సైన్స్ టఫ్ సబ్జెక్ట్ అనుకుంటాం. కానీ.. ఇంట్రెస్ట్ ఉంటే ఆ టఫ్ సబ్జెక్టే.. మనకు ఇష్టమైన ప్రపంచం అవుతుంది. ఇప్పుడు ఆ ప్రపంచంలోనే ఉన్నారు మంజులారెడ్డి! కొత్త తరం అమ్మాయిల్ని ఆ ప్రపంచంలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే ‘ఇన్ఫోసిస్ సైన్స్’ అవార్డుకు ఎంపికైన మంజలారెడ్డితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.
‘‘నీ లక్ష్యాన్ని చేరడానికి చేస్తున్న ప్రయత్నాల్లో నీ వంతుగా ప్రయత్న లోపం ఉండకూడదు. వందసార్లు అడ్డంకులు ఎదురైనా సరే, నూట ఒకటో సారి కూడా ప్రయత్నించి తీరాలి. అప్పుడే లక్ష్యం నీదవుతుంది’’ వివేకానందుడు చెప్పిన ఈ మాటను మనసుకు పట్టించుకున్నారు సైంటిస్ట్ మంజులారెడ్డి. హైదరాబాద్, బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్‌లో బీఎస్సీ చదువుతున్న రోజుల్లోనే సైంటిస్ట్ కావాలన్న తలంపు కూడా ఆమెలో కలిగింది. హెచ్‌సీయూలో ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ చేసేటప్పుడు మరింతగా అది స్థిరపడింది.పీహెచ్‌డీలో చేరారామె.
పీహెచ్‌డీలో కూడా పరీక్షలుంటాయని అప్పుడు తెలియలేదు. అనుకున్నవన్నీ అనుకున్నట్లే అనుకున్న సమయానికే జరగడం అందరి జీవితంలో సాధ్యంకాదు. పీహెచ్‌డీ సగంలోనే ఆపేయాల్సి వచ్చింది. మళ్లీ ప్రయత్నించారు. రెండోసారి కూడా పీహెచ్‌డీ డిస్‌కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అక్కడితో సరిపెట్టుకుంటే చరిత్రలో కలిసిపోతాం. సరిపోదు అనుకుంటే చరిత్ర సృష్టించగలుగుతాం. ఆ ఎదురీతే ఆమెను సైంటిస్ట్‌గా నిలబెట్టింది.
పెళ్లి, పిల్లలతో కూడిన కుటుంబ బంధాలు ఒకటికి రెండుసార్లు ఆమెను పీహెచ్‌డీకి దూరంగా ఉంచినప్పటికీ ఆమె మాత్రం పీహెచ్‌డీకి దూరంగా ఉండదలుచుకోలేదు. సీసీఎంబీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన తర్వాత ఉద్యోగం చేస్తూనే తిరిగి పీహెచ్‌డీలో చేరారు. మూడవ ప్రయత్నం విజయవంతమైంది. అప్పటి నుంచి సైంటిస్ట్‌గా తన కెరీర్‌ని తనకు నచ్చినట్లు మలుచుకున్నారు. ఆ ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు మంజులారెడ్డి.
నిరంతరం సాగే యజ్ఞం
‘‘సెయింట్ ఫ్రాన్సిస్‌లో టీచర్లు పాఠం చెప్పి ఊరుకోకుండా స్టూడెంట్స్‌కి భవిష్యత్తు పట్ల మార్గదర్శనం చేసేవారు. వాళ్ల ప్రసంగాలు.. శాస్త్ర సాంకేతిక పరిశోధనల అవసరాన్ని తెలియచేయడంతోపాటు ఆసక్తిని రేకెత్తించేలా ఉండేవి. సైంటిస్ట్‌ను అవ్వాలనేది ఆ వయసులో నా మనసులో స్థిరంగా ఏర్పడిన కోరిక. అందుకే ఎన్నిసార్లు అడ్డంకులు వచ్చినప్పటికీ ప్రయత్నించడాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. సైంటిస్ట్‌కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం కూడా అదే.
మా పరిశోధనలు చాలా విస్తృతంగా జరుగుతుంటాయి. నిత్యం పర్యవేక్షిస్తూనే ఉండాలి. బ్యాక్టీరియా గురించి దేశంలో దాదాపు యాభైకి పైగా లాబొరేటరీల్లో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విభాగంలో పరిశోధన చేస్తుంటారు. నా పరిశోధన బ్యాక్టీరియా కణం గోడల నిర్మాణం, బ్యాక్టీరియా పెరుగుదల, ఎంజైమ్‌ల వాడకం ద్వారా కణం గోడలు రెండుగా విడిపోవడం మీద సాగుతోంది.
దీని వల్ల కొత్త యాంటీబయాటిక్స్ మందుల తయారీ సాధ్యమవుతుంది. సుదీర్ఘమైన ఫలితాల కోసం నిరంతరం ఒక యజ్ఞంలాగ జరిగే శ్రమ ఇది. అయితే బయటి ప్రపంచానికి... సైంటిస్ట్‌లు కాలక్రమంలో లాబొరేటరీల్లో ఒక పరికరంలాగ మారిపోతుంటారనే అపోహ ఉంటుంది. కానీ మాకు మాత్రం ఏ రోజుకారోజు కొత్తగానే ఉంటుంది. శోధనలో తెలుసుకున్న కొత్త విషయం ఉత్సాహాన్నిస్తుంటుంది. జీవితేచ్ఛను పెంచుతుంది.
డైనింగ్ టేబుల్ కబుర్లు
కుటుంబం కోసం కొన్నేళ్లు కెరీర్‌కు దూరంగా ఉన్న మాట నిజమే. కానీ ఒకసారి సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ సెంటర్)లో చేరిన తర్వాత ఇక వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మా చిన్నవాడు సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో మైక్రోస్కోప్‌లో నేను పరిశీలిస్తున్న బ్యాక్టీరియాను చూడడానికి చాలా ఇష్టపడేవాడు. రాత్రి భోజనాల దగ్గర నలుగురమూ ఆ రోజు నేను గుర్తించిన విషయాలనే చర్చించేవాళ్లం.
నాతోపాటు పిల్లలు కూడా ఎక్సైట్ అయ్యేవాళ్లు. మా వారు డాక్టర్ కావడంతో సబ్జెక్ట్ ఆయనకీ ఆసక్తిగానే ఉండేది. ఇలాంటి ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పించుకోవడం వల్ల పిల్లల వైపు నుంచి ‘మా అమ్మ తన పనిలో తానుంటోంది. మా కోసం టైమ్ కేటాయించట్లేదు’ అనే కంప్లయింట్ రాలేదు. నాకు కూడా రిగ్రెట్స్ లేవు. ఫ్యామిలీ లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేశాను.
అడవాళ్లు మారారు
పాతికేళ్ల కిందటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఆడవాళ్లు చాలా మారారు. ఆలోచనల్లో అభ్యుదయ ధోరణి అలవడింది. అప్పట్లో నా ఉద్యోగం తొలినాళ్లలో చాలా ఫంక్షన్‌లు మిస్ అయ్యేదాన్ని. వీలయినప్పుడు ఎప్పుడో ఒక ఫంక్షన్‌కు వెళ్తే అక్కడకు వచ్చిన వాళ్లు ‘కొత్త మోడల్స్ ఎన్నో వచ్చాయి... ఇంకా ఈ చీరలే కడుతున్నావేంటి అని ఒకరు అడిగితే, నగలు పెట్టుకోకూడదూ’ అని మరొకరు అభిమానంగా కసురుకునే వాళ్లు. ‘ఇంత ఆలస్యంగా వచ్చావేంటి, దగ్గర వాళ్ల పెళ్లి కదా ఒకరోజు సెలవు పెట్టచ్చు కదా’ అని కూడా అనేవాళ్లు.
ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి వర్కింగ్ ఉమన్ కనీసం ఒకరైనా ఉంటున్నారు. కెరీర్ జర్నీ ఎంత ముఖ్యమో తెలుసుకుంటున్నారు. సోషల్ లైఫ్‌ని ఉద్యోగ జీవితాన్ని సమన్వయం చేసుకోవడంలో ఎదురయ్యే సున్నితమైన అడ్డంకులను అర్థం చేసుకుంటున్నారు. సమాజాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం మొదలైంది. ఇది చాలా మంచి పరిణామం’’ అన్నారు సీసీఎంబీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ మంజులారెడ్డి.
వాకా మంజులారెడ్డి,
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
అందరూ పని చేయాలి
ఆడవాళ్లు– మగవాళ్లు అని కాదు, పని చేసే శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పని చేయాలి. ‘మా నాన్న ఇంత ఆస్తి ఇచ్చారు కాబట్టి నేను పని చేయను. నా భర్త ఇంతింత సంపాదిస్తున్నాడు కాబట్టి నాకు పని చేయాల్సిన అవసరం లేదు’ అనే భావజాలానికి నేను పూర్తిగా వ్యతిరేకిని. ‘ఆడవాళ్లు సాధారణంగా తాము మొదలు పెట్టిన పనిని సగంలో వదిలిపెట్టరు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనక్కి తగ్గరు. అంతటి స్థిరత్వం ఆడవాళ్లలోనే ఉంటుంది. ఈ తరం అమ్మాయిలకు నేను చెప్పే మాట... ‘ఇష్టమైన ఫీల్డ్‌ని ఎంచుకోండి. పని చేయడంలో సంతోషాన్ని ఆస్వాదించండి’ అని మాత్రమే.
డాక్టర్ మంజులారెడ్డి
ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీసీఎంబీ హైదరాబాద్
►ఇన్ఫోసిస్‌అవార్డును మంజులా రెడ్డి వచ్చే ఏడాది జనవరి ఏడవ తేదీన బెంగళూరులో భారతరత్న, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ చేతుల మీదుగా అందుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment