యూస్‌లైన్: సైన్స్ పరిశోధనలే దేశాభివృద్ధికి కీలకమని భోపాల్ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్య ఎస్కె డోగ్రా అన్నారు. స్థానిక ఎస్వీఆర్ఎం కళాశాలలో డిపార్ట్మెంట్ ఆప్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐదు రోజుల రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ ఇంటర్న్‌షిప్ సైన్సు క్యాంపు శుక్రవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ బి.రత్నరాజు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి డోగ్రా మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధాశక్తిని పెంపొందించేందుకు సైన్స్ ప్రయోగాలు దోహదపడతాయన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను శాస్త్ర పరిశోధనల వైపు దృష్టి మళ్లించేందుకే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్పైర్ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శాస్త్రవేత్త ఎంవీ సుబ్బారావు మాట్లాడుతూ మానవుడు 15 శాతం మాత్రమే మేధస్సును వినియోగించుకుంటున్నాడని చెప్పారు. మనిషి మిల్లీసెకనులో ఏ విషయమైనా సంగ్రహించుకోగలడని ఆయన పేర్కొన్నారు. ఇంతటి మేధాశక్తిని వృధాచేయకుండా పరిశోధనలకు వినియోగించుకోవాలని సూచించారు. ప్రొఫెసర్ కృష్ణమూర్తి, కళాశాల కరస్పాండెంట్ ఏడీఎల్ ప్రసాద్‌లు ప్రసగించారు. కార్యక్రమంలో క్యాంప్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.శ్రీనివాసరావు, ఎం.సుధాకరరావు, సైన్స్ అధ్యాపకులు పాల్గొన్నారు.