Cancer In Children: Symptoms, Warning Signs, Childhood Cancer Late Effects In Telugu - Sakshi
Sakshi News home page

పిల్లల్లో వచ్చే క్యాన్సర్లు ఇవే.. వాటి లక్షణాలు, రకాలు తెలుసుకోండి!

Published Sun, Aug 8 2021 11:24 AM | Last Updated on Sun, Aug 8 2021 3:49 PM

Signs And Effects Of Cancer In A child - Sakshi

పిల్లలది అభం, శుభం తెలియని అమాయకత్వం. వాళ్లది ఆటలాడుకునే పసిప్రాయం. వాళ్లకసలు క్యాన్సర్‌ అనే పదానికి అర్థమే తెలియదు. కానీ క్యాన్సర్‌కు అవేమీ పట్టవు. పెద్దవారిలో వచ్చే అన్ని క్యాన్సర్లూ పిల్లల్లోనూ వచ్చినప్పటికీ... కొన్ని రకాలు పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. లుకేమియా (రక్త సంబంధిత క్యాన్సర్లూ), మెదడులో వచ్చే కణుతులు (బ్రెయిన్‌ ట్యూమర్స్‌), లింఫోమా, సాఫ్ట్‌ టిష్యూ సార్కోమా వంటివి పిల్లల్లో ఎలాంటి లక్షణాలూ చూపకుండానే అకస్మాత్తుగా వచ్చే జ్వరం వంటి లక్షణాలతో బయట పడవచ్చు. ఒకరినో ఇద్దరినో కని, ఆ సంతానాన్ని అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులు తమ చిన్నారికి క్యాన్సర్‌ అనగానే తల్లడిల్లిపోతారు.

అయితే అదృష్టవశాత్తూ పిల్లల్లో వచ్చే చాలా రకాల క్యాన్సర్లు పూర్తిగా నయం చేయదగినవే. వాళ్లలో వచ్చే చాలా రకాల క్యాన్సర్లు ఇప్పుడు చికిత్సకు లొంగిపోతుండటం విశేషం. చాలామంది సెలబ్రిటీస్, సినీతారలు, ఇతరత్రా రంగాల్లో నిపుణులు చిన్నప్పుడు క్యాన్సర్‌కు గురైనప్పటికీ, చికిత్స తీసుకుని, ఇప్పుడు అందరిలాగే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ వాళ్ల రంగాల్లో ముందుకెళ్తున్నవారు చాలామందే ఉన్నారు. 

మనదేశంలో ప్రతీ ఏడాదీ దాదాపు 45,000 మంది పిల్లలు క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. వీళ్లలో 70 శాతం మందికి వ్యాధి పూర్తిగా నయమవుతుంది. అయితే 30 శాతం మందిలో వారి జీవితకాలంలో అది ఎప్పుడో ఒకప్పుడు తిరగబెట్టే ప్రమాదం ఉంది. చిన్నప్పుడు 20 ‘గ్రే’ల కంటే ఎక్కువగా రేడియేషన్‌కు గురైనా క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ‘గ్రే’అంటే శరీరం గ్రహించిన రేడియేషన్‌ అని అర్థం. మామోగ్రామ్‌ వంటి పరీక్షలు మరీ చిన్నవయసులో చేయించడమూ అంత మంచిది కాదు. 30 ఏళ్లు పైబడ్డాక డాక్టర్‌ సలహా మేరకు చేయించుకుంటేనే మంచిది. 

చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లు చాలావరకు కీమో, రేడియేషన్‌కు స్పందిస్తాయి. పిల్లలు రేడియేషన్‌ తీసుకునేటప్పడు ఒంటరిగా ఉండటానికి భయపడి చికిత్సకు సహకరించకపోతే కొన్ని సందర్భాల్లో వారికి మత్తు ఇస్తారు. 12 ఏళ్లు పైబడ్డాక అమ్మాయికి గానీ, అబ్బాయికి గానీ క్యాన్సర్‌ చికిత్స వల్ల పునరుత్పత్తి వ్యవస్థ మీద ప్రభావం పడుతుందనుకుంటే... అలాంటిప్పడు ముందుగానే వారి నుంచి అండాలను, వీర్యకణాలను సేకరించి భద్రపరుస్తుంటారు. 

పిల్లల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్‌ 
లుకేమియా. మనల్ని ఇన్ఫెక్షన్స్‌ నుంచి కాపాడే తెల్లరక్తకణాలు అపరిమితంగా పెరిగిపోవడమే లుకేమియా. ఇలా అధికంగా పెరిగిన తెల్లరక్తకణాలు ఎర్రరక్తకణాలను అడ్డుకుని రక్తాన్ని సరిగా సరఫరా కానివ్వవు. ఇలా ఒక్కసారిగా జరగడం కానీ లేదా దీర్ఘకాలికంగా గానీ జరగవచ్చు. చాలావరకు నయం చేయగలిగే ఈ చికిత్సలో కీమో, రేడియో ధెరపీలు ఉంటాయి. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, స్టెమ్‌సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ప్రక్రియలు ఈ క్యాన్సర్‌కు బాగా పనిచేస్తాయి. మొదటి బిడ్డకు రక్తసంబంధిత క్యాన్సర్‌ ఉంటే రెండో బిడ్డ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. 

పిల్లలు పాలిపోయినట్లుగా ఉండటం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, నీరసం, అలసట ఎక్కువగా ఉండటం, త్వరగా చర్మం కమిలిపోవడం, మచ్చలుమచ్చలుగా ఉండటం, తీవ్రమైన రక్తస్రావం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే లుకేమియాను అనుమానించాల్సి ఉంటుంది. రక్తపరీక్షలు, తుంటి లేదా ఇతర పెద్ద ఎముకల నుంచి తీసిన మూలగ (బోన్‌మ్యారో)ను పరీక్షించడం ద్వారా ఈ క్యాన్సర్‌ను కనుక్కోవచ్చు. 

పెద్దవాళ్లలో కంటే పిల్లల్లో బ్రెయిన్‌ ట్యూమర్స్‌ ఎక్కువని చెప్పవచ్చు. పొద్దున్నే లేవగానే తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు, ప్రవర్తించే తీరుమారడం, ఆందోళన, ఫిట్స్, చూపు/మాట మందగించడంవంటి లక్షణాలను మెదడు కణితిగా అనుమానించాల్సి ఉంటుంది. అది క్యాన్సర్‌ కణితి అయినా, కాకపోయినా రెండూ ప్రమాదకరమే. మెదడులో కణితి వచ్చిన ప్రదేశాన్ని బట్టి సర్జరీతో దాన్ని తొలగించడమా లేక ఇతర చికిత్స ప్రక్రియలు అనుసరించడం మంచిదా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్సను నిర్ణయిస్తారు. ఒక్కోసారి మెదడు కణితిని రేడియోసర్జరీతో తొలగిస్తారు. 

రోగనిరోధక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించే లింఫ్‌నాళాలకు సంబంధించిన క్యాన్సర్‌లో హాడ్జ్‌కిన్స్, నాన్‌హాడ్జ్‌కిన్స్‌ అనే రకాలుంటాయి. మెడ, చంకల్లో, గజ్జల్లో లింఫ్‌నాళాలు వాయడం, జ్వరం, చలి, ఆకలి తగ్గడం, రాత్రిళ్లు చెమటలు, దగ్గు, ఊపిరితీసుకోవడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలతో లింఫోమాలు బయటపడుతుంటాయి. ఇతర టిష్యూలను కలిపే సాఫ్ట్‌ టిష్యూలలో వచ్చే క్యాన్సర్స్‌ను సాఫ్ట్‌టిష్యూ సార్కోమా అంటారు. ఎముకలను, కండరాలను కలిపే ఈ సాఫ్ట్‌ టిష్యూ క్యాన్సర్స్‌ లక్షణాలు... వచ్చిన ప్రదేశం మీద ఆధారపడి ఉంటాయి. ఈ టిష్యూలకు సాగే గుణం ఉండటం వల్ల తొలిదశలో లక్షణాలు బయటపడవు. సాఫ్ట్‌టిష్యూలలో వచ్చే క్యాన్సర్స్‌కు ప్రధానంగా సర్జరీ, అవసరాన్ని బట్టి దానికంటే ముందు లేదా తర్వాత రేడియో, కీమో థెరపీలుంటాయి. అండాల్లో, టెస్టిస్‌లో వచ్చే జెర్మ్‌సెల్‌ ట్యూమర్స్‌ కూడా పిల్లల్లో ఎక్కువ. 

రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో అడ్రినల్‌గ్రంథిలో, మెడ, ఛాతీ, పొట్ట, పెల్విస్‌లలో వచ్చే కణుతులు (న్యూరో)బ్లాస్టోమాలు, ఎముకలు, టిష్యూలలో వచ్చే ఈవింగ్‌ సర్కోమా, కిడ్నీల్లో వచ్చే నెఫ్రోబ్లాస్టోమా వంటివి పిల్లల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లు. పిల్లల్లో పూర్తిగా నయం చేయగలిగిన ఈ క్యాన్సర్స్‌ పెద్దవాళ్లలో కనిపిస్తే మాత్రం అంతే తేలిగ్గా నయం కాకపోవచ్చు. పిల్లల్లో అరుదుగా కనిపించే మిగతా క్యాన్సర్స్‌ అదుపులోకి రావడం కొంత కష్టం కావచ్చు లేదా ఎంతగా ప్రయత్నించినా చికిత్సకు లొంగకపోవచ్చు. పుట్టుకతో వచ్చే లోపాలు, జన్యుసంబంధంమైన కారణాలు పిల్లల్లో క్యాన్సర్‌కు దారితీయవచ్చు. కాబట్టి ముందు పుట్టిన బిడ్డకు క్యాన్సర్‌ ఉంటే రెండోబిడ్డ విషయంలో జాగ్రత్తగా ఉండటం, లక్షణాలు గుర్తించి సరైన చికిత్స అందించడం, పోషకాహార లోపాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవడం, చికిత్స తర్వాత కూడా డాక్టర్‌ సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement