విజయవాడ కమిషనరేట్ పరిధిలోనే తుళ్లూరు
డీజీపీ జేవీ రాముడు వెల్లడి
విజయవాడ సిటీ : రాజధాని ప్రతిపాదిత ప్రాంతమైన తుళ్లూరు సబ్ డివిజన్ విజయవాడ కమిషనరేట్ పరిధిలోనే ఉంటుందని రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్ జేవీ రాముడు తెలిపారు. కమిషనరేట్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో డీజీపీ పాల్గొన్నారు. రాజధాని పట్టణం స్మార్ట్ సిటీగా రూపొందించాల్సి ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కమిషనరేట్ పరిధిలోకి ఆ ప్రాంతాన్ని తీసుకురావాల్సి ఉంటుందని చెప్పారు.
ఏ ప్రాంతం ఏ కమిషనరేట్ పరిధిలో ఉండాలనేది మాత్రం ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్టు వివరించారు. సమావేశంలో అదనపు డీజీపీలు ఎన్‌వీ సురేంద్రబాబు, అనూరాధ, వీఎస్ కౌముది, ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.