మైసూర్‌లో జరిగిన 103 వ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ(ఫైల్)
సంక్రాంతి ముందు సైన్స్ పండుగ
Published Thu, Sep 29 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
–104వ సైన్స్ కాంగ్రెస్‌కు తిరుపతి వేదిక
–1983లో తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్
–ఏపీలో మూడోసారి
– ఈ ఏడాది థీమ్ ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ డెవలప్‌మెంట్’
యూనివర్సిటీ క్యాంపస్:
శాస్త్ర సాంకేతిక రంగంలో నూతన పరిశోధనలు.. ఫలితాలు.. కొంగొత్త ఆవిష్కణలతో పాటు పలు అంశాలపై జరిగే చర్చా వేదికే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. ఎంతో ప్రతిష్టాత్మకమైన సైన్స్ కాంగ్రెస్ ఏటా జనవరిలో జరపడం ఆనవాయితీ. ఏటా ఈ సదస్సును దేశ ప్రధానే ప్రారంభిస్తారు. అంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి అతిథ్యం ఇచ్చే అవకాశం ఎస్వీయూకు దక్కింది.
ఎస్వీయూలో వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగనుంది. జనవరి 3న ఎస్వీయూ స్టేడియంలో నిర్వహించనున్న సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎస్వీయూలో ఆడిటోరియం, సెనెట్ హాల్, అంతర్గత రహదార్లను అభివద్ధి చేయాలని ఈనెల 26న జరిగిన పాలకమండలిలో సైతం నిర్ణయం తీసుకున్నారు.
33 ఏళ్ల తర్వాత
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 1983లో తిరుపతిలో నిర్వహించారు. ‘ మ్యాన్ అండ్ ద ఓసియన్ రీసోర్స్ డెవలప్‌మెంట్’ అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించారు. కోల్‌కత్తా కేంద్రంగా ఉన్న ద ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ఏటా నిర్వహిస్తారు. తొలి సైన్స్ కాంగ్రెస్ 1914లో కలకత్తాలో నిర్వహించారు. జస్టిస్ అశుతోష్ ముఖర్జీ అధ్యక్షుడిగా, డి.హూపర్ ప్రధాన కార్యదర్శిగా ఈ సదస్సు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలిసారిగా 1937లో 24 వ సైన్స్ కాంగ్రెస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘ ద ఇండియన్ విలేజ్ ఇట్స్ ఫాస్ట్, ప్రజెంట్, ప్యూచర్’ అనే అంశంపై నిర్వహించారు. అనంతరం 1954, 1967, 1979, 1998, 2006లో మొత్తం ఆరుసార్లు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇక ఏపీ విషయానికి వస్తే 1983లో 70వ సైన్స్ కాంగ్రెస్ తిరుపతిలో నిర్వహించారు. ఫ్రొఫెసర్ బీ రామచంద్రరావు అధ్యక్షుడిగా, ప్రొఫెసర్ అర్చన శర్మ, అరుణ్ దేవ్‌లు ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. 2008లో విశాఖపట్నంలో 95వ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించారు. గత ఏడాది 103వ సైన్స్ కాంగ్రెస్‌ను మైసూర్‌లో నిర్వహించారు.
ప్రారంభం ఇలా
1914లో బ్రిటీష్ రసాయన శాస్త్రవేత్తలు జేఎల్.సిమన్‌సన్, పీఎస్.మెక్ మోహన్‌లు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను స్థాపించారు. జనవరి 15–17వ తేదీల్లో కలకత్తాలో జరిగిన ఈ సదస్సుకు ఐదుగురు శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఆరు సెషన్స్‌లో జరిగిన సదస్సులలో 35 పరిశోధన పత్రాలు సమర్పించారు. 2013లో కలకత్తాలోనే 100వ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించారు. ఇదే సదస్సు సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరిపారు. 1981 నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డును ప్రవేశపెట్టారు. ఉత్తమ పరిశోధన పత్రాన్ని సమర్పించిన వారికి యంగ్‌సైంటిస్ట్ అవార్డు ఇవ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ అవార్డు పొందిన వారికి రూ.25 వేల నగదు, ప్రశంసాæపత్రం ప్రదానం చేస్తున్నారు.
ఎస్‌ఆర్‌ఎం నుంచి ఎస్వీయూకు..
జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ బాధ్యతను మొదట చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి కేటాయించారు. ఇటీవల ఆ సంస్థపై మెడిసిన్ అడ్మిషన్ల అంశంపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో వేదిక ఎస్వీయూకు మార్చారు. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఎస్వీయూలోని వసతులు సౌకర్యాలు పరిశీలించి ఎస్వీయూలో నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర కేబినేట్ కూడా దీని నిర్వహణకు ఆమోదించింది. అయితే స్థానిక నిర్వహణ కార్యదర్శి నియామకం జరగలేదు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఎలెక్టెడ్ మెంబర్స్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న ఎస్వీయూ ప్రొఫెసర్ ఎం.భూపతినాయుడికి ఈ అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి.
20 వేల మంది ప్రతినిధులు
జనవరిలో జరగనున్న సైన్స్ కాంగ్రెస్‌కు 20వేల మంది ప్రతినిధులు, 200 మంది విదేశీ ప్రతినిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ సదస్సు నిర్వహణకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించటంతో పాటు, మౌలిక వసతుల కల్పనకు ఎస్వీయూకు రూ.కోటి నిధులు కూడా ఇచ్చే అవకాశం ఉంది.
ఉపయోగాలు:
ఈ సదస్సు నిర్వహణ వల్ల ఎస్వీయూ ప్రతిష్ట ఇనమడించే అవకాశం ఉంది. దేశ, విదేశాల్లో ఎస్వీయూకు గుర్తింపు లభిస్తుంది. నూతన పరిశోధనలకు అవకాశం ఏర్పడుతుంది. సైన్స్ పరిశోధనలకు ప్రోత్సాహం లభిస్తుంది. యువత స్ఫూర్తి పొంది భావి శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఏర్పడుతుంది.
మంచి అవకాశం
ఎస్వీయూకు 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించే అవకాశం రావడం అదష్టమని చెప్పవచ్చు. ఈ సదస్సు నిర్వహణ వల్ల ఎస్వీయూ ప్రతిష్ట పెరగటమే కాకుండా భవిష్యత్‌లో నూతన పరిశోధనలకు అవకాశం ఏర్పడుతుంది.
–ఆర్.గురుప్రసాద్, ఎస్వీయూ పాలకమండలి సభ్యుడు
Advertisement