బ్లాక్‌మెయిలర్ల పంజా
► అడుగడుగునా నేరాలు
► మొన్న దేశాన్ని కుదిపేసిన కాల్‌మనీ వ్యవహారం
► నిన్న చర్చి ఫాదర్‌పై దందా
► నేడు వివాహితపై వెలుగుచూసిన అకృత్యాలు
విజయవాడ కమిషనరేట్ పరిధిలో బ్లాక్‌మెయిల్ నేరాలు, అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. కొంతమంది నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించి లక్షలు, కోట్లలో నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు. మరికొందరు.. మహిళలపై అకృత్యాలకు తెగబడుతున్నారు. ఇటీవలే వెలుగుచూసిన చర్చి ఫాదర్ బ్లాక్‌మెయిల్ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కాల్‌మనీ వ్యవహారాన్ని మరువకముందే.. సింగ్‌నగర్ పరిధిలోని రామలింగేశ్వనగర్‌లో మరో మహిళపై అకృత్యం ఉదంతం తాజాగా వెలుగులోకొచ్చింది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ సాక్షి, విజయవాడ : రాజధాని నగరంలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. సంచలనం రేపిన కాల్‌మనీ వ్యవహారం నుంచి పేరెన్నికగన్న చర్చి ఫాదర్ వ్యవహారం వరకు నగరంలో నేరాలు రకారకాల తీరులో బయటపడుతున్నాయి. చర్చి ఫాదర్ ఘటనలో నగ్న చిత్రాలు, వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్ చేసి కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి కోర్టుకు పంపించారు. వారిపై ప్రత్యేక విచారణ కోసం కోర్టు పోలీసు కస్టడీకి ఇచ్చింది. ఈ ఘటనలో అనేక కోణాలు కూడా వెలుగు చూసిన విషయం తెలిసిందే.
వివాహితపై టీడీపీ చోటా నేత లైంగిక దోపిడీ
తాజాగా సింగ్‌నగర్ పరిధిలోని రామలింగేశ్వనగర్‌లో వెలుగుచూసిన ఘటన నగరంలో పెచ్చుమీరుతున్న నేరప్రవృత్తికి మరో ఉదాహరణ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భర్తతో విభేదాల నేపథ్యంలో ఒక వివాహిత రామలింగేశ్వనగర్‌లో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. పక్క ఇంట్లో మండవ రవికాంత్ అనే టీడీపీ చోటా నేత, రియల్టర్ తన రెండో భార్య శ్రీదేవితో కలిసి ఉంటున్నాడు. అతని మొదటి భార్య కృష్ణలంకలో నివసిస్తున్నారు. ఇంటి పక్కన నివసించే వివాహితపై కన్నేసిన రవికాంత్ ఆమెను లోబర్చుకునేందుకు తన రెండో భార్య సహకారం కోరాడు. తోటి స్త్రీ అన్న సంగతి మరచి ఆమె అతనికి సహకరించింది.
వివాహితతో స్నేహం పెంచుకుని, బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న నగ్న వీడియోలను మొబైల్‌లో చిత్రీకరించింది. వాటి ఆధారంగా బెదిరింపులకు దిగింది. లేని పక్షంలో వీడియో ఇంటర్నెట్‌లో పెట్టి కుటుంబం పరువు తీస్తానని, మీ కుటుంబ సభ్యుల్ని చంపి నాగాయలంకలో పడేస్తానని బెదిరించారు. ఈ నేపథ్యంలో నిందితుడు ఆమెను లొంగదీసుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగక ఆమెను నగ్నంగా చేసి మెడకు బెల్టు కట్టి మోకాళ్లపై నడిపించి పైశాచిక ఆనందం పొందేవారు.
లక్షల్లో నగదు వసూలు...
మరోపక్క లక్షల్లో నగదు కూడా వసూలు చేశారు. గత ఏడాది ఫిబ్రవరి 25న సదరు వివాహిత వద్ద 38 గ్రాముల ఆభరణాలు తీసుకున్నారు. అంతేగాక తన తండ్రి రిటైరైతే వచ్చిన రూ.6 లక్షల నగదు కూడా వడ్డీ పేరుతో తీసుకున్నారు. బయటికి చెబితే కుటుంబసభ్యులు, పిల్లలపై యాసిడ్ పోసి చంపుతామని బెదిరించి, కులదూషణకు పాల్పడ్డారు. అంతేగాక మరింత బరితెగించి ఆమెను వేరొకరికి అమ్మే ప్రయత్నం చేస్తుండగా తెలుసుకున్న వివాహిత ఇంటినుంచి పారిపోయి కొంతకాలం బంధువుల ఇంట్లో ఉంది. చివరికి వివాహిత తల్లిదండ్రులు ఆమెను వెతికి తెచ్చి అన్ని విషయాలు తెలుసుకుని రవికాంత్‌పై, అతని భార్య శ్రీదేవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు విచారణ చేపట్టారు. ఏసీపీ సత్యానందం ఆధ్వర్యంలో నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. వారినుంచి వీడియోలు తీసిన మొబైల్, ట్యాబ్‌లను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
పోలీసులకు సవాలే...
ఒకవైపు నగదు వసూళ్లు, మరోవైపు లైంగిక దాడులకు పాల్పడటం వంటి నేరాలకు పాల్పడే ముఠాలు నగరంలో పెరుగుతుండటం పోలీసులకు సవాలుగా మారింది. ఫాదర్‌ను బ్లాక్‌మెయిల్ చేసిన వారిలో ఇప్పటికే ఐదుగురు అరెస్ట్ కావడంతో ఇంకా ఎవరైనా ఈ ముఠాకు సంబంధించిన వారు నగరంలో ఉన్నారేమోననే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు సాగుతోంది. కాల్‌మనీ వ్యవహారంలోనూ వేల సంఖ్యలోనూ ఫిర్యాదులు నమోదైన విషయం తెలిసిందే. మరి ఇలాంటి నేరాలకు చెక్ పెట్టేందుకు నగర పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి