హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా రేకెత్తించిన కాల్ మనీ, సెక్స్ రాకెట్ నిందితుడు, విద్యుత్ శాఖ డిఇ సత్యానందంకు ముందస్తు బెయిల్ లభించింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని షరతు విధిస్తూ ఆయనకు హైకోర్టు మంగళవారం బెయిల్ ఇచ్చింది. ఈ కేసు వ్యవహారం వెలుగులోకి రాగానే సత్యానందం పరారీలో ఉన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తన అరెస్ట్ తప్పదని గ్రహించిన సత్యానందం ముందస్తు బెయిల్ కోసం నేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. కాల్‌మనీ-సెక్స్ రాకెట్ వ్యవహారంలో పిటిషనర్‌కు ఎటువంటి సంబంధం లేదని, వాస్తవాలను తెలుసుకోకుండా పోలీసులు పిటిషనర్‌ను నిందితునిగా చేరుస్తూ కేసు నమోదు చేశారని సత్యానందం తరఫు న్యాయవాది పి.విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు. ఫిర్యాదు ఇచ్చిన మహిళకు అసలు సత్యానందం ఎవరో కూడా తెలియదని, ఈ విషయం ఫిర్యాదును పరిశీలిస్తే అర్థమవుతోందన్నారు. తరువాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ఇవ్వరాదని కోరారు. కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ కేసులో సత్యానందం కీలక నిందితుల్లో ఒకరన్నారు. ఫిర్యాదుదారు మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో సత్యానందం తనను లైంగికంగా వేధించారని చెప్పారని, దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో పిటిషనర్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు ఈ కేసులో నిందితులపై చార్జ్‌షీట్ నమోదైంది. ప్రధాన నిందితులు యలమంచిలి రాము, భవానీ ప్రసాద్, సత్యానందం, చెన్నుపాటి శ్రీను, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ల శ్రీకాంత్, దూడల రాజేష్‌పై పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు. అయితే కేసు నమోదై మూడు వారాలవుతున్నా ఇంకా నిందితుల్ని పోలీసులు పట్టుకోలేదు. అలాగే ఈ కేసులో నిందితులైన పెండ్యాల శ్రీకాంత్,వెనిగళ్ల శ్రీకాంత్‌ల ఆచూకీ ఇంకా దొరకలేదు.