Satyanandam
-
వీడిన కాకినాడ జంట హత్యల కేసు మిస్టరీ!
సాక్షి, తూర్పుగోదావరి: నాలుగు నెలల క్రితం కాకినాడలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాకినాడ టూటౌన్ పోలీసులు.. సోమవారం నిందితుడు వీర్రాజును అరెస్టు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. నిందితుడు వీర్రాజు గతంలో రెండేళ్ల పాటు అదే ఇంట్లో అద్దెకు ఉన్నాడనీ, స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు రావడంతో చోరీలకు పాల్పడేవాడు. అదే క్రమంలో చోరీకి పాల్పడుతూ అడ్డుకున్న దంపతులను హత్య చేశాడు. ఈ క్రమంలో ఆధారాలు దొరకకుండా ఉండేందుకు పలు డాక్యుమెంట్లను తగులబెట్టాడు. కాగా జూన్ 7న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ముమ్మిడివారి వీధిలో నివాసం ఉంటున్న తుమ్మలపల్లి సత్యానందం (65), మంగతాయారు (62) అనే వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. భార్యభర్తలను హత్య చేసిన ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు చేసిన కేవలం మూడు సెకండ్స్ ఫోన్ కాల్ ఆధారంగా కేసును చేధించామని జిల్లా ఎస్పీ నయీం అస్మీ వెల్లడించారు. అంతేకాక అతని నుంచి రూ. 4 లక్షల 75 వేల విలువైన వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నట్లు మీడియాకు వివరించారు. -
కాకినాడలో వృద్ధ దంపతులు హత్య
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ముమ్మిడివారి వీధిలో నివాసం ఉంటున్న తుమ్మలపల్లి సత్యానందం (65), మంగతాయారు (62) అనే వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలు..కాకినాడ తిలక్ స్ట్రీట్‌లో ఉంటున్న సత్యానందం, మంగతాయారు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. పెద్ద కుమార్తె మంజులాదేవి, కుమారుడు మోహన్‌కుమార్‌లు అమెరికాలో ఉంటుండగా మరో కుమార్తె విజయలక్ష్మి బెంగళూరులో ఉంటున్నారు. కాగా, భార్యాభర్తలిద్దరూ గురువారం ఓ ఫంక్షన్‌కు హాజరై అందరితో సంతోషంగా గడిపి తమ ఇంటికి వెళ్లిపోయారు. అనంతరం శుక్రవారం ఉదయం బంధువులు, స్నేహితులు ఎంతసేపు ఫోన్‌చేసినా స్పందన లేకపోవడంతో సత్యానందం తోడల్లుడు వడుగల వెంకటేశ్వరరావుకు ఫోన్‌చేసి విషయం చెప్పారు. దీంతో శుక్రవారం సాయంత్రం ఆయన వచ్చి చూసేసరికి ఇంటి గేటుకు తాళం వేసి, బయట పాల ప్యాకెట్టు, పేపరు వేసినవి వేసినట్లే ఉన్నాయన్నారు. అనుమానం వచ్చి పక్క మేడపై నుంచి వెళ్లి చూడగా రక్తపు మడుగులో భార్యాభర్తలిద్దరూ పడి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. కొన్ని గంటల ముందు వరకు తమతో ఎంతో సంతోషంగా గడిపిన వీరు అంతలోనే విగతజీవులుగా మారిపోవడంతో బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనా స్థలంలో కొన్ని డాక్యుమెంట్లు కాల్చివేసి ఉండడంతో ఆస్తి తగాదాలు కారణమై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అలాగే, బలమైన ఆయుధంతో తలపై కొట్టడంవల్లే వీరు మృతిచెంది ఉంటారని వారు అనుమానిస్తున్నారు. -
సత్యానందం లొంగుబాటు
* కాల్‌మనీ కేసులో కోర్టులో లొంగిపోయిన నిందితుడు * మరో కేసులో అరెస్టు విజయవాడ సిటీ/ఇబ్రహీంపట్నం: కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ కేసులో నాలుగో నిందితుడైన విద్యుత్ శాఖ డీఇ ఎం.సత్యానందం గురువారం విజయవాడలో ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయాడు. మరో కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కాల్‌మనీ కేసులో సత్యానందంకు హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఒకటో అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో సత్యానందం లొంగిపోయాడు. రూ.లక్ష పూచీకత్తు సమర్పించడంతోపాటు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మాచవరం పోలీసుస్టేషన్లో హాజరై సంతకం చేయాలని సత్యానందంను హైకోర్టు ఆదేశించింది. సత్యానందం కోర్టుకు సమర్పించిన పూచీకత్తును ఇన్చార్జి న్యాయమూర్తి డి.సత్యప్రభాకరరావు పరిశీలించారు. కాగా రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు వార్షిక నేర సమీక్షను విలేకరుల కు విడుదల చేస్తున్న సమయంలోనే సత్యానందం లొంగుబాటు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీం పట్నం పోలీసులు మరో కేసులో అతడిని అదుపులోకి తీసుకొని తరలించారు. ఇది ఇలా ఉండగా విజయవాడ కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం సత్యానందం విలేకరులతో మాట్లాడాడు. కాల్‌మనీ కేసులో తాను నిర్దోషినని చెప్పుకున్నాడు. -
కోర్టులో లొంగిపోయిన విద్యుత్ శాఖ డీఈ సత్యానందం
విజయవాడ సిటీ:కాల్ మనీ- సెక్స్ రాకెట్ కేసులో నాలుగో నిందితుడైన విద్యుత్‌శాఖ డీఈ ఎం.సత్యానందం గురువారం ఒకటవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో సత్యానందంకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు మంగళవారం తీర్పుచెప్పిన విషయం విదితమే. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇక్కడి 1వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో తన న్యాయవాదులు విష్ణువర్థన్‌రెడ్డి, సీహెచ్ మన్మథరావులతో కలిసి వచ్చి సత్యానందం లొంగిపోయాడు. రూ.లక్ష పూచీకత్తుతోపాటు ప్రతి రోజు ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో కేసు నమోదైన మాచవరం పోలీసుస్టేషన్లో హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ సంతకాలు చేయాలనేది హైకోర్టు ఆదేశం. సత్యానందం కోర్టుకు సమర్పించిన పూచీకత్తులను ఇన్చార్జి న్యాయమూర్తి డి.సత్యప్రభాకరరావు పరిశీలించారు. రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు, నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్, ఇతర పోలీసు అధికారులతో కలిసి వార్షిక నేర సమీక్షను విలేకరుల సమావేశంలో విడుదల చేస్తున్న సమయంలో సత్యానందం లొంగుబాటు విషయం తెలిసింది. కంగుతిన్న పోలీసు ఉన్నతాధికారులు మాచవరం ఇన్స్పెక్టర్ కె.ఉమామహేశ్వరరావు సహా ప్రత్యేక పోలీసు బృందాన్ని కోర్టు వద్దకు పంపింది. ఇదే సమయంలో సత్యానందంపై మరికొన్ని కేసులు కూడా ఉన్నాయంటూ డీజీపీ రాముడు చెపుతూ ఆయా కేసులపై కూడా తగు చర్యలు తీసుకుంటామన్నారు. మరో కేసుపై అరెస్టు చేయనున్నారనే సమాచారంతో సత్యానందం న్యాయవాదులతోపాటు కోర్టుకు భారీగా న్యాయవాదులు చేరుకున్నారు. కోర్టు ప్రొసీడింగ్స్ పూర్తి కాగానే న్యాయవాదులతో కలిసి బయటకు వచ్చిన సత్యానందం తన కారెక్కి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులను చూసి ఉద్వేగం చెందిన సత్యానందం అస్వస్థతకు లోనై సాయంత్రం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకోసం చేరగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీపీ కార్యాలయానికి, ఆపై గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. -
ఒక్క కేసులోనే సత్యానందంకి బెయిల్ : డీజీపీ
విజయవాడ : కాల్‌మనీ కేసుకి సంబంధించి ఓ కేసులో మాత్రమే డీఈ సత్యానందం బెయిల్ పొందాడని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడు వెల్లడించారు. అతని మీద మరికొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో విచారణ కోసం సత్యానందంను అదుపులోకి తీసుకుంటామని రాముడు స్పష్టం చేశారు. గురువారం విజయవాడలో ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన నేరాల సంఖ్యపై జేవీ రాముడు మాట్లాడారు. ఈ ఏడాది 100 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. మరో 96 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాలో 2,710 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. 2014తో పోలిస్తే ఈ ఏడు నేరాల సంఖ్య 4.23 శాతం తగ్గిందని డీజీపీ రాముడు విశ్లేషించారు. -
'ఈ కేసులో అకారణంగా ఇరికించారు'
విజయవాడ : కాల్‌మనీ కేసులో అకారణంగా తనను ఇరికించారని డీఈ సత్యానందం ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విజయవాడలో డీఈ సత్యానందం మాట్లాడుతూ... తాను ఉద్యోగ సంఘం నేతగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇంటెలిజెన్స్ డీజీ ఏ బి వెంకటేశ్వరరావును కలిసినట్లు తెలిపారు. కాల్‌మనీ కేసులో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ఈ సందర్భంగా డీఈ సత్యానందం స్పష్టం చేశారు. -
విజయవాడ కోర్టులో సత్యానందం ప్రత్యక్షం
విజయవాడ: కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ కేసులో పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న ప్రధాన నిందితుల్లో ఒకరైన ఏపీఎస్పీడీసీఎల్ డివిజినల్ ఇంజనీర్ ఎం.సత్యానందం గురువారం విజయవాడలోని ఒకటో మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బెయిల్ కోసం పూచీకత్తు సమర్పించారు. కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ కేసులో సత్యానందం ఏ4 నిందితుడిగా ఉన్నారు. సత్యానందంకు హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్షతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని, దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వారి ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఉత్తర్వులిచ్చారు. ఈ కేసులో పోలీసులు కీలక వ్యక్తి శ్రీరామ్మూర్తి, మరికొందరిని అరెస్ట్ చేయగా, సత్యానందం ఇప్పటివరకు పరారీలో ఉన్నారు. కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో తన అరెస్ట్ తప్పదని గ్రహించిన సత్యానందం ముందస్తు బెయిల్ కోసం నేరుగా హైకోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్ లభించడంతో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. -
కాల్‌మనీ నిందితుడు సత్యానందంకు బెయిల్
-
కాల్‌మనీ కేసులో సత్యానందంకు ముందస్తు బెయిల్
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా రేకెత్తించిన కాల్ మనీ, సెక్స్ రాకెట్ నిందితుడు, విద్యుత్ శాఖ డిఇ సత్యానందంకు ముందస్తు బెయిల్ లభించింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని షరతు విధిస్తూ ఆయనకు హైకోర్టు మంగళవారం బెయిల్ ఇచ్చింది. ఈ కేసు వ్యవహారం వెలుగులోకి రాగానే సత్యానందం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన అరెస్ట్ తప్పదని గ్రహించిన సత్యానందం ముందస్తు బెయిల్ కోసం నేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. కాల్‌మనీ-సెక్స్ రాకెట్ వ్యవహారంలో పిటిషనర్‌కు ఎటువంటి సంబంధం లేదని, వాస్తవాలను తెలుసుకోకుండా పోలీసులు పిటిషనర్‌ను నిందితునిగా చేరుస్తూ కేసు నమోదు చేశారని సత్యానందం తరఫు న్యాయవాది పి.విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు. ఫిర్యాదు ఇచ్చిన మహిళకు అసలు సత్యానందం ఎవరో కూడా తెలియదని, ఈ విషయం ఫిర్యాదును పరిశీలిస్తే అర్థమవుతోందన్నారు. తరువాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ఇవ్వరాదని కోరారు. కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ కేసులో సత్యానందం కీలక నిందితుల్లో ఒకరన్నారు. ఫిర్యాదుదారు మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో సత్యానందం తనను లైంగికంగా వేధించారని చెప్పారని, దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో పిటిషనర్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో నిందితులపై చార్జ్‌షీట్ నమోదైంది. ప్రధాన నిందితులు యలమంచిలి రాము, భవానీ ప్రసాద్, సత్యానందం, చెన్నుపాటి శ్రీను, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ల శ్రీకాంత్, దూడల రాజేష్‌పై పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు. అయితే కేసు నమోదై మూడు వారాలవుతున్నా ఇంకా నిందితుల్ని పోలీసులు పట్టుకోలేదు. అలాగే ఈ కేసులో నిందితులైన పెండ్యాల శ్రీకాంత్,వెనిగళ్ల శ్రీకాంత్‌ల ఆచూకీ ఇంకా దొరకలేదు. -
నేడు పాలిసెట్
ఆదిలాబాద్ టౌన్/బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : జిల్లాలో బుధవారం నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష(పాలిసెట్)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం ఆదిలాబాద్ నాలుగు, బెల్లంపల్లిలో 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లో 1,566, బెల్లంపల్లిలో 6,397 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఆదిలాబాద్, బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్లు సత్యానందం, వాణి స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు 23 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 23 మంది పరిశీలకులు, ఐదుగురు రూట్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. విద్యార్థులకు పెన్సిల్, రబ్బర్, షార్ప్‌నర్ పరీక్ష కేంద్రంలో అందజేస్తారు. బాల్‌పెన్, పరీక్ష ప్యాడ్, హాల్ టికెట్ వెంట తెచ్చుకోవాలి. ఈసారి ఓఎంఆర్ షీట్‌ను ఆధునీకరించారు. విద్యార్థి ఫొటో, పేరు, హాల్‌టికెట్ నంబరు పొందుపర్చారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయకుండా రూపొందించారు. ఒక్కో పరీక్ష కేంద్రంలో సుమారు 25 నుంచి 45 మంది ఇన్విజిలేటర్లు, సిబ్బందిని నియమించారు. పరీక్షల్లో అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకోకుండా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.