భూమి సాగుచేసుకుంటున్నారని దళిత రైతులపై అక్రమ కేసులు!
వందలాది ఎకరాల్లో సాగు చేయడంతోపాటు భూములు కౌలుకు ఇచ్చుకుంటున్న టీడీపీ నేతలకు వత్తాసు..
తాడికొండ: కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు.. రాజధానిలో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న పేదలు, దళిత రైతులను మాత్రమే టార్గెట్‌గా చేసి అక్రమ కేసులు బనాయిస్తున్న సీఆర్డీయే అధికారులు.. టీడీపీకి చెందిన రైతులకు మాత్రం వత్తాసు పలుకుతుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. తాజాగా శాఖమూరు గ్రామానికి చెందిన జొన్నకూటి ప్రశాంత్ అనే దళిత రైతు సీఆర్డీయే అధికారుల ఆదేశాల మేరకు మినుము పైరును రోటోవేటర్‌తో దున్ని అప్పగించిన తరువాత కూడా అక్రమ కేసు నమోదు చేయడం పట్ల పలువురు విస్తుపోతున్నారు.
ఇదంతా ఓ ఎత్తయితే టీడీపీకి చెందిన నాయకులు భారీగా సాగు చేసుకుంటూ, కౌలుకు ఇచ్చుకుంటున్న పంట పొలాల వైపు కన్నెత్తి చూడకపోవడం వారి పక్షపాత వైఖరికి అద్దం పడుతున్నది . తుళ్లూరు మండల పరిధిలో పూలింగ్‌కు ఇచ్చి రిటర్న్‌బుల్ ప్లాట్లు పొంది వార్షిక కౌలు తీసుకుంటున్న రైతులు పొలాలను దున్ని సాగు చేసుకుంటున్నారు. మరి కొంతమంది ఎకరా రూ.30 వేలకు కౌలుకు ఇచ్చుకుంటున్నారు. అయితే ఇలా.. సాగు చేసుకుంటున్న వారిలో కేవలం దళిత రైతులపై సీఆర్డీయే అధికారులు ఉక్కుపాదం మోపుతూ.. మిగిలిన వారిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.
ఇప్పటికే టీడీపీ నాయకుల చేతుల్లో వందలాది ఎకరాలు బందీగా మారినప్పటికీ అధికారులు అటువైపు తొంగి చూసిన దాఖలాలు లేవు. శుక్రవారం వారాంతపు గ్రీవెన్స్‌లో భాగంగా వైఎస్సార్‌సీపీ నాయకులు కాకర్ల నాగేశ్వరరావు, గద్దర్ చెన్నకేశవ తదితరులు సీఆర్డీయే అడిషనల్ కమిషనర్ జి సూర్యసాయి ప్రవీణ్ చంద్‌ను కలిసి టీడీపీ నాయకుల ఆక్రమణలో ఉన్న పంట పొలాలపై ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన స్పందించలేదని వారు తెలిపారు.
పనుల్లేక పస్తులుండలేక ఖాళీగా ఉన్న భూముల్లో పేదలు ఎస్సీ, ఎస్టీ రైతులు పంటలు సాగు చేసుకుంటే కేసులు నమోదు చేసి వేధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి చెందిన నాయకుల చేతిలో ఉన్న భూములను కూడా దున్నడంతో పాటు కేసులు నమోదు చేయకపోతే తాము న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment