సాక్షి, అమరావతి బ్యూరో: రాజధానిలో కిరాయి హంతక ముఠాలు మళ్లీ విజృంభిస్తున్నాయి. చాప కింద నీరులా కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై పోలీసు శాఖ నిఘా పెట్టడంలో ఉదాసీనత ప్రదర్శిస్తుండటంతో వీరి ఆగడాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లో వ్యాపారి రాంప్రసాద్‌ను హత్యలో గుంటూరు, విజయవాడకు చెందిన రౌడీషీటర్ల హస్తం ఉండటం రాజధానిలో కలకలం రేపుతోంది.
పోలీసుల వైఫల్యం..
వ్యాపారి రాంప్రసాద్ హత్య వ్యవహారంలో విజయవాడ పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రౌడీషీటర్లపై నిఘా పెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. గుంటూరు, విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో వెయ్యి మందికిపై రౌడీషీటర్లు ఉన్నారు. ఈ నగరాల్లో ఏ కేటగిరీ వారిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. వీరి కదలికలపై కమిషనర్ టాస్క్‌ఫోర్స్, సంబంధిత స్టేషన్ల అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
విజయవాడ నగరంలో..
ముఖ్యంగా విజయవాడ నగరంలో పలుకుబడి కలిగిన రౌడీషీటర్లు చాలా మంది నెలల తరబడి సంబంధిత స్టేషన్లకు రాకపోయినా పోలీసులు స్పందించడం లేదు. ‘ఏ’ కేటగిరీ రౌడీషీటర్ల విభాగంలో ఉన్న కోగంటి సత్యం ఈ ఏడాది జనవరి నుంచి పటమట స్టేషన్‌కు రాకపోయినా పట్టించుకోలేదు. నేరాభియోగాలు ఎదుర్కొంటూ రౌడీషీట్ ఉన్న వ్యక్తి చాలా కాలం నుంచి స్టేషన్‌కు ఎందుకు రావడం లేదన్న దానిపై కనీసం దృష్టి కూడా పెట్టలేదు. ఇన్నాళ్లు రాకపోతే ఏదైనా కుట్రకు పాల్పడుతున్నాడా? అన్న కోణంలో కూడా చూడలేదు. సత్యం కదలికలపై కూడా నిఘా పెట్టలేదు. ఇన్నాళ్లు రాకుండా ఉండడానికి ఏమైనా మినహాయింపు తీసుకున్నారా? అన్న విషయాన్ని పోలీసులు బయటపెట్టడం లేదు. ఈ సమయంలో ఎక్కడ ఉన్నారు? ఎవరిని కలిశారు? అన్న అంశాలపై హైదరాబాద్ పోలీసులు పరిశీలిస్తే కానీ అసలు విషయం బయటపడలేదు.
శ్యామ్ సుందర్‌పైనా నిఘా లేదు..
రాంప్రసాద్‌ను తానే చంపానని హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయిన శ్యామ్, బెజవాడ వాసి. గతంలో రాజరాజేశ్వరీపేటలో కేబుల్ ఆపరేటర్‌గా పని చేశాడు. ఇతడితో కోగంటి సత్యం కృష్ణలంకలోని బందరు లాకుల ఎదుట తన కార్యాలయం ప్రాంగణంలోనే ‘కె వాటర్‘ పేరుతో నీటి ప్లాంటు పెట్టించాడు. ఆయనపై విజయవాడలోని నున్న పోలీసు స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. 2013లో రాంప్రసాద్ హత్యాయత్నం, కిడ్నాప్ కేసు నమోదు అయింది. ఈ కేసులో అప్పట్లో కోగంటి సత్యంతో పాటు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. రాంప్రసాద్ హత్యకు ఉపయోగించిన కత్తులను ఈ ప్లాంటులోనే తయారు చేయించాడు. గత కొన్ని నెలలుగా శ్యామ్ కూడా బయటకు రాకుండా ఉన్నాడు. రౌడీషీట్ ఉన్న వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లాడంటే ఏదో కుట్రకు ప్రణాళిక రచిస్తున్నాడేమోనన్న అనుమానం కూడా పోలీసులకు రాకపోవడం గమనార్హం. తనపై ఎలాంటి పోలీసుల నిఘా లేకపోవడంతో రాంప్రసాద్ హత్యకు ప్లాన్ చేసి అమలు చేశాడు.
అందరూ విజయవాడ వాసులే..
కేసులో ఏ2గా ఉన్న టెక్కం శ్యామ్ సుందర్‌తో పాటు రాంప్రసాద్ హత్యలో పాల్గొన్న నిందితుల్లో చాలా మంది విజయవాడ వాసులే. రాంప్రసాద్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఏ3గా ఉన్న పులివర్తి బాల నాగాంజనేయ ప్రసాద్, ఏ4 మండే ప్రీతం, ఏ5 పులివర్తి రాములుది గుంటూరు జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామం. వీరు ప్రస్తుతం ఉపాధి నిమిత్తం కృష్ణలంకలో నివాసం ఉంటున్నారు. ఏ6 తిరుపతి సురేష్ భవానీపురం నివాసి. ఇతడిపై భవానీపురం స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఉంది. ఇతడు కోగంటి అనుచరుడు. 2003లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పట్లో వన్‌టౌన్ స్టేషన్‌లో షీట్ తెరిచారు. ఈ స్టేషన్ నుంచి భవానీపురం స్టేషన్‌ను విడగొట్టడంతో ఇక్కడికి బదిలీ అయింది. సురేష్‌కు అనుచరుడిగా ఏ10 పత్తిపాటి నరేష్ కొనసాగుతున్నాడు. ఏ7 చండిక ఆనంద్, ఏ8 శ్రీరామ్ రమేష్, ఏ9 షేక్ అజారుద్దీన్ అలియాస్ చోటు, ఏ11 వెంకట్ రాంరెడ్డిలు కూడా విజయవాడకు చెందిన వారిగా హైదరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment