బిర్లా సన్‌లైఫ్ నుంచి క్యాన్సర్‌షీల్డ్ పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా రంగ సంస్థ బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ (బీఎస్‌ఎల్‌ఐ) తాజాగా క్యాన్సర్‌షీల్డ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం దేశీయంగా ఏటా పది లక్షల పైగా క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదమవుతున్నాయని, గత కొన్నేళ్లలో చికిత్స వ్యయాలు మూడు, నాలుగు రెట్లు పెరిగిపోయాయని బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ పంకజ్ రజ్దాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో తక్కువ ప్రీమియంతో క్యాన్సర్ తొలి దశ నుంచి తీవ్ర స్థాయి దాకా చికిత్స వ్యయాలకు గరిష్ట కవరేజి లభించేలా క్యాన్సర్‌షీల్డ్ పాలసీని తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు.
ప్రీమియం వెయివర్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నట్లు బుధవారమిక్కడ క్యాన్సర్‌షీల్డ్ ప్లాన్‌ను ఆవిష్కరించిన సందర్భంగా విలేకరులకు తెలిపారు. మరోవైపు, క్యాన్సర్‌షీల్డ్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటిదాకా రెండు పాలసీలను ప్రవేశపెట్టామని, బీమా రంగ పరిస్థితులను బట్టి ఈ సంవత్సరం మరో పథకం ప్రవేశపెట్టే అవకాశముందని పంకజ్ రజ్దాన్ తెలిపారు.
సంస్థ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో ఉత్పాదకత మరింత పెంచుకునే దిశగా కసరత్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రైవేట్ రంగ జీవిత బీమా మార్కెట్లో ప్రస్తుతం తమకు సుమారు 7 శాతం వాటా ఉందని, దాదాపు 17 శాతం వృద్ధి నమోదు చేస్తున్నామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం స్థూల ప్రీమియం ఆదాయం రూ. 5,580 కోట్లుగా నమోదైనట్లు రజ్దాన్ చెప్పారు.