నఖ శిఖం : క్యాన్సర్‌ మహమ్మారి | special story on various cancers symptoms causes and treatment | Sakshi
Sakshi News home page

నఖ శిఖం : క్యాన్సర్‌ మహమ్మారి

Published Tue, Oct 29 2024 5:15 PM | Last Updated on Tue, Oct 29 2024 5:15 PM

special story on various cancers symptoms causes and treatment

ఓ పరిమితి లేకుండా అనారోగ్యకరంగా, అసాధారణంగా పెరుగుతూ, తొలుత ఒక కణంతోనే క్యాన్సర్‌ తన ప్రస్థానాన్ని   ప్రారంభిస్తుంది. ఎప్పటికప్పుడు రెట్టింపు అయ్యే ఈ ప్రక్రియలో 20వ సారి అది ఒక మిలియన్‌ కణాలుగా వృద్ధి చెందుతుంది. మిలియన్‌ కణాల సముదాయంగా పెరిగినప్పటికీ ఆ టైమ్‌లోనూ దాన్ని కనుక్కోవడం కష్టసాధ్యం. అదే 30వసారి రెట్టింపు అయ్యే సమయంలో అందులో బిలియన్‌ కణాలకు పైగా ఉంటాయి. అప్పుడు మాత్రమే అది ఓ గడ్డ (లంప్‌)లా రూపొంది గుర్తించడానికి వీలయ్యేలా ఉంటుంది.  అంటే... చేత్తో గడ్డను తడిమి గుర్తించడానికి వీలయ్యే సమయానికి ఆ క్యాన్సర్‌ గడ్డలో బిలియన్‌ కణాలు... వందకోట్ల కణాలకు పైనే ఉంటాయి. ఇక 40వ సారి రెట్టింపయ్యాక అందులో ఒక ట్రిలియన్‌ కణాలుంటాయి. అప్పటికీ చికిత్స లభించక 42–43వ సారి రెట్టింపయినప్పుడు రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు. అన్ని రెట్టింపులు కాకముందే... అంటే కేవలం 20వ సారి రెట్టింపయ్యే లోపు కనుక్కోగలిగితే...? క్యాన్సర్‌ను నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువే. మరి ఆ దశలోనే క్యాన్సర్‌ను కనుక్కోవడం ఎలాగో తెలిపేదే ఈ కథనం.  

క్యాన్సర్‌ లక్షణాలు అవయవానికీ అవయవానికీ మారి΄ోతున్నప్పటికీ క్యాన్సర్‌ బాధితులందరికీలోనూ కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఆరోగ్యవంతుల్లోనూ అప్పుడప్పుడూ ఆ లక్షణాలు కనిపించేవే కావడంతో వాటిని గుర్తించడం కష్టం.


క్యాన్సర్‌ను గుర్తించేందుకు తోడ్పడే కొన్ని సాధారణ అంశాలు... 

  • ఆకలి తగ్గడం 

  • కారణం తెలియకుండా / ఏ కారణమూ లేకుండానే బరువు తగ్గడం 

  • ఎడతెరిపి లేకుండా దగ్గు 

  • లింఫ్‌ గ్లాండ్స్‌ (చంకల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు 

  • అవయవాలనుంచి రక్తస్రావం... (ఈ లక్షణం కొన్నిసార్లు కొన్ని అవయవాలలో మాత్రమే)
     

ఒక్క చివరిది మినహా ఇక్కడ పేర్కొన్నవన్నీ చాలామందిలో ఏదో ఓ దశలో క్యాన్సర్‌ లేకపోయినప్పటికీ కనిపించే మామూలు లక్షణాలు. అందుకే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌వే కానక్కర్లేదు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి కనిపించిన మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ లక్షణాలకు అవవసరమైన తొలి చికిత్సలు తీసుకున్న తర్వాత కూడా, అవే పునరావృతమవుతుంటే ఒకసారి డాక్టర్‌ చేత పరీక్ష చేయించుకుని అది క్యాన్సర్‌ కాదని నిర్ధారణ చేసుకొన్న తర్వాతే నిశ్చింతగా ఉండాలి.  

తల నుంచి కాలి వేలి వరకు ఆయా అవయవాల్లో క్యాన్సర్‌ ఉంటే కనిపించేందుకు / తొలి దశలోనే గుర్తించేందుకు ఉపయోగపడే ప్రాథమిక లక్షణాలివి... 

బ్రెయిన్‌ క్యాన్సర్‌ : తలనొప్పి వస్తుంటుంది. అకస్మాత్తుగా మతిమరపు రావడం, కొన్ని సార్లు సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనిషి మెదడులో మాట్లాడటానికీ, దృష్టికీ, వినికిడికీ, కాళ్లూ, చేతుల కదలికల నియంత్రణకు... ఇలా వేర్వేరు ప్రతిచర్యలకు వేర్వేరు కేంద్రాలు (సెంటర్స్‌) ఉంటాయి. క్యాన్సర్‌ అభివృద్ధి చెందిన సెంటర్‌ దేనికి సంబంధించినదైతే ఆ అవయవం చచ్చుబడటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇవీ ఆయా అవయవాలకు సంబంధించి తొలిదశలో క్యాన్సర్‌కు లక్షణాలు.  

తల భాగంలో: ఈ క్యాన్సర్స్‌ నోటిలో, దడవ మీద, నాలుక మీద లేదా చిగుర్లు (జింజివా) మీదా ఇలా తలభాగంలో ఎక్కడైనా రావచ్చు. ఆయా భాగాల్లో ఎరుపు, తెలుపు రంగుల ΄్యాచెస్‌ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు (సాధారణంగా నొప్పి లేని పుండు, కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు కూడా) ఉంటే క్యాన్సర్‌ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. అదే నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇక స్వరపేటిక ్ర΄ాంతంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మెడ దగ్గర లింఫ్‌ గ్రంధుల వాపు కనిపిస్తుంది.  

గొంతు భాగంలో : దీన్ని ఓరో ఫ్యారింజియల్‌ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఇరుక్కుని ఉన్న ఫీలింగ్‌ ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడం  ఇబ్బందిగా అనిపిస్తుంది.  

ఊపిరితిత్తులు : పొగతాగేవాళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువ. ఇది ఉన్నవాళ్లలో దగ్గు, కళ్లె (స్ఫుటమ్‌)లో రక్తం పడటం వంటì  లక్షణాలు కనిపిస్తాయి. ఎక్స్‌–రే, సీటీ స్కాన్‌ పరీక్ష ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు.

రొమ్ము క్యాన్సర్‌ : మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ రకం క్యాన్సర్‌లో... రొమ్ములో ఓ గడ్డ చేతికి తగలడం, రొమ్ము పరిమాణంలో మార్పు, రొమ్ము మీది చర్మం ముడతలు పడటం, రొమ్ము చివర (నిపుల్‌) నుంచి రక్తంతో కలిసిన స్రావం లాంటివి రొమ్ము క్యాన్సర్‌ లక్షణాలు.

కడుపు (స్టమక్‌)లో: కడుపు (స్టమక్‌)లో మంట పుడుతున్నట్లుగా నొప్పి. పొట్టలో మంట. కొన్నిసార్లు పొట్టలో రక్తస్రావం అయినప్పుడు ఆ రక్తం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత (ఎనీమియా) కూడా కనిపించవచ్చు. దాంతో  పాటు కొన్ని సార్లు కొద్దిగా తినగానే కడుపునిండిపోయిన ఫీలింగ్‌ ఉంటుంది.

పేగుల్లో... మలమూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు కనిపిస్తాయి.

రెక్టమ్‌ క్యాన్సర్‌లో:  మలద్వారం (రెక్టమ్‌) క్యాన్సర్‌ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న ఫీలింగ్‌. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం పేరుకుని ఉన్నట్లుగా మెదడుకు సమాచారమిస్తాయి. అప్పుడా పదార్థాల్ని విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. కానీ విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్‌ ఓ గడ్డలా ఉండటంతో ఏదో మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు మళ్లీ మళ్లీ చేరవేస్తుంటాయి. దాంతో ఇంకా అక్కడేదో ఉందన్న ఫీలింగ్‌ కలుగుతుంటుంది. ఈ లక్షణంతో పాటు కొందరిలో బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

సర్విక్స్‌ క్యాన్సర్‌: దక్షిణ భారతదేశంలోని తీర్ర ప్రాంతాల్లోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్‌ ఇది. రుతుస్రావం సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్‌) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్‌ తర్వాత రక్తస్రావం ( పోస్ట్‌ కాయిటల్‌ బ్లీడింగ్‌), ఎరుపు, తెలుపు డిశ్చార్జ్‌ వంటివి దీని లక్షణాలు.

ఒవేరియన్‌ క్యాన్సర్‌ : దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో  పొట్ట కింది భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి క్యాన్సర్‌ వస్తే ఒక్కోసారి ఏ లక్షణాలూ కనిపించకుండానే ప్రమాదకరంగా పరిణమించవచ్చు.

టెస్టిస్‌ క్యాన్సర్‌ : పురుషుల్లో వచ్చే ఈ క్యాన్సర్‌లో వృషణాల సైజ్‌ పెరగడం, దాన్ని హైడ్రోసిల్‌గా పొరబాటు పడటం వల్ల పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడంతో అది సైజ్‌లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలెక్కువ.

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ : సాధారణంగా 50, 60 ఏళ్లు దాటిన పురుషుల్లో తరచూ కనిపించే క్యాన్సర్‌ ఇది. దాదాపు లక్షణాలేవీ పెద్దగా కనిపించకుండా వచ్చే ఈ క్యాన్సర్‌లో రాత్రివేళల్లో మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉండవచ్చు. పీఎస్‌ఏ అనే పరీక్ష ద్వారా దీన్ని తేలిగ్గా గుర్తించవచ్చు.

కిడ్నీ అండ్‌ బ్లాడర్‌ క్యాన్సర్‌ : మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం.

బ్లడ్‌ క్యాన్సర్స్‌ : రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి... బ్లడ్‌ క్యాన్సర్‌ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద పొడలా (పర్ప్యూరిక్‌  పాచెస్‌) రావడం, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్‌ క్యాన్సర్‌ లక్షణాలు. లింఫ్‌ గ్లాండ్స్‌ అన్నవి బాహుమూలాల్లో, దవడల కింది భాగంలో మెడకు ఇరువైపులా, గజ్జల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్‌ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు.

స్కిన్‌ క్యాన్సర్‌: చర్మం క్యాన్సర్‌ను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– అంటే... ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– అంటే... బార్డర్‌ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ– అంటే కలర్‌ రంగు మారినా, డీ అంటే డయామీటర్‌... అంటే వ్యాసం (సైజు) పెరిగినా దాన్ని చర్మం క్యాన్సర్‌ లక్షణాలుగా భావించవచ్చు.

కొంతమందిలో తమ తాత తండ్రుల్లో, పిన్ని వంటి దగ్గరి సంబంధీకుల్లో క్యాన్సర్‌ ఉన్నప్పుడూ, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్‌ వంటి అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారూ...ఇక జన్యుపరంగా అంటే... జీరోడెర్మా, న్యూరోఫైబ్రమాటోసిస్‌ వంటి వ్యాధులున్నవారిలో క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హైరిస్క్‌ వ్యక్తులంతా మిగతావారికంటే మరింత అప్రమత్తంగా ఉంటూ, మరింత ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. 

గమనించాల్సిన అంశం ఏమిటంటే... ఇక్కడ ప్రస్తావించిన లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించినవే కావచ్చేమోనని ఆందోళన వద్దు. తొలిదశలో తేలిగ్గా గుర్తిస్తే క్యాన్సర్‌ తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకుని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా ఒకసారి డాక్టర్ల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలి. అది క్యాన్సర్‌ కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాత నిశ్చింతగా ఉండాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement