అకడమిక్స్‌తోపాటే పరిశోధనలు | researches along with academics | Sakshi
Sakshi News home page

అకడమిక్స్‌తోపాటే పరిశోధనలు

Published Mon, Mar 2 2015 12:36 AM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM

అకడమిక్స్‌తోపాటే పరిశోధనలు - Sakshi

అకడమిక్స్‌తోపాటే పరిశోధనలు

శ్రీకాంత్ జగబత్తుల, అసిస్టెంట్ ప్రొఫెసర్- న్యూయార్క్ యూనివర్సిటీ.. ఇప్పుడు అమెరికా అకడమిక్ వర్గాల్లో వార్తల్లోకి వచ్చిన తెలుగు తేజం. కారణం.. సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్.. ప్రతి ఏటా అతి పిన్న వయసు ప్రొఫెసర్లకు అందించే ఫ్యాకల్టీ కెరీర్ ఎర్లీ డెవలప్‌మెంట్ అవార్డుకు ఎంపికవడం. జాతీయ స్థాయిలో ఎంతో క్లిష్టంగా ఉండే ఎంపిక
 
ప్రక్రియలో ఏటా ఒకరు లేదా ఇద్దరు ఎంపికయ్యే ఈ అవార్డు ఈసారి శ్రీకాంత్ జగబత్తులకు లభించింది. డేటా డ్రివెన్ మోడలింగ్ అండ్ టెక్నికల్ టూల్స్‌లో ఆయన చేస్తున్న పరిశోధనలకు గుర్తింపుగా లభించిన ఈ అవార్డుతో.. పరిశోధనలను సమర్థంగా కొనసాగించేందుకు అయిదు లక్షల అమెరికన్ డాలర్లను కూడా ఎన్‌ఎస్‌ఎఫ్ అందిస్తుంది.  మూడు పదుల వయసులోనే ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్న శ్రీకాంత్ జగబత్తులతో గెస్ట్‌కాలం..
 
రీసెర్చ్ - అవార్డు
అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్.. సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో రీసెర్చ్ కార్యకలాపాలు నిర్వహించే పిన్న వయసు ప్రొఫెసర్లను ప్రోత్సహించే ఉద్దేశంతో నెలకొల్పినదే ఫ్యాకల్టీ కెరీర్ ఎర్లీ డెవలప్‌మెంట్ అవార్డు. దీనికి జాతీయ స్థాయిలో రీసెర్చ్ ప్రతిపాదనలు స్వీకరిస్తారు. 12 మంది నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి సంతృప్తి చెందితే అవార్డుకు ఎంపికచేస్తుంది. ఇలా ఏటా ఒకరికి లేదా గరిష్టంగా ఇద్దరికి లభిస్తుంది.

ఎంపికైన వారికి తమ రీసెర్చ్ కార్యకలాపాలు సమర్థంగా కొనసాగించేందుకు ఐదేళ్ల వ్యవధికి 5 లక్షల డాలర్ల ఆర్థిక సహకారం అందిస్తుంది. ఈ ఏడాది నేను చేస్తున్న డేటా డ్రివెన్ మోడలింగ్ అండ్ టెక్నికల్ టూల్స్ రీసెర్చ్ కార్యకలాపాలకు ఆ గుర్తింపు లభించడం ఎంతో సంతోషంగా ఉంది. డేటా డ్రివెన్ మోడలింగ్ అండ్ టెక్నికల్ టూల్స్ ఫలితంగా వ్యాపార సంస్థల ఉత్పత్తుల నిల్వ, సమీప భవిష్యత్తులో నిల్వల అంచనా, ధరల్లో హెచ్చుతగ్గులు వంటి వాటిని ముందుగానే గుర్తించే విధంగా ఒక సొల్యూషన్‌ను కనుగొనడం. దీని ద్వారా వ్యాపార సంస్థలకు తమ ఉత్పత్తుల తయారీ నుంచి భవిష్యత్తులో మార్కెటింగ్‌లో సంభవించే మార్పుల వరకు ముందుగానే ఒక అంచనాకు వచ్చే అవకాశం లభిస్తుంది. దీనికి అనుగుణంగా తమ వ్యూహాలు రూపొందించుకునే వీలు కలుగుతుంది.
 
పరిశోధనల పట్ల ఆసక్తి
ఐఐటీ-ముంబైలో చదువుతున్న రోజుల్లో రీసెర్చ్‌పై ఆసక్తి పెరిగింది. అప్పటి ప్రొఫెసర్, ప్రస్తుతం ఐఐటీ-హైదరాబాద్ డెరైక్టర్ ప్రొఫెసర్ యు.బి.దేశాయ్ అందించిన స్ఫూర్తి, సహకారంతో రీసెర్చ్ అభిలాష మరింత పెరిగింది. ఐఐటీ-ముంబైలో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసి, అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(మిట్)లో పీహెచ్‌డీతో న్యూయార్క్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించాను. నాకు పరిశోధనల పట్ల ఆసక్తి పెరగడానికి ప్రధానం కారణం ఐఐటీల వాతావరణమే.

ఐఐటీల్లో బీటెక్ స్థాయి నుంచే రీసెర్చ్ కార్యకలాపాల్లో పాల్పంచుకునే అవకాశం కల్పిస్తారు. అందుకే ఐఐటీల్లోని విద్యార్థుల్లో అధిక శాతం మంది రీసెర్చ్‌ను అకడమిక్‌లో భాగంగానే భావిస్తారు. అంతేకాని అదో ప్రత్యేక విభాగమనుకోరు. మిగతా ఇన్‌స్టిట్యూట్‌లలో చదువుతున్న విద్యార్థులు కూడా ఇదే దృక్పథాన్ని అలవర్చుకోవాలి. అప్పుడు పీహెచ్‌డీ అంటే ఏళ్ల తరబడి కష్టపడాలి అనే భావన వీడొచ్చు. పీహెచ్‌డీ.. ఆర్ అండ్ డీ యాక్టివిటీస్.. ఈ రెండింటిని అకడమిక్స్‌లో భాగంగా భావించాలి. కానీ చాలామంది విద్యార్థులకు రీసెర్చ్ దృక్పథం ఉన్నప్పటికీ సరైన మార్గాలపై అవగాహన లేక అవకాశాలను చేజార్చుకుంటున్నారు. అకడమిక్ స్థాయి నుంచే పీహెచ్‌డీ దిశగా సరైన దృక్పథంతో అడుగులు వేస్తే ఉన్నత స్థానాలు అధిరోహించొచ్చు.
 
STEM నైపుణ్యాలు
విద్యార్థులు-నైపుణ్యాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలు విభిన్న స్కిల్స్ కలిగిన వారికి ప్రాధాన్యమిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఖీఉక (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) కోర్సుల ప్రాముఖ్యత పెరిగింది. దీన్ని గుర్తించే కొన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు పాటించే ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నత విద్య కోర్సుల్లో ఈ విభాగాలను సమ్మిళితం చేసి అందిస్తున్నాయి. విద్యార్థులు తాము చేరిన కోర్ కోర్స్‌తోపాటు ఖీఉక నైపుణ్యాలు సొంతం చేసుకునే దిశగా కృషి చేయాలి. ఫలితంగా భవిష్యత్తులో ఉద్యోగ విధుల్లో అన్ని విభాగాల్లో సమర్థంగా రాణించే పరిజ్ఞానం సొంతమవుతుంది.
 
ఫ్లెక్సిబుల్ లెర్నింగ్
అకడమిక్ పరంగా ఇప్పుడు ఎంతో ఆవశ్యకంగా మారిన విభిన్న నైపుణ్యాలు అనే దానికి పరిష్కారం అకడమిక్ స్థాయిలో ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ విధానాన్ని అవలంబించడం. దీనికి ఇన్‌స్టిట్యూట్‌ల స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఒక బ్రాంచ్ లేదా కోర్స్‌లో విద్యార్థులను కేవలం వాటికే పరిమితం చేయకుండా.. ఎలక్టివ్స్, మైనర్స్, మేజర్స్ రూపంలో ఇతర సంబంధిత సబ్జెక్ట్‌లు అభ్యసించే అవకాశం కల్పించాలి. అప్పుడే జాబ్ స్కిల్స్, ఉన్నతవిద్య పరంగా ముందంజలో ఉంటారు.
 
కలలు గనే ధైర్యం
డేర్ టు డ్రీమ్.. ప్రస్తుతం విద్యార్థులంతా గుర్తించాల్సిన, భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అధిరోహించడానికి అనుసరించాల్సిన తొలి వ్యూహం. చాలా మందికి ఎన్నో స్వప్నాలు ఉంటాయి. కానీ అవి నెరవేరతాయా? లేదా? అనే సందిగ్ధతతో వాటివైపు దృష్టి పెట్టరు. దీంతో నైపుణ్యాలు ఉన్నప్పటికీ వెలుగులోకి రాలేకపోతున్నారు. కానీ ఒక లక్ష్యం గురించి కలలు గనే ధైర్యం ఉంటే అదే భవిష్యత్తుకు పునాది. ఆ స్వప్నం, లక్ష్యం నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు సహజమే. ఇప్పుడు మనం ఉపయోగించే ఎన్నో ఉత్పత్తులు ఎందరో శాస్త్రవేత్తల ఎన్నో ఏళ్ల పరిశోధనలు, ఆ క్రమంలో ఎన్నో ప్రతికూల ఫలితాలు చవిచూశాక ఆవిష్కృతమైనవే. దీన్ని గుర్తిస్తే అపోహలు, ఆందోళనలు వీడినట్లే.
 
సబ్జెక్ట్‌పై దృష్టి పెట్టాలి
నేటి విద్యార్థుల్లో కనిపిస్తున్న ఫోబియా.. ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించడం. ఉన్నత విద్య లేదా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయానికి అవసరమైన మార్కులు, గ్రేడ్‌ల గురించి ఆందోళన చెందుతుంటారు. ప్రాక్టికల్ దృక్పథంతో, పరిశోధనాత్మక శైలితో సబ్జెక్ట్ నైపుణ్యాలను సొంతం చేసుకుంటే ర్యాంకులు, అవకాశాలు, ఉన్నతస్థానాలు వాటంతటవే లభిస్తాయన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి!!
 
ఎడ్యూన్యూస్
 ఆర్ట్స్, క్రాఫ్ట్స్ కోర్సులకు ప్రత్యేక యూనివర్సిటీ
 
ఆర్ట్స్, క్రాఫ్ట్స్ (హస్త కళలు) గత కొంత కాలంగా ఇన్‌స్టిట్యూట్‌ల పరంగా, విద్యార్థుల్లో ఆసక్తి పరంగా వెనుకంజలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు కోర్సులకు ప్రత్యేకంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం చేపట్టాల్సిన చర్యలు, విధి విధానాల రూపకల్పనకు ఐదుగురు సభ్యుల కమిటీని కూడా నియమించింది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అమర్జీత్ సిన్హా నేతృత్వంలోని ఈ కమిటీలో టెక్స్‌టైల్స్, హెచ్‌ఆర్‌డీ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ మూడు నెలల్లో తన నివేదికను సమర్పించనుంది.
 
యూనివర్సిటీల గ్రేడింగ్‌కు సరికొత్త విధానం
దేశంలోని యూనివర్సిటీలకు ఇచ్చే గ్రేడింగ్ విధానంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్పులు చేపట్టనుంది. దీని ప్రకారం ప్రస్తుతం అనుసరిస్తున్న గ్రేడింగ్ నియమావళిలోనూ మార్పులు తేనుంది. ప్రస్తుతం దేశంలో సాంకేతిక విద్యా సంస్థల గ్రేడింగ్‌ను ఏఐసీటీఈ, యూనివర్సిటీల పనితీరు ఆధారంగా ఇచ్చే గ్రేడింగ్ విధానాలను యూజీసీ, నాక్ (నేషనల్ అక్రెడిటేషన్ అండ్ అసెస్‌మెంట్ కౌన్సిల్)లు నిర్వహిస్తున్నాయి. అయితే ఇవి గ్రేడింగ్ ఇచ్చే సమయంలో అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు తలెత్తుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో మూడు నెలల్లో గ్రేడింగ్‌కు సంబంధించి కొత్త విధానాలు, అదేవిధంగా నియమావళిని రూపొందించనున్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement