సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశోధనలకు ప్రాధాన్యం తగ్గుతోంది. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల కొరత, ఇతర వివాదాలతో ప్రవేశాలు సజావుగా జరగడం లేదు. రాష్ట్రంలోని వర్సిటీల్లో ఆరేళ్లుగా ప్రొఫెసర్ల నియామకాలు తగ్గడంతో ఎక్కువగా ప్రవేశాలు చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది.
సమాజానికి ఉపయోగపడే పీహెచ్‌డీలు ఎన్ని ఉన్నాయో పక్కనబెడితే.. మార్గదర్శనం చేసే ప్రొఫెసర్లు లేక రాష్ట్రంలో పరిశోధనలు తగ్గుతున్నాయని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోల్చితే పీహెచ్‌డీలు చేస్తున్న విద్యార్థుల సంఖ్యలో తెలంగాణ 12వ స్థానంలో ఉన్నా.. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే అట్టడుగున ఉండిపోయింది.
తమిళనాడులో 28,684 మంది..
2016–17 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా పీహెచ్‌డీలు, ఎంఫిల్, పీజీలు చదువుతున్న విద్యార్థుల సంఖ్యపై కేంద్రం లెక్కలు తేల్చింది. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేరుతో ఇటీవల గణాంకాలు విడుదల చేసింది. ఆ ప్రకారం దేశవ్యాప్తంగా పరిశోధనలు చేస్తున్న విద్యార్థుల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 28,684 మంది విద్యార్థులు పీహెచ్‌డీలు చేస్తున్నారు.
13,227 మంది విద్యార్థులతో ఉత్తరప్రదేశ్, 10,841 మంది విద్యార్థులతో కర్ణాటక రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్తాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో 5 వేల మంది చొప్పున పీహెచ్‌డీ విద్యార్థులున్నారు. 4 వేల నుంచి 5 వేలలోపు పీహెచ్‌డీ విద్యార్థులతో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 10 రాష్ట్రాల్లో పీహెచ్‌డీలు చేస్తున్న వారి సంఖ్య 1,000కి మించనేలేదు.
కేరళలో 58.82 శాతం మహిళలు
దేశవ్యాప్తంగా 1,41,037 మంది విద్యార్థులు పీహెచ్‌డీ చేస్తుండగా.. అందులో 59,242 (42.01 శాతం) మంది మహిళలే ఉన్నారు. 58.82 శాతం మంది మహిళలతో కేరళ తొలి స్థానంలో నిలిచింది. పంజాబ్‌లో 53.95 శాతం మంది, హర్యానాలో 49.54 శాతం, తమిళనాడులో 42.95, రాజస్తాన్‌లో 47.61, ఢిల్లీలో 46.39, మహారాష్ట్రలో 41.79, గుజరాత్‌లో 39.15, కర్ణాటకలో 38.84, అస్సాంలో 38.19, ఆంధ్రప్రదేశ్‌లో 37.24, తెలంగాణలో 34.28% మంది మహిళలు పీహెచ్‌డీ చేస్తున్నారు.
పీహెచ్‌డీలతోపాటు మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఎం.ఫిల్.) ప్రవేశాల్లోనూ రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొంది. కానీ పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో మాత్రం రెండు రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాల్లో సీన్ రివర్స్ అయింది. పీజీ కోర్సులు చదువుతున్న వారు ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా (5,40,138 మంది) ఉండగా, మహారాష్ట్రలో 3,18,077 మంది ఉన్నారు. తమిళనాడులో 2,63,450 మంది, మధ్యప్రదేశ్‌లో 1,71,801, కర్ణాటకలో 1,69,889, తెలంగాణలో 1,66,186, ఆంధ్రప్రదేశ్‌లో 1,85,672 మంది విద్యార్థులు పీజీ చదువుతున్నట్లు కేంద్రం లెక్కలు తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment