నగరం, న్యూస్‌లైన్: సైన్స్ పరిశోధనలే దేశాభివృద్ధికి కీలకమని భోపాల్ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్య ఎస్‌కె డోగ్రా అన్నారు. స్థానిక ఎస్వీఆర్‌ఎం కళాశాలలో డిపార్ట్‌మెంట్ ఆప్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐదు రోజుల రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ ఇంటర్న్‌షిప్ సైన్సు క్యాంపు శుక్రవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ బి.రత్నరాజు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి డోగ్రా మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధాశక్తిని పెంపొందించేందుకు సైన్స్ ప్రయోగాలు దోహదపడతాయన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను శాస్త్ర పరిశోధనల వైపు దృష్టి మళ్లించేందుకే డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్పైర్ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శాస్త్రవేత్త ఎంవీ సుబ్బారావు మాట్లాడుతూ మానవుడు 15 శాతం మాత్రమే మేధస్సును వినియోగించుకుంటున్నాడని చెప్పారు. మనిషి మిల్లీసెకనులో ఏ విషయమైనా సంగ్రహించుకోగలడని ఆయన పేర్కొన్నారు. ఇంతటి మేధాశక్తిని వృధాచేయకుండా పరిశోధనలకు వినియోగించుకోవాలని సూచించారు. ప్రొఫెసర్ కృష్ణమూర్తి, కళాశాల కరస్పాండెంట్ ఏడీఎల్ ప్రసాద్‌లు ప్రసగించారు. కార్యక్రమంలో క్యాంప్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.శ్రీనివాసరావు, ఎం.సుధాకరరావు, సైన్స్ అధ్యాపకులు పాల్గొన్నారు.
పరిశోధనలే దేశాభివృద్ధికి కీలకం
Published Sat, Dec 21 2013 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement