ruling party Leaders
-
భూకబ్జా వ్యవహారం.. సీఐ కాళ్లపై పడిన బాధితురాలు
వెల్దుర్తి(తూప్రాన్): అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తక్కువ ధరకు తమ భూమిని లాక్కోవాలని చూస్తున్నాడని, న్యాయం చేయాలని బాధితురాలు సీఐ కాళ్ల మీద పడి వేడుకుంది. ఈ ఘటన వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లికి చెందిన బొగ్గుల భిక్షపతి, జయలక్ష్మి దంపతులకు వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ శివారులో 7.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో సుమారు నాలుగెకరాల స్థలాన్ని శివ్వంపేట పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి అక్రమంగా కబ్జాచేశాడని, రక్షణ క్పలించాలని బాధితురాలు సోమవారం ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తూప్రాన్ సీఐ శ్రీధర్ మంగళవారం హస్తాల్పూర్ శివారులో విచారణ చేపట్టారు. తమ వ్యవసాయ బోరుబావిని సైతం స్వాధీనం చేసుకున్నాడని, అడిగితే బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. అదే గ్రామానికి చెందిన మరో రైతు కూడా నక్ష బాటను కబ్జా చేశాడని, పొలాల్లోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. వారసత్వంగా వచ్చిన భూమిని ఆక్రమించిన వ్యక్తిపై చట్టపర చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ.. సీఐ శ్రీధర్ కాళ్ళమీదపడి బాధితురాలు ప్రాధేయపడింది. -
వైవీయూలో చీప్ పాలిట్రిక్స్
యోగివేమన విశ్వవిద్యాలయం, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న చిరుద్యోగుల జీవితాలతో అధికారపార్టీ నాయకులు ఆడుకుంటున్నారు. ఒక చేత్తో మీకు సాయం చేస్తామంటూ.. మరో చేత్తో వీరికి వేతనాలు ఎందుకు పెంచారంటూ ఫిర్యాదు చేశారు. ఈ పాలి‘ట్రిక్స్’ తెలియని చిరుద్యోగులకు గత్యంతరం లేకపోవడంతో ‘గతిలేనమ్మకు మతిలేని మొగుడే దిక్కు’ అన్న చందంగా ప్రొద్దుటూరులోని ఓ మాజీ ప్రజాప్రతినిధిని కలిశారు. దీంతో మీకు నేను సాయం చేస్తానని... మీ అందరినీ టైంస్కేల్కు మార్చేలా చూస్తానని.. దీనికి ప్రతిఫలం చెల్లించాలని మెలికపెట్టడంతో చేసేదేమీ లేక ఒక్కో అభ్యర్థి రూ.లక్ష వరకు మొక్కు చెల్లించేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి కడప: యోగివేమన విశ్వవిద్యాలయం, ప్రొద్దుటూరులోని వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 52 మంది చిరుద్యోగులు ఎన్ఎంఆర్ (నాన్ మస్టర్డ్ రోల్) ఒప్పంద పద్ధతిలో 2008లో విధుల్లో చేరారు. గత కొద్ది సంవత్సరాలుగా వీరంతా తమను టైం స్కేల్ పరిధిలోకి తీసుకోవాలంటూ విశ్వవిద్యాలయ అధికారులకు పలుమార్లు విన్నవించారు. వీరి న్యాయమైన కోరికకు బలం చేకూర్చేలా పొరుగున ఉన్న రాయలసీమ విశ్వవిద్యాలయంలో 5 సంవత్సరాల సీనియారిటీ కలిగిన ఎన్ఎంఆర్ ఉద్యోగులందరినీ టైంస్కేల్ కింద మార్పు చేశారు. దీంతో వైవీయూ ఎన్ఎంఆర్ ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. తాము పది సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పటికీ టైంస్కేల్ వర్తింప చేయకపోవడం పట్ల అసంతృప్తి మొదలైంది. దీంతో మళ్లీ అధికారుల వద్దకు వచ్చి తమను టైంస్కేల్కు మార్పుచేయాలని, ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నం. 151 ప్రకారం వేతనాలు పెంచాలని కోరారు. దీనికి స్పందిం చిన అధికారులు ఎన్ఎంఆర్ ఉద్యోగులను టైంస్కేల్ ఉద్యోగులుగా మార్పు చేయడం, వేతనాల పెంపు విషయం పాలకమండలి సమావేశంలో ఉంచగా...టైంస్కేల్ అంశం తర్వాత చూద్దామని..వేతనాల పెంపునకు వైవీయూ పాలకమండలి ఆమోదం తెలిపింది. పాలకమండలి సభ్యుల్లో ఇద్దరు మినహా మిగతా అందరూ ఆమోదం తెలపడంతో ఎన్ఎంఆర్ ఉద్యోగులకు వేతనాలు పెరిగాయి. కాగా తన మాట నెగ్గలేదన్న అక్కసుతో నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వానికి తెలపకుండానే వేతనాలు పెంచారంటూ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్‌పై అధికార పార్టీకి చెందిన ఓ పాలకమండలి సభ్యుడు గవర్నర్‌కు ఫిర్యాదు చేశాడు. ప్లేటు ఫిరాయించిన పాలకమండలి సభ్యుడు.. గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన పాలకమండలి సభ్యుడు స్థానిక ఒత్తిళ్ల కారణంగా ప్లేటు ఫిరాయించారు. ప్రొద్దుటూరులోని వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఆ ప్రాంత మాజీ ప్రజాప్రతినిధిని కలిసి సమస్యను పరిష్కరించాలని ఆశ్రయించినట్టు సమాచారం. దీంతో సదరు మాజీ ప్రజాప్రతినిధి వైవీయూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది.కాగా వ్యవహారం గవర్నర్కోర్టులో ఉన్నందున తామేమీ నిర్ణయం తీసుకోలేమని ఆయనకు చెప్పినట్లు తెలిసింది. వెంటనే సదరు నేత ఈ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన పాలకమండలి సభ్యుడితో మంతనాలు జరిపి సానుకూలంగా వ్యవహరించాలని ఆయనకు సూచించినట్లు తెలిసింది. దీంతో వీరి వేతనాల పెంపుపై ఫిర్యాదు చేసిన పాలక మండలి సభ్యుడు ఏ చెత్తో అయితే ఫిర్యాదు చేశాడో...మళ్లీ ప్లేటు ఫిరాయించి ఎన్ఎంఆర్ ఉద్యోగులు తీసుకువచ్చిన వినతిపత్రంలో వీరిని టైంస్కేల్ ఉద్యోగులుగా మార్పు చేయాలని నోట్ పెట్టి పంపారు. వాస్తవానికి ఆయనకు చిత్తశుద్ధి ఉంటే పాలకమండలి సభ్యుడి హోదాలో సమావేశంలో పెట్టబోయే అజెం డాలో వీరి అంశాన్ని చేర్చాలని కోరుతూ చైర్మన్‌కు లేఖ రాయాలి. అలా చేయకుండా వారు రాసుకొచ్చిన వినతిపత్రంలో మాత్రం రెకమెండ్ చేస్తూ నోట్ పెట్టడం చూస్తుంటే.. నోటితో కావాలని.. నొసటితో వద్దన్న చందంగా ఉందని కొందరు ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఏమి జరిగిందో కానీ ఈ వ్యవహారం త్వరితగతిన తేల్చాలంటూ ఇద్దరు పాలకమండలి సభ్యులతో పాటు ప్రొద్దుటూరుకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి తరచూ వాకబు చేయడం చూస్తుంటే ఎక్కడా లేని ప్రేమ వెనుక ఉన్న మతలబు ఏంటో ఇట్టే అర్థం అవుతోంది. చిత్తశుద్ధి ఉంటే పాలకమండలి సభ్యుడు చేసిన ఫిర్యాదు వెనక్కు తీసుకుని తమను టైంస్కేల్ ఉద్యోగులుగా మార్చేందుకు సహకరించాలని పలువురు ఎన్ఎంఆర్ ఉద్యోగులు కోరుతున్నారు. గవర్నర్ వివరణ కోరడంతో అడ్డం తిరిగిన కథ.. ఎన్ఎంఆర్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్న విశ్వవిద్యాలయ అధికారులు ఈనెల 21న నిర్వహించాల్సిన (ప్రస్తుతం వాయిదా పడింది) పాలకమండలి సమావేశంలో అనుమతి పొందేందుకు రంగం సిద్ధం చేశా రు. అదే సమయంలో పాలకమండలి సభ్యుడి ఫి ర్యాదు మేరకు దీనిపై పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ వైవీయూ అధికారులకు గవర్నర్ కార్యాలయం నుంచి లేఖ అందింది. దీనికి విశ్వవిద్యాలయ అధికారులు తగిన ఆధారాలును క్రోడీకరించి నివేదికను పంపారు. తాము నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించామని.. ఎటువంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడలేదని.. అవసరమైతే విచారణకు సైతం సిద్ధమేనన్న సందేశాన్ని పంపా రు. దీంతో ఎన్ఎంఆర్ ఉద్యోగుల టైంస్కేల్ ప్రక్రియకు నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ఎన్ఎంఆర్ ఉద్యోగులను టైంస్కేల్‌గా మార్పు ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. తాము సమస్య పరిష్కారానికి కృషిచేస్తుంటే ఈ అంశంపై ఫిర్యాదులు వచ్చి న నేపథ్యంలో ముందుకు వెళ్లలేమంటూ విశ్వవిద్యాలయ అధికారులు పేర్కొనడంతో ఎన్ఎంఆర్ ఉద్యోగుల నోట్లో పచ్చి వెలక్కాయపడ్డట్టు అయింది. -
బడాబాబుల కోసం బంగారు భూముల్లో ..
పెళ్లకూరు మండలం నుంచి నాయుడుపేట మీదుగా పండ్లూరు వరకూ ఆరు లైన్ల బైపాస్ నిర్మిస్తున్నారు. 20 కిలోమీటర్ల మేర అధికారులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. అయితే సంపన్నుల కోసం ప్లాన్లు మార్చివేశారు. దీనికి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తోడవడంతో పేదల ఇళ్లు, పంటలు పండే బంగారు భూములపై పడ్డారు అధికారులు. రోజురోజుకూ అధికారులు హద్దు లు మార్చేస్తూ పెద్దలకు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎనిమిది నెలల క్రితం వేసిన హద్దుల్లో బడాబాబులకు చెందిన భవనాలు, అపార్టుమెంట్లున్నాయి. ప్రస్తుతం వేస్తున్న హద్దుల్లో పంట పొలాలు, బోర్లు, పలు దళిత కాలనీలున్నాయి. కొత్త హద్దులను అడ్డుకుంటూ మాకు చావే శరణ్యం అంటున్నారు పేదలు. అయినా అధికారులకు వీరి గోడు పట్టడంలేదు. నాయుడుపేటటౌన్ (నెల్లూర): కేంద్రం ఇటీవల ఏర్పాటుచేసిన 71వ జాతీయ రహదారిపై రేణిగుంట నుంచి (పూతలపట్టు – నాయుడుపేట) మండల పరిధిలోని నాయుడుపేట పట్టణంలోని జీఎన్టీ రోడ్డు మీదుగా తుమ్మూరు, పండ్లూరు గ్రామం వరకు 16వ నంబరు జాతీయ రహదారిని కలుపుతూ ఆరులైన్ల రోడ్డును నిర్మించాల్సి ఉంది. దీనికితోడు నాయుడుపేట నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి సైతం భూసేకరణ పనులు చేపట్టి ఉన్నారు. ఆరులైన్ల నిర్మాణానికి సంబంధించి ఈ జాతీయ రహదారిపై స్వర్ణముఖి నదిపై చాలా పొడవైన బ్రిడ్జి ఉండటం, అంతేకాకుండా మామిడి కాలువ, రైల్వేగేట్లు తదితరాలు అడ్డంకులుగా ఉండడంతో ఈ ప్రతిపాదనను ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) తిరస్కరించింది. ఎన్హెచ్ఏఐ అధికారులు 2017 సంవత్సరం ఆగస్ట్ 3న కొత్తగా మళ్లీ సర్వే చేపట్టారు. దీంతో నాయుడుపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి జాతీయ రహదారి కూడలి సమీపంలో ఉన్న 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి గోమతి సర్కిల్ ఆవతల వైపు నుంచి రేణిగుంట వరకు 71వ నంబర్ జాతీయ రహదారిలో ఆరులైన్ల రోడ్డు నిర్మాణానికి హద్దులు ఏర్పాటుచేసి ప్రతిపాదనలు (డీపీఆర్) తయారు చేశారు. 20 కిలోమీటర్లకు సంబంధించిన ఆ రిపోర్టును తిరుపతి డివిజన్‌కు చెందిన అధికారులు కలెక్టర్‌కు అందజేశారు. నాయుడుపేట పట్టణ పరిధిలోని గోమతి సర్కిల్ నుంచి ఎల్ఏ సాగరం సమీప ప్రాంతాల నుంచి ఎల్ఏ సాగరం చెరువు, జువ్వలపాళెం గ్రామ పొలాల మీదుగా 16వ నంబర్ జాతీయ రహదారి కూడలి వరకు ప్రత్యేక సర్వే బృందం హద్దులు నాటారు. ఈ హద్దుల్లో గోమతి సర్కిల్ నుంచి జాతీయ రహదారి కూడలి వరకు అనేక భారీ భవంతులతో పాటు పలు అపార్ట్మెంట్లు సైతం ఉన్నాయి. అందుకు సంబంధించి భూసేకరణకు సైతం శ్రీకారం చేపట్టారు. ఇది అప్పట్లో సంచలనమైంది. అయితే అధికారులు బడాబాబులకు దాసోహమైపోయి హద్దు మార్చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడు అధికార పార్టీ నేతలు ఒత్తిడి కావడంతో హద్దులు మారిపోతున్నాయి. నిరుపేద రైతులు, దళితులు నివాసం ఉండే ప్రాంతాలు, పచ్చని పంట పొలాల్లో హద్దు నాటుతున్నారు. కొద్దిరోజుల క్రితం జువ్వలపాళెంకు చెందిన దళితులు అధికారులను అడ్డుకున్నారు. అలాగే నాయుడుపేట, పెళ్లకూరు మండలాలకు చెందిన రైతులు సైతం వ్యవసాయ బోర్ల వద్ద ఆందోళనలు చేశారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వ్యవసాయ బోర్లు, బంగారు (వరి, చెరుకు) పండించే భూములను సైతం లాక్కునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రైతులు రెండు పర్యాయాలు కలెక్టర్ కార్యాలయంలో జేసీని కలిసి వినతిపత్రాలు సమర్పించారు కూడా. న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని రైతులు, దళితులు అంటున్నారు. నా దృష్టికి రాలేదు ఎల్‌ఏసాగరం, తదితర ప్రాంతాల్లో రైతుల బోర్లల వద్ద రాళ్లు నాటి విషయమై రైతులు నా దృష్టికి తీసుకురాలేదు. ఆరులైన్ల రోడ్డు కోసం మొదట ఎన్‌హెచ్ అధికారులు సర్వే చేశారు. తర్వాత రెవెన్యూ అధికారుల సర్వే ఉంటుంది. ఏదైనా సమస్యలుంటే పరిశీలించి జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తా. -ఎం శ్రీదేవి, ఆర్డీఓ నాయుడుపేట దుర్మార్గపు చర్య జాతీయ రహదారిపై ఆరు లైన్ల నిర్మాణానికి కొత్తగా సర్వే చేస్తూ రైతులకు సంబంధించిన వ్యవసాయ బోర్లు, పోలాలతో పాటు దళితులు నివాసాలు సమీపంలో హద్దులు రాళ్లు వేస్తుండటం దారుణం. ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న ఈ స్థలాలను సేకరించి రహదారి నిర్మాణం చేపడితే అందరికీ సమ్మతమే. – తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, నాయుడుపేట ఆత్మహత్యలే శరణ్యం ఎల్ఏ సాగరంలో మాకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయ బోరు ఏర్పాటు చేసుకుని సాగు చేసుకుంటున్నాం. తొలుత చేసిన సర్వేలో కొద్దిపాటి పొలం మాత్రమే పొయింది. తిరిగి నాటుతున్న హద్దుల్లో పొలాలతో పాటు బోర్లు ఉన్నాయి. బోర్లు పోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం. రెవెన్యూ అధికారులు పరిశీలించి న్యాయం చేయాలి. – పుట్ట రాగమ్మ, మహిళ రైతు, తాళ్వాయిపాడు, పెళ్లకూరు మండలం -
అంచనాలు పురోగతి.. పనులు అధోగతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైల్వే పనుల అంచనాలు ఏటికేడాది పెరుగుతున్నాయి తప్ప.. పనులు మాత్రం ఎక్కడివి అక్కడే ఉన్నాయి. రైల్వే పనుల జాప్యానికి ప్రధానంగా భూసేకరణ, అధికార పార్టీ నేతల కమీషన్ల కక్కుర్తే కారణమని రైల్వే వర్గాలే చెబుతున్నాయి. ఈ కారణంగానే పనులు ముందుకు నడవక ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరుగుతోందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనుల్లో స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామకృష్ణ, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురగండ్ల రామకృష్ణ కాంట్రాక్టు కంపెనీల నుంచి కమీషన్ల కోసం డిమాండ్ చేసి నానాహంగామా సృష్టించిన విషయాలను వారు ఉదహరిస్తున్నారు. రైల్వే ప్రాజెక్టు భూ సేకరణ బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఆ సేకరణ సకాలంలో పూర్తి చేయడం లేదని రైల్వే శాఖ చెబుతోంది. ఇక కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే ప్రాజెక్టులకు కాస్ట్ షేరింగ్ విధానంలో నిధులు మంజూరు చేస్తున్నాయి. కాస్ట్ షేరింగ్ విధానంలో అటు రైల్వే, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అరకొరగా నిధులు కేటాయిస్తుండటంతో ప్రాజెక్టుల పనులు నాలుగేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులు 8 ఉన్నాయి. వీటి అంచనా వ్యయం నాలుగేళ్ల క్రితం మొత్తం రూ. 13,200 కోట్లు. ఇప్పుడు అదనంగా మరో రూ. 2 వేల కోట్ల వరకు పెరిగినట్లు రైల్వే శాఖ నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసేందుకు రైల్వే, ఏపీ ప్రభుత్వం జాయింట్ వెంచర్ కంపెనీ (జేవీ) ఏర్పాటు చేసినా.. అది కాగితాలకే పరిమితమైంది. జేవీ కాకుండా రాష్ట్రంలో రైల్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు, నిధుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వంద కోట్లతో రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను గతేడాది ఆగస్టులో ఏర్పాటు చేసింది. 2016 డిసెంబర్ 30న ఏపీ ప్రభుత్వం రైల్వే శాఖ జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో రైల్వే వాటా 41%, ఏపీ సర్కారు వాటా 51 % ఉంటుంది. కొలిక్కిరాని నడికుడి–శ్రీకాళహస్తి భూసేకరణ రాష్ట్రానికి వెన్నెముకలాంటి నడికుడి–శ్రీకాళహస్తి రైల్వేలైన్ ఏర్పాటుకు భూ సేకరణ ప్రక్రియ ఇంతవరకు కొలిక్కి రాలేదు. రూ.1,314 కోట్లుగా ఉన్న అంచనా వ్యయం ప్రస్తుతం రూ. 2,200 కోట్లు దాటిందని రైల్వే శాఖ చెబుతోంది. విజయవాడ–భీమవరం–నిడదవోలు రైల్వే లైన్ డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులు 2013లో రూ.1,009.08 కోట్లు అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు రూ.1,300 కోట్లను దాటుతోంది. కడప–బెంగళూరు రైల్వే లైన్‌కు రూ.1000.23 కోట్లు అంచనా వ్యయం కాగా, ఇప్పుడు రూ.1,300 కోట్లు దాటింది. కాజీపేట–విజయవాడ మూడో లైన్ నిర్మాణానికి రూ.3,246 కోట్లు అంచనా కాగా, రూ.3,780 కోట్లకు చేరింది. -
టీడీపీ జెండా కట్టలేదని పాక తగలబెట్టారు
‘అయ్యా... నేను రోడ్డు పక్కన చిరు దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను. ఆ దుకాణంపై టీడీపీ జెండా కట్టలేదనే కోపంతో అధికార పార్టీ నాయకులు నా పాకను ఆరు నెలల క్రితం తగులబెట్టారు’. అని పెడనకు చెందిన అబ్దుల్ రజా బేగం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పట్టణానికి వచ్చిన జననేత జగన్మోహన్ రెడ్డి వద్ద వాపోయింది. కొన్నేళ్లుగా రోడ్డు పక్కన తినుబండారం దుకాణం పెట్టుకొని జీవిస్తున్నానని, అధికార పార్టీ నాయకులు జెండా కట్టలేదని రాత్రి వేళలో తగలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో రోడ్డు మీదనే తినుబండారాలు అమ్ముకొంటున్నానని వాపోయారు. స్థలం కోసం దరఖాస్తు చేసుకొంటే ఇవ్వలేదని నా భర్త కూడా మృతి చెందాడని, స్థలం కావాలంటే పార్టీ జెండా కట్టమని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
అవినీతి కంపు!
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవినీతి కంపుకొడుతోంది. అధికార పార్టీ నాయకులు, కొందరు అధికారులు కుమ్మక్కై పథకం ఉద్దేశాన్ని పక్కదారి పట్టించి లక్షల రూపాయలు కొల్లగొట్టారు. కోవెలకుంట్ల మండలంలో ఏకంగా పాతమరుగుదొడ్లు చూపి బిల్లులు స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ గత రెండేళ్ల కాలంలో రెండు వందలు దాటని మరుగుదొడ్ల నిర్మాణాలు రెండు నెలల్లోనే కొత్తగా 300 నిర్మాణాలు పూర్తైనట్లు రికార్డుల్లో చూపడం అనుమానాలకు తావిస్తోంది. కోవెలకుంట్ల: పల్లెలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోకేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మరుగుదొడ్డి మంజూరైన తర్వాత లబ్ధిదారుడు దానిని నిర్మించే ప్రదేశాన్ని అధికారులు జియోట్యాగింగ్ చేసి రికార్డుల్లో నమోదు చేయాలి. మరుగుదొడ్డి బేస్మెంట్ దశలో నిర్మాణ ఫొటో జత చేసి మొదటి విడత బిల్లుకు ప్రతిపాదిస్తే రూ. 6వేలు లబ్ధిదారుని ఖాతాలో జమ అవుతుంది. మరుగుదొడ్డి పూర్తి అయ్యాక అధికారులు పరిశీలించి రికార్డుల్లో నమోదు చేసి మిగిలిన రూ. 9వేలు జమ చేస్తారు. ఇందులో ఎలాంటి అవకగతవకలు జరగకుండా సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు ఒక్కో గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. అయితే, కోవెలకుంట్ల మండలంలో నిర్మించిన మరుగుదొడ్ల నిర్మాణాల్లో ఈ నిబంధనలను తుంగలో తొక్కి చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. పాతవాటికే బిల్లులు: కోవెలకుంట్ల పట్టణంలో గత రెండళ్లలో కేవలం 240 లెట్రిన్లు పూర్తి అయ్యాయి. ఫిబ్రవరి 15 నాటికి వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఇటీవల లక్ష్యాన్ని నిర్దేశించగానే ఏకంగా 300కు పైగా మరుగుదొడ్లు నిర్మించినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఈ రెండు నెలల్లో అదేలా సాధ్యమని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని టీడీపీ కమిటీలో కీలకంగా ఉన్న ఓ నాయకుడు, కొందరి అధికారులతో కుమ్మక్కై గతంలో నిర్మించిన పాత మరుగుదొడ్లకే బిల్లులు చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో ఇదే తంతు నిర్వహించి సుమారు రూ. రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. తర్వాత ఆ నిధులను కొందరు అధికారులు, టీడీపీ నాయకులు, బోగస్ లబ్ధిదారులు కలిసి వాటాలు పంచుకున్నట్లు చర్చ జరుగుతోంది. బిల్లులు చేయాలంటూ అధికారులపై ఫైర్: తాము సూచించిన వ్యక్తులకే వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు మంజూరు చేయాలని, టీడీపీ నాయకులు ఇటీవల మండల అధికారులపై ఫైర్ అయ్యారు. అలాగే గుళ్లదూర్తి గ్రామంలో టీడీపీలోని రెండు వర్గాలు మరుగుదొడ్ల కేటాయింపులో అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఒక వర్గానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా తమ వర్గానికి 50 కేటాయించాలని అధికారులకు లబ్ధిదారుల జాబితా అందజేశారు. ఉన్నతాధికారులు మండలంలోని వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పాత మరుగుదొడ్లకు బిల్లుల చెల్లింపు జరిగినవి మచ్చుకు కొన్ని ► కోవెలకుంట్ల గ్రామ పంచాయతీలో కాంట్రాక్ట్ బేసిక్‌పై పనిచేస్తున్న ఓ ఉద్యోగి పాత మరుగుదొడ్లు చూపించి తమ బంధువుల పేరుతో మూడు బిల్లులు డ్రా చేసుకున్నాడు. ► ఇదే కార్యాలయంలో తాత్కాలికంగా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి రెండు బిల్లులు తీసుకున్నాడు. ► స్వామినగర్ కాలనీలో ఒకే ఇంటిపేరు మీద ఆరుగురికి వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా వీటిలో రెండింటికి పాత వాటికే బిల్లులు చేశారు. ► పట్టణంలోని గుదేట్టి వీధి, బసిరెడ్డి బావి వీధి, సంతపేట కాలనీల్లో 50 నుంచి 60 దాకా పాత మరుగుదొడ్లకే బిల్లులు చెల్లించారు. -
ఇదిగో.. ఇసుక దొంగలు!
సిరిసిల్ల శివారులోని మానేరువాగులోంచి అక్రమంగా ఇసుక తరలించే దొంగల బండారం బయటపడింది.. నిన్నామొన్నటి దాకా గుట్టుచప్పుడు కాకుండా దందా సాగిస్తున్నదెవరనేది సామాన్యులకు అంతుచిక్కకుండా ఉన్నా.. అజ్ఞాతవాసి ఒకరు ఇసుకాసురుల జాబితా వెల్లడించడం.. అదికూడా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో పోస్టర్లు అంటించడం ద్వారా బహిర్గతమైంది. ఈ జాబితాలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, విలేకరులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉండడం గమనార్హం. ఈజాబితా సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొడుతోంది. ఇది అసలుదా..? నకిలీదా? అనే విషయం అటుంచితే.. ఇసుక దందాపై ‘సంతకం ఏదీ’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సైతం సంచలనం కలించింది. సిరిసిల్లక్రైం : ప్రభుత్వం కేటాయించిన రీచ్‌లు కాకుండా అధికార పార్టీ నాయకులు, పలుకుబడి కలిగిన నాయకులు, కొందరు వ్యాపారులు మానేరువాగులో అనధికార రీచ్‌లు ఏర్పాటు చేసుకుని ఇసుక తవ్వేస్తున్నారు. అనుమతిలేని ప్రాంతాల్లోంచి ఇసుక దొంగచాటుగా తరలిపోతోందనే సమాచారం రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలతోపాటు కలెక్టర్ దృష్టికి వెళ్లింది. కానీ, స్థానిక అవసరాల కోసం నిబంధనలకు లోబడి నిర్దేశిత సమయంలో ఇసుక రవాణాకు అవకాశం కల్పించామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే, నిర్దేశిత సమయంలో వేబిల్లు ఆధారంగా ఇసుక ట్రిప్పులు అధికంగా చేశారనే ఫిర్యాదులు అందినా.. అట్లాంటిదేమీ జరగలేదని సదరు అధికారులు ట్రాక్టర్ యజమానులను వెనకేసుకొచ్చినట్లు విమర్శలు వచ్చాయి. అజ్ఞాతవాసిదే హాట్‌టాపిక్.. రెవెన్యూ అధికారుల సంతకాలు లేకుండా వేబిల్లు తీసుకున్న టీఆర్ఎస్ నాయకుడి వ్యవహారంపై ‘సంతకం ఏదీ’ కథనం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితం కావడం సంచలనమే కలిగించింది. కానీ, ఇంతకన్నా మరోవాస్తవాన్ని ఓ అజ్ఞాతవాసి వాల్‌పోస్టర్ల ద్వారా బహిర్గతం చేయడం అధికారులు, అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇసుక రవాణా చేస్తున్నది కేవలం ఒక వ్యక్తి కాదని, పార్టీలోని అనేక మందితోపాటు ఆర్థిక, అంగబలం ఉన్నవాళ్లు, కొందరు విలేకరులూ ఇసుకాసురులుగా అవతారం ఎత్తారని వాల్‌పోస్టర్లలో ముద్రించాడు. వీటిని సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయం ఆవరణతోపాటు పలు ప్రధాన కూడళ్లలో అతికించాడు. ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. పోస్టర్‌లోని జాబితాలో ఉన్న వ్యక్తులకు ఈ విషయం తెలియడంతో ఆత్మరక్షణలో పడిపోయారు. విలేకరులు.. అధికార పార్టీ నేతల అండతో.. సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూర్, సర్ధాపూర్ గ్రామాల నుంచి రోజూ రాత్రి 9 – ఉదయం 6 గంటల వరకు ఇసుక జోరుగా అక్రమంగా తరలిపోతోంది. ఇందుకు అధికార పార్టీ నాయకులు, కొందరు విలేకరుల అండ ఉంది. ఇట్లాంటి వారిపై తగిన చర్య తీసుకోవాలని అజ్ఞాతవాసి వాల్‌పోస్టర్లలో జిల్లా ఎస్పీని అభ్యర్థించడం గమనార్హం. ఉన్నతాధికారుల ఆరా..? అధికారుల సంతకాలు లేకుండా జారీ చేసిన వే బిల్లులు ఎలా బహిర్గతమయ్యాయనే విషయంపై రెవెన్యూ శాఖలోని ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ముఖ్యంగా సిరిసిల్ల ఏంఎంసీ చైర్మన్ పేరిట జారీ అయిన వేబిల్లుపై రెవెన్యూ సిబ్బంది, అధికారి సంతకాలు లేకుండా ఎలా బయటకు వెళ్లిందని బాధ్యులను మంగళవారం అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి ఎలా సమాధానం ఇవ్వాలనే ఆలోచనలో సదరు బాధ్యులు తికమకపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
వేషాలేస్తే తాటతీస్తా...
విలేకరికి ఎమ్మెల్సీ అన్నం సతీశ్ హెచ్చరిక సాక్షి, గుంటూరు/పాతగుంటూరు: అక్రమాలను ప్రశ్నిస్తే చాలు అధికారపార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. అడిగేవాడు ఉండడనే ధీమాతో దౌర్జన్యాలకు దిగుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ప్రభాకర్ ఓ విలేకరిని తీవ్ర స్థాయితో బెదిరించారు. తాను పెద్దల సభలో సభ్యుడిని అన్న విషయం కూడా మర్చిపోయి.. పత్రికల్లో రాయలేని భాషలో ఆ విలేకరిపై విరుచుకుపడ్డారు. బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ నిర్మాణంలో అక్రమాలపై ఆ విలేకరి సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నమే ఎమ్మెల్సీ ఆగ్రహానికి కారణం. వివరాలు ఇలా ఉన్నాయి.. రూ. 70 లక్షలకు టెండర్లు.. రూ. 1.30 కోట్లు ఖర్చు బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో కూరగాయల మార్కెట్ నిర్మాణానికి రూ. 70 లక్షలతో టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. తరువాత నిర్మాణ వ్యయాన్ని రూ. 1.30 కోట్లుగా ఖర్చు చూపారు. దీనిపై కౌన్సిల్లో తీవ్ర స్థాయిలో రగడ జరిగింది. నిర్మాణం చేసిన 17 షాపులకు రూ. 36 లక్షలతో మళ్లీ టెండర్లను పిలవడం టీడీపీ నేతల అధికార దుర్వినియోగానికి, అవినీతికి నిదర్శనమంటూ విమర్శలు వెల్లువెత్తాయి. స.హ.చట్టం ద్వారా దరఖాస్తు.. ఈ నేపథ్యంలోనే బాపట్లకు చెందిన 6 టీవీ రిపోర్టర్ చల్లా శ్రీనివాసరావు మార్కెట్ నిర్మాణాలు, అందులో జరిగిన అవకతవకలపై వివరాలు కోరుతూ బాపట్ల మున్సిపల్ కమిషనర్‌కు స.హ. చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. గడువు ముగిసినా సమాచారం ఇవ్వకపోవడంతో మరోసారి అప్పీలు చేశారు. ఈ వ్యవహారం ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ప్రభాకర్ దృష్టికి వెళ్లడంతో ఆయన శ్రీనివాసరావుకు ఫోన్ చేశారు. సమాచారం ఎందుకు అడిగావంటూ ప్రశ్నించారు. ‘ఏం తమాషాగా ఉందా.. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తా’ అంటూ బెదిరింపులకు దిగారు. అనంతరం బూతు పురాణం అందుకున్నారు. ఎమ్మెల్సీ బెదిరింపుల ఆడియోను శ్రీనివాసరావు సోషల్ మీడియాలో పెట్టారు. ఎమ్మెల్సీ వల్ల ప్రాణహాని ఎమ్మెల్సీ అన్నం సతీ్శ ప్రభాకర్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని విలేకరి చల్లా శ్రీనివాసరావు భయాందోళన వ్యక్తం చేశారు. గుం టూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు ప్రాణభయం ఉండటంతో కలెక్టర్, అర్బన్, రూరల్ ఎస్పీ, సీఎం, గవర్నర్లకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. విలేకరిపై కేసు నమోదు బాపట్ల: విలేకరి చల్లా శ్రీనివాసరావుపై బాపట్ల పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. బాపట్ల మున్సిపల్ డీఈ సీతారామారావు, ఏఈ హసీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. విలేకరి తమను సమాచారం ఇవ్వాలని కోరడంతో పాటు పేపర్, టీవీకి యాడ్స్ రూపంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొనడంతో శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు. -
వెనిగళ్ల శ్రీకాంత్ ఎక్కడ?
► కాల్‌మనీ కేసులో కీలక నిందితుడు ఆరు నెలలుగా పరారీలోనే ► అధికార పార్టీ నేతల సహకారంతో అజ్ఙాతంలో ► శ్రీకాంత్ వద్ద అధికార పార్టీ నేతల పెట్టుబడులు ► తరచూ నగరానికి వస్తున్న శ్రీకాంత్! ► రాజకీయ ఒత్తిళ్లతో పట్టించుకోని పోలీసులు ► ఆరు నెలలు గడిచినా పురోగతి లేని కేసు సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ కేసు ప్రకంపనలు మళ్లీ నగరంలో మొదలయ్యాయి. కేసులో కీలక సూత్రధారి, ఏ-6 నిందితుడుగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ మినహా మిగిలిన వారందరూ అరెస్టయ్యారు. కాల్‌మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోయినా కీలక నిందితుడుగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసే దిశగా పోలీసులు కనీసం దృష్టి సారించకపోవటం గమన్హారం. ఈ క్రమంలో శ్రీకాంత్ పరారీలోనే ఉంటూ పాత వ్యవహారాలను చక్కబెట్టే పనుల్లో బిజీగా మారినట్లు సమాచారం. నాలుగేళ్ల కిత్రం రూ.20 లక్షల పెట్టుబడితో కాల్‌మనీ వ్యాపారం మొదలుపెట్టిన శ్రీకాంత్ కోట్ల రూపాయలకు ఎదగడం వెనుక కాల్‌మనీ దందాలు, దాడులతో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సహకారం, భారీ పెట్టుబడులు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఘటన... గత ఏడాది డిసెంబర్ 10న కాల్‌మనీ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మొగల్రాజపురానికి చెందిన ఓ బాధిత మహిళ నేరుగా నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయటంతో వీరి గుట్టు బట్టబయలైంది. 11న యలమంచలి రాము కార్యాలయంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేసిన క్రమంలో 25 వరకు సీడీలు (మహిళల్ని లోబర్చుకున్న వీడియోలు), 3 బస్తాల డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్ల బయటపడ్డాయి. దీంతో 12 మందిపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. దశలవారీగా నిందితుల అరెస్టులు జరిగాయి. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించటమే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర శాసనసభను కుదిపేసింది. ఆరో నిందితుడుగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ తనకు స్నేహితుడు మాత్రమేనని, అతని లావాదేవీలతో సంబంధం లేదని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీడియా సమావేశం పెట్టి మరీ వివరణ ఇచ్చుకోవటంతో పాటు అసెంబ్లీలోనూ దీనిపై వివరణ ఇచ్చుకున్నారు. ఈ పరిణామాల క్రమంలో కమిషనరేట్ పోలీసులు కేసును పూర్తిస్థాయిలో ఛేదించామనే రీతిలో హడావుడి చేశారు. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి 1181 కాల్‌మనీ ఫిర్యాదులు తీసుకొని వాటిలో 1104 సెటిల్ చేసినట్లు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు కీలక కేసులో నిందితుడిని మాత్రం గుర్తించి అరెస్టు చేయకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాపాడుతున్నది అధికార పార్టీ నేతలే! సిండికేట్ టీమ్‌లో సభ్యులందరూ ఒక్కో ప్రజాప్రతినిధి వద్ద పరపతి బాగా పెంచుకొని హవా సాగించారు. శ్రీకాంత్ కొంత దూకుడుగా ఉండి కాల్‌మనీ వ్యవహారాల్లో అనేక మందిపై దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్ల కిత్రం రూ.20 లక్షల పెట్టుబడితో కాల్‌మనీ వ్యాపారం మొదలుపెట్టిన శ్రీకాంత్ అంచెలంచెలుగా ఎదిగాడు. దీని వెనుక అధికార పార్టీ నేతల పూర్తి సహకారం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా నగరానికి చెందిన ప్రజాప్రతినిధి, నగర సమీపంలోని నియోజకవర్గానికి చెందిన ఒక అధికార పార్టీ ప్రజాప్రతినిధి పెట్టుబడులు అతని వద్ద పెట్టినట్లు సమాచారం. వారి నగదు వ్యవహారం సెటిల్ అయ్యే వరకు శ్రీకాంత్‌ను దొరకకుండా కాపాడుతున్నారనే ఆరోపణ ఉంది. కాల్‌మనీ ముఠాకు రావాల్సిన బకాయిలు కూడా వసూలు చేసేందుకే అతన్ని పోలీసులు అరెస్టు చేయకుండా ప్రజాప్రతినిధులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ఈ క్రమంలో పరారీలో ఉన్న శ్రీకాంత్ తరచూ విజయవాడ నగరానికి వస్తున్నట్లు తెలిసింది. గత వారంలో విజయవాడలో జరిగిన ఒక ఫంక్షన్‌కు కూడా శ్రీకాంత్ హాజరైనట్లు నిఘా వర్గాల కథనం. వివాదాలివీ... శ్రీకాంత్ పరారీ వెనుక అధికార పార్టీ ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కేసులో 12 మంది నిందితులకు గాను శ్రీకాంత్ మినహా మిగిలిన వారంతా అరెస్టయ్యారు. ఘటన జరి గిన రోజు నుంచే శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. పోరంకి గ్రామానికి చెందిన శ్రీకాంత్‌పై పటమట పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీటు ఉంది. గతంలో పటమట ప్రాంతానికి చెందిన ఒక డాక్టర్‌తో స్నేహంగా ఉంటూ చివరకు అతని తమ్ముడిపైనే దాడి చేశాడు. దీనిపై పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో ఉయ్యూరుకు చెందిన ఒక అధికార పార్టీ నేత, హైదరాబాద్‌లో హత్యకు గురైన రౌడీషీటర్ ద్వారా వివాదాన్ని సెటిల్ చేయించుకున్నాడు. దీంతో శ్రీకాంత్ అప్పట్లో ఒక టీడీపీ నేతకు అనుచరునిగా మారిపోయాడు. కాలక్రమంలో సదరు నేత ప్రజాప్రతినిధి కావటంతో శ్రీకాంత్ ఆగడాలు మొదలయ్యాయి. వెంటనే సిండికేట్ టీమ్‌లో కీలక వ్యక్తిగా మారాడు. ఈ క్రమంలోనే తాము బిల్డింగ్ అద్దెకు తీసుకున్న భవన యజమానిపై దాడి చేశాడు. -
‘ఉచితం’తో ఆదాయం గోవిందా..
ప్రత్యామ్నాయం కోరుతున్న పంచాయతీలు ఆత్మకూరురూరల్: టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో తెలుగుతమ్ముళ్లు అందిన కాడికి ఇసుకను దోచుకొని అమ్ముకున్నారు. గతంలో ఉన్న ఇసుక పాలసీతో ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా మసకబారిన క్రమంలో ‘ఉచితం’ అంటూ తాయిలం చూపి ప్రజలను మభ్య పెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మేరకు సీనరేజ్ ఆదాయం కోల్పోతున్నామని పలు పంచాయతీ పాలకవర్గా లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇళ్లు నిర్మించుకునే వారు ఇసుకను ఉచి తంగా తరలించుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. పేద, మధ్య తరగతి ప్రజలకు సంతోషం కలుగుతున్నా ఇదే అదునుగా పలువురు అధికారపార్టీ నేతలు ఇసుకను దోచుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు. ఉచితం మాటున ఓ వైపు ఇసుకను డంప్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆత్మకూరు మండలంలోని అప్పారావుపాళెం ఇసుక రీచ్ నుంచి ఉచితంగా ఇసుకను తరలించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 19 రీచ్‌లకు అనుమతి వసూలు చేసే మొత్తంలో పంచాయతీలకు క్యూబిక్ మీటరుకు రూ.70 చొప్పున సీనరేజ్ కింద ప్రభుత్వం ఆయా పంచాయతీ ఖాతాల్లో గతంలో జమ చేసేది. జిల్లాలో 19 ఇసుక రీచ్‌లను ఉచితానికి అనుమతిచ్చింది. అప్పారావుపాళెం, గొల్లకందుకూరు, సజ్జాపురం, జమ్మిపాళెం, పడమటి కంభంపాడు, లింగంగుంట, మాముడూరు, మినగల్లు, ముదివర్తిపాళెం, పల్లిపాడు, పడమటిపాళెం, సూరాయపాళెం, పొట్టేపాళెం తదితర రీచ్‌లలో ఇసుకను ఉచితంగా పొందేందుకు అనుమతి ఉంది. దీంతో ఉచితం అవకాశంగా పలువురు ఇసుక కొల్లగొడుతున్నారు. ప్రత్యామ్నాయ నిధులు మంజూరు చేయాలి ఇసుకను ఉచితంగా తరలిస్తుండడంతో సీనరేజ్ ఆదాయం కోల్పోతున్న పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా నిధులు మంజూరు చేయాలని ఆయా పంచాయతీ పాలక వర్గాలు కోరుతున్నాయి. అసలే అంతంతమాత్రంగా ఉన్న పంచాయతీల ఆదాయం సీనరేజ్ కోల్పోతుండడంతో వాటి పరిస్థితి ఆర్థికంగా చతికిల పడ్డట్టు అయింది. గతంలో పంచాయతీల పరిధిలో తాగునీటి పథకాలు మరమ్మతులకు గురైతే కొంత సీనరేజ్ సొమ్ము ఖాతాల్లో ఉండడంతో సర్పంచ్‌లు పనులు చేయించేవారు. ప్రస్తుతం ఆదాయం కోల్పోవడంతో ప్రతి పనికీ ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. ఇలా ఇసుక రీచ్‌లున్న పంచాయతీల ఆదాయానికి గండి పడే రీతిలో ప్రకటన చేయడంతో వాటి ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం ఉచితం ప్రకటించిన రీచ్‌ల పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా అదనపు నిధులు మంజూరు చేయాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. పంచాయతీలు ఆదాయం కోల్పోవడం వాస్తవం : పంచాయతీలకు సీనరేజ్ లేకపోవడంతో ఆదాయం కోల్పోతున్న విషయం వాస్తవమే. ఈ నెల 16,17 తేదీల్లో కలెక్టర్, ఇతర ఉన్నతస్థాయి అధికారులు, జిల్లాలోని అన్ని మండల స్థాయి అధికారులతో పెంచలకోనలో సమావేశం జరగనుంది. ప్రస్తుతం శాఖాపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆ సమావేశంలో అధికారుల దృష్టికి తెస్తాం. పరిష్కారానికి అక్కడ అధికారులు చర్యలు చేపడతారు. - నిర్మలాదేవి, ఎంపీడీఓ