వెనిగళ్ల శ్రీకాంత్ ఎక్కడ?
► కాల్‌మనీ కేసులో కీలక నిందితుడు ఆరు నెలలుగా పరారీలోనే
► అధికార పార్టీ నేతల సహకారంతో అజ్ఙాతంలో
► శ్రీకాంత్ వద్ద అధికార పార్టీ నేతల పెట్టుబడులు
► తరచూ నగరానికి వస్తున్న శ్రీకాంత్!
► రాజకీయ ఒత్తిళ్లతో పట్టించుకోని పోలీసులు
► ఆరు నెలలు గడిచినా పురోగతి లేని కేసు
సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ కేసు ప్రకంపనలు మళ్లీ నగరంలో మొదలయ్యాయి. కేసులో కీలక సూత్రధారి, ఏ-6 నిందితుడుగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ మినహా మిగిలిన వారందరూ అరెస్టయ్యారు. కాల్‌మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోయినా కీలక నిందితుడుగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసే దిశగా పోలీసులు కనీసం దృష్టి సారించకపోవటం గమన్హారం. ఈ క్రమంలో శ్రీకాంత్ పరారీలోనే ఉంటూ పాత వ్యవహారాలను చక్కబెట్టే పనుల్లో బిజీగా మారినట్లు సమాచారం. నాలుగేళ్ల కిత్రం రూ.20 లక్షల పెట్టుబడితో కాల్‌మనీ వ్యాపారం మొదలుపెట్టిన శ్రీకాంత్ కోట్ల రూపాయలకు ఎదగడం వెనుక కాల్‌మనీ దందాలు, దాడులతో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సహకారం, భారీ పెట్టుబడులు ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఘటన...
గత ఏడాది డిసెంబర్ 10న కాల్‌మనీ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మొగల్రాజపురానికి చెందిన ఓ బాధిత మహిళ నేరుగా నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయటంతో వీరి గుట్టు బట్టబయలైంది. 11న యలమంచలి రాము కార్యాలయంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేసిన క్రమంలో 25 వరకు సీడీలు (మహిళల్ని లోబర్చుకున్న వీడియోలు), 3 బస్తాల డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్ల బయటపడ్డాయి. దీంతో 12 మందిపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. దశలవారీగా నిందితుల అరెస్టులు జరిగాయి. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించటమే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
రాష్ట్ర శాసనసభను కుదిపేసింది. ఆరో నిందితుడుగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ తనకు స్నేహితుడు మాత్రమేనని, అతని లావాదేవీలతో సంబంధం లేదని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీడియా సమావేశం పెట్టి మరీ వివరణ ఇచ్చుకోవటంతో పాటు అసెంబ్లీలోనూ దీనిపై వివరణ ఇచ్చుకున్నారు. ఈ పరిణామాల క్రమంలో కమిషనరేట్ పోలీసులు కేసును పూర్తిస్థాయిలో ఛేదించామనే రీతిలో హడావుడి చేశారు. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి 1181 కాల్‌మనీ ఫిర్యాదులు తీసుకొని వాటిలో 1104 సెటిల్ చేసినట్లు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు కీలక కేసులో నిందితుడిని మాత్రం గుర్తించి అరెస్టు చేయకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
కాపాడుతున్నది అధికార పార్టీ నేతలే!
సిండికేట్ టీమ్‌లో సభ్యులందరూ ఒక్కో ప్రజాప్రతినిధి వద్ద పరపతి బాగా పెంచుకొని హవా సాగించారు. శ్రీకాంత్ కొంత దూకుడుగా ఉండి కాల్‌మనీ వ్యవహారాల్లో అనేక మందిపై దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్ల కిత్రం రూ.20 లక్షల పెట్టుబడితో కాల్‌మనీ వ్యాపారం మొదలుపెట్టిన శ్రీకాంత్ అంచెలంచెలుగా ఎదిగాడు. దీని వెనుక అధికార పార్టీ నేతల పూర్తి సహకారం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా నగరానికి చెందిన ప్రజాప్రతినిధి, నగర సమీపంలోని నియోజకవర్గానికి చెందిన ఒక అధికార పార్టీ ప్రజాప్రతినిధి పెట్టుబడులు అతని వద్ద పెట్టినట్లు సమాచారం.
వారి నగదు వ్యవహారం సెటిల్ అయ్యే వరకు శ్రీకాంత్‌ను దొరకకుండా కాపాడుతున్నారనే ఆరోపణ ఉంది. కాల్‌మనీ ముఠాకు రావాల్సిన బకాయిలు కూడా వసూలు చేసేందుకే అతన్ని పోలీసులు అరెస్టు చేయకుండా ప్రజాప్రతినిధులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ఈ క్రమంలో పరారీలో ఉన్న శ్రీకాంత్ తరచూ విజయవాడ నగరానికి వస్తున్నట్లు తెలిసింది. గత వారంలో విజయవాడలో జరిగిన ఒక ఫంక్షన్‌కు కూడా శ్రీకాంత్ హాజరైనట్లు నిఘా వర్గాల కథనం.
వివాదాలివీ...
శ్రీకాంత్ పరారీ వెనుక అధికార పార్టీ ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కేసులో 12 మంది నిందితులకు గాను శ్రీకాంత్ మినహా మిగిలిన వారంతా అరెస్టయ్యారు. ఘటన జరి గిన రోజు నుంచే శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. పోరంకి గ్రామానికి చెందిన శ్రీకాంత్‌పై పటమట పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీటు ఉంది. గతంలో పటమట ప్రాంతానికి చెందిన ఒక డాక్టర్‌తో స్నేహంగా ఉంటూ చివరకు అతని తమ్ముడిపైనే దాడి చేశాడు. దీనిపై పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో ఉయ్యూరుకు చెందిన ఒక అధికార పార్టీ నేత, హైదరాబాద్‌లో హత్యకు గురైన రౌడీషీటర్ ద్వారా వివాదాన్ని సెటిల్ చేయించుకున్నాడు.
దీంతో శ్రీకాంత్ అప్పట్లో ఒక టీడీపీ నేతకు అనుచరునిగా మారిపోయాడు. కాలక్రమంలో సదరు నేత ప్రజాప్రతినిధి కావటంతో శ్రీకాంత్ ఆగడాలు మొదలయ్యాయి. వెంటనే సిండికేట్ టీమ్‌లో కీలక వ్యక్తిగా మారాడు. ఈ క్రమంలోనే తాము బిల్డింగ్ అద్దెకు తీసుకున్న భవన యజమానిపై దాడి చేశాడు.