వైవీయూ పరిపాలన భవనం
యోగివేమన విశ్వవిద్యాలయం, ప్రొద్దుటూరు వైఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న చిరుద్యోగుల జీవితాలతో అధికారపార్టీ నాయకులు ఆడుకుంటున్నారు. ఒక చేత్తో మీకు సాయం చేస్తామంటూ.. మరో చేత్తో వీరికి వేతనాలు ఎందుకు పెంచారంటూ ఫిర్యాదు చేశారు. ఈ పాలి‘ట్రిక్స్’ తెలియని చిరుద్యోగులకు గత్యంతరం లేకపోవడంతో ‘గతిలేనమ్మకు మతిలేని మొగుడే దిక్కు’ అన్న చందంగా ప్రొద్దుటూరులోని ఓ మాజీ ప్రజాప్రతినిధిని కలిశారు. దీంతో మీకు నేను సాయం చేస్తానని... మీ అందరినీ టైంస్కేల్‌కు మార్చేలా చూస్తానని.. దీనికి ప్రతిఫలం చెల్లించాలని మెలికపెట్టడంతో చేసేదేమీ లేక ఒక్కో అభ్యర్థి రూ.లక్ష వరకు మొక్కు చెల్లించేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం.
సాక్షి ప్రతినిధి కడప: యోగివేమన విశ్వవిద్యాలయం, ప్రొద్దుటూరులోని వైఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 52 మంది చిరుద్యోగులు ఎన్‌ఎంఆర్ (నాన్ మస్టర్డ్ రోల్) ఒప్పంద పద్ధతిలో 2008లో విధుల్లో చేరారు. గత కొద్ది సంవత్సరాలుగా వీరంతా తమను టైం స్కేల్ పరిధిలోకి తీసుకోవాలంటూ విశ్వవిద్యాలయ అధికారులకు పలుమార్లు విన్నవించారు. వీరి న్యాయమైన కోరికకు బలం చేకూర్చేలా పొరుగున ఉన్న రాయలసీమ విశ్వవిద్యాలయంలో 5 సంవత్సరాల సీనియారిటీ కలిగిన ఎన్‌ఎంఆర్ ఉద్యోగులందరినీ టైంస్కేల్ కింద మార్పు చేశారు. దీంతో వైవీయూ ఎన్‌ఎంఆర్ ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. తాము పది సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పటికీ టైంస్కేల్ వర్తింప చేయకపోవడం పట్ల అసంతృప్తి మొదలైంది.
దీంతో మళ్లీ అధికారుల వద్దకు వచ్చి తమను టైంస్కేల్‌కు మార్పుచేయాలని, ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నం. 151 ప్రకారం వేతనాలు పెంచాలని కోరారు. దీనికి స్పందిం చిన అధికారులు ఎన్‌ఎంఆర్ ఉద్యోగులను టైంస్కేల్ ఉద్యోగులుగా మార్పు చేయడం, వేతనాల పెంపు విషయం పాలకమండలి సమావేశంలో ఉంచగా...టైంస్కేల్ అంశం తర్వాత చూద్దామని..వేతనాల పెంపునకు వైవీయూ పాలకమండలి ఆమోదం తెలిపింది. పాలకమండలి సభ్యుల్లో ఇద్దరు మినహా మిగతా అందరూ ఆమోదం తెలపడంతో ఎన్‌ఎంఆర్ ఉద్యోగులకు వేతనాలు పెరిగాయి. కాగా తన మాట నెగ్గలేదన్న అక్కసుతో నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వానికి తెలపకుండానే వేతనాలు పెంచారంటూ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్‌పై అధికార పార్టీకి చెందిన ఓ పాలకమండలి సభ్యుడు గవర్నర్‌కు ఫిర్యాదు చేశాడు.
ప్లేటు ఫిరాయించిన పాలకమండలి సభ్యుడు..
గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన పాలకమండలి సభ్యుడు స్థానిక ఒత్తిళ్ల కారణంగా ప్లేటు ఫిరాయించారు. ప్రొద్దుటూరులోని వైఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు ఆ ప్రాంత మాజీ ప్రజాప్రతినిధిని కలిసి సమస్యను పరిష్కరించాలని ఆశ్రయించినట్టు సమాచారం. దీంతో సదరు మాజీ ప్రజాప్రతినిధి వైవీయూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది.కాగా వ్యవహారం గవర్నర్‌కోర్టులో ఉన్నందున తామేమీ నిర్ణయం తీసుకోలేమని ఆయనకు చెప్పినట్లు తెలిసింది. వెంటనే సదరు నేత ఈ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన పాలకమండలి సభ్యుడితో మంతనాలు జరిపి సానుకూలంగా వ్యవహరించాలని ఆయనకు సూచించినట్లు తెలిసింది.
దీంతో వీరి వేతనాల పెంపుపై ఫిర్యాదు చేసిన పాలక మండలి సభ్యుడు ఏ చెత్తో అయితే ఫిర్యాదు చేశాడో...మళ్లీ ప్లేటు ఫిరాయించి ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు తీసుకువచ్చిన వినతిపత్రంలో వీరిని టైంస్కేల్ ఉద్యోగులుగా మార్పు చేయాలని నోట్ పెట్టి పంపారు. వాస్తవానికి ఆయనకు చిత్తశుద్ధి ఉంటే పాలకమండలి సభ్యుడి హోదాలో సమావేశంలో పెట్టబోయే అజెం డాలో వీరి అంశాన్ని చేర్చాలని కోరుతూ చైర్మన్‌కు లేఖ రాయాలి. అలా చేయకుండా వారు రాసుకొచ్చిన వినతిపత్రంలో మాత్రం రెకమెండ్ చేస్తూ నోట్ పెట్టడం చూస్తుంటే.. నోటితో కావాలని.. నొసటితో వద్దన్న చందంగా ఉందని కొందరు ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఏమి జరిగిందో కానీ ఈ వ్యవహారం త్వరితగతిన తేల్చాలంటూ ఇద్దరు పాలకమండలి సభ్యులతో పాటు ప్రొద్దుటూరుకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి తరచూ వాకబు చేయడం చూస్తుంటే ఎక్కడా లేని ప్రేమ వెనుక ఉన్న మతలబు ఏంటో ఇట్టే అర్థం అవుతోంది. చిత్తశుద్ధి ఉంటే పాలకమండలి సభ్యుడు చేసిన ఫిర్యాదు వెనక్కు తీసుకుని తమను టైంస్కేల్ ఉద్యోగులుగా మార్చేందుకు సహకరించాలని పలువురు ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు కోరుతున్నారు.
గవర్నర్ వివరణ కోరడంతో అడ్డం తిరిగిన కథ..
ఎన్‌ఎంఆర్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్న విశ్వవిద్యాలయ అధికారులు ఈనెల 21న నిర్వహించాల్సిన (ప్రస్తుతం వాయిదా పడింది) పాలకమండలి సమావేశంలో అనుమతి పొందేందుకు రంగం సిద్ధం చేశా రు. అదే సమయంలో పాలకమండలి సభ్యుడి ఫి ర్యాదు మేరకు దీనిపై పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ వైవీయూ అధికారులకు గవర్నర్ కార్యాలయం నుంచి లేఖ అందింది. దీనికి విశ్వవిద్యాలయ అధికారులు తగిన ఆధారాలును క్రోడీకరించి నివేదికను పంపారు. తాము నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించామని.. ఎటువంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడలేదని.. అవసరమైతే విచారణకు సైతం సిద్ధమేనన్న సందేశాన్ని పంపా రు. దీంతో ఎన్‌ఎంఆర్ ఉద్యోగుల టైంస్కేల్ ప్రక్రియకు నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ఎన్‌ఎంఆర్ ఉద్యోగులను టైంస్కేల్‌గా మార్పు ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. తాము సమస్య పరిష్కారానికి కృషిచేస్తుంటే ఈ అంశంపై ఫిర్యాదులు వచ్చి న నేపథ్యంలో ముందుకు వెళ్లలేమంటూ విశ్వవిద్యాలయ అధికారులు పేర్కొనడంతో ఎన్‌ఎంఆర్ ఉద్యోగుల నోట్లో పచ్చి వెలక్కాయపడ్డట్టు అయింది.
Comments
Please login to add a commentAdd a comment