రక్తకణాల ఉత్పత్తి కొన్ని దుష్ప్రభావాలకు లోనై, కొన్ని రకాల రక్తకణాలు అపరిమితంగా పెరగడాన్ని స్థూలంగా ‘బ్లడ్ క్యాన్సర్’గా చెప్పవచ్చు. ఈ సమస్యకు మూలం ప్రధానంగా బోన్ మ్యారో (ఎముక మజ్జ /మూలగ)లో ఉండి, అక్కడే అది ప్రారంభమవుతుంది. సాధారణంగా ఎముక మజ్జ (మ్యారో)లో తొలుత మూలకణాలు అభివృద్ధిచెంది... క్రమంగా అవి ఎర్రరక్తకణాలు (ఆర్‌బీసీ), తెల్లరక్తకణాలు (డబ్ల్యూబీసీ), ప్లేట్‌లెట్స్‌గా రూపొందుతాయి.
బ్లడ్ క్యాన్సర్ వచ్చినవారిలో సాధారణంగా తెల్లరక్తకణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. దాంతో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఇలా నియంత్రణ లేకుండా పెరిగిన తెల్లరక్తకణాలు మిగతా వాటిని పనిచేయనివ్వవు. ఫలితంగా వ్యక్తులు తమ స్వాభావికమైన రోగనిరోధక శక్తిని కోల్పోతారు. బ్లడ్ క్యాన్సర్స్‌లో ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. అవి... 1) లుకేమియా 2) లింఫోమా 3) మైలోమా.
లక్షణాలు: బ్లడ్‌క్యాన్సర్‌లో పూర్తిగా పరిపక్వం కాని తెల్లరక్తకణాలు అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతుంటాయి. ఫలితంగా గాయాలైనప్పుడు రక్తాన్ని గడ్డకట్టించడానికి ఉపయోగపడే ప్లేట్‌లెట్స్ తగ్గిపోతాయి. ఫలితంగా క్యాన్సర్ రోగులలో గాయాలైనప్పుడు అధిక రక్తస్రావం, శరీరం కమిలినట్లుగా కనపడటం, చర్మం మీద ఎర్రగా దద్దుర్లు కనిపిస్తుంటాయి. వ్యాధులను కలగజేసే సూక్ష్మజీవులతో తెల్లరక్తకణాలు పోరాడుతుండటం వల్ల మనకు వ్యాధినిరోధకత చేకూరుతుందన్న విషయం తెలిసిందే. అయితే అపరిపక్వమైన తెల్లరక్తకణాల వల్ల వాటి పనితీరు దెబ్బతినడం... ఫలితంగా వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుంది.
పైగా అవి విపరీతంగా పెరగడం వల్ల ఎర్ర రక్తణాలు తగ్గిపోవడంతో రోగికి రక్తహీనత రావచ్చు. దాంతో వాళ్లలో తగినంత ఆక్సిజన్ అందక ఆయాసం కూడా రావచ్చు. అంతేకాదు... జ్వరం, వణుకు, రాత్రుళ్లు చెమటలు పట్టడం, ఇన్‌ఫ్లుయెంజా, అలసట, ఆకలి లేకపోవడం, కాలేయం, స్పీ›్లన్ పెరగడం, ఎముకల నొప్పి లాంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు బోన్‌మ్యారో పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేస్తారు. సాధారణంగా బ్లడ్ క్యాన్సర్ ఉన్నవారికి ప్రధానంగా మందుల (కీమోథెరపీ)తోనే ఎక్కువగా చికిత్స అందిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment