మన గొర్రెతోక బెత్తెడే!
సాక్షి, హైదరాబాద్:మన రాష్ట్రంలో దాదాపు 2.5 కోట్ల గొర్రెలు ఉన్నాయి. లక్ష కుటుంబాలకు పైగా గొర్రెల పెంపకంపై ఆధార పడి జీవిస్తున్నాయి. అయినప్పటికీ వీరి అభ్యున్నతికి దోహదపడేలా, మేలు జాతి గొర్రెల అభివృద్ధికి పశు వైద్య విశ్వవిద్యాలయంలో నామమాత్రపు పరిశోధనలు కూడా జరగక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. మరోవైపు గడ్డి విత్తనాల పంపిణీ, సబ్సిడీపై నట్టల మందు సరఫరా.. లాంటి సాధారణ కార్యక్రమాలకే పశుసంవర్ధక శాఖ పరిమితమరుు్యంది. కానీ పొరుగు రాష్ట్రాలు గొర్రెల అభివృద్ధిలో ఎంతో ముందుంటున్నాయి. మన రాష్ట్రం మాత్రం కొత్త ఆవిష్కరణలు లేకపోయినా కనీసం పక్క రాష్ట్రాల ఆవిష్కరణలను అందిపుచ్చుకోవడంలో కూడా విఫలమవుతోంది.
‘నారి సువర్ణ’తో మహారాష్ట్ర ముందడుగు...
గొర్రె ప్రతిసారీ రెండు, మూడు పిల్లల్ని ఈనితే పెంపకందారుకు ఎంతో లాభం. దీన్ని దృష్టిలో ఉంచుకునే మహారాష్ట్రలోని ‘నింబ్‌కర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం’ (నారి) పదేళ్లకు పైగా రకరకాల ప్రయోగాలు చేసింది. ప్రతి ఈతలోనూ రెండు పిల్లలను ఈనే కొత్త గొర్రె జాతిని సృష్టించి తమ రాష్ట్రవాసులకు కానుకగా అందించింది. కవల పిల్లలకు ఆస్ట్రేలియాలోని ‘బొరోలో’ జాతి గొర్రెలు పెట్టింది పేరు. గొర్రెల్లో కవల పిల్లలను ఈనే జన్యు మూలానికి ‘ఫెక్యున్‌డిటీ బొరోలో’ (ఫెక్యున్‌డిటీ అంటే బహుళ పిల్లలను ఈనే లక్షణం అని అర్థం.) అన్న పేరు స్థిరపడింది. ఇదే ‘ఫెక్ బి’గా వ్యవహారంలో ఉంది. బొరోలో జాతి గొర్రెల్లోని ‘ఫెక్ బి’ జన్యువును మన దక్కనీ జాతి గొర్రెల్లో ప్రవేశపెట్టగలిగితే కవల పిల్లలను ఇచ్చే దక్కనీ గొర్రెలను సృష్టించవచ్చనే ఆలోచన ‘నారి’కి వచ్చింది. ‘నారి’ ప్రయత్నాలకు ‘నేషనల్ కెమికల్ లేబొరేటరీస్’ (ఎన్‌సీఎల్) తోడ్పాటునందించింది.
పశ్చిమబెంగాల్‌లోనే దొరికిన మూలాలు...
19వ శతాబ్దానికి ముందు ‘బొరోలో’ జాతి గొర్రెలు ఒక పిల్లనే ఈనేవి. అలాంటిది ఈ గొర్రెల్లోకి ‘ఫెక్ బి’ జన్యువు ఎలా వచ్చిందన్న అంశంపై ‘నారి’ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. దీంతో దీని మూలాలు మన దేశంలోనే ఉన్న విషయం బయటపడింది. పశ్చిమ బెంగాల్‌లో ‘గరోల్’ అనే జాతి గొర్రెల్లో కూడా ఈతకు రెండు, మూడు పిల్లలను ఈనే లక్షణాలు ఉన్నాయి. ఈ గొర్రెలనే 1793లో తెల్ల జాతీయులు ఆస్ట్రేలియాకు తీసుకెళ్లినట్లుగా ఆధారాలు లభించాయి. ‘గరోల్’ గొర్రెలతో సంకరం ద్వారానే ‘బొరోలో’ గొర్రెల్లో కవల పిల్లలను ఈనే లక్షణం వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ‘నారి’ సంస్థ వారు గరోల్ జాతి గొర్రెలను తెప్పించారు. అయితే ఈ గొర్రెలు చాలా చిన్నవి. 12 నుంచి 15 కిలోల బరువు మాత్రమే తూగుతాయి. దక్కనీ జాతి గొర్రెలు 30 నుంచి 35 కిలోల బరువు తూగుతాయి. దీంతో రకరకాలుగా ప్రయోగాల అనంతరం.. సైజులో దక్కనీ లక్షణాలు...పునరుత్పత్తిలో ‘గరోల్’ లక్షణాలు ఉన్న కొత్త గొర్రెను సృష్టించారు. దీనికి ‘నారి సువర్ణ’ అన్న పేరుపెట్టారు. ఈ ఆవిష్కరణకు గాను 2007లో గ్రామీణాభివృద్ధికి దోహదపడే శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించిన జాతీయ అవార్డును ‘నారి’, ‘ఎన్‌సీఎల్’లు సంయుక్తంగా పొందాయి.
అందిపుచ్చుకున్న కర్ణాటక..
‘నారి సువర్ణ’ జాతి విత్తన పొట్టేళ్లను కొనుగోలు చేసి కొన్ని జిల్లాల్లో ఎంపికచేసిన గొర్రెల కాపరులకు అందించే ప్రాజెక్టును ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం కర్ణాటక ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ పొట్టేళ్ల సంకరం ద్వారా పుట్టే ‘ఫెక్ బి’ జన్యువు కల్గిన పిల్లలను ప్రభుత్వమే రూ.10 వేలకు కొనుగోలు చేసి వాటిని ఇతర పెంపకందారులకు అందజేసే ప్రణాళిక సిద్ధం చేసింది. రెండు పిల్లలను ఈనే కొత్త జాతి గొర్రెల గురించి ‘సాక్షి’ ప్రశ్నించే వరకు అటు మన పశు వైద్య విశ్వవిద్యాలయ వర్గాలకు కానీ, పశుసంవర్ధక శాఖ అధికారులకు గానీ సమాచారం లేకపోవడం విచారకరం. మహారాష్ట్ర తరహా కొత్త జాతి గొర్రెలను మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేసి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గొర్రెల పెంపకందారులు కోరుతున్నారు.