రెండో రోజూ కొనసాగిన
బయో ఆసియా-2015 సదస్సు
హైదరాబాద్: జీవశాస్త్ర పరిశోధనలపై బయో ఆసియా-2015 సదస్సు రెండో రోజున ప్రతినిధులు లోతైన చర్చలు సాగించారు. మంగళవారం జరిగిన ఈ సదస్సుకు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. పలు దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చించారు. ఔషధాలు, నూతన వ్యాక్సిన్‌లు, డ్రగ్స్, బయోటెక్నాలజీ వంటి వైద్య సంబంధిత అంశాలపై నిపుణులు ప్రసంగించారు. అలాగే భారత్‌లో ఔషధ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సదస్సు నిర్ణయించింది. చౌక ధరల్లో ఔషధాలను తీసుకురావాలని, వివిధ వ్యాధులకు ఔషధ ప్రయోగాలు చేపట్టాలని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
నిపుణులకు అవార్డులు: ఔషధ రంగంలో కృషి చేసిన పలువురికి మంత్రి జూపల్లి అవార్డులు అందజేశారు. యూకేకు చెందిన విలియమ్ హార్వే రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ మార్క్ కాల్‌ఫీల్డ్ ‘జీనోం వ్యాలీ అవార్డు’ను అందుకున్నారు. రక్తపోటు, రేడియో వాస్కులర్ అనే అంశంపై ఆయన కృషి చేశారు. ‘జీనోం వ్యాలీ స్పెషల్ ఎక్స్‌లెన్స్’ అవార్డును భారత్ యువ శాస్త్రవేత్త నటాషా పూనం వాలాకు దక్కింది. నెక్టార్ థెరపిటిక్స్ సంస్థ తరపున ఆమె ఔషధాలపై పరిశోధనలు చేశారు. బ్రిటిష్ డిప్యూటి హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్‌కు ప్రత్యేక బయో అవార్డును మంత్రి అందజేశారు.
చైనాతో తెలంగాణ పారిశ్రామిక ఒప్పందం
చైనాతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికంగా సంయుక్త కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించింది. దానిలో భాగంగా మంగళవారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో చైనా, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక ఒప్పందం చేసుకున్నాయి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్, చైనాలోని చైనా మెడికల్ సిటీ సంస్థలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఇరు సంస్థలు సంయుక్తంగా వైద్య సంబంధిత ఔషధ ఉత్పత్తులను చేపట్టేందుకు నిర్ణయించారు.
పరిశోధనలపై లోతైన చర్చలు
Published Wed, Feb 4 2015 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement