కాల్‌నాగులు
► కాల్‌మనీ ఉచ్చులో భారీ బిల్డర్ ముఠా నుంచి పెరిగిన ఒత్తిళ్లు
► కానూరులో మహిళకు వేధింపులు
► రూ.26 లక్షల అసలుకు రూ.67 లక్షలు వసూలు
► అంతటితో ఆగకుండా రూ.5 కోట్ల విలువైన స్థలం స్వాధీనం
► మళ్లీ నగరంలో దందా షురూ
సాక్షి, విజయవాడ : రాజధాని నగరంలో కాల్‌మనీ ప్రకంపనలు మళ్లీ మొదలయ్యాయి. కాల్‌మనీ ముఠా సభ్యులు నగరంలోని భారీ రియల్టర్‌కు ఆర్థిక అవసరాలకు అప్పు ఉచ్చి ఆస్తుల స్వాధీనానికి యత్నించారు. అంతటితో ఆగక వేధింపులు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఒక మహిళను కూడా ఈ ముఠా వేధించింది. అసలుకు రెండు రెట్లు వసూలు చేయటంతో పాటు కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఇంకా డబ్బు కట్టాలని వేధిస్తూ మహిళను మానసిక క్షోభకు గురిచేసింది. పర్యవసానంగా సదరు మహిళ ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్లింది. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో విజయవాడ కమిషనరేట్ పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ ఘటనతో మళ్లీ కాల్‌మనీ దందా కార్యకలాపాలు జోరుగా సాగుతున్నట్టు తేటతెల్లమైంది. ఇదిగాక వెలుగులోకి రాని ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా బీజేపీ నేతలు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ వ్యవహారాన్ని కదిలించారు. దీంతో మళ్లీ అనేక మంది కాల్‌మనీ ముఠా, బడా బాబుల ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి.
మహిళ ఫిర్యాదుతో మరోసారి వెలుగులోకి...
విజయవాడ నగరంలో కాల్‌మనీ ముఠా ఆగడాలు మళ్లీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో గతంలో అప్పులు ఇచ్చినవారు తిరిగి వేధింపులు సాగిస్తూ వసూళ్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. శుక్రవారం కానూరుకు చెందిన మహిళ చలసాని నిర్మల కాల్‌మనీ ముఠాపై ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. నిర్మల ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. కానూరుకు చెందిన కాల్‌మనీ వ్యాపారి అన్నే శివనాగేశ్వరరావు వద్ద 2009లో అదే గ్రామంలో తనకున్న 2057 గజాల స్థలాన్ని తనఖా పెట్టి పిల్లల చదువు కోసం 26.90 లక్షలు అప్పుగా తీసుకున్నారు.
దశలవారీగా 2014 సంవత్సరం కల్లా అసలు, వడ్డీ కలిపి రూ.67.88 లక్షలు చెల్లించారు. ఈ నేపథ్యంలో తాను తనఖా పెట్టిన స్థలం జీపీఏను రద్దు చేసి తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరారు. అప్పటికే కాల్ ముఠా సభ్యుడు అన్నే శివనాగేశ్వరరావు ఆమెకు తెలియకుండా స్థలాన్ని వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశాడు. ప్రస్తుతం స్థలం బహిరంగ మార్కెట్ విలువ రూ.5 కోట్ల వరకు ఉంటుంది. ఈ విషయంపై గ్రామంలో పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టినా న్యాయం జరగలేదు. దీంతో బాధితురాలైన నిర్మల కమిషనరేట్ పోలీసులను ఆశ్రయించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసును విచారిస్తున్నారు.
కాల్ ఉచ్చులో మరో బడా బిల్డర్
కాల్‌మనీ ముఠా ఉచ్చులో మరో బడా బిల్డర్ చిక్కుకున్నట్లు సమాచారం. కానూరు ప్రాంతానికి చెందిన ఒక బిల్డర్ అనతికాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో బాగా గడించారు. తొలుత వ్యాపారానికి బయట నుంచి అప్పులు తెచ్చి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లో పలు బహుళ అంతస్తుల సముదాయాలు పలు నిర్మించారు. ఈ క్రమంలో భారీగా సంపాదించినట్లు సమాచారం. ఒక దశలో ఆయనకు పెట్టుబడులు పెట్టేందుకు అనేకమంది ముందుకొచ్చారు. అదే క్రమంలో వ్యాపారంలో తాత్కాలిక సర్దుబాట్ల కోసం కాల్‌మనీ కేసు నిందితుల నుంచి గతంలో కొంత మొత్తం అప్పుగా తీసుకున్నారు. దీనికి నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న పలు ఆస్తుల్ని తనఖా పెట్టి జీపీఏ రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు బకాయిని అసలు కంటే నాలుగు రెట్లు పెంచి మొత్తం ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి కాల్‌మనీ ముఠా యత్నిస్తున్నట్లు తెలిసింది.
వేధిస్తున్న ముఠా సభ్యులు గతంలో కాల్‌మనీ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తులని సమాచారం. దీనికోసం బౌన్సర్‌లను వినియోగించి బిల్డర్‌పై దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఈ కేసులో కాల్‌మనీ కేసులో పరారీలో ఉన్న వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. పరారీలో ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ ద్వారా ఈ అప్పులు తీసుకున్నట్లు తెలిసింది. వెనిగళ్ల శ్రీకాంత్ గతంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తో కలిసి విదేశాలకు వెళ్లాడని విస్తృత ప్రచారం జరిగింది. పోలీసులు మాత్రం ఈ కీలక కేసులోని నిందితుడైన వెనిగళ్ల శ్రీకాంత్ ఆచూకీని మాత్రం ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. రాజకీయంగా పరపతి ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ పరారీ వెనుక అధికార పార్టీ నేతల కీలక సహకారం ఉందనేది బహిరంగ రహస్యం.