ఒక్క కేసులోనే సత్యానందంకి బెయిల్ : డీజీపీ
విజయవాడ : కాల్మనీ కేసుకి సంబంధించి ఓ కేసులో మాత్రమే డీఈ సత్యానందం బెయిల్ పొందాడని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడు వెల్లడించారు. అతని మీద మరికొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో విచారణ కోసం సత్యానందంను అదుపులోకి తీసుకుంటామని రాముడు స్పష్టం చేశారు.
గురువారం విజయవాడలో ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన నేరాల సంఖ్యపై జేవీ రాముడు మాట్లాడారు. ఈ ఏడాది 100 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. మరో 96 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాలో 2,710 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. 2014తో పోలిస్తే ఈ ఏడు నేరాల సంఖ్య 4.23 శాతం తగ్గిందని డీజీపీ రాముడు విశ్లేషించారు.