కమిషనరేట్‌పై 'అధికార' పెత్తనం
ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పోలీస్‌స్టేషన్లు
కేసుల్లో పెరుగుతున్న అధికార పార్టీ నేతల జోక్యం
సీఐకే న్యాయం చేయలేని మరో సీఐ
సీపీ సీరియస్ అయ్యాకే కేసు నమోదు
సాక్షి, విజయవాడ : నగర కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లపై అధికార పార్టీ నేతల పెత్తనం పెరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తాము చెప్పిందే చేయాలంటూ పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. పోలీస్‌స్టేషన్లలో హల్‌చల్ చేస్తూ దందాలు సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో ఈ పరిస్థితి నెలకొంది. పరిస్థితి తీవ్రమై నగర పోలీస్ కమిషనర్ దృష్టికి రావడం, ఆయన సర్కిల్ ఇన్‌స్పెక్టర్లపై సీరియస్ అయితే కానీ కేసులు నమోదు కాని పరిస్థితికి వచ్చింది.
అడుగడుగునా జోక్యం...
విజయవాడ నగరంలో అధికార పార్టీకి చెందిన ఒక అమాత్యుడు, ప్రజాప్రతినిధి జోక్యం బాగా పెరిగింది. ముఖ్యంగా పోలీస్‌స్టేషన్లల్లో అయితే సాధారణ ఫిర్యాదుల విషయాల్లో తరచూ వీరు జోక్యం చేసుకోవడం, కొన్ని సందర్భాల్లో వివాదంగా మారుతోంది. పర్యవసానంగా పోలీసులు బాధితులకు న్యాయం చేయలేని పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇటీవల స్థలవివాదంలో ఒక సీఐ మరో స్టేషన్ పరిధిలోని సీఐని ఆశ్రయిస్తే న్యాయం జరగని పరిస్థితి ఉందంటే అధికార పార్టీ ఒత్తిళ్ల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏడాదిన్నరగా పోలీసులపై అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు పెరిగాయి.
అమాత్యుని ఒత్తిడి
భవానీపురంలో ఈ నెల 22న ఒక కేసు నమోదైంది. అక్కడ ఐదు ఎకరాల విస్తీర్ణంలో కాంప్లెక్స్‌ను నగరంలోని వ్యాపారులు కొన్నేళ్ల కిత్రం నిర్మించారు. ఈ క్రమంలో దాని పక్కనే 1.5 ఎకరాల స్థలం యజమాని, గొల్లపూడి ఉప సర్పంచ్ తన స్థలానికి రోడ్డు కోసం అనుమతి లేకుండా 25 అడుగుల మేర కాంప్లెక్స్ గోడను ధ్వంసం చేశారు. ఈ ఘటన 21వ తేదీ అర్ధరాత్రి జరగ్గా 22న ఉదయం పది గంటలకు కాంప్లెక్స్ వ్యాపారులు భవానీపురం సీఐ గోపాలకృష్ణకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో ఉప సర్పంచ్‌కు మద్దతుగా ఓ అమాత్యుడు, కీలక ప్రజాప్రతినిధి జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఫిర్యాదును పట్టించుకోలేదు. సాయంత్రం వరకు స్టేషన్ వద్ద రాజీ హైడ్రామా నడిపించారు. చివరకు బాధితులు నగర పోలీసు కమిషనర్‌ను కలిసి సమస్యను వివరించారు. దీనిపై సీపీ స్పందించడంతో సీఐ గోపాలకృష్ణ ఆఘమేఘాలపై కేసు నమోదు చేసి ఉపసర్పంచ్ చిగురుపాటి నాగరాజును అరెస్టు చేశారు. ఆ తర్వాత కూడా రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటంతో ఆయన్ను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.
సీఐకీ దక్కని న్యాయం
సాధారణంగా పోలీసులు అంటే తోటి పోలీసులకు గౌరవం ఉంటుంది. అలాంటిది ఒక సీఐ బాధితుడుగా మారి తన సమస్యపై స్టేషన్ వచ్చి మరో సీఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. కంకిపాడు సీఐ ఎం.రాజ్‌కుమార్‌కు విజయవాడలోని కేఎల్ రావు నగర్‌లో పూర్వీకుల ద్వారా వచ్చిన ఇల్లు ఉంది. అదే ప్రాంతానికి చెందిన తమ్మిన కృష్ణ, దుర్గాంబతో ఆ ఇంటి విషయమై వివాదాలు ఉన్నాయి. సీఐ రాజ్‌కుమార్ కోర్టును ఆశ్రయించి ఇంటిపై తనకే సర్వహక్కులు ఉండేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు.
ఈ క్రమంలో తమ్మిన కృష్ణ, దుర్గాంబ ఇంటిని ఆక్రమించుకోవడానికి యత్నించడంతో సీఐ రాజ్‌కుమార్ కొత్తపేట సీఐ దుర్గారావుకు ఈ నెల 22న ఫిర్యాదు చేశారు. అయినా సీఐ దుర్గారావు స్పందించలేదు. తమ్మిన కృష్ణకు మద్దతుగా కీలక ప్రజాప్రతినిధి రంగంలోకి దిగి ఒత్తిడి తీసుకురావడంతో దుర్గారావు మౌనం వహించారు. చివరకు 23న ఈ విషయం కమిషనరేట్ వర్గాల ద్వారా సీపీకి తెలిసింది. దీంతో రాజ్‌కుమార్ ఫిర్యాదుకు కదలిక వచ్చి నిందితులు తమ్మిన కృష్ణ, దుర్గాంబతో పాటు మరో ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదైంది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఆ రెండు కేసులతో స్తబ్దు...
గుట్కా సిండికేట్ వ్యవహారంలో వరుస అరెస్టులు, అందులోనూ అధికార పార్టీ నేతల అరెస్టులు జరిగాయి. ఆ తర్వాత కాల్‌మనీ కేసుల్లో పోలీసులు తొలుత రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. ఈ రెండు వరుస ఘటనల తర్వాత ప్రజాప్రతినిధులు కొంత కాలం స్తబ్దుగా ఉన్నారు. నెల నుంచి మళ్లీ సిఫార్సులు, అడ్డగోలు పంచాయితీలకు తెరతీస్తున్నారు. ఇటీవల భవానీపురం పోలీస్ స్టేషన్, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో ఈ తరహా వ్యవహారాలు సాగాయి. చివరకు రెండు కేసుల్లో నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ సీరియస్ అయ్యాకే కేసులు నమోదయ్యాయి.