సృజనకు ‘అనంత’ పట్టం.. | researches in anantha laxmi college | Sakshi
Sakshi News home page

సృజనకు ‘అనంత’ పట్టం..

Published Sun, Jun 11 2017 11:31 PM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM

సృజనకు ‘అనంత’ పట్టం..

సృజనకు ‘అనంత’ పట్టం..

– సమాజహితమే ధ్యేయంగా ‘అనంతలక్ష్మి’ పరిశోధనలు
అను నిత్యం నూతనంగా ఆలోచించే యువత.. తమలోని సృజనకు పదును పెడుతోంది. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని సమాజ హితానికి దోహదపడే ఆవిష్కరణలతో రాణిస్తోంది. ఇందులో భాగంగానే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌ (ఐఓటీ) వినియోగం అనివార్యమైంది. ఇంటర్నెట్‌ ఆధారితంగా పనిచేసే ఈ వ్యవస్థ వ్యవసాయ ఉత్పత్తుల నుంచి అన్ని రంగాలకు విస్తరింపజేయడంలో యువత ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ని వినియోగించుకుని రూపొందించిన అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థుల పలు ఆవిష్యరణలు అద్భుత ఫలితాలను సాధిస్తున్నాయి.
- జేఎన్‌టీయూ

సాంకేతిక వ్యవ‘సాయం’
వ్యవసాయనికి సాంకేతికత అనుసంధానం అనివార్యమైన రోజులివి. పండ్లతోటలు, ఇతరత్రా తడి పంటల్లో ఐఓటీ ద్వారా అన్నదాతకు దన్నుగా ఆవిష్కరణలు జరిపారు. ‘ఆటోమేటిక్‌ మెయిషర్‌ డిటెక్షన్‌ సిస్టమ్‌ ’ అనే ఆవిష్కరణను ఈసీఈ చదువుతన్న తరుణ్, రెడ్డిశేఖర్, జయరాములు, ఆరీఫుల్లా  రూపకల్ప చేశారు. ప్రతి మొక్క వద్ద ఐఓటీకి అనుసంధానం చేసిన సెన్సార్‌లను ఉంచడం ద్వారా నీటి శాతం తక్కువైనా.. ఎక్కువైనా వెంటనే ఆ విషయాన్ని మన సెల్‌ఫోన్‌కు సమాచారం అందుతుంది. దీని ద్వారా నీటి యాజమాన్యాలను చేపట్టవచ్చు. దీనిని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆపరేట్‌ చేయవచ్చు. ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండాలి. పండ్లతోటలకే కాకుండా అన్ని రకాల పంటలకు దీనిని ఉపయోగించుకోవచ్చు.

ఆటోమేటిక్‌ బ్రేక్‌
రోడ్డు ప్రమాదాల నివారణకు ఐఓటీ ద్వారా నూతన ఆవిష్కరణ చేశారు పి.మహేష్‌ కుమార్‌ (కంప్యూటర్‌ సైన్సెస్‌ మూడో సంవత్సరం), జే.సాదిక్‌ (ఈసీఈ మూడో సంవత్సరం), పి.శ్రీనివాసులు (కంప్యూటర్‌ సైన్సెస్‌ మూడో సంవత్సరం), కృష్ణ సాయి ధీరజ్‌ (కంప్యూటర్‌ సైన్సెస్‌ మూడో సంవత్సరం), సాయి ప్రతాప్‌ రెడ్డి (ఈసీఈ మూడో సంవత్సరం).  మన బైక్‌ లేదా కారుకు అమర్చిన సెన్సార్‌ ఉన్న ఈ పరికరం ద్వారా వాహనానికి రెండు మీటర్ల దూరం (ఈ దూరం వాహనదారుడి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది)లో వచ్చే అడ్డంకులను గుర్తించి, వాహన వేగం నియంత్రించే వీలుగా ఎంబీడెడ్‌ సిస్టమ్‌​ద్వారా ప్రోగ్రాం రాస్తారు. మనం ఎంత వేగంగా వెళుతున్నప్పటికీ రెండు మీటర్ల దూరంలో అడ్డంకి ఎదురైన వెంటనే ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు పడతాయి.

గాలితో నడిచే వాహనం
ఫోర్‌ స్ట్రోక్‌ ఇంజిన్‌ను టూ స్ట్రోక్‌ ఇంజిన్‌గా మార్చి గాలితో నడిచే వాహనాన్ని ఆవిష్కరించారు మెకానికల్‌ విభాగం మూడో సంవత్సరం విద్యార్థులు జె.దేవకాంత్, కె.అఖిల్, ఎ.జయదీప్, డి.వి.హరీష్, ఎం.చైతన్య రెడ్డి, ఆర్‌.రజనీకాంత్, నిఖిల్‌ యాదవ్‌. కంప్రెస్ట్‌ ఎయిర్‌ ఆధారంగా చలనం కలుగుతుంది. గంటలకు 30 నుంచి 40 కిటోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.

పరిశోధనలకు ఊతం :
పరిశోధనలకు ఊతమిచ్చే విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా మరిన్ని ఆవిష్కరణలు చేయడానికి విద్యార్థులకు ఇది దోహదపడుతుంది. పరిశోధనలకు ఉపయుక్తమయ్యే అధునాతన పరికరాలను మా కళాశాలలో ఏర్పాటు చేశాం.
–ఎం. రమేష్‌ నాయుడు, డైరెక్టర్, అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాల

ఆర్‌ అండ్‌ డీ కీలకం
ఏ వ్యవస్థ అయినా పురోగతి చెందడానికి పరిశోధనలు, అభివృద్ధి కీలకమైనవి (రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్‌ అండ్‌ డీ). కళాశాలలో నేర్చుకొన్న అంశాలను పరిగణలోకి తీసుకొని ఇష్టంగా చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చు. విద్యార్థులు ఎంతో సృజనతో ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టడం గర్వకారణం.
– డాక్టర్‌ బండి రమేష్‌ బాబు, ప్రిన్సిపల్, అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాల. అనంతపురం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement