పనాజి: భారత్‌లో కరోనా విజృంభణ తర్వాత క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అభిప్రాయపడ్డారు. గోవా మిరామర్ బీచ్‌లో శనివారం పతాంజలి యోగా సమితి నిర్వహించిన యోగా క్యాంప్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొవిడ్-19 మహమ్మారి విజృంభణ తర్వాతే ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు కంటిచూపును, వినికిడి శక్తిని కోల్పోతున్నారు అని ఆయన ప్రసంగించారు. అయితే బాబా రాందేవ్ అభిప్రాయాన్ని.. వైద్య నిపుణులు తోసిపుచ్చుతున్నారు.
గోవాలోని ఇండియన్ మెడికల్ అసోషియేషన్ విభాగం మాజీ అధికారి, ప్రముఖ ఆంకాలజిస్ట్ శేఖర్ సాల్కర్ స్పందిస్తూ.. ప్రపంచ జనాభాతో పాటే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ప్రతీ రెండేళ్లకొకసారి క్యాన్సర్ కేసుల్లో ఐదు శాతం పెరుగుదల చోటుచేసుకోవడం సాధారణమే అని డాక్టర్ శేఖర్ స్పష్టం చేశారు. 2018లో భారత్‌లో లక్షకు 85 క్యాన్సర్ కేసులు వెలుగు చూసేవి. ఇప్పుడు ఆ సంఖ్య లక్ష జనాభాకు 104 క్యాన్సర్ కేసులకు చేరింది. క్యాన్సర్ కేసులు తగ్గడం అనేది ఉండదు. అలాగే కరోనా లాంటి మహమ్మారితో దానిని ముడిపెట్టడం సరికాదని, అందుకు సంబంధించిన ఆధారాలేవీ లేవని అన్నారాయన. డాక్టర్ శేఖర్ గోవా బీజేపీ మెడికల్ సెల్‌కు చీఫ్ కూడా.
సెలబ్రిటీలపై ప్రజల్లో కొంత నమ్మకం ఉంటుందని, వాళ్లు బాధ్యతాయుతంగా వ్యాఖ్యలు చేయాలంటూ పరోక్షంగా రాందేవ్‌కు చురకలంటించారాయన. అమెరికాలో ప్రతీ లక్ష జనాభాకు 500 క్యాన్సర్ కేసులు వెలుగు చూస్తున్నాయని, ప్రస్తుతానికి భారత్‌లో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా.. సరైన జీవనశైలిని అవలంభించకపోతే క్యాన్సర్ రేటులో అమెరికాను భారత్ మించి పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment