సాక్షి, తిరుపతి: మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో రాయలసీమపై దుష్ప్రచారం జరుగుతోందని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి అన్నారు. మంగళవారం ఎస్వీయూలో రాయలసీమ మేధావుల ఫోరం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అమరావతి రైతు నాయకులు రాయలసీమ వాసులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాయలసీమ వాసులు వారి ప్రాంతానికి రాజధాని వద్దని చెబుతున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త నగరం రావాలంటే అది రాయలసీమకే రావాలి.
చదవండి: (సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్ విరాళం)
రాయలసీమలో గ్రామీణ వాతావరణం కలిగిన పట్టణాలే తప్ప ఒక్క నగరం కూడా లేదని గతంలో శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అమరావతి రైతులు విశాల హృదయం, విశాల త్యాగం చేసినవారు. అమరావతి రైతు నాయకులు రాయలసీమవాసులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ, వామపక్షాలు కర్నూలుకు హైకోర్టు రావాలని ఒప్పుకున్నాయి. రాయలసీమ వాసుల మౌనాన్ని అలుసుగా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
రాయలసీమకు హైకోర్టు రాకూడదని ఎస్వీయూలో బహిరంగ సభ పెట్టాలంటే మేం ఎందుకు అనుమతించాలి. రాయలసీమ ప్రజలందరూ ఈ విషయంపై స్పందించాలి. రేపటి నుంచి రాయలసీమకు రాజధాని అంశంపై విద్యార్థుల్లోకి వెళ్తామ’ని పురుషోత్తం రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment