నవరంగ్ సెంటర్‌లో త్రిమూర్తుల దందా
విజయవాడ సిటీ : పైకి స్టిక్కరింగ్ వ్యాపా రం. చేసేది కాల్‌మనీ వ్యాపారం. వడ్డీ చెల్లించలేని మహిళలకు లైంగిక వేధింపులు ఇక్కడ నిత్యకృత్యం. నవరంగ్ థియేటర్ సమీపంలో త్రిమూర్తులు కాల్‌మనీ దందా వికృత స్వరూపమిది. వీరి బెదిరింపులకు అనేక మంది మహిళలు బెంబేలెత్తుతున్నారు. వీరి పరపతికి వెరసి పైకి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. ఓ మహిళ ధైర్యం చేసి సాక్షి కార్యాలయానికి లేఖ రూపంలో వీరి ఆగడాలను ఏకరువు పెట్టింది. ఆ లేఖలో ఆమె పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే వీరంటే ఎంతగా భయపడుతుందో స్పష్టమవుతోం ది. నవరంగ్ సెంటర్ అంటే వాహనాల నంబర్లకు స్టిక్కరింగ్ చేసే షాపుల కోలాహలం ఉంటుంది. ఇక్కడ తమ వాహనానికి స్టిక్కరింగ్ చేయించుకునేందుకు యువకులు ‘క్రేజీ’ చూపుతుంటారు. అలాంటి సెంటర్‌ను కేంద్రంగా చేసుకొని ఇద్దరు సోదరులు, వీరి స్నేహితుడు కలిసి కాల్‌మనీ వ్యాపారం చేస్తున్నారు.
వీరి వద్ద ఎక్కువగా రూ.20వేల నుంచి రూ.50వేల వరకు కాల్‌మనీగా అప్పులు తీసుకునే వారే. ఒక్కసారి వీరి వద్ద కాల్‌మనీకి డబ్బులు తీసుకుంటే ఏళ్ల తరబడి వడ్డీలు కట్టడమే సరిపోతుంది తప్ప అసలు మాత్రం తీరదు. ఒకవేళ అసలు తీసుకొచ్చి ఎవరైనా ఇచ్చినా ముందుగా తీసుకున్న ఖాళీ నోట్లను చూపి కోర్టు కేసుల పేరిట బెదిరింపులకు దిగుతారు. ఆ నెపంతో మహిళలను లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. తిరస్కరిస్తే కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనని బాధితురాలి ఆవేదన. వీరి వద్ద రూ.20 వేలు తీసుకున్న పాపానికి రూ.2 లక్షల వరకు వడ్డీగా కట్టినట్టు చెప్పింది. అసలు అలానే ఉందంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు పేర్కొంది. అదేమంటే రూ.2 లక్షలు ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆమె తెలిపింది. ఇక తాను కట్టలేనంటే తమతో గడపాలంటూ వేధిస్తున్నట్టు ఆమె వెల్లడించింది. ఏళ్ల తరబడి ఇదే సెంటర్‌ను కేంద్రంగా చేసుకొని కాల్‌మనీ దందా చేస్తున్న వీరికి రాజకీయ, పోలీసు సర్కిళ్లతో పరిచయాలు ఉన్నట్టు ఆమె వెల్లడించింది. అనేక మంది మహిళలు వీరి ఆగడాలను కిమ్మనకుండా భరిస్తున్నట్టు తెలిపింది. పోలీసు కమిషనర్ జోక్యం చేసుకుంటే తప్ప వీరి ఆగడాలకు అడ్డుకట్ట పడదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
పైకి స్టిక్కరింగ్..! లోపల కాల్‌మనీ!!
Published Wed, Jan 6 2016 12:39 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement