విజయవాడ సిటీ:కాల్ మనీ- సెక్స్ రాకెట్ కేసులో నాలుగో నిందితుడైన విద్యుత్‌శాఖ డీఈ ఎం.సత్యానందం గురువారం ఒకటవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో సత్యానందంకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు మంగళవారం తీర్పుచెప్పిన విషయం విదితమే. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇక్కడి 1వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో తన న్యాయవాదులు విష్ణువర్థన్‌రెడ్డి, సీహెచ్ మన్మథరావులతో కలిసి వచ్చి సత్యానందం లొంగిపోయాడు. రూ.లక్ష పూచీకత్తుతోపాటు ప్రతి రోజు ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో కేసు నమోదైన మాచవరం పోలీసుస్టేషన్‌లో హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ సంతకాలు చేయాలనేది హైకోర్టు ఆదేశం.
సత్యానందం కోర్టుకు సమర్పించిన పూచీకత్తులను ఇన్‌చార్జి న్యాయమూర్తి డి.సత్యప్రభాకరరావు పరిశీలించారు. రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు, నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్, ఇతర పోలీసు అధికారులతో కలిసి వార్షిక నేర సమీక్షను విలేకరుల సమావేశంలో విడుదల చేస్తున్న సమయంలో సత్యానందం లొంగుబాటు విషయం తెలిసింది. కంగుతిన్న పోలీసు ఉన్నతాధికారులు మాచవరం ఇన్‌స్పెక్టర్ కె.ఉమామహేశ్వరరావు సహా ప్రత్యేక పోలీసు బృందాన్ని కోర్టు వద్దకు పంపింది. ఇదే సమయంలో సత్యానందంపై మరికొన్ని కేసులు కూడా ఉన్నాయంటూ డీజీపీ రాముడు చెపుతూ ఆయా కేసులపై కూడా తగు చర్యలు తీసుకుంటామన్నారు. మరో కేసుపై అరెస్టు చేయనున్నారనే సమాచారంతో సత్యానందం న్యాయవాదులతోపాటు కోర్టుకు భారీగా న్యాయవాదులు చేరుకున్నారు. కోర్టు ప్రొసీడింగ్స్ పూర్తి కాగానే న్యాయవాదులతో కలిసి బయటకు వచ్చిన సత్యానందం తన కారెక్కి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులను చూసి ఉద్వేగం చెందిన సత్యానందం అస్వస్థతకు లోనై సాయంత్రం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకోసం చేరగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీపీ కార్యాలయానికి, ఆపై గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు.
కోర్టులో లొంగిపోయిన విద్యుత్ శాఖ డీఈ సత్యానందం
Published Thu, Dec 31 2015 11:02 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
Advertisement